‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’: మన్మోహన్ సింగ్ ప్రధాని కావడానికి ముందు సోనియా గాంధీ ఇంట్లో జరిగిన డ్రామా ఏంటి?

మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కాంగ్రెస్, రాహుల్ గాంధీ, వాజ్‌పేయి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గణేశ్ పాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''మానా కీ తెరీ దీద్ కే కాబిల్ నహీ హూన్ మై, తు మేరా షౌఖ్ దేఖ్, మేరా ఇంతేజార్ దేఖ్.''

2011 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, దివంగత బీజేపీ నేత సుష్మాస్వరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. సుష్మా స్వరాజ్ ఒక ఉర్దూ కవితతో మన్మోహన్‌పై మాటల దాడి చేశారు.

మౌనిగా అందరూ పిలిచే మన్మోహన్ అప్పుడు ఎవరూ ఊహించని విధంగా మరో కవితతో దీటుగా స్పందించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌లో ఇలా మాటల దాడి చేయడం చాలా అరుదు. ఆయన ఏకంగా కవిత చెప్పడంతో ఆ మాటలు విని సుష్మా స్వరాజ్ కూడా తన నవ్వు ఆపుకోలేకపోయారు.

దేశానికి మౌనంగా ఉండే ప్రధాని లభించారని మన్మోహన్ సింగ్ గురించి విపక్షాలు విమర్శిస్తుండేవి. ఆయన మౌనం చాలా సార్లు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల హయాంలో ప్రణబ్ ముఖర్జీ, పి. చిదంబరం వంటి అనేక మంది కేంద్ర మంత్రులు ప్రభుత్వం తరఫున తమ వాదనను వినిపించేవారు. కానీ ప్రధానిగా ఉన్న మన్మోహన్ మాత్రం ఎక్కువగా మౌనంగా కనిపించేవారు.

పెద్దపెద్ద ప్రసంగాలు చేయకుండా మితంగా స్పందించాలనే మార్గాన్ని మన్మోహన్ ఎంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.

అయితే, విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా తానొక నిశ్శబ్ధ ప్రధానిని కాదని 2021 సెప్టెంబర్‌లో మన్మోహన్ సింగ్ నొక్కి చెప్పారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కాంగ్రెస్, రాహుల్ గాంధీ, వాజ్‌పేయి

ఫొటో సోర్స్, Getty Images

"ప్రధానిగా నా కెరీర్‌లో నేనెప్పుడూ మీడియాతో మాట్లాడేందుకు భయపడలేదు. మీడియాతో మాట్లాడేందుకు భయపడే ప్రధానిని కాను నేను. ఈ విషయం మీరు గమనించి ఉండొచ్చు. నేను తరచుగా జర్నలిస్టులను కలుస్తూ ఉండేవాడిని. విదేశీ పర్యటనల సమయంలోనూ విమానంలోనే విలేఖరుల సమావేశాలు నిర్వహించాం. లేదా విమానం దిల్లీలో ల్యాండ్ కాగానే, విమానాశ్రయంలోనే విలేఖరులతో మాట్లాడేవాడిని'' అని చెబుతూ పరోక్షంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ తీరును ఆయన విమర్శించారు.

యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోనియా గాంధీ కనుసన్నల్లో ప్రధానమంత్రి కార్యాలయం పని చేస్తుందంటూ బీజేపీ ఆరోపించింది.

అయితే, దేశ ఆర్థిక వ్యవస్థకు తమ ప్రభుత్వం చేసిన కృషి కచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుందని 2014 జనవరిలో ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.

కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదివిన మన్మోహన్ సింగ్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, దేశ ఆర్థిక మంత్రిగా, చివరకు ప్రధానమంత్రిగా సేవలందించారు.

అంతే కాకుండా ఏడుగురు ప్రధాన మంత్రులతో కలిసి పనిచేశారు. ఆయన ప్రయాణం గురించి ఈ కథనంలో చూద్దాం.

మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కాంగ్రెస్, రాహుల్ గాంధీ, వాజ్‌పేయి

ఫొటో సోర్స్, ANI

చిన్నతనంలో తల్లిని, విభజన సమయంలో ఇల్లును కోల్పోయారు

మన్మోహన్ సింగ్, నెలల వయసున్న పిల్లాడిగా ఉన్నప్పుడే ఆయన తల్లి చనిపోయారు. పని నిమిత్తం తండ్రి ఎప్పుడూ దూరంగా ఉండేవారు. అమ్మమ్మ పర్యవేక్షణలో మామ ఇంట్లో పెరిగారు. ఈ విషయాలన్నీ మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ్ బారు, తన పుస్తకం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'లో పేర్కొన్నారు.

పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా లేని ఆ ప్రాంతంలో ఉర్దూ మీడియం పాఠశాలలో చేరేందుకు మన్మోహన్ సింగ్ ప్రతిరోజూ అనేక మైళ్లు నడవాల్సి వచ్చేది. గ్రామానికి కరెంటు వచ్చే వరకు మన్మోహన్ సింగ్ రాత్రిపూట కిరోసిన్ దీపం కింద చదువుకునేవారు.

మన్మోహన్ సింగ్‌కు సంబంధించిన కొన్ని విషయాలను సీనియర్ జర్నలిస్ట్ మానిని ఛటర్జీ, బీబీసీతో పంచుకున్నారు.

''1947 విభజన తర్వాత మన్మోహన్ సింగ్ తన కుటుంబంతో కలిసి పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చారు. మొదట వారంతా హల్ద్వాని (ఉత్తరాఖండ్)లోని శరణార్థి శిబిరంలో ఉన్నారు. విభజన కారణంగా, పాకిస్తాన్‌లో బోర్డ్ పరీక్షలకు హాజరు కాలేకపోయారు. తర్వాత, పంజాబ్ యూనివర్సిటీలో చదువుకున్నారు'' అని మానిని చెప్పారు.

కేంద్ర మంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారని మానిని ఛటర్జీ తెలిపారు.

భారత్‌కు తరలి వచ్చిన తర్వాత కూడా మన్మోహన్ సింగ్ ఇంటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. శరణార్థి శిబిరానికి చేరుకున్న తర్వాత, వారు అమృత్‌సర్, హోషియార్‌పూర్, పాటియాలా, చండీగఢ్‌లలో కూడా నివసించారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.

మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కాంగ్రెస్, రాహుల్ గాంధీ, వాజ్‌పేయి

ఫొటో సోర్స్, Getty Images

''కేంబ్రిడ్జి లేదా ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లి చదువుకునే స్థోమత మాకు లేదు. కానీ, భారత్‌కు వచ్చిన తర్వాత నేను బాగా చదువుకున్నాను. అదృష్టవశాత్తు స్కాలర్‌షిప్ దొరికింది'' అని అమెరికా జర్నలిస్ట్ చార్లీ రోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన్మోహన్ చెప్పారు.

యూఎన్‌ జనరల్ అసెంబ్లీ సమావేశం కోసం అమెరికా వెళ్లినప్పుడు 2004 సెప్టెంబర్‌లో మన్మోహన్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు.

భారత్ ఎందుకు పేద దేశంగా ఉంది? అనే విషయాన్ని అధ్యయనం చేసేందుకు ఆర్థికశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నట్లు మన్మోహన్ సింగ్ ఒక సందర్భంలో చెప్పారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆయన పెట్టుబడిదారి విధానానికి మద్దతుదారు. దేశ సమగ్రాభివృద్ధికి పెట్టుబడిదారీ విధానం అవసరమని ఆయన నమ్మారు.

''మీరు పేద నేపథ్యం నుంచి వచ్చారు. అయినా మీరు పెట్టుబడిదారీ విధానం, స్వేచ్ఛా మార్కెట్ విధానాలను విశ్వసిస్తారు. భారత్‌లో పేదరికం, అసమానతలు హెచ్చుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు సోషలిజం వైపు ఎందుకు వెళ్లలేదు'' అని చార్లీ రోజ్ ఆయన్ను ప్రశ్నించారు.

''ఆర్థిక సమానత్వం గురించి మనం నిరంతరం ఆందోళన చెందుతున్నాం. నా అభిప్రాయం ప్రకారం, పెట్టుబడిదారీ విధానంలో చాలా డైనమిజం ఉంటుంది. ఇది పేదరికాన్ని రూపుమాపడంలో సహాయపడుతుంది'' అని ఆయన బదులిచ్చారు.

మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కాంగ్రెస్, రాహుల్ గాంధీ, వాజ్‌పేయి

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయాల్లోకి రాకముందు

మన్మోహన్ సింగ్, ఆక్స్‌ఫర్డ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత పంజాబ్ యూనివర్సిటీ, దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

1971లో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థికశాఖ సలహాదారుగా చేరారు. ఇక్కడినుంచి ఆయన ప్రభుత్వం కోసం పనిచేయడం మొదలైంది.

1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖకు చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌గా పదోన్నతి పొందారు.

ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్‌గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా, ప్రధానమంత్రి సలహాదారుగా, యూజీసీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.

మన్మోహన్ సింగ్, రాజకీయ రంగ ప్రవేశం వెనుక కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది 1991 వేసవి కాలం. ఆ సమయంలో ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలో జరగాల్సిన ఘటనలు భారత్‌లో జరుగుతున్నాయి. వాటిన్నింటికీ మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష సాక్షి.

చంద్రశేఖర్ ప్రభుత్వం కూలిపోయింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజీవ్‌గాంధీ హత్య జరిగింది. ఎన్నికల తర్వాత దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు తీసుకున్నారు.

ఆరోజుల్లో దేశం దివాలా తీసే స్థితిలో నిలిచింది. భారత్ వద్ద కేవలం రెండు వారాలకు సరిపడా చమురు, ఎరువులు, ఇతర వస్తువులు దిగుమతి చేసుకునేంత విదేశీ మారకం మాత్రమే ఉంది.

గల్ఫ్ దేశాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. మరోవైపు పేలవ ఆర్థిక నిర్వహణ కారణంగా 1990ల ఆరంభంలో దేశం ఆర్థిక సంక్షోభానికి దారితీసింది.

ఈ కారణంగా విదేశాల నుంచి రుణం అందలేదు. రెండు వారాల తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నడిపించాలని కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ తలలు పట్టుకున్నాయి. అదే సమయంలో ప్రవాస భారతీయుల, భారత్ నుంచి 900 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కాంగ్రెస్, రాహుల్ గాంధీ, వాజ్‌పేయి

ఫొటో సోర్స్, ANI

ఒకవేళ విదేశీ మారక ద్రవ్యం లభించకపోతే, 1991 జులై తర్వాత దేశానికి వచ్చే దిగుమతులు ఆగిపోతాయి.

ఈ నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక ఆర్థికవేత్తను నియమించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని అప్పటి ప్రధాని నరసింహారావు గ్రహించారు.

వెంటనే ఆర్థిక మంత్రి పదవికి తగిన వ్యక్తి కోసం వెతకడం మొదలుపెట్టారు. రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తి ఈ పదవికి అర్హుడని ఆయన భావించారు. ఈ క్రమంలో ఐజీ పటేల్, డాక్టర్ మన్మోహన్ సింగ్ పేర్లు ఆయన దృష్టికి వచ్చాయి.

కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పేరును నామినేట్ చేస్తున్నట్లుగా తన ప్రిన్సిపల్ సెక్రటరీ అలెగ్జాండర్‌కు పీవీ సమాచారం ఇచ్చారు.

ఈ విషయాన్ని తన ఆత్మకథ '' త్రూ ద కారిడార్స్ ఆఫ్ పవర్'' అనే పుస్తకంలో అలెగ్జాండర్ రాశారు.

అలెగ్జాండర్ ఉదయం మన్మోహన్ సింగ్‌ను నిద్ర లేపి, 'మీరు దేశానికి ఆర్థిక మంత్రి కాబోతున్నారు' అనే విషయాన్ని చెప్పారు.

దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్ సింగ్ వెంటనే పరిష్కార మార్గాలను అన్వేషించారు.

దేశం దివాలా తీయకుండా కాపాడేందుకు 1991 తొలినాళ్లలో ప్రభుత్వం తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. భారత ప్రభుత్వం తాకట్టు పెట్టిన మొత్తం బంగారాన్ని 1991 డిసెంబర్ నాటికి తిరిగి తెచ్చుకుంది.

మన్మోహన్ సింగ్ ఒక కేంద్ర మంత్రి హోదాలో నేరుగా పార్లమెంటరీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కాంగ్రెస్, రాహుల్ గాంధీ, వాజ్‌పేయి

ఫొటో సోర్స్, Getty Images

మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యే ముందు జరిగిన డ్రామా

2004 లోక్‌సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఓడిపోయింది.

అప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, దేశానికి తదుపరి ప్రధాని అవుతారనే చర్చ సర్వత్రా మొదలైంది. దీన్ని బీజేపీ, ముఖ్యంగా సుష్మా స్వరాజ్ తీవ్రంగా వ్యతిరేకించారు.

''ఒకవేళ ఒక విదేశీ వ్యక్తి మళ్లీ భారత్‌ను ఏలితే జుట్టు కత్తిరించుకొని, తెల్లచీర కట్టుకొని, నేలపైనే పడుకుంటాను'' అని సుష్మా స్వరాజ్ హెచ్చరించారు.

కాంగ్రెస్ నాయకులు, బీజేపీ వ్యతిరేకతను అంత సీరియస్‌గా తీసుకోలేదు. సీనియర్ నేతలు, మిత్ర పక్షాల నేతలతో సోనియా గాంధీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల నేతలంతా భేటీలు జరుపుతున్నారు. కానీ, ఒక్క ఘటన తర్వాత తాను ప్రధానమంత్రి పదవిని తీసుకోలేనని సోనియా తేల్చి చెప్పారు.

మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కాంగ్రెస్, రాహుల్ గాంధీ, వాజ్‌పేయి

ఫొటో సోర్స్, Getty Images

సోనియా నిర్ణయాన్ని మార్చేసిన ఆ ఘటన ఏంటి?

అది 2004 మే 17. దిల్లీలోని సోనియా గాంధీ అధికారిక నివాసం 10 జనపధ్‌లో మధ్యాహ్నం ఒక సంఘటన జరిగింది.

ఆరోజు మన్మోహన్ సింగ్‌ను వెదుక్కుంటూ నట్వర్ సింగ్, 10 జనపధ్‌కు చేరుకున్నారు.

సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మన్మోహన్‌ సింగ్, సుమన్ దుబే ఒక సోఫాపై కూర్చొని ఉన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఉద్దేశిస్తూ మాట్లాడారు.

''అమ్మా, మిమ్మల్ని ప్రధానమంత్రి కానివ్వను. నా తండ్రిని హత్య చేశారు. మా నాన్నమ్మను చంపేశారు. ఒకవేళ మీరు కూడా ప్రధానమంత్రి అయితే వచ్చే ఆరు నెలల్లో మిమ్మల్ని కూడా చంపుతారేమో'' అని రాహుల్ గాంధీ అన్నారు.

అప్పుడు సోనియా గాంధీ ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది.

సోనియాకు 24 గంటల సమయం ఇచ్చారు రాహుల్ గాంధీ. ''మీరు నా మాట వినకుంటే నేను తీవ్ర చర్యలు తీసుకుంటాను'' అని చెప్పి రాహుల్ గాంధీ అక్కడినుంచి వెళ్లిపోయారు.

సోనియా కళ్లలో నుంచి కన్నీరు రావడంతో హాలులో అంతా నిశ్శబ్ధం అలుముకుంది. తర్వాతి 15-20 నిమిషాల వరకు అక్కడ ఎవరూ ఏమీ మాట్లాడలేదు.

''మీరు లోపలికి వెళ్లండి. మేం చూసుకుంటాం'' అని సోనియాతో నట్వర్ సింగ్ అన్నారు.

ఈ విషయాలన్నీ సీనియర్ జర్నలిస్ట్ నీర్జా చౌదరీకి నట్వర్ సింగ్ వివరించారు. ''హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్'' అనే పుస్తకంలో నీర్జా చౌదరీ ఈ విషయాలన్నీ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ చేసిన తీవ్ర హెచ్చరిక కారణంగానే సోనియా గాంధీ, ప్రధాని కావాలనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారని నట్వర్‌సింగ్ తెలిపారు.

సోనియా గాంధీ ఒక తల్లిగా తన కుమారుని ఆందోళనను పరిగణనలోకి తీసుకున్నారని నట్వర్ సింగ్ చెప్పినట్లు పుస్తకంలో ఆమె పేర్కొన్నారు.

అదే రోజు సోనియాగాంధీ, 10 జన్‌పథ్‌లో సీనియర్ కాంగ్రెస్ నేతలందరితో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ మాటలు విన్న తర్వాత సోనియా గాంధీ బరువెక్కిన హృదయంతో ఈ మీటింగ్‌కు వెళ్లారు. నట్వర్ సింగ్, మన్మోహన్ సింగ్ ఇద్దరూ ఆమెను అనుసరించారు.

మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఈ సమావేశానికి ప్రణబ్ ముఖర్జీ, శివరాజ్ పాటిల్, గులామ్ నబీ ఆజాద్, ఎంఎల్ ఫోతేదార్, అహ్మద్ పటేల్‌లోపాటు మరికొందరు నేతలు కూడా వచ్చారు.

''ప్రధానమంత్రి పదవిని చేపట్టాల్సిందిగా మన్మోహన్ సింగ్‌ను అభ్యర్థిస్తున్నా'' అని వచ్చీ రాగానే సోనియా గాంధీ ఈ ప్రకటన చేశారు. అక్కడంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది.

''మేడమ్, మీ ప్రతిపాదనకు కృతజ్ఞతలు. కానీ, నాకు మెజారిటీ లేదు. కాబట్టి దీన్ని నేను అంగీకరించలేను'' అన్నారు మన్మోహన్ సింగ్.

వెంటనే నట్వర్ సింగ్ జోక్యం చేసుకన్నారు. ''మన్మోహన్ సింగ్‌కు కాదనే హక్కు లేదు. ఎందుకంటే మెజారిటీ ఉన్న వ్యక్తి మిమ్మల్ని ప్రతిపాదిస్తున్నారు'' అని అన్నారు.

మరుసటి రోజు 2004 మే18న సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌లు అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాంను కలిశారు. మరుసటి రోజే మన్మోహన్ సింగ్ పేరును అధికారికంగా ప్రకటించారు.

ప్రధానమంత్రి పదవిని అంగీకరించవద్దని అప్పట్లో అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా సోనియాకు సూచించారు. రాజకీయాలు ఎలా ఉన్నా, సోనియా, వాజ్‌పేయిల మధ్య సత్సంబంధాలు ఉండేవి.

కాంగ్రెస్‌ గెలవగానే సోనియా గాంధీ వాజ్‌పేయికి ఫోన్ చేసి ఆయన ఆశీస్సులు అడిగారు. అప్పుడు ఆయన, 'మీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఆ కిరీటాన్ని ధరించవద్దు. ఇది దేశంలో అశాంతికి కారణమవుతుంది' అని అన్నారు.

అలా 'విదేశీ వనిత' అంటూ ప్రతిపక్షాల విమర్శల కారణంగా సోనియా గాంధీ ప్రధాని పీఠానికి దూరమయ్యారు. దీంతో మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు.

మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఆర్థిక కుంభకోణాల ఆరోపణలు

2004 మేలో దేశపు 14వ ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాతి ఐదేళ్లలో భారతదేశం వేగంగా ఆర్థిక ప్రగతి సాధించింది. ఆర్థిక వృద్ధి రేటు 7 నుంచి 8 శాతానికి చేరుకుంది.

యూపీఏ-1 హయాంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ (ఉపాధి హామీ పథకం), సమాచార హక్కు, విద్య ప్రాథమిక హక్కు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే అమెరికా పౌర అణు ఒప్పందం సమయంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్‌కు తొలిసారి సవాలు ఎదురైంది.

అణు ఒప్పందం విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. వామపక్షాలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాయి. అయినా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ తీర్మానంలో నెగ్గింది. దీంతో భారత్, అమెరికాల మధ్య చరిత్రాత్మక అణు ఒప్పందం కుదిరింది.

మన్మోహన్ సింగ్ మొదటి టర్మ్‌ను చరిత్రాత్మకంగా పేర్కొనడానికి మరో కారణం కూడా ఉంది. ఆయన హయాంలోనే రైతులకు రుణమాఫీ పథకం అమలైంది. ఇది అప్పటి వరకు జరిగిన వాటిలో అతిపెద్ద రుణమాఫీ. మహారాష్ట్రలోని యావత్మాల్‌లో ఈ నిర్ణయం ప్రకటించారు మన్మోహన్. ఈ నిర్ణయం వల్లే యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగలిగిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అయితే, రెండో దఫాలో మన్మోహన్ పాలన అనేక గందరగోళాలకు కేంద్రంగా మారింది. ఆర్థిక అవకతవకలకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి.

ఇదే సమయంలో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టడం, దిల్లీలో బస్సులో యువతిపై సామూహిక అత్యాచారం వ్యవహారాలు బయటకు రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త అనే పేరు ఉన్న మన్మోహన్ సింగ్, తన పాలనా కాలంలో జరిగిన ఆర్థిక అవకతవకలను ఆపలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు.

మన్మోహన్ సింగ్ ఎన్నడూ ఎన్నికల్లో గెలవలేదు. కానీ, ప్రఖ్యాత ఆర్థిక వేత్త అన్న పేరును సంపాదించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వంటి ప్రపంచ నాయకులు కూడా ఆయనను మెచ్చుకునేవారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)