'ఇంకా పెళ్లెందుకు చేసుకోలేదు, ఏదైనా సమస్యా?'- ఇలాంటి ప్రశ్నలు పెళ్లి చేసుకోనివారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి...

అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సమాజంలో పురుషులకు, మహిళలకు పెళ్లిని అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు.
    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతీయ సామాజిక వ్యవస్థలో పెళ్లి అనేది అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తుంది. మహిళలు, పురుషులు జీవితంలో పెళ్లిని ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు.

పురుషులతో పోలిస్తే మహిళలు పెళ్లి విషయంలో ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తారని కూడా చెప్పొచ్చు.

2011 జనాభా లెక్కల డేటాను ఉదహరిస్తూ.. భారత్‌లో ఒంటరిగా నివసిస్తున్న మహిళలపై ఒక అధ్యయనం చేపట్టారు.

ఒంటరిగా నివసిస్తున్న మహిళల సంఖ్య 7.14 కోట్లు అని, భారత్‌లోని మొత్తం మహిళల సంఖ్యలో వీరు 12 శాతమని ఆ అధ్యయనం పేర్కొంది.

అకాడమియా జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో, 2001లో ఈ సంఖ్య 5.12 కోట్లని, పదేళ్లలో ఈ సంఖ్య 39 శాతం పెరిగినట్లు తెలిపింది.

అదేవిధంగా, ఒంటరిగా నివసిస్తున్న మహిళలను, ఈ సమాజంలో చాలా చెడుగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొంది.

ఒక వయసు తర్వాత పెళ్లి కాకుండా ఉన్న ఉండిపోయిన మహిళల విషయంలో ఈ సమాజం దృష్టికోణం ఎలా ఉంది? అలాంటి మహిళలు ఎలాంటి సామాజిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు?

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఒంటరితనానికి, ఒంటరిగా ఉండటానికి తేడా ఏంటి?

''పెళ్లి కాకపోవడాన్ని ఈ సమాజం ఒక పాపంగా చూస్తుంది. నాకు పెళ్లి కాలేదు కాబట్టి, నా ఆర్థిక స్థితి, చదువు, నైపుణ్యాలు చూడకుండా నన్ను నేరస్థురాలిగా భావించడం ఏంటి?'' అని 40 ఏళ్ల జ్యోతి షింగే ప్రశ్నించారు.

జ్యోతి ముంబయిలో ఉంటారు. ఉత్తరాఖండ్‌లో చక్రత పట్టణంలో ప్రస్తుతం తాను సొంతంగా ఒక గెస్ట్ హౌస్‌ను, ఒక కేఫ్‌ను నిర్వహిస్తున్నారు.

''భారత్‌లో పెళ్లి కాని మహిళలు ఎదుర్కొనే కష్టాలను నేను ఎన్నో ఎదుర్కొన్నా. ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నా.'' అని ఆమె చెప్పారు.

''కొన్నేళ్ల క్రితం నేను దిల్లీలో పనిచేస్తున్నప్పుడు, ఉండేందుకు నాకు ఇల్లు దొరకలేదు. పెళ్లి కాని అబ్బాయిలకైనా ఇల్లు ఇస్తాం కానీ, పెళ్లి కాని మహిళలపై మాకు నమ్మకం లేదని ఒక ఇంటి యజమాని అన్నారు'' అని జ్యోతి తెలిపారు.

''అది చెబుతూ ఆయన నవ్విన నవ్వును నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో, ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో మంచి జీతానికి నేను పనిచేస్తున్నాను.'' అని చెప్పారు.

జ్యోతి

ఫొటో సోర్స్, Jyotish

ఫొటో క్యాప్షన్, ఇంటిని వెతికేటప్పుడు తనకు చేదు అనుభవాలు ఎదురైనట్లు చెప్పిన జ్యోతి

ఇంటిని వెతికేటప్పుడు ఎదురైన చేదు అనుభవాలే సొంతంగా గెస్ట్‌హౌస్ ప్రారంభించేందుకు కారణమయ్యాయని జ్యోతి తెలిపారు.

''ఇప్పుడు ప్రజలు పెళ్లెప్పుడు చేసుకుంటావు? అని అడుగుతున్నారు. ఇలా బతికితే నీకేమొస్తుంది? ఏమైనా లోపం ఉందా? అనే ప్రశ్నలు వేస్తారు'' అని అన్నారామె.

అయితే, తాను ఈ ప్రశ్నలను సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు జ్యోతి.

''నా వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టాను. చక్రతాలో ప్రశాంతంగా జీవిస్తున్నా. హిమాలయాలకు దగ్గర్లో ఉన్న అందమైన నగరం ఇది. త్వరలోనే ఇక్కడే ఒక కొత్త హోటల్ కూడా ప్రారంభించబోతున్నా'' అని జ్యోతి చెప్పారు.

కానీ, తనని ఈ ప్రశ్నలు వేసే వారికి ఇదేమీ అర్థం కాదని, ఎందుకంటే పెళ్లి చేసుకోని అమ్మాయిలను వారసలు మహిళలుగానే పరిగణించరని అన్నారు.

అధ్యయనం ఏం చెబుతోంది?

భారత్‌లో ఒంటరిగా ఉంటున్న మహిళలపై చేపట్టిన అధ్యయనంలో, ''సమాజంలో ఉన్న సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా చేసే మహిళలను సంతోషంగా లేని, పరిపక్వత లేని, అసంపూర్ణ మహిళలుగా భావిస్తూ, సమాజం వారిని దూరంగా ఉంచుతుంది.'' అని వెల్లడైంది.

35 ఏళ్లు నిండిన నాలుగు రకాల మహిళలను 'ఒంటరిగా నివసిస్తున్న మహిళలు' అని ఈ అధ్యయనం గుర్తించింది.

  • భర్త లేని మహిళలు
  • విడాకులు తీసుకున్న మహిళలు
  • పెళ్లికాని అమ్మాయిలు
  • భర్త నుంచి విడిపోయి ఉంటున్న మహిళలు

జీవితంపై మరింత ఆశతో, సానుకూల ధోరణితో, ఆర్థికంగా మెరుగ్గా మహిళలు ఉంటున్నప్పటికీ, వారిని జీవితంలో లూజర్లుగానే పరిగణిస్తున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది.

''ఒంటరిగా నివసిస్తున్న మహిళలు సంతోషంగా ఉండరని ఈ సమాజంలో ఒక దృక్పథం ఉంది. చాలామంది నాకు ఈ విషయం చెప్పారు.'' అని జ్యోతి అన్నారు.

అయితే, ఒంటరిగా జీవించడం, ఒంటరితనంతో జీవించడం వేరువేరని తెలిపారు.

''నాకు కూడా ముంబయిలో పెద్ద కుటుంబం ఉంది. నాన్న, అన్న, వదిన, పిల్లలు ఉన్నారు. నేను ఏ కుటుంబ కార్యక్రమాన్ని మిస్ కాను. అదేవిధంగా, నాకు చక్రతాలో కూడా స్నేహితులు ఉన్నారు. నేను ఒంటరి దాన్ని కాదు. నాకు నచ్చిన విధానంలో నా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నా'' అని జ్యోతి చెప్పారు.

డిప్రెషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పెళ్లయిన వారికంటే పెళ్లికాని వారే ఎక్కువ డిప్రెషన్‌లో ఉంటున్నట్లు వెల్లడి

'జీవితం శూన్యం'

అయితే, కోయంబత్తూర్‌కు చెందిన 43 ఏళ్ల వినోద్ కుమార్ (పేరు మార్చాం)ది భిన్నమైన పరిస్థితి.

''కుటుంబాలు కలుసుకునే కార్యక్రమాలకు వీలైనంత దూరంగా ఉండాలనుకుంటాను.’’ అన్నారు వినోద్ కుమార్.

కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేనని, పెళ్లికాకపోవడాన్ని వారు ఒక పెద్ద నేరంగా చూస్తారని వినోద్ కుమార్ చెప్పారు.

‘‘నాకు ఎప్పుడూ జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటా. ఒకవేళ వచ్చినా, ఎవరికైనా చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడతా. ఎందుకంటే చెబితే త్వరగా పెళ్లి చేసుకో అంటారు.'' అన్నారు వినోద్.

''ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పలేక, చాలా ఇబ్బంది పడుతున్నా. అయితే, ఎవరైతే మనల్ని ప్రశ్నించి, ఉచిత సలహాలు ఇస్తారో వారు మనకోసం ఏమీ చేయరని అర్ధమైంది.'' అని అన్నారు.

''నేనేమీ చేయలేను. జీవితంలో ఒక రకమైన శూన్యతను అనుభవిస్తున్నాను.'' అని అన్నారు వినోద్ కుమార్.

సైన్స్ మేగజీన్ 'నేచర్'లో ప్రచురితమైన అధ్యయనంలో, పెళ్లయిన వ్యక్తులతో పోలిస్తే పెళ్లి కాని వ్యక్తులు ఎక్కువ డిప్రెషన్‌లో ఉంటున్నారని తెలిసింది.

ఏడు దేశాల నుంచి లక్షా 6 వేల 556 మంది వలంటీర్లపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

దీనిని నిర్వహించిన దేశాలలో అమెరికా, బ్రిటన్, మెక్సికో, ఐర్లాండ్, దక్షిణ కొరియా, చైనా, ఇండోనేషియా ఉన్నాయి. విడాకులు తీసుకున్నవారితో 99 శాతం ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతున్నారని ఈ అధ్యయనం గుర్తించింది.

రచయిత రాజసంగీతన్

ఫొటో సోర్స్, Rajasangeethan/FB

ఫొటో క్యాప్షన్, రచయిత రాజసంగీతన్

ఒంటరిగా జీవిస్తున్న వారిని సమాజం ఎలా చూస్తుంది?

ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలకు మన సమాజం వద్ద పరిష్కారం లేదని రచయిత రాజసంగీతన్ అన్నారు.

''సమాజంలో ఒంటరిగా నివసిస్తున్న, విడాకులైన, లేదా భాగస్వాములను కోల్పోయిన వారి లైంగిక అవసరాల గురించి ఇక్కడెవరూ మాట్లాడరు.'' అని అన్నారు.

''ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒకటే సమాధానం చెబుతారు. పెళ్లి చేసుకో అని. నిజానికి, స్త్రీ పురుషుల మధ్య వివాహం తప్ప మరే ఇతర సంబంధం ఉండకూడదు అని సమాజం భావిస్తుంది.'' అని అన్నారు.

నగరంలో లేదా గ్రామంలో ఎవరైనా ఒంటరిగా ఉంటున్న మహిళలు అబ్బాయిలు లేదా పురుషులతో మాట్లాడితే ఆమెను చాలా తేడాగా చూస్తారని చెప్పారు.

''ఒక వ్యక్తి పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయానికి రావడానికి ఎన్నో బలమైన కారణాలుంటాయి’’ అన్నారు రాజసంగీతన్. ఏదో లోపం ఉన్న కారణంతో మహిళలు లేదా పురుషులు ఒంటరిగా నివసించాల్సిన అవసరం లేదంటారాయన.

కుటుంబ బాధ్యతలు, ఇతర సామాజిక ఒత్తిళ్లతో వారు పెళ్లి చేసుకోకపోవచ్చన్నారు. కుటుంబ ఒత్తిడితో చాలా మంది పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటున్నారని తెలిపారు.

''కుటుంబ పరిస్థితి కాస్త మెరుగుపడినప్పుడు, పెళ్లి కోసం ఆలోచించినప్పుడు సమాజం నిర్ణయించిన వయసు అప్పటికే వారికి దాటిపోతుంది. వారి అవసరాలను కనీసం సమాజం పట్టించుకోదు'' అని చెప్పారు.

ఒంటరిగా నివసిస్తున్న వారిని సమాజం విస్మరించి, పట్టించుకోకపోతే, ఈ పరిస్థితి మరింత డిప్రెషన్‌కు దారితీసి, ఎన్నో రుగ్మతలు వారిని చుట్టముట్టవచ్చని రాజసంగీతన్ అభిప్రాయపడ్డారు.

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

సమాజ ఒత్తిడి ప్రభావమెంత?

ఒంటరిగా నివసిస్తోన్న వారికి, తమ తల్లిదండ్రులు పదేపదే 'నువ్వు ఈ సమాజంలో భాగం కావు' అని గుర్తు చేస్తుంటారు. ఇది వారిలో అపరాధ భావనకు గురి చేస్తుందని సైకియాట్రిస్ట్ పూర్ణ చంద్రిక అన్నారు.

''వారికి ఎన్నో సూచనలు చేశాం. ఆలయాలకు వెళ్లమన్నాం. సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లాం'' అని కొందరు తల్లిదండ్రులు చెప్పినట్లు పూర్ణ చంద్రిక చెప్పారు.

కొందరు తమ పిల్లలకి ఏదైనా మానసిక సమస్యలు ఉన్నాయో చూడాలంటూ తన దగ్గరకు వస్తుంటారని తెలిపారు. అయితే ఇదంతా మన పక్కింటి వారు ఏమనుకుంటారో అన్న భయంతోనేనని అన్నారు.

సామాజిక ఒత్తిడి కారణంగా తొందరపాటు వివాహాలు చేసుకుని, తప్పుడు భాగస్వామ్యులతో కలిసి ఉంటున్న వారికి తాను మానసిక ఆరోగ్య సలహాలు అందించినట్లు చెప్పారు. పెళ్లి చేసుకోకుండా ఉండటమనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమన్నారామె.

‘‘మన సమాజంలో ఎంతో కాలంగా ఒక మూఢనమ్మకం ఉంది. పెళ్లి చేసుకో, అంతా మారిపోతుంది అంటారు. ఈ నమ్మకం మారనంత వరకు, ఏదీ మారదు'' అని పూర్ణ చంద్రిక అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)