పవన్ కల్యాణ్ వెళ్లేంతగా గాలివీడు ఎంపీడీవో కార్యాలయంలో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, X/JanaSenaParty
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైఎస్ఆర్‌సీపీ నేత సుదర్శన్ రెడ్డి దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం జవహర్ బాబును పరామర్శించారు.
ఇంతకీ గాలివీడు ఎంపీడీఓ కార్యాలయంలో ఏం జరిగింది?
అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు. సుదర్శన్ రెడ్డి. గతంలో గాలివీడు జడ్పీటీసీ సభ్యుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి ఈనెల 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం తన అనుచరులతో కలిసి గాలివీడు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లారు.
అక్కడి ఎంపీపీ చాంబర్ తాళం ఇవ్వాలని ఎంపీడీవోను అడిగారని, ఎంపీపీ వస్తేనే తాళాలు ఇస్తామని ఆయన సమాధానం ఇవ్వడంతో దాడి జరిగిందని పోలీసులు అంటున్నారు.
అనుచరులతో కలిసి ప్రభుత్వ కార్యాలయంలో అనధికార హోదా అనుభవించేందుకు చూసిన సుదర్శన్‌రెడ్డికి అడ్డు చెప్పినందుకే దళితుడైన తనపై దాడి చేశారని ఎంపీడీవో జవహర్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఎంపీపీ గది తాళాలివ్వలేదనే..
''శుక్రవారం మధ్యాహ్నం ఎంపీడీవో కార్యాలయానికి ఎంపీపీ కుమారుడు సుదర్శన్ రెడ్డి వచ్చారు. ఆయనకు ఎటువంటి అధికారిక హోదా లేదు. ఎంపీపీ చాంబర్ తాళాలు ఇవ్వమని మా సిబ్బందిని అడిగారు. వాళ్లు నన్ను అడిగారు. ఇవ్వొద్దు వాళ్లంతా వచ్చి అక్కడ గలీజు చేస్తుంటారని చెప్పాను. వాళ్లు వెళ్లి ఆ విషయాన్ని సుదర్శన్ రెడ్డికి చెప్పారు. వెంటనే ఆయన 20 మంది అనుచరులతో లోపలికి వచ్చి కులం పేరుతో దూషిస్తూ నాపై దాడి చేశారు. కింద పడేసి కొట్టారు, కుర్చీలతో దాడి చేశారు. చేతులు విరిచి పట్టుకుని గుండెల మీద తన్నారు. చంపుతామని బెదిరించారు. అక్కడున్న అటెండర్ పక్కకు వెళ్లిపోయారు. మా డ్రైవర్ వచ్చి అడ్డుపడ్డాడు. అతడిని కూడా కొట్టారు'' అని ఎంపీడీవో జవహర్ బాబు మీడియాకు చెప్పారు.
ఎంపీడీవోకు గాయాలవ్వడంతో కార్యాలయంలోనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి అక్కడి నుంచి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎంపీడీవోకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. తరువాత మెరుగైన వైద్యం కోసం జవహర్ బాబును కడప రిమ్స్‌కు తరలించారు.
'ప్రోటోకాల్ పాటించాం'
''నేను అక్కడ బాధ్యతలు చేపట్టి రెండు నెలలే అయింది. అక్టోబర్ 3వ తేదీన మండల సమావేశం జరిగినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం కేవలం సభ్యులను మాత్రమే అనుమతించాం. ఇతరులను లోపలికి రానీయలేదనే కోపం ఉంది. రెండోది సుదర్శన్ రెడ్డికి ఎటువంటి పదవీ లేకపోయినా ఆయన దగ్గర నిలబడి మాట్లాడాలి. అందుకని నేను సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడు వెళ్లను, మాట్లాడను. ఆ ఉద్దేశంతోనే ఆయన నన్ను కొట్టారు. ఏదైనా ఫైల్ పెట్టినా వాళ్ల ఇంటికి వెళ్లి, మాట్లాడాలి. ముందు నుంచి అది అలవాటు చేశారు. మేం ఎందుకు వెళతాం'' అని ఎంపీడీవో జవహర్ బాబు అన్నారు.

ఫొటో సోర్స్, X/janasenaparty
రాష్ట్ర యంత్రాంగంపై దాడి: పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కడప రిమ్స్‌కు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించారు. బాధితుడి కుటుంబ సభ్యులతో పవన్ మాట్లాడారు. జవహర్ బాబుకు అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
దాడి ఘటనను మర్చిపోవాలని, తామంతా అండగా ఉంటామని జవహర్ బాబుకు ధైర్యం చెప్పారు పవన్. త్వరగా కోలుకుని విధులకు హాజరుకావాలని సూచించారు.
''పవన్ కల్యాణ్ వచ్చి నన్ను పరామర్శించడం చాలా సంతోషంగా ఉంది. నాకు అది ఒక భరోసా, ధైర్యాన్ని ఇచ్చింది. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటారని నమ్మకం వచ్చింది'' అని జవహర్ బాబు అన్నారు.
''దీనిని రాష్ట్ర యంత్రాగంపై జరిగిన దాడిగా చూస్తున్నాం. గతంలోనూ చల్లా సుదర్శన్ రెడ్డి ఎంపీడీవో ఆఫీసులో ప్రతాప్, శేఖర్‌నాయక్, శ్రీనివాసుల రెడ్డిలపైన దాడులు చేశారు. ఇది వారి రాజ్యం అనుకుంటున్నారు. ఎంపీడీవో కూడా చెప్పింది ఏమిటంటే.. మీ అమ్మగారు వస్తే తాళాలు ఇస్తామని, వాళ్ల పిల్లలకు ఇవ్వం అన్నందుకు అమానుషంగా కొట్టారు'' అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఫొటో సోర్స్, X/JanaSenaParty
''గత ప్రభుత్వం మాదిరి కాదు. ఇష్టారాజ్యంగా చేస్తుంటే చూస్తూ కూర్చోం. విధులు నిర్వహిస్తున్న వారిపైన దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించం. లోపల గడి పెట్టి మరీ ఎవరిని రానీయకుండా ఆయనపై అమానుషంగా దాడి చేశారు. వీళ్లకి కులం ఎక్కువ, తక్కువ అని కాదు. ఆధిపత్యపు అహంకారంతో అధికారులపైన దాడి చేస్తే కచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం. ఇలాంటి విషయాలలో ప్రజలు కూడా స్పందించాలి '' అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు.
అనంతరం గాలివీడు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు పవన్. అక్కడ దాడి ఎలా జరిగిందనే విషయాన్ని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఫొటో సోర్స్, facebook/Gadikota Srikanth Reddy
రాజకీయం చేస్తున్నారు: వైసీపీ
ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
''రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతోనే సమస్య పెద్దది అయింది. కాల్ డేటా తీసుకొని విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఎంపీడీవో కార్యాలయ అధికారులు పిలిస్తేనే సుదర్శన్ రెడ్డి అక్కడికి వెళ్లారు. తన తల్లి అయిన ఎంపీపీకి చెందిన సామగ్రి లోపల ఉందని తాళాలు తీయాలని ఆయన అడిగారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. దాన్ని రాజకీయం చేస్తున్నారు'' అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
దాడి జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని అక్కడే ఉన్న సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ఎంపీపీ కార్యాలయం తాళం విషయంలో ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారని, 13 మందిపై కేసు నమోదు చేశామని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ బీబీసీతో అన్నారు.
''ఎంపీపీ కార్యాలయం తాళం ఇతరులకు ఇచ్చేది లేదని అన్నందుకే తనపై దాడి చేశారని బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 13 మందిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశాం. ప్రధాన నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఈ దాడిలో ఇంకా ఎంతమంది పాల్గొన్నారు అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నాం'' అని డీఎస్పీ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














