మన్మోహన్ సింగ్: సంస్కరణలను పరుగులు పెట్టించి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించిన రాజనీతిజ్ఞుడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన ప్రధానమంత్రుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా, అంతకు ముందు ఆర్థికమంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్‌ను భారత దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా చెబుతారు.
భారత తొలి ప్రధాని నెహ్రూ తర్వాత, ప్రధానిగా ఒక టర్మ్ పూర్తి చేసుకుని, రెండోసారి మళ్లీ ఎన్నికైన ఘనత మన్మోహన్ సింగ్‌కు దక్కుతుంది. ఆ తర్వాత నరేంద్ర మోదీ వరసగా మూడుసార్లు ప్రధాని అయ్యారు.
దేశ ప్రధానిగా పదవి చేపట్టిన తొలి సిక్కు నేత కూడా ఆయనే.
ఇందిర మరణం తర్వాత 1984లో జరిగిన అల్లర్లలో మూడు వేల మంది సిక్కుల మరణానికి సంబంధించి మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌లో బహిరంగ క్షమాపణ చెప్పారు.
రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. స్కాములు, అవినీతి ఆరోపణల వల్ల 2014లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది.
మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజ్య భారత దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో జన్మించారు. అప్పట్లో ఈ ప్రాంతానికి మంచి నీరు, విద్యుత్‌లాంటి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కాదు.
మన్మోహన్ సింగ్ భార్య పేరు గురుశరణ్ కౌర్. వీరికి ముగ్గురు కుమార్తెలు.
పంజాబ్ విశ్వవిద్యాలయంలో విద్య పూర్తి చేసుకున్న తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌లో డాక్టరేట్ చేశారు.
కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్న సమయంలో డబ్బులు లేక ఇబ్బంది పడ్డారని ఆయన కుమార్తె దమన్ సింగ్ తన తల్లిదండ్రుల గురించి రాసిన పుస్తకంలో వెల్లడించారు.
"ట్యూషన్, రోజువారీ ఖర్చులన్నీ కలిసి ఏడాదికి 600 పౌండ్లు అయ్యేవి. అయితే ఆయనకు పంజాబ్ యూనివర్సిటీ 160 పౌండ్లు మాత్రమే స్కాలర్‌షిప్ ఇచ్చేది. మిగతా సొమ్ము కోసం ఆయన తన తండ్రి మీద ఆధారపడేవారు. చాలా పొదుపుగా జీవించేవారు. రాయితీ మీద లభించే భోజనం చేసేవారు" అని పేర్కొన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
ఏకాభిప్రాయ సాధనలో నేర్పరి
మన్మోహన్ సింగ్ 1991లో కేంద్ర ఆర్థికమంత్రి అయిన తర్వాత రాజకీయంగా ఆయన ప్రతిష్ఠ పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా దశలో ఉన్నప్పుడు ఆయన ఆ పదవి చేపట్టారు.
అనూహ్యంగా వచ్చిన పదవి తరవాత చాలా కాలం ఆయన్ను రాజకీయాల్లో కొనసాగేలా చేసింది. సివిల్ సర్వెంట్‌గా, ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా పని చేశారు. రిజర్వ్ బ్యాంక్‌కు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
ఆర్థికమంత్రిగా తన తొలి ప్రసంగంలో "ఎవరికైనా టైమ్ వస్తే వారి ఆలోచనను ఏ శక్తి కూడా ఆపలేదు" అని విక్టర్ హ్యూగో వ్యాఖ్యల్ని ప్రస్తావించారు.
అలా దేశంలో తిరుగులేని ఆర్థిక సంస్కరణల కార్యక్రమానికి బాటలు వేశారు. పన్నుల్ని తగ్గించారు. రూపాయి విలువ నిలబెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు.
దీంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. పారిశ్రామిక రంగం ముందడుగు వేసింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. 1990ల్లో వృద్ధిరేటు స్థిరంగా కొనసాగింది.

ఫొటో సోర్స్, AFP
యాక్సిడెంటల్ పీఎం
రాజకీయంగా తనకు పునాది లేదన్న సంగతి మన్మోహన్ సింగ్‌కు బాగా తెలుసు. ''రాజనీతిజ్ఞునిగా ఉండడం మంచిది. అయితే ప్రజాస్వామ్యంలో రాజనీతిజ్ఞునిగా ఉండాలంటే మొదట మనం ఎన్నికల్లో గెలవాలి'' అని ఆయన ఒకసారి అన్నారు.
1999లో లోక్‌సభకు పోటీచేసి ఆయన ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్ ఆయన్ను రాజ్యసభకు పంపింది.
2004లోనూ ఇలాగే జరిగింది. ఆ ఏడాది ఆయన మొదటిసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. తన ఇటలీ మూలాల విషయంలో పార్టీపై విమర్శలు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధాని పదవిని తిరస్కరించారు. అప్పుడు మన్మోహన్ సింగ్ భారత ప్రధాని అయ్యారు.
అయితే మన్మోహన్ ప్రధాని అయినప్పటికీ సోనియాగాంధీనే నిజమైన అధికారకేంద్రంగా ఉన్నారనీ, ఆయనెప్పుడూ పూర్తిస్థాయి అధికార బాధ్యతలు నిర్వహించలేదని విమర్శకులు ఆరోపించేవారు.
మన్మోహన్ ప్రధానిగా ఉన్న తొలి ఐదేళ్లకాలంలో అతిపెద్ద విజయం అమెరికాతో అణు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోవడం.
అమెరికాతో అణుఒప్పందాన్ని వ్యతిరేకించిన వామపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోకుండా మరో పార్టీ మద్దతు తీసుకుంది కాంగ్రెస్. అయితే ఆ సమయంలో కాంగ్రెస్‌పై ఓటుకు నోటు ఆరోపణలొచ్చాయి.
ఏకాభిప్రాయం సాధించగల సామర్థ్యమున్న మన్మోహన్ సింగ్ క్లిష్టపరిస్థితులున్నప్పటికీ, సంకీర్ణ ప్రభుత్వ అధినేతగా విభిన్న ప్రాంతీయ పార్టీలకు, మద్దతుదారులకు నేతృత్వం వహించారు.
తెలివితేటలు, అపారజ్ఞానం, అంకితభావంతో పనిచేయడం ద్వారా మన్మోహన్ సింగ్ ఎంతో గౌరవం సంపాదించారు. అదే సమయంలో మృదుస్వభావి, నిర్ణయాత్మక వ్యక్తిగానూ గుర్తింపు పొందారు. ఆర్థిక సంస్కరణలు మందగించాయని, ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో సాధించినన్ని విజయాలు, ప్రధానమంత్రిగా మన్మోహన్ సాధించలేకపోయారని కొందరు విమర్శకులు ఆరోపించారు.
మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ రెండోసారి 2009లో విజయం సాధించింది. సందర్భానికి అనుగుణంగా పార్టీ ఎదుగుదల ఉందని ఆ సమయంలో మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.
అయితే ఆ తర్వాత కొద్దికాలానికే కాంగ్రెస్ ప్రతిష్ఠ మసకబారింది. రెండోసారి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వంపై అనేక ఆరోపణలతో మన్మోహన్ ఎక్కువకాలం వార్తల్లో నిలిచారు.
ఆయన క్యాబినెట్ మంత్రులు వేలకోట్ల రూపాయల కుంభకోణాల్లో చిక్కుకున్నారు. ప్రతిపక్షం పార్లమెంట్‌ను స్తంభింపచేసింది. విధానాల పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఆర్థిక వ్యవస్థ మందగించి.. తిరోగమనం బాటలో సాగింది.
భారత్‌లో అతి బలహీనమైన ప్రధాని మన్మోహన్ సింగ్ అని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ విమర్శించారు. అయితే మన్మోహన్ సింగ్ తన పాలనను సమర్థించుకున్నారు. దేశంకోసం, ప్రజల సంక్షేమం కోసం అంకితభావం, నిబద్ధతతో పనిచేశామని మన్మోహన్ సింగ్ తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
ఆచరణాత్మక విదేశాంగ విధానం
ప్రధానిగా విదేశాంగ విధానం విషయంలో మన్మోహన్ సింగ్ పూర్వ ప్రధానుల ఆచరణాత్మక విధానాలనే అనుసరించారు.
పాకిస్తాన్‌తో శాంతిసంబంధాలకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే 2008 నవంబరులో ముంబైలో ఉగ్రవాదులు జరిపిన దాడులతో ఈ విధానానికి ఆటంకం కలిగింది. ఈ దాడులు పాకిస్తాన్ ఉగ్రవాదుల పనే అన్న ఆరోపణలొచ్చాయి.
చైనాతో సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు మన్మోహన్ సింగ్ ప్రయత్నించారు. 40 ఏళ్లకు పైగా మూసి ఉన్న నాథులా పాస్‌ను తిరిగి తెరిచేందుకు చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
అఫ్గానిస్తాన్‌కు ఆర్థిక సాయం పెంచారు. అప్పటికి దాదాపు 30 ఏళ్ల తర్వాత అఫ్గానిస్తాన్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా నిలిచారు.
ఇరాన్‌తో స్నేహసంబంధాలకు ముగింపు పలికినట్టు కనిపించిన మన్మోహన్ వైఖరిపై ప్రతిపక్షనేతలు అప్పట్లో తీవ్రవిమర్శలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
హంగు, ఆర్భాటం లేని నాయకుడు
విద్యావంతుడిగా, మేధావిగా, ప్రజా సేవకుడిగా పేరున్నప్పటికీ, ఆయన ఎప్పుడూ లో ప్రొఫైల్‌లో ఉండేవారు. ట్వీట్లు, పోస్టులు పెట్టే అలవాటు పెద్దగా లేకపోవడం వల్ల ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయర్లు కూడా తక్కువే.
తక్కువగా మాట్లాడటం, ప్రశాంతమైన ప్రవర్తనలాంటివి కూడా ఆయనకు అభిమానుల్ని సంపాదించి పెట్టాయి.
బొగ్గు గనుల కేటాయింపుల్లో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఆయన తన మౌనాన్ని సమర్థించుకున్నారు. వేల సమాధానాల కంటే అదే ఉత్తమమైనదని చెప్పారు.
నేరపూరిత కుట్రకు పాల్పడటం, నమ్మక ద్రోహం, అవినీతికి సంబంధించిన అంశాలలో కోర్టుకు హాజరుకావాలని 2015లో మన్మోహన్ సింగ్‌కు సమన్లు అందాయి. తాను న్యాయ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన రిపోర్టర్లతో చెప్పారు.
యూపీఏ-2 ఓటమి తర్వాత మన్మోహన్ సింగ్ ప్రతిపక్షనేతగా కాంగ్రెస్‌పార్టీని ముందుకు నడిపించేందుకు కృషి చేశారు.
2020 ఆగస్టులో బీబీసీకి ఇచ్చిన అరుదైన ఇంటర్వూలో...భారతదేశం తక్షణం మూడు కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. కరోనా వైరస్ వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని అరికట్టాలని కోరారు.
లాక్‌డౌన్ల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోయిందని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రజలకు డబ్బులు నేరుగా ఇవ్వాలని, వ్యాపారాలకు పెట్టుబడుల్ని అందుబాటులోకి తేవాలని, ఆర్థిక రంగాన్ని గట్టెక్కించాలని కోరారు.
కొంతమంది చరిత్రకారులు ఆయన ఇంకా ముందే రాజకీయాల నుంచి వైదొలిగితే బావుండేదని వ్యాఖ్యానించినప్పటికీ, దేశాన్ని అణు వివక్ష నుంచి బయటపడేసినందుకు, ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టినందుకు మన్మోహన్‌సింగ్‌ను చరిత్ర ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది.
" మీడియా, ప్రతిపక్షాలు నన్ను ఎలా విమర్శించినా చరిత్ర నాపట్ల దయతో వ్యవహరిస్తుందని నేను నమ్ముతున్నా" అని ఆయన 2014లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














