ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. ఆయన స్మారకంపై వివాదం ఏమిటి?

ఫొటో సోర్స్, @RahulGandhi
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. దిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో మాజీ ప్రధాని భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమసంస్కారాలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభలోప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు మాజీ ప్రధానికి తుదివీడ్కోలు పలికారు.
మరోపక్క మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకం ఏర్పాటుకు వీలైనంత త్వరగా స్థలం కేటాయించాలనే డిమాండ్ మరింత బలపడుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడి లేఖ, ప్రభుత్వ సమాధానం నేపథ్యంలో చాలా మంది కాంగ్రెస్ నేతలు దీనిపై స్పందిస్తున్నారు.
అకాలీదళ్ కూడా ఈ డిమాండ్‌కు మద్దతు తెలిపింది. ఇందులో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని కోరింది. దీంతో క్రమంగా ఈ వివాదం ముదురుతోంది.
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారకం ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం ఎందుకు కేటాయించలేకపోతుందో దేశ ప్రజలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సోషల్ మీడియా పోస్టులో రాశారు.
ఆయన గ్లోబల్ ఇమేజ్, ఆయన సాధించిన అసాధారణ విజయాలు, దశాబ్దాలుగా దేశానికి అందించిన సేవలకు చిహ్నంగా ఆయన స్మారకం ఉండాలని జైరాం రమేశ్ పేర్కొన్నారు.


ఫొటో సోర్స్, ANI
స్మారకం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ చాలా మంది కాంగ్రెస్ నేతల నుంచి ప్రకటనలు వస్తున్నాయి.
''స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకానికి స్థలం ఇచ్చినప్పుడు, మన్మోహన్ సింగ్ కోసం ఎందుకు ఇవ్వలేరు. ఆయన ఏకైక సిక్కు ప్రధాని. ఆయన స్మారక చిహ్నం భావితరాలకు స్ఫూర్తినిస్తుంది'' అని కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
డిమాండ్‌ను తీవ్రతరం చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుశీల్ కుమార్ శిందె మాట్లాడుతూ, ''ఆయన ఒక మహోన్నత వ్యక్తి. దేశ ప్రధానుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి. అందరినీ కలుపుకుపోయేవారు. పేదలపక్షాన పనిచేశారు. ఆధార్ కార్డును తీసుకొచ్చారు. మేం ఆయన కోసం పోరాడతాం'' అన్నారు.
''ఆయన దేశం కోసం, దేశ ప్రజల కోసం పనిచేశారు. దేశంలోని అన్నివర్గాలనూ ఆయన ఆదరించారు. ఇప్పుడు ఆయనను గౌరవించుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వం సరైన ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థనను నెరవేర్చాలని కోరుకుంటున్నా'' అన్నారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.
అయితే, ఈ విషయంలో మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి పలు ప్రశ్నలు సంధించారు.
''నాన్న చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి కనీసం సంతాపం వ్యక్తం చేయలేదు. రాష్ట్రపతిగా పనిచేసిన వారి విషయంలో అలాంటి ఆనవాయితీ లేదని ఒక సీనియర్ నేత నాతో అన్నారు'' అని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
''అది పూర్తిగా అసంబద్ధం. మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మరణానంతరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన సంతాప సందేశాన్ని నాన్నే స్వయంగా తయారుచేసినట్లు ఆయన డైరీలో ఉంది'' అన్నారు.
అయితే, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా మహమ్మారి సమయంలో మరణించారు. ఆయన 2020 ఆగస్టు 31న చనిపోయారు.

ఫొటో సోర్స్, ANI
హోం శాఖ ఏం చెప్పింది?
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి వినతి పత్రం అందినట్లు హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
''కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే, మన్మోహన్ సింగ్ స్మారకం కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈలోపు ఆయన అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. మెమోరియల్ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత భూ కేటాయింపు జరుగుతుంది'' అని ఆ ప్రకటనలో పేర్కొంది.
ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీకి శుక్రవారం లేఖ రాస్తూ మాజీ ప్రధాని గౌరవార్థం ఆయన స్మారక చిహ్నం నిర్మించే స్థలంలోనే ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించాలని కోరారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కృషి, విజయాల గురించి కూడా ఆ లేఖలో ఖర్గే రాశారు.
ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారని, ఆయన విధానాలు దేశాన్ని ఆర్థిక సుస్థిరత దిశగా తీసుకెళ్తున్నాయన్నారు.
''ఆయన సేవలను దృష్టిలో ఉంచుకుని తన అభ్యర్థనకు అంగీకరిస్తారని ఆశిస్తున్నా. విశ్వసిస్తున్నా'' అని ఖర్గే రాశారు.

ఫొటో సోర్స్, ANI
అకాలీదళ్ అసంతృప్తి
మన్మోహన్ సింగ్ స్మారకం విషయంలో మోదీ ప్రభుత్వంపై శిరోమణి అకాలీదళ్ అధ్యక్షులు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆయన ఎక్స్‌లో ఇలా రాశారు, ''షాకింగ్, దీన్ని నమ్మలేకపోతున్నా. స్మారక చిహ్నం ఏర్పాటుకు అనువైన స్థలంలోనే ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించాలని డాక్టర్ మన్మోహన్ సింగ్ కుటుంబం అభ్యర్థించింది. కానీ, ఆ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది. ఇది ఖండించదగిన విషయం.''
''ఏకైక సిక్కు ప్రధాని అయిన నాయకుడి పట్ల ప్రభుత్వం ఎందుకింత అగౌరవంగా వ్యవహరిస్తుందో తెలియడం లేదు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ విభేదాలున్నప్పటికీ మన్మోహన్ సింగ్‌ను మేమెప్పుడూ గౌరవిస్తాం. ఆయన రాజకీయాలకు అతీతమైన వ్యక్తి. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నా'' అని రాశారు.
''ఆయనకు ఈ గౌరవం దక్కాలి. మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడు ఈ దేశానికి ఎప్పటికీ దొరకరు. ఆయన ప్రభుత్వంలో నేను మంత్రిగా పనిచేశా. ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవాడిని'' అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్పందిస్తూ, ''దేశానికి తొలి సిక్కు ప్రధాని అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి. ఆయన కుటుంబం కోరుకున్న ప్రదేశంలో ఆయన గౌరవార్థం స్మారకం నిర్మించాలి'' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీనిపై రాజకీయాలు చేయడం సరికాదని, కేంద్రం మాజీ ప్రధాని కుటుంబంతో పాటు సిక్కు సమాజం మనోభావాలను కూడా గౌరవించాలని ఆమె రాశారు.
బీజేపీ సమాధానం
మాజీ ప్రధాని స్మారకం చుట్టూ వివాదం ముదురుతున్న నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది స్పందించారు.
దేశ ఆర్థికాభివృద్ధికి పునాది వేసిన మాజీ ప్రధానికి సముచిత గౌరవం కల్పించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తుందన్నారు.
నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం, సమాధి నిర్మించాలని నిర్ణయించామని, భూసేకరణ, ట్రస్ట్ ఏర్పాటు వంటి లాంఛనాలకు ఎంత సమయం పడుతుందో కాంగ్రెస్ పార్టీకి తెలియజేశామని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్‌ను ఎన్నడూ గౌరవించలేదని, కనీసం ఈ విషాద సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














