అసోం వరదలు: ‘ఇప్పటివరకూ 90కిపైగా మరణాలు, నీట మునిగిన 3,376 గ్రామాలు’

‘ఇప్పటివరకూ ఈ వరదల్లో మరణించినవారి సంఖ్య 92కు చేరుకుంది’

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ‘ఇప్పటివరకూ ఈ వరదల్లో మరణించినవారి సంఖ్య 92కు చేరుకుంది’

ఈశాన్య రాష్ట్రం అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి.

ఇప్పటివరకూ ఈ వరదల్లో మరణించినవారి సంఖ్య 92కు చేరుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

వీరిలో 66 మంది నేరుగా వరదల వల్ల మరణించగా, 26 మంది కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయారు.

బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో వరదల కారణంగా ఏడుగురు చనిపోయారు.

అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏఎస్‌డీఎంఏ) ఈ వివరాలు వెల్లడించినట్లు పీటీఐ తెలిపింది.

26 జిల్లాల వ్యాప్తంగా మొత్తం 36 లక్షల మంది ఈ వరదల వల్ల ప్రభావితమయ్యారు.

అసోంలో ఏటా ఈ సమయంలో వర్షాలు సాధారణమే

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అసోంలో ఏటా ఈ సమయంలో వర్షాలు సాధారణమే

ధుబ్రి జిల్లాలో అత్యధికంగా 5.51 లక్షల మంది వరదల వల్ల ప్రభావితమయ్యారని... బార్పేట, గోల్పారా జిల్లాల్లోనూ ప్రభావం ఎక్కువగా ఉందని ఏఎస్‌డీఎంఏ తెలిపింది.

ఇప్పటివరకూ 3,376 గ్రామాలు నీట మునిగాయని, 1.27 లక్షల హెక్టార్ల మేర పంటలకు నష్టం జరిగినట్లు వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా 629 పునరావాస శిబిరాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయని, 36 వేలకుపైగా మంది వాటిలో ఆశ్రయం పొందుతున్నారని పేర్కొంది.

కజిరంగా నేషనల్ పార్క్‌లో 167, రాజీవ్ గాంధీ ఓరంగ్ నేషనల్ పార్క్‌లో 19, పోబితోరా వైల్డ్ లైఫ్ సాంక్చువరీలో 24 క్యాంపుల్లోకి వరద చేరినట్లు పీటీఐ తెలిపింది.

66 జంతువులు చనిపోయాయని, కజిరంగా నేషనల్ పార్క్‌లోని 117 జంతువులను సిబ్బంది రక్షించారని పేర్కొంది.

సాధు జంతువులు, వన్యప్రాణులు కూడా ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయాయి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సాధు జంతువులు, వన్యప్రాణులు కూడా ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయాయి

కజిరంగాలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గురువారం వెళ్లారు. అక్కడి సహాయ చర్యలను, ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

సమీపంలోని కొహోరా ప్రాంతంలో ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరానికి కూడా వెళ్లి, పరిస్థితులను సమీక్షించారు.

వరదల్లో ప్రాణాలు కోల్పోయినవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.

ఏటా రుతుపవనాల సమయంలో అసోంలో భారీ వర్షాలు సాధారణమే అయినప్పటికీ, ఈసారి కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో జనాల్లో మరింత ఆందోళన నెలకొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)