ఆరేళ్లలో ఎయిడ్స్ ముప్పుకు ముగింపు పలకొచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
హెచ్ఐవీ కారణంగా మరణాలు, కొత్త కేసులు భారీగా తగ్గుతున్నప్పటికీ ప్రపంచానికి ఎయిడ్స్ ముప్పు తొలగలేదని హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై పనిచేసే యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్(యూఎన్‌ఎయిడ్స్) హెచ్చరించింది.
ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల 99 లక్షల మంది ప్రజలు ఎయిడ్స్‌తో జీవిస్తున్నారని, వారిలో దాదాపు సగం మంది ఆఫ్రికాలో దక్షిణ, తూర్పు దేశాలకు చెందిన వారని యూఎన్ఎయిడ్స్ తెలిపింది.
హెచ్ఐవీ బారిన పడుతున్నవారి సంఖ్య 2010తో పోలిస్తే 39 శాతం తగ్గింది. ఎయిడ్స్‌తో మరణిస్తున్నవారి సంఖ్య సగానికి తగ్గింది.
అయితే 2010 నుంచి 2023 మధ్య అఫ్గానిస్తాన్, ఈజిప్ట్, ఫిజి, ఫిలిప్పీన్స్, పపువా న్యూ గినియా, సౌదీ అరేబియాలో మాత్రం హెచ్‌ఐవీ కేసుల సంఖ్య వంద శాతానికి పైగా పెరిగింది.


ఫొటో సోర్స్, Getty Images
ఐదేళ్లు పెరిగిన హెచ్ఐవీ బాధితుల ఆయుర్దాయం
2010 తరువాత కెన్యా, మలావి, జింబాబ్వే, నేపాల్‌లు తమ దేశాల్లో హెచ్ఐవీ కేసుల సంఖ్యను 75 శాతానికి తగ్గించడంలో విజయవంతమయ్యాయి.
ఎయిడ్స్ వ్యతిరేక పోరాటంలో ఇప్పుడు ఆఫ్రికా ముందుంది.
2010 నుంచి గణాంకాలు పరిశీలిస్తే మరో 18 దేశాలు ఏటా నమోదయ్యే హెచ్ఐవీ కొత్త కేసులను 60 శాతానికి పైగా తగ్గించగలిగాయి.
లిసోథో, ఎస్వాటిని, బెనిన్, ఇథియోపియో, రువాండా, బోట్సువానా, ఎరిట్రియా, లైబీరియా, బుర్కినా ఫాసో, టోగో, జాంబియా, బురుండి, గినియా-బిసావు, యుగాండా, తజకిస్తాన్, పోర్చుగల్, బెలారస్, ఇటలీ వంటి దేశాలు కేసులను తగ్గించగలిగాయి.
వీటిలో అత్యధికం సబ్ సహారా ప్రాంత దేశాలే.
ప్రపంచంలోని హెచ్ఐవీ బాధితుల్లో 77 శాతం మంది యాంటీరెట్రోవైరల్ చికిత్స పొందుతున్నారు. సబ్ సహారా ప్రాంత బాధితుల్లో 82 శాతం మంది ఈ చికిత్స పొందుతున్నారు.
హెచ్ఐవీ బాధితుల ఆయుర్దాయం ఐదేళ్లు పెంచగలగడం ఈ దిశగా సాధించిన విజయమని ‘యూఎన్ఎయిడ్స్’ చెప్తోంది. ఎయిడ్స్ రోగుల సగటు ఆయుర్దాయం 2010లో 56 ఏళ్లుగా ఉంటే 2023 నాటికి అది 61 ఏళ్లకు పెరిగింది.
హెచ్ఐవీ బాధితులకు చికిత్స అందుతుండడంతో వైరస్ నిర్మూలనకు, వ్యాప్తి నిరోధానికి అవకాశం ఏర్పడింది ‘యూఎన్ ఎయిడ్స్’ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
‘సబ్ సహారాన్ ఆఫ్రికాలో హెచ్ఐవీ నిర్మూలనలో మంచి పురోగతి కనిపించింది. స్థానిక నాయకత్వం, అంతర్జాతీయ మద్దతు, అందరూ కలిసికట్టుగా పనిచేయడం ఫలితాలనిచ్చింది’ అని యూఎన్ ఎయిడ్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిస్టీన్ స్టెగ్లింగ్ చెప్పారు.
హెచ్ఐవీ నివారణ అవకాశాలపై.. ఆరోగ్య సేవలు పొందడంలో ఏమైనా అడ్డుగోడలు ఉంటే అలాంటివి తొలగించడంపై దేశాలు దృష్టి సారించాలని క్రిస్టీన్ బీబీసీతో చెప్పారు.
‘ఎయిడ్స్ ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా భావించాల్సిన పరిస్థితులే ఇప్పటికీ ఉన్నాయి. ప్రజలకు వైద్యసేవలందడంలో చాలా లోపాలున్నాయి. వెనకబడిన వర్గాలకు చెందిన ప్రజలకు, పేదలకు సరైన చికిత్స లభించడం లేదు. హెచ్ఐవీ వ్యాప్తిని అడ్డుకోవడంలో సంక్షోభం కొనసాగుతోంది’ అన్నారామె.
సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలు కాకుండా ప్రపంచంలోని మిగతా దేశాల్లో పరిస్థితి పెద్దగా మెరుగుపడడం లేదు. పపువా న్యూ గినియా, అప్గానిస్తాన్, ఫిజి, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, సౌదీ అరేబియాల్లో 2010 నుంచి 2023 మధ్య హెచ్ఐవీ కేసులు వంద శాతం కన్నా ఎక్కువ పెరిగాయి.
అయితే అఫ్గానిస్తాన్, ఈజిప్టు, సౌదీ అరేబియాల్లో అక్కడి జనాభాతో పోల్చితే హెచ్‌ఐవీ కేసుల సంఖ్య తక్కువే. కానీ, పెరుగుదల శాతమే ఆందోళనకరంగా ఉంది.
రాజకీయ మద్దతు, నిధుల కేటాయింపు సరైన స్థాయిలో ఉంటే ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న ఎయిడ్స్‌ను ఆరేళ్లలో అంతం చేయొచ్చని ‘యూఎన్ఎయిడ్స్’ అంచనా వేస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














