చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్: అగర్తలలో బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయంపై దాడి

అగర్తలలో నిరసనలు

ఫొటో సోర్స్, Pinaki Das

ఫొటో క్యాప్షన్, అగర్తలలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన హిందూ సంఘర్ష్ సమితి కార్యకర్తలు
    • రచయిత, పినాకీ దాస్
    • హోదా, బీబీసీ కోసం

త్రిపుర రాజధాని అగర్తలలో బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయంపై దాడి జరిగింది.

బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయం వద్ద హిందూ సంఘర్ష్ సమితికి చెందిన త్రిపుర విభాగం ఆందోళన చేపట్టింది. ఈ సమయంలో ఆందోళనకారులు ఆ కార్యాలయంపై దాడి చేశారు.

సర్క్యూట్ హౌస్‌కు సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సోమవారం ఉదయం ఆందోళన చేశారు.

అదే సమయంలో, కొందరు ఆందోళనకారులు పోలీసు బారికేడ్లను తోసేసి, బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు.

రాష్ట్ర డీజీపీ అనురాగ్ ధన్‌ఖడ్, పశ్చిమ త్రిపుర జిల్లా ఎస్పీ డాక్టర్ కిరణ్ కుమార్‌లు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

అగర్తలలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హైకమిషనర్ కార్యాలయంపై దాడి తర్వాత భారత విదేశాంగ శాఖ స్పందించింది. దౌత్య కార్యాలయాలపై ఎవరూ దాడులకు పాల్పడొద్దని చెప్పింది. దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న డిప్యూటీ/అసిస్టెంట్ హైకమిషన్‌ల దగ్గర భద్రతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో హిందూ సంస్థల ఆందోళన

ఫొటో సోర్స్, Kamal Das

ఫొటో క్యాప్షన్, చిన్మయ్ కృష్ణ దాస్‌ అరెస్టును నిరసిస్తూ బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో హిందూ సంస్థలు ఆందోళన చేశాయి

దేశద్రోహం ఆరోపణలతో ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్‌ను బంగ్లాదేశ్‌లో అరెస్ట్ చేయడంపై హిందూ సంస్థలు ఆందోళన చేపట్టాయి.

చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టుపై భారత్ ''తీవ్ర ఆందోళన'' వ్యక్తం చేయడంతో పాటు బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని ఆ దేశాన్ని కోరుతూ ప్రకటన చేసింది.

చిన్మయ్ కృష్ణ దాస్‌ను వెంటనే విడుదల చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ డిమాండ్ చేసింది.

మరోవైపు, ఇస్కాన్‌ను బ్యాన్ చేయాలని బంగ్లాదేశ్‌లో కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆ డిమాండ్‌తో వేసిన పిటిషన్‌ను బంగ్లాదేశ్‌లోని కోర్టు తిరస్కరించింది.

 చిన్మయ్ కృష్ణ దాస్

ఫొటో సోర్స్, Kamol Das

ఫొటో క్యాప్షన్, దేశద్రోహం ఆరోపణలతో చిన్మయ్ కృష్ణ దాస్‌ను బంగ్లాదేశ్‌లో అరెస్టు చేశారు

చిన్మయ్ కృష్ణ దాస్‌కు సంబంధించిన వివాదమేంటి?

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల తీవ్ర నిరసనల కారణంగా అశాంతి చెలరేగి మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగస్టులో అధికారం కోల్పోయిన తరువాత, ఆ దేశంలో హిందూ మైనారిటీల భద్రత విషయంలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ముస్లిం మెజార్టీ దేశమైన బంగ్లాదేశ్‌లో హిందువులు ప్రధాన మైనారిటీలుగా ఉన్నారు. ఆ దేశ జనాభాలో హిందువుల జనాభా దాదాపు 8 శాతం.

మైనార్టీలపై దాడులను నిరసిస్తూ చిన్మయ్ కృష్ణ దాస్ పలు ఆందోళనల్లో పాల్గొన్నారు.

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో జరిగిన ఒక ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

అయితే, చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ తర్వాత ఆయన మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఢాకా, చిట్టగాంగ్‌లలో నిరసనలు ఎక్కువగా జరిగాయి.

దీని తర్వాత, బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ను బ్యాన్ చేయాలని పలు సంస్థలు డిమాండ్ చేశాయి. దీనిపై కోర్టులో పిటిషన్ కూడా వేశాయి. ఆ పిటిషన్‌ను బంగ్లాదేశ్ కోర్టు తిరస్కరించింది.

‘‘చిన్మయ్ కృష్ణ దాస్‌ ఇస్కాన్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఏది చేసినా, అది మా బాధ్యత కాదు’’ అని బంగ్లాదేశ్ ఇస్కాన్ సెంట్రల్ కమిటీ మెంబర్ బిమల్ కుమార్ ఘోస్ తెలిపారు.

‘‘దేశాన్ని అస్థిరపరిచే ఉద్దేశంతో తన మూవ్‌మెంట్‌కు రాజకీయ రంగును పులమాలని చిన్మయ్ కృష్ణ దాస్ ప్రయత్నిస్తున్నారు’’ అని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి చెందిన ఇన్‌ఫర్మేషన్ అడ్వయిజర్ నహిద్ ఇస్లాం అన్నారు.

ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో మతపరమైన, రాజకీయ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇస్కాన్ విషయంలో నెలకొన్న కొత్త వివాదం మరింత క్లిష్టంగా మారింది.

షేక్ హసీనా పదిహేనేళ్ల పాలనకాలంలో భారత సరిహద్దు భద్రత, మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు భద్రత వంటి వ్యవహారాల్లో బంగ్లాదేశ్ కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగానూ, మిత్రదేశంగానూ ఉంది.

భారత్‌తో సన్నిహితంగా ఉండడం వల్ల ఆ దేశం ఆర్థికంగానూ లాభపడింది.

కానీ, ఆమె పదవి కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల భద్రతపై భారత్ పదేపదే ఆందోళన వ్యక్తం చేసింది. అయితే భారత వాదనలను బంగ్లాదేశ్ తోసిపుచ్చుతూ వచ్చింది.

ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు మహమ్మద్ యూనస్ ఇటీవల కోరారు. తమ ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉందన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)