HMPV: చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్‌తో ముప్పు ఎంత, భారత్‌లో పరిస్థితి ఏంటి?

హెచ్ఎంపీవీ వైరస్

ఫొటో సోర్స్, Getty Images

ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి వ్యాపించిన ఐదేళ్ల తర్వాత, మరో కొత్తరకం వైరస్ కేసులు చైనాలో నమోదవుతున్నాయి. ఈ కొత్త వైరస్ 14 ఏళ్ల లోపున్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది.

హ్యుమన్ మోటానిమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) అనే కొత్త వైరస్‌కు చెందిన ఇన్‌ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉత్తర చైనాలో నమోదవుతున్నట్టు కథనాలు వస్తున్నాయి.

ఈ వైరస్ సోకిన వ్యక్తులలో జలుబు, కోవిడ్-19 వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, ఇది వేగంగా వ్యాపిస్తోందని ఒక మీడియా నివేదికను ఉటంకిస్తూ బీబీసీ మానిటరింగ్ తెలిపింది.

చైనా సరిహద్దు దేశాలన్నీ దీనిపై తీవ్ర దృష్టిసారించాయి. అయితే, ప్రస్తుతం భయపడాల్సిన పరిస్థితి లేదని భారత ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్ఎస్) తెలిపారు.

ఇదే సమయంలో, భారత కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శనివారం డీజీహెచ్ఎస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సమావేశంలో, విస్తృత స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత, కొన్ని విషయాలను వారు అంగీకరించినట్లు తెలిసింది. చైనాలో ఈ పరిస్థితి సాధారణమైనదేనని, ఫ్లూ సీజన్‌లో హెచ్ఎంపీవీ ఒక సాధారణ వ్యాధి కారకమేనని పరిస్థితిని భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సమయానికి అనుగుణంగా సమాచారాన్ని చేరవేయాలని చైనాను కోరింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చైనాలో పెరుగుతున్న కేసులు

సోషల్ మీడియాలో ఇటీవల చక్కర్లు కొట్టిన వీడియోల్లో, చైనాలో చాలా మంది రోగులు ఆస్పత్రుల వద్ద ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. ఫ్లూ వంటి లక్షణాలు ఈ రోగుల్లో కనిపిస్తున్నట్లు ఆ వీడియోల్లో పేర్కొన్నారు.

ఆ తర్వాత, చైనాలో ప్రజలకు మరోసారి కొత్త వైరస్ ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు పెరిగాయి.

ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ కూడా చైనాలోని వూహాన్‌లో పుట్టిందని నమ్ముతున్నారు.

చైనా ప్రభుత్వ వార్తా వెబ్‌సైట్ గ్లోబల్ టైమ్స్ పేర్కొన్న వివరాల ప్రకారం, ఉత్తర చైనాతో పాటు బీజింగ్‌, నైరుతి నగరం చాంగ్‌కింగ్, దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ నగరంలో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది.

2024 డిసెంబర్ 27న రాయిటర్స్‌లో ప్రచురితమైన కథనంలో, శీతాకాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒక పైలట్ నిఘా వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు చైనా ఆరోగ్య సంస్థలు పేర్కొన్నట్లు తెలిపింది.

ఈ నిఘా వ్యవస్థ గురించి మాట్లాడుతూ, గుర్తు తెలియని కారణాలతో వచ్చే న్యూమోనియా కేసులను పర్యవేక్షిస్తామని చైనా జాతీయ వ్యాధుల నియంత్రణ, నివారణ అధినేత లి జెంగ్‌లాంగ్ చెప్పారు.

చైనాలో డిసెంబర్ మూడో వారంలో, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య తీవ్రంగా పెరిగిందని చైనా ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసిందని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.

నమోదవుతున్న కేసుల్లో రైనో వైరస్, హ్యుమన్ మోటానిమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) ఇన్‌ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు రాయిటర్స్ తన రిపోర్టులో పేర్కొంది.

ఈ ఇన్‌ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉత్తర ప్రావిన్స్‌లలో నమోదవుతున్నాయి. 14 ఏళ్ల లోపున్న చిన్నారులు ఎక్కువగా దీనికి ప్రభావితులు అవుతున్నారు.

హ్యుమన్ మెటానిమోవైరస్ మూలం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని ఈ రిపోర్టు పేర్కొంది.

చైనాలో కొత్త వైరస్

ఫొటో సోర్స్, John Ricky/Anadolu via Getty Images

చైనా సరిహద్దు దేశాల్లో ఆందోళన

చైనాలో ఇన్‌ఫ్లుయెంజా, ఇతర శ్వాసకోశ సంబంధిత వైరస్ కేసులు వ్యాపించడంపై ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది.

చైనాలో పరిస్థితి గురించి సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొట్టగానే, ప్రజలు ఈ వైరస్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మాస్క్‌లు ధరించడం, సోపుతో చేతులు కడుక్కోవడం వంటి ముందు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి విద్యావతి ప్రజలకు సూచించినట్టు ఇండోనేషియా వార్తా సంస్థ అంతారా పేర్కొంది.

''చైనాలో హెచ్ఎంపీవీ ఇన్‌ఫెక్షన్లు వ్యాపించడాన్ని ఇండోనేషియా పర్యవేక్షిస్తోంది. దేశంలోకి ప్రవేశించే మార్గాల వద్ద నిఘా వ్యవస్థను నిర్వహిస్తున్నాం. ఫ్లూ వంటి లక్షణాలతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచుతున్నాం'' అని తెలిపారు.

హాంకాంగ్‌లో హెచ్ఎంపీవీ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని, కానీ కొన్ని మాత్రమే రిపోర్టు అయినట్లు హాంకాంగ్ ఫ్రీ ప్రెస్ తెలిపింది.ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్ కేసులు పెరగడం లేదని అక్కడి డాక్టర్లు పేర్కొన్నారు.

చైనా విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి మావో నింగ్

ఫొటో సోర్స్, fmprc.gov.cn

ఫొటో క్యాప్షన్, శీతాకాలంలో శ్వాసకోశ సంబంధిత ఇన్‌ఫెక్షన్ కేసులు సహజమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ అన్నారు.

‘శీతాకాలంలో సహజమే’

ఉత్తరార్ధ గోళంలో శీతాకాలంలో శ్వాసకోశ సంబంధిత ఇన్‌ఫెక్షన్ కేసులు సహజమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ అన్నారు.

''చైనాలో శీతాకాలంలో వచ్చే శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణ, నియంత్రణపై ఇటీవలే చైనా జాతీయ వ్యాధుల నియంత్రణ, నివారణ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమాచారం అందించింది'' అని తెలిపారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యాధుల తీవ్రత, వ్యాప్తి తక్కువగా ఉందని పేర్కొన్నారు. చైనాకి సురక్షితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.

భారత ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్

ఫొటో సోర్స్, niphtr.mohfw.gov.in

ఫొటో క్యాప్షన్, భారత ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్

భారత్ ఏమంటోంది?

చైనాలో హెచ్‌ఎంపీవీ ఇన్‌ఫెక్షన్ కేసులు పెరుగుతున్నట్లు కథనాలు రాగానే, భారత్‌లో కూడా దీనిపై ఆందోళనలు పెరిగాయి.

అయితే, ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏమీ లేదని భారత ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ చెప్పారు.

ఇప్పటి వరకు భారత్‌లో ఈ వైరస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.

''శ్వాసకోశ సంబంధిత ఇన్‌ఫెక్షన్‌లో ఇది సాధారణమైన వైరస్. జలుబు, ఫ్లూ వంటి అనారోగ్యానికి ఇది కారణమవుతుంది. ఏడాది కంటే తక్కువ వయసున్న పిల్లల్లో, పెద్ద వారిలో ఈ ఇన్‌ఫెక్షన్ వల్ల ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి.'' అని చెప్పారు.

''ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీయదు. భయపడాల్సిన అవసరం లేదు. శీతాకాలంలో, జలుబు, ఫ్లూ సాధారణం. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆస్పత్రులు పూర్తి తరహాలో సిద్ధంగా ఉన్నాయి. డేటాను మేం నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. గత డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఇన్‌ఫెక్షన్ సంఖ్య పెరగలేదు'' అని తెలిపారు.

చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతుండటంపై దృష్టి పెట్టినట్టు అంతకుముందు ఓ వార్తా సంస్థకు భారతీయ ఆరోగ్య శాఖ తెలిపింది.

''హెచ్ఎంపీవీ వైరస్‌కు సంబంధించి చైనాలో శ్వాస కోశ సంబంధిత సమస్య కేసులు నమోదవుతున్నాయి. శీతాకాలంలో, శ్వాస సంబంధిత సమస్యలు భారత్‌లో కూడా వస్తుంటాయి. కానీ, ఇప్పటి వరకు ఈ కేసుల్లో ఎలాంటి పెరుగుదల లేదు'' అని ఇటీవల ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.

వ్యాధులు

ఫొటో సోర్స్, Getty Images

డాక్టర్లు ఏం చెబుతున్నారు?

ఇది కొత్త వైరస్ కాదని దిల్లీలోని శ్రీ గంగా రామ్ హాస్పిటల్‌ పిడియాట్రిక్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డాక్టర్ సురేష్ గుప్తా వార్తా సంస్థ పీటీఐకి చెప్పారు.

''గత 20 ఏళ్లుగా ప్రజలకు ఈ వైరస్ తెలుసు. శీతాకాలంలో, ఈ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదవుతుంటాయి. ఇది ఫ్లూ వైరస్ లాంటిది. దీనికోసం, జలుబు, ఫ్లూలకు వాడే మందులు వాడాలి. అనారోగ్యంగా అనిపిస్తే, విశ్రాంతి తీసుకోవాలి. చాలా కేసుల్లో, ఈ ఇన్‌ఫెక్షన్‌కు ఆస్పత్రిలో చేరాలని సూచించం'' అని సురేష్ గుప్తా తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, ANI

హెచ్ఎంపీవీ వైరస్ ఎలా పుట్టింది?

200 నుంచి 400 ఏళ్ల క్రితం పక్షుల నుంచి ఈ వైరస్ పుట్టిందని సైన్స్ డైరెక్ట్‌లో ఉంది. కానీ, అప్పటి నుంచి ఈ వైరస్ పదేపదే మారుతోంది. ప్రస్తుతం పక్షులకు ఈ వైరస్ సోకడం లేదు.

2001లో ఈ వైరస్‌ను మనుషుల్లో గుర్తించినట్టు అమెరికా ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.

దీనివల్ల, జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

ఇన్‌ఫెక్షన్ పెరుగుతున్నప్పుడు, బ్రాంకైటిస్ లేదా న్యూమోనియాకు కూడా కారణం కావొచ్చు.

ఈ వైరస్ ఇంక్యుబేషన్ పిరియడ్ సాధారణంగా మూడు నుంచి ఆరు రోజులు ఉంటుంది. అనారోగ్యం స్వల్ప కాలం లేదా దీర్ఘకాలం ఉండొచ్చు. ఇది ఇన్‌ఫెక్షన్ తీవ్రతను బట్టి ఉంటుంది.

ఎలా సోకుతుంది?

దగ్గు, ముక్కు కారడం వంటి సమయాల్లో విడుదలయ్యే లాలాజల కణాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.

షేక్ హ్యాండ్, కౌగలింత, ఒకరినొకరు తాకడం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది.

దగ్గు లేదా ముక్కు కారడం వల్ల ఏదైనా ఉపరితలంపై లాలాజల కణాలు పడినప్పుడు, వాటిని తాకిన చేతులతో ముఖం, ముక్కు, కన్ను,నోటిని ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)