పెళ్లి చేసుకుని పిల్లలను కంటే చైల్డ్ కేర్ సపోర్ట్, తక్కువ వడ్డీకి హోం లోన్ - సౌత్ కొరియాలో ప్రభుత్వమే పెళ్లి కుదుర్చుతోంది

- రచయిత, రేచల్ లీ
- హోదా, బీబీసి వరల్డ్ సర్విస్
సౌత్ కొరియాలో పెళ్లిళ్లు తగ్గిపోతున్నాయి, జననాల రేటు కూడా తగ్గుతోంది.
ఈ రెండు సమస్యలపై ఆందోళన చెందుతున్న అక్కడి ప్రభుత్వం పరిష్కారానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది.
అందులో భాగంగానే బ్యాచిలర్స్‌ను పార్టీలకు పిలిచి, అందరినీ ఒక చోట చేర్చి జంటలను కలుపుతోంది. వివాహాలకు ఈ స్పీడ్ డేటింగ్ ఈవెంట్స్ వేదికగా మారాయి. మరో వైపు మ్యారేజ్ బ్యూరోలు విపరీతంగా పెరిగిపోయాయి. తమ వద్ద ప్రొఫైల్ నమోదు చేసుకున్నవారికి భాగస్వామిని వెతికిపెడుతున్నాయి.
మిన్ జంగ్ తన బాయ్‌ఫ్రెండ్‌తో మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. అయితే, ఒక రోజు ఆయన హఠాత్తుగా తన మనసులో మాట చెప్పారు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, ఎప్పటికీ పెళ్లి చేసుకోనని బాయ్ ఫ్రెండ్ చెప్పడంతో మిన్ షాక్ అయ్యారు.
కొన్ని రోజుల తర్వాత, బెడ్‌పై పడుకుని ఫోన్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఓ మ్యారేజ్ మ్యాచింగ్ ఏజెన్సీ ప్రకటన మిన్ చూశరు.
‘ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించింది?’ అని మిన్ చెప్పారు. ఆ ఆలోచన ముందుకు సాగింది.. 30 ఏళ్ల మిన్ జంగ్.. టే హ్యూంగ్‌ను కలిసేలా చేసింది.
ఇప్పుడు వారిద్దరు భార్యాభర్తలు. పెళ్లయి నాలుగు నెలలవుతోంది.

ఇది మొదటి చూపులోనే పుట్టిన ప్రేమ కాకపోయినా తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరిందని వారు చెప్తున్నారు.
"మిన్‌ని కలిసే ముందు రోజు ఒక ఆఫీస్ పార్టీకి వెళ్లాను. ఆమెను కలిసిన రోజు హాంగ్‌ఓవర్‌లో ఉన్నాను. నేను నా భార్యను మొదటిసారి కలిసినప్పుడు మంచి అభిప్రాయం కలిగే అవకాశాన్ని ఏర్పర్చుకోలేదు. కానీ ఆమె నవ్వు నాకు నచ్చింది. చాలా బాగా మాట్లాడుకున్నాం. రెండోసారి కలవాలి అనుకున్నాను. నాపై ఆమెకు మంచి అభిప్రాయాన్ని కలిగించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది" అని టే హ్యూంగ్ గుర్తుచేసుకున్నారు.
దక్షిణ కొరియా మ్యాచ్‌మేకర్‌లు తమ క్లయింట్‌ల మొదటి డేట్‌కు సంబంధించి ప్రతి విషయాన్ని వారే చూసుకుంటారు.
అయితే దానికి ముందు వారి వ్యక్తిగత సమాచారం- వయసు, వృత్తి, ఆస్తి, కుటుంబ వివరాలు వంటివి సేకరిస్తారు.
ఆ వ్యక్తిగత వివరాల ఆధారంగా క్లయింట్‌లకు రేటింగ్ ఇస్తారు. ఉదాహరణకు.. డాక్టర్‌లు, న్యాయవాదులు ఎక్కువ గ్రేడ్‌లతో ముందంజలో ఉండే అవకాశం ఉంది. కార్పొరేట్, ఇతర ఆఫీస్ ఉద్యోగులకు తక్కువ ర్యాంక్ ఉంటుంది.
కొంతమంది ఈ గ్రేడింగ్ విధానాన్ని విమర్శిస్తున్నారు. సామాజిక స్థితిగతులకు మరీ ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తున్నారని వాదిస్తున్నారు.
కానీ, మిన్ జంగ్ తనకు సమానంగా ఉన్న వ్యక్తే భర్తగా కావాలని కోరుకున్నారు. టే హ్యూంగ్ కూడా అదే ఆశించారు. మ్యారేజ్ ఏజెన్సీ తన పని తను చేసింది.
ఒకప్పుడు, సోల్ నగరంలో ఆఫీస్ వర్కర్లుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లితోనే కాదు, వైన్ షాపు వ్యాపారంతోనూ తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించారు.
"ఆఫీస్ వర్కర్‌గా నా జీవితం చాలా డల్‌గా ఉండేది. కానీ ఇప్పుడు, కొత్తగా ఏదో చేస్తున్నాను, నా భార్యతో కలిసి కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటున్నా - ఇది చాలా బాగుంది" అని టే హ్యూంగ్ చెప్పారు.

మ్యాచ్ మేకింగ్ ఏజెన్సీలు పెరుగుతున్నాయి
2024 నాటికి దక్షిణ కొరియా వ్యాప్తంగా దాదాపు 1,000 మ్యాచ్ మేకింగ్ ఏజెన్సీలు ఉన్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా మ్యాచ్ మేకింగ్ సర్వీసులు ఉపయోగిస్తున్న బ్యాచిలర్‌ల సంఖ్య పెరుగుతూనే ఉందని, క్లయింట్‌లు 30 శాతం పెరిగారని అనేక ఏజెన్సీలు చెప్తున్నాయి.
"కోవిడ్ సమయంలో సహజ సమావేశాలకు అవకాశాలు లేక ఎక్కువ మంది మ్యాచ్ మేకింగ్ వైపు మొగ్గు చూపారు" అని హై-ప్రొఫైల్స్‌తో డీల్ చేసే మ్యాచ్ మేకింగ్ ఏజెన్సీ ‘ఎన్ నోబల్ ’ వైస్ ప్రెసిడెంట్ హాన్ కి యోల్ చెప్పారు.
"వివాహం చేసుకోవడంలో విఫలమైన వారి కోసమే ఏజెన్సీలున్నాయని గతంలో యువత భావించేది, ఈ ఆలోచనలో మార్పు వచ్చింది. ఇప్పుడు తమకు సరిపోయే వ్యక్తిని కనుగొనేందుకు ఈ ఏజెన్సీలే మంచి మార్గమని భావిస్తున్నారు. దాంతో మ్యాచ్ మేకింగ్ ఏజెన్సీలు పెరిగాయి" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పేరు చెప్పొద్దని కోరిన ఓ 32 ఏళ్ల వైద్యురాలు ఒక మ్యాచ్‌మేకింగ్ ఏజెన్సీకి క్లయింట్. మొదట్లో ఈ ఏజెన్సీలపై మంచి అభిప్రాయం ఉండేది కాదని, కానీ ఇప్పుడు అలా ఏమీ లేదని.. తన స్నేహితులు చాలామంది ఇలాంటి ఏజెన్సీల సేవలు ఉపయోగించుకుంటున్నారని చెప్పారు.
"స్నేహితులు ఏర్పాటు చేసిన బ్లైండ్ డేట్‌లు అంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. తెలిసిన వారి ఫ్రెండ్స్ కావడంతో వద్దని చెప్పలేం. మ్యాచ్ మేకర్స్ ఈ ఒత్తిడి లేకుండా చేస్తారు" అన్నారామె.
అయితే, వ్యక్తిగత అభిరుచులకు తగ్గ భాగస్వాములను కాకుండా సోషల్ స్టేటస్‌కు తగ్గ భాగస్వాములను వెతికిపెడుతున్నారని కొందరు అంటున్నారు.
మిన్ జంగ్ తాను ఏజెన్సీలో తన ప్రొఫైల్‌ను నమోదు చేసుకున్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన రోజును గుర్తుచేసుకున్నారు, " కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మ్యారేజ్ మ్యాచింగ్ ఏజెన్సీ ఉపయోగించటంపై సానుకూలమైన అభిప్రాయం పెద్దగా లేదు. వ్యక్తులను వారి ప్రొఫైల్‌ల ద్వారా అంచనా వేసి, ప్రేమ లేకుండా వివాహం చేసుకున్నట్లు అనిపించవచ్చు" అని ఆమె చెప్పారు.
ఏజెన్సీ ఫీజులు రూ. లక్ష నుంచి రూ. 6 లక్షల వరకు(భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే) ఉంటాయి. ఫీజు ఎక్కువగా ఉండడం వల్ల కొందరు ఏజెన్సీల వైపు మొగ్గు చూపడం లేదు.
పేరు చెప్పొద్దని కోరిన 36 ఏళ్ల ఉపాధ్యాయురాలు పదేళ్ల క్రితం ఈ ఏజెన్సీలలో ఒకదాన్ని ఉపయోగించారు, కానీ తగిన వారిని కలవలేదు.
"నేను మ్యారేజ్ మ్యాచ్‌మేకర్స్ ద్వారా కలుసుకున్న వ్యక్తుల్లో కొందరికి లోపాలు ఉన్నాయి, కొెందరు పర్ఫెక్ట్‌గా కూడా ఉన్నారు. కానీ ఎదుటి వారి నుండి చాలా ఎక్కువ కావాలని ఆశిస్తున్నారు" అని ఆమె అన్నారు.
ఇది తనను చాలా నిరాశపరిచిందని, మ్యాచ్‌మేకర్ ఏజెన్సీకి వెళ్లడం ఒక అసైన్‌మెంట్‌ను పూర్తి చేసినట్లు అనిపించిందని ఆమె చెప్పారు.

ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పీడ్ డేటింగ్ ఈవెంట్స్
మ్యాచ్‌మేకింగ్ సేవలలో పెరుగుదల ఉన్నప్పటికీ, దక్షిణ కొరియాలో వివాహాలు- జనన రేట్లు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి.
గత దశాబ్దంతో పోలిస్తే 2023లో వివాహాల సంఖ్య 40% తక్కువగా ఉంది. దేశ సంతానోత్పత్తి రేటు ప్రపంచంలోనే అత్యంత కనిష్ఠ స్థాయి 0.72కి చేరుకుంది.
ఈ గణాంకాలకు కారణం దక్షిణ కొరియా పాటిస్తున్న సుదీర్ఘ పని గంటలే అని నిపుణులు అంటున్నారు.
2017లో ప్రపంచవ్యాప్తంగా మెక్సికో తర్వాత ఎక్కువ పని గంటలు ఉన్న దేశం దక్షిణ కొరియా.
వర్క్-లైఫ్ బ్యాలన్స్ తక్కువగా ఉండడం.. ఇళ్ల ధరలు భారీగా ఉండడం.. పిల్లలను పెంచేందుకు అయ్యే ఖర్చు అధికంగా ఉండడం వల్ల ప్రసవం తర్వాత మహిళలు తిరిగి పనిలోకి రావడం సవాలుగా మారింది.
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) ప్రకారం స్థిరమైన జనాభాను కొనసాగించడానికి దేశ సంతానోత్పత్తి రేటు 2.1 ఉండాలి.
సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ఇప్పుడు దక్షిణ కొరియా ప్రభుత్వం ముందడుగు వేసింది. మ్యాచ్ మేకర్ పాత్రను పోషించి, వ్యక్తులు తమ భాగస్వాములను కనుగొనడంలో సహాయపడటానికి స్పీడ్ డేటింగ్ ఈవెంట్‌లను నిర్వహిస్తోంది.
సోల్‌కు కొంత దూరంలో ఉన్న ఓ ప్రాంతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇటీవల ఏడు ఈవెంట్లు నిర్వహించారు.
ఆ ప్రాంతంలో ఉండే 27-39 ఏళ్ల వయసుండే 100 మంది బ్యాచిలర్‌లు ఆట-పాటలు, విందు-పానీయాలు వినోదంతో నిండిన ఆ ఈవెంట్‌కు వచ్చారు.
దరఖాస్తుదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసి ఈవెంట్‌కు పిలిచారు.

"నేను పెద్దగా ఆలోచించకుండా ఇక్కడికి వచ్చాను, కానీ ఇప్పుడు భయంగానే ఉంది, నా గుండె గట్టిగా కొట్టుకుంటుంది " అని 32 ఏళ్ల ము జిన్ చెప్పారు.
చాలా మందిలాగే, ఉద్యోగంలో చేరాకా భాగస్వామిని వెతకడం కష్టమని అతను భావిస్తున్నారు. ‘పనిలో చాలా బిజీగా ఉంటాను. కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలు లేవు. కానీ నగరం ఆ అవకాశాన్ని కల్పించింది’ అని చెప్పారు.
ప్రభుత్వం నిర్వహించినప్పటికీ ఈవెంట్ మాత్రం చాలా ఉత్సాహవంతంగా, ఎంగేజింగ్‌గా ఉందని దానికి హాజరైన వారు చెప్పారు.
30 ఏళ్ల యూ సన్, పార్ట్నర్ కోసం ఆశతో ఈవెంట్‌కి వచ్చారు. "ఇలాంటి పెద్ద సమూహం ఉన్నప్పుడు మంచి కనెక్షన్‌లను ఏర్పరచుకోవడం కొంచెం కష్టమే, కానీ కొత్తవారిని కలసుకోవడానికి ఇది గొప్ప అవకాశం" అని ఆమె చెప్పారు.
ఈ కార్యక్రమాలు పెద్దఎత్తున విజయవంతమయ్యాయని ప్రభుత్వం చెబుతుంది. హాజరయ్యే వారిలో 43 శాతం మంది ఎవరో ఒకరితో మ్యాచ్ అవుతున్నారని, ఇప్పటికే కొన్ని జంటలు పెళ్లి చేసుకున్నారని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ కొరియా ప్రభుత్వం నూతన వధూవరులకు చైల్డ్ కేర్ సపోర్ట్, తక్కువ వడ్డీకి గృహ రుణాలను అందించడం ద్వారా జనన రేట్లకు సంబంధించిన సవాళ్లను కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది.
"గత 20 సంవత్సరాలుగా జనన రేటును పెంచడం కోసం తీసుకొచ్చిన ప్రతి పాలసీ విఫలమైంది" అని సియోంగ్నామ్ మేయర్ షిన్ సాంగ్ జిన్ చెప్పారు. అందుకే యువతీయవకులు కలుసుకోవడానికి ప్రభుత్వం సహాయం చేస్తోంది అన్నారు.
అయితే, ఇది ప్రజల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ప్రభుత్వం హద్దులు దాటడమేనని కొందరు వాదిస్తున్నారు.
పనిలో తిరిగి చేరేందుకు మహిళలకు మద్దతు ఇవ్వడం, అధిక జీవన వ్యయాల సమస్యలు పరిష్కరం వంటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు.
"20- 30 ఏళ్లల్లో దృడమైన కెరీర్ కోసం కష్టపడతారు. కాని 35 ఏళ్లలోపు కుటుంబాలతో సెటిల్ అవ్వాలని సమాజం ఒత్తిడి చేస్తుంది. పని ప్రదేశాల్లలో సవాళ్లతో, ప్రసూతి సెలవు తర్వాత ఉద్యోగాలు కోల్పోవడం వంటి సమస్యలు ఎదురుకుంటున్నప్పుడు పెళ్లి, పిల్లలు అంటే అంగీకరింలేం" మిన్ జంగ్ చెప్పారు.
ఆమె భర్త టే హ్యూంగ్.. వివాహం పూర్తిగా తన సొంత నిర్ణయమని.. సామాజిక ఒత్తిడి వల్ల చేసుకున్నామని అనుకోవడం సరికాదని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














