‘భూతల నరకం’: ‘రేప్ రూమ్‌లోకి తీసుకెళ్లేవారు, మా కూతుళ్లపైనా అత్యాచారం చేశారు, రేప్ తరువాత గర్భం దాల్చానని భర్త వదిలేశాడు’

ఫొటో సోర్స్, AFP
- రచయిత, అమిరా మాద్బి
- హోదా, బీబీసీ ప్రతినిధి
(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలిచివేయవచ్చు)
‘మేం భయంభయంగా బతుకుతున్నాం’ అని ఫోన్‌లో చాలా మెల్లగా చెప్పారు లైలా. ఎవరికీ తన మాటలు వినిపించకూడదన్న ఉద్దేశంతో ఆమె అలా మాట్లాడారు.
భద్రతను వెతుక్కుంటూ గత ఏడాది మొదట్లో తన భర్త, ఆరుగురు పిల్లలతో కలిసి ఆమె సూడాన్ నుంచి పారిపోయారు. ఇప్పుడామె లిబియాలో ఉన్నారు.
లిబియాకు అక్రమంగా వలస వెళ్లిన సూడాన్ మహిళలతో బీబీసీ మాట్లాడింది. వారి అనుభవాలను తెలుసుకుంది.
వారి గుర్తింపును దాచడం కోసం ఈ కథనంలో బాధిత మహిళల పేర్లను మార్చాం.
2023లో చెలరేగిన సూడాన్ హింసాత్మక అంతర్యుద్ధం సమయంలో ఆమ్‌డర్మన్‌లోని తన ఇంటిపై ఎలా దాడి జరిగిందో వివరిస్తున్నప్పుడు లైలా గొంతు వణికింది.
లైలా కుటుంబం మొదట ఈజిప్ట్ వెళ్లింది. లిబియాకు వెళ్తే తమ జీవితాలు బాగుపడతాయని, అక్కడ క్లీనింగ్, హాస్పిటాలిటీ విభాగాల్లో ఉద్యోగాలు చేసుకోవచ్చని ట్రాఫికర్లు చెప్పడంతో ఆ మాటలు నమ్మి వారికి 350 డాలర్లు (సుమారు రూ. 30 వేలు) చెల్లించారు.
కానీ, సరిహద్దులు దాటిన మరుక్షణమే ట్రాఫికర్లు తమను బందీలుగా చేసుకొని చావబాదడంతో పాటు మరింత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారని లైలా చెప్పారు.
''మా బాబు ముఖంపై పదేపదే పిడిగుద్దులు కురిపించడంతో అతనికి చికిత్స అవసరమైంది'' అని బీబీసీకి ఆమె తెలిపారు.
మూడు రోజుల తర్వాత ట్రాఫికర్లు తమను వదిలేశారని, ఎందుకు వదిలేశారో తమకు తెలియదని ఆమె అన్నారు.
లిబియాలో తమ కొత్త జీవితం బాగుంటుందని లైలా ఆశించారు. ఒక గది అద్దెకు తీసుకొని పని చేయడం మొదలుపెట్టారు.
ఒక రోజు పని వెతుక్కుంటూ వెళ్లిన ఆమె భర్త మళ్లీ తిరిగిరాలేదు. ఆ తర్వాత, ఆమె 19 ఏళ్ల కూతురిపై అత్యాచారం జరిగింది. లైలా ఉద్యోగం చేసే చోట వారి కుటుంబానికి తెలిసిన ఒక వ్యక్తి ఆమె కూతురిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

‘జరిగింది ఎవరికైనా చెప్తే చెల్లెలినీ చెరిచేస్తామన్నారు’
''జరిగింది ఎవరికైనా చెబితే నీ చెల్లెలిని కూడా రేప్ చేస్తానంటూ అతను మా పెద్దమ్మాయిని బెదిరించాడు'' అని లైలా తెలిపారు.
తన మాటలను యజమాని వింటే తమ కుటుంబాన్ని అక్కడి నుంచి పంపేస్తారేమో అనే భయంతో ఆమె చాలా మెల్లగా మాట్లాడారు.
తమ కుటుంబం లిబియాలో చిక్కుకుపోయిందని లైలా అన్నారు. లిబియా నుంచి వెళ్లిపోవడానికి ట్రాఫికర్లకు చెల్లించేందుకు వారివద్ద డబ్బులు లేవు. యుద్ధంతో నలిగిపోయిన సూడాన్‌కు వారు తిరిగి వెళ్లలేరు.
''మాకు తినడానికి సరిపడా తిండి కూడా లేదు. మా అబ్బాయి నల్లగా ఉన్నాడని తోటిపిల్లలు తరచుగా అతడిని కొడుతున్నారు, అవమానిస్తున్నారు. భయంతో వాడు ఇంటి నుంచి బయటకు వెళ్లడం లేదు. ఇదంతా చూస్తుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది'' అని లైలా ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అక్కడ వివక్ష.. ఇక్కడ అంతకంటే పెద్ద శిక్ష’
2023లో ఆర్మీకి, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి లక్షల మంది సూడాన్ నుంచి పారిపోయారు. 2021లో ఈ రెండు వర్గాలు కలిసి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాయి.
కానీ, ఆ తర్వాత అధికారం విషయంలో వారి కమాండర్ల మధ్య మొదలైన ఆధిపత్య పోరుతో దేశంలో అంతర్యుద్ధం మొదలైంది.
యుద్ధం కారణంగా 1,20,00,000 మందికి పైగా ప్రజలు బలవంతంగా తమ ఇళ్ల నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.
అయిదు ప్రాంతాల్లో అత్యంత తీవ్ర స్థాయిలో కరవు ఏర్పడింది. 2.46 కోట్ల మంది ప్రజలకు, అంటే దేశ జనాభాలో సగం మందికి అత్యవసరంగా ఆహార పంపిణి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
సూడాన్‌కు చెందిన 2,10,000 మంది శరణార్థులు ఇప్పుడు లిబియాలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి రెఫ్యూజీ ఏజెన్సీ చెబుతోంది.
సూడాన్‌కు చెందిన అయిదు కుటుంబాలతో బీబీసీ మాట్లాడింది. ఈ కుటుంబాలన్నీ లిబియాకు వెళ్లడానికంటే ముందు ఈజిప్ట్ వెళ్లాయి.
అక్కడ జాతి వివక్ష, హింసకు గురయ్యామని ఆ కుటుంబాలు చెప్పాయి. లిబియాకు వెళ్తే తాము సురక్షితంగా ఉండొచ్చని, మంచి ఉద్యోగాలు దొరుకుతాయని అనుకున్నట్లు వారు తెలిపారు. లిబియాలో వలస, శరణార్థుల సమస్యలపై పరిశోధనలు చేసే ఒక వ్యక్తి సహాయంతో మేం ఈ కుటుంబాలను సంప్రదించాం. వారిలో సాల్మా కుటుంబం ఒకటి.

ఫొటో సోర్స్, Getty Images
‘నా కళ్లెదుటే మా బాబు చేతిని కాల్చేశారు’
సూడాన్ అంతర్యుద్ధం మొదలైనప్పటికే తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి తామంతా కైరో నగరంలో నివసిస్తున్నట్లు సాల్మా చెప్పారు. కానీ, భారీ సంఖ్యలో శరణార్థులు ఈజిప్టులోకి రావడంతో అక్కడి వలసదారుల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆమె అన్నారు.
దాంతో సాల్మా కుటుంబం, లిబియాకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. కానీ, తమ కోసం అక్కడ ‘భూలోక నరకం’ ఎదురుచూస్తున్న సంగతి తమకు తెలియదని సాల్మా చెప్పారు.
సరిహద్దు దాటిన తక్షణమే తమ కుటుంబాన్ని ట్రాఫికర్లు ఒక గోదాములో ఎలా బంధించారో ఆమె వివరించారు. డబ్బు కావాలని వేధించారని చెప్పారు.
ఆమె కుటుంబం దాదాపు రెండు నెలలు అదే గోదాములో గడపాల్సి వచ్చింది.
ఒక దశలో సాల్మాను భర్త నుంచి వేరుచేసి మహిళలు, పిల్లలు ఉన్న మరో గదిలోకి తీసుకెళ్లారు.
డబ్బు కోసం అక్కడ తనతో పాటు తన ఇద్దరు పిల్లలను చిత్రవధ చేశారని, క్రూరంగా ప్రవర్తించారని ఆమె చెప్పారు.
''మా శరీరాలపై వారు కొట్టిన కొరడా దెబ్బల గుర్తులు ఉన్నాయి. వాళ్లు నా కూతుర్ని కొట్టారు. నేను చూస్తుండగా మా బాబు చేతిని కాల్చారు. మేం అందరం ఒకేసారి చనిపోతే బావుండు అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంతకుమించి అక్కడనుంచి బయటపడేందుకు నాకే మార్గం కనిపించలేదు'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఆకలితో చచ్చిపోతున్నానంటున్నా ఇవ్వడానికి రొమ్ముల్లో పాలు లేవు’
ఈ దారుణాలన్నింటితో తన పిల్లలు క్షోభకు గురయ్యారని ఆమె అన్నారు. ఆ తర్వాత ఆమె గొంతులో మరింత బాధ ధ్వనించింది.
''వాళ్లు నన్ను మరో ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లేవారు. అది 'రేప్ రూమ్'.
ప్రతిసారి వేర్వేరు పురుషులు అందులోకి వచ్చేవారు. వారిలో ఒకరి బిడ్డనే ఇప్పుడు నేను మోస్తున్నా'' అని ఆమె చెప్పారు.
ఎట్టకేలకు ఈజిప్ట్‌లోని ఒక ఫ్రెండ్ సహాయంతో సాల్మా కొంత డబ్బును సేకరించారు. ఆ డబ్బు ఇవ్వడంతో ట్రాఫికర్లు తమ కుటుంబాన్ని విడిచిపెట్టారని ఆమె తెలిపారు.
అబార్షన్ చేయడం కుదరదని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఒక డాక్టర్ చెప్పారని ఆమె అన్నారు. గర్భవతిని అని తెలిసి తనను, తన పిల్లలను భర్త వదిలేశాడని చెప్పారు.
దిక్కులేని పరిస్థితుల్లో చెత్త డబ్బాల్లో దొరికిన ఆహారం తింటూ, కటిక నేలపై పడుకుంటూ, వీధుల్లో భిక్షం ఎత్తుకున్నామని ఆమె వివరించారు.
కొంతకాలం పాటు లిబియాలోని ఒక మారుమూల పొలంలో తలదాచుకున్నామని చెప్పారు. అక్కడ తినడానికి తిండి లేదని, దాహం తీర్చుకునేందుకు దగ్గరలోని ఒక బావిలోని కలుషితమైన నీరు తాగామని వివరించారు.
''ఆకలితో చచ్చిపోతున్నానని నా పెద్ద కుమారుడు అన్నప్పుడు అది విని నా గుండె ముక్కలైంది'' అంటూ ఆమె ఫోన్‌లో చెబుతున్నప్పుడు వెనుక నుంచి ఒక పిల్లాడి ఏడుపు మాకు బిగ్గరగా వినిపించింది.
''వాడు బాగా ఆకలితో ఉన్నాడు. కానీ, తినిపించడానికి నాదగ్గర ఏమీ లేవు. రొమ్ములలో తగినన్ని పాలు రావడం లేదు'' అని ఆమె చెప్పారు.
‘నా కంటే చిన్నవాడు.. పని ఇప్పిస్తానని తీసుకెళ్లి నిర్బంధించి వారాల తరబడి అత్యాచారం చేశాడు’
లిబియాలో మెరుగైన జీవితం గడపొచ్చని నమ్మిన వారిలో సూడాన్‌కు చెందిన జమీలా కూడా ఒకరు. ఆమె వయస్సు నలభైలలో ఉంటుంది.
2014లో సూడాన్ పశ్చిమ ప్రాంతం డార్ఫర్‌లో అశాంతి నెలకొన్నప్పుడే జమీలా అక్కడినుంచి ఈజిప్ట్ పారిపోయారు. ఈజిప్ట్‌లో కొన్నేళ్లు గడిపారు. తర్వాత 2023 చివరి కాలంలో లిబియాకు వెళ్లారు.
అప్పుడు తనకు 19 ఏళ్లు, 20 ఏళ్ల వయస్సున్నఇద్దరు కూతుళ్లు ఉన్నారని ఆమె చెప్పారు. లిబియాకు వెళ్లినప్పటి నుంచి వారిద్దరిపై పదేపదే అత్యాచారాలు జరిగాయని తెలిపారు.
''నాకు ఆరోగ్యం బాలేనప్పుడు వారిని ఒక చోట క్లీనింగ్ పని కోసం పంపించాను. వారు రాత్రిపూట రక్తం, దుమ్ముధూళి మరకలతో తిరిగొచ్చారు. స్పృహతప్పి పడిపోయే వరకు నలుగురు వ్యక్తులు వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక వ్యక్తి తనను కొన్ని వారాలపాటు నిర్బంధించి అత్యాచారం చేశాడని ఆమె తెలిపారు. అతను తనకంటే చాలా చిన్నవాడని, ఒక ఇంట్లో క్లీనింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని తనకు చెప్పాడని ఆమె వివరించారు.

‘మహిళలు పుట్టింది అందుకోసమే అనేవాడు’
''అతను నా నలుపు రంగును అవహేళన చేస్తూ పిలిచేవాడు. నన్ను రేప్ చేశాడు. మహిళలు పుట్టిందే దీనికోసమే అనేవాడు. అక్కడి పిల్లలు కూడా మమ్మల్ని నీచంగా చూస్తారు. మమ్మల్ని ఒక జంతువులా, మంత్రగత్తెల్లా చూస్తారు. ఆఫ్రికన్ అని, నల్లగా ఉన్నందుకు అవమానిస్తారు. వారు మాత్రం ఆఫ్రికన్లు కాదా?'' అని ఆమె ప్రశ్నించారు.
తన కుమార్తెలపై తొలిసారి అత్యాచారం జరిగినప్పుడు జమీలా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ, వారు శరణార్థులని గుర్తించిన తర్వాత ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ, ఒకవేళ అధికారికంగా ఫిర్యాదు నమోదైతే జైల్లో వేస్తానంటూ తనను పోలీస్ అధికారి బెదిరించినట్లు జమీలా చెప్పారు.
1951 శరణార్థుల ఒప్పందం, శరణార్థుల స్థితికి సంబంధించిన 1967 ప్రోటోకాల్‌పై లిబియా సంతకం చేయలేదు. పైగా శరణార్థులను, ఆశ్రయం కోరుతూ వచ్చేవారిని అక్రమ వలసదారులుగా లిబియా పరిగణిస్తుంది.
లిబియా రెండు భాగాలుగా విడిపోయింది. వేర్వేరు ప్రభుత్వాలు ఈ భాగాలను పాలిస్తున్నాయి. మానవ హక్కుల సంఘం 'లిబియా క్రైమ్ వాచ్' ప్రకారం, లిబియా తూర్పు భాగంలో వలసదారుల పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. వలసదారులు తమకు అన్యాయం జరిగితే అధికారికంగా ఫిర్యాదు చేయవచ్చు. సులభంగా ఆరోగ్య సంరక్షణ పొందవచ్చు.
లిబియాకు పశ్చిమాన అధికార డిటెన్షన్ సెంటర్లలో వేధింపులు జరుగుతున్నాయని చెప్పే ఆధారాలు కూడా ఉన్నాయి. ట్రాఫికర్లు నడిపే అనధికార వసతుల్లో లైంగిక వేధింపులు చాలా సాధారణం.
‘గంటల తరబడి బతిమాలితేనే బాత్‌రూమ్‌కు వెళ్లేందుకు అనుమతి’
చెత్త కుప్పల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లను సేకరిస్తూ, వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో పిల్లలను పోషిస్తున్న సూడాన్ మహిళ హనా.
పశ్చిమ లిబియాలో తనను కిడ్నాప్ చేసి, ఒక అడవిలోకి తీసుకెళ్లి, గన్ పెట్టి కొంతమంది పురుషులు తనను రేప్ చేశారని ఆమె చెప్పారు.
ఆ మరుసటి రోజు వారు తనను ప్రభుత్వ నిధులతో నడిచే స్టెబిలీ సపోర్ట్ అథారిటీ (ఎస్‌ఎస్‌ఏ) కేంద్రానికి తీసుకెళ్లారని తెలిపారు.
''అక్కడ కొందరు యువకులను బాగా కొట్టి, నేను చూస్తుండగా వారితో పూర్తిగా దుస్తులు విప్పించారు. కొన్నిరోజుల పాటు నేను అక్కడే ఉన్నాను. ప్లాస్టిక్ చెప్పులపై తల పెట్టుకొని నేలపై పడుకున్నాను. గంటల పాటు బతిమాలితే బాత్‌రూమ్‌కు వెళ్లనిచ్చేవారు. పదేపదే నా తలపై కొట్టారు'' అని ఆమె వివరించారు.
ఆఫ్రికా దేశాల వలసదారులపై లిబియాలో వేధింపులు జరుగుతున్నాయని గతంలో చాలా నివేదికలు వచ్చాయి. యూరప్‌కు వెళ్లే మార్గంలో లిబియా ఒక కీలక దేశం.
బీబీసీ మాట్లాడిన మహిళలెవరూ యూరప్‌కు వెళ్లాలనుకుంటున్నట్లుగా చెప్పలేదు.
హత్యలు, నిర్బంధాలు, వలసదారులను శరణార్థులను అడ్డగించి నిర్బంధించడం, హింసించడం, శ్రమదోపిడీ, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ ఎస్‌ఎస్‌ఏపై 2022లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపణలు చేసింది.
ఎస్‌ఎస్‌ఏ అనేది లిబియా ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్‌కు జవాబుదారీ అయినందున తమకు ఆ సంస్థపై ఎలాంటి పర్యవేక్షణ లేదని రాజధాని ట్రిపోలీలోని దేశీయ వ్యవహారాల శాఖ చెప్పినట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదికలో పేర్కొంది.
దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ‘బీబీసీ’ సంప్రదించింది. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ట్రిపోలీలోని కరుడుగట్టిన నేరస్థులు ఉండే అబు సలీమ్ జైలు సహా అధికారిక నిర్బంధ కేంద్రాల్లో వలసదారులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ‘లిబియా క్రైమ్ వాచ్’ బీబీసీతో చెప్పింది.
సాల్మా ఇప్పుడు పొలంలో తాను ఆశ్రయం పొందిన ప్రాంతం నుంచి సమీపంలోని మరో గదికి మారారు. ఇంకో కుటుంబంతో కలిసి వారు అక్కడ ఉంటున్నారు. కానీ, ఇప్పటికీ వారు భయంభయంగానే జీవిస్తున్నారు.
ఇంత జరిగాక, ఇక ఇంటికి తిరిగి వెళ్లలేమని ఆమె అంటున్నారు.
''కుటుంబం పరువు తీశానని మా వాళ్లు అంటారు. నా శవాన్ని కూడా వారు తాకుతారో లేదో నాకు తెలియదు'' అని ఆమె చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














