‘హెచ్1బీ వీసా’లపై ట్రంప్ పార్టీలో తలో మాట.. మస్క్, వివేక్ రామస్వామి ఏమన్నారు? నిక్కీ హేలీ ఏమంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మైక్ వెండ్లింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హెచ్1బీ వీసా పాలసీ డోనల్డ్ ట్రంప్ మద్దతుదారులలో విభేదాలకు కారణమైంది. ఇప్పుడు అమెరికా రాజకీయాలలో చర్చనీయంగా మారింది.
కొన్నిరోజులుగా సాగుతున్న వీసా వివాదంపై ట్రంప్ స్పందించారు. టెక్ దిగ్గజాలు వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్‌ల వాదనకు ఆయన మద్దతిచ్చినట్లుగా కనిపిస్తోంది.
మరికొద్దిరోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డోనల్డ్ ట్రంప్ శనివారం న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. హెచ్-1బీ వీసాలకు తాను మద్దతుదారునని, ఈ స్కీమ్ కింద గెస్ట్ వర్కర్లను కూడా నియమించుకున్నానని చెప్పారు.
అయితే గతంలో హెచ్1బీ వీసా విధానంపై ట్రంప్ విమర్శలు చేశారు. ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెచ్1బీ వీసాలను ఆయన పరిమితం చేశారు.
‘హెచ్1బీ వీసాలను నేను ఎల్లప్పుడూ ఇష్టపడతాను, దానికి మద్దతుగా ఉంటాను. అందుకే అవి మన వ్యవస్థలో ఉన్నాయి. నా కార్యాలయాలలో చాలామంది హెచ్1బీ వీసా ఉద్యోగులున్నారు. ఈ వీసాపై నాకు నమ్మకం ఉంది’ అని ట్రంప్ ‘న్యూయార్క్ పోస్ట్’తో అన్నారు.
ఈ వివాదం ఇంతటితో ఆగలేదు. ఆన్‌లైన్ వేదికగా చర్చ నడుస్తోంది.


ఫొటో సోర్స్, Getty Images
వివాదం ఎలా మొదలైంది?
భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి ‘ఎక్స్’ వేదికగా హెచ్1బీ వీసా ప్రక్రియపై చేసిన పోస్ట్‌తో వివాదం మొదలైంది.
నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను హెచ్1బీ వీసాలతో నియమించుకోవాలని యూఎస్ కంపెనీలు నిర్ణయించుకోవడానికి అమెరికన్ సంస్కృతే కారణమని వివేక్ ఆరోపించారు.
అమెరికన్ సంస్కృతి తరచూ అకడమిక్ ఎక్సలెన్స్ కంటే ప్రజాదరణకు విలువనిస్తోందని ఆయన అన్నారు. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారే యూఎస్ ఆర్ధిక వ్యవస్థను ముందుకు తీసుకెళుతున్నారని వివేక్ వాదించారు.
అయితే వలసవాదాన్ని ఎక్కువగా వ్యతిరేకించే ట్రంప్ మద్దతుదారులు కొందరు వివేక్ అభిప్రాయాన్ని తప్పుబట్టారు, వారి నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ వివాదం పెరగడంతో వివేక్ బదులిచ్చారు.

''గణితంలో రాణించే విద్యార్థిని కన్నా ఒక ప్రామ్ క్వీన్‌ను(అమెరికన్ స్కూళ్లల్లో విద్యాసంవత్సరం చివర్లో నిర్వహించే డాన్స్ కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచే బాలబాలికలను ప్రామ్ కింగ్, ప్రామ్ క్వీన్ అంటారు) కొనియాడే మన సంస్కృతి.. క్లాస్ టాపర్ కన్నా మంచి సెలబ్రెటీ ప్లేయర్లను ఆదరించే మన సంస్కృతి గొప్ప ఇంజినీర్లను సృష్టించలేదు'' అని వివేక్ అన్నారు.
ఈ పోస్టుతో వలస వాదాన్ని బలంగా వ్యతిరేకించే పలువురు ట్రంప్ మద్దతుదారుల నుంచి వివేక్ విమర్శలు ఎదుర్కొన్నారు.
రిపబ్లికన్ పార్టీ ముఖ్య నాయకులు, సంప్రదాయవాదులు, ట్రంప్‌తో మంచి సంబంధాలున్న సంపన్నులు కూడా వివేక్ అభిప్రాయాన్ని ఖండించారు.
దీంతో వివేక్ మరోసారి దీనిపై స్పందిస్తూ... 'హెచ్1బి వీసా వ్యవస్థలో చాలా లోపాలున్నాయి. దానికి బదులుగా మరింత మెరుగైన వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది' అని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
మస్క్ మద్దతు..
'వార్ రూమ్' పాడ్కాస్ట్ నిర్వహించే ట్రంప్ మద్దతుదారు స్టీవ్ బ్యానన్.. 'ఒకవేళ ఈ విషయమై చర్చ జరగాల్సి వస్తే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి జరిగితీరాలి' అన్నారు.
హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌ను వెనకేసుకొస్తున్న రిపబ్లికన్‌ల వాదన ఒక వంచన అని ఆయన ఆరోపించారు.
వివేక్ అభిప్రాయంతో ఎలాన్ మస్క్ ఏకీభవించారు. హెచ్1బీ వీసాల ద్వారా అత్యంత ప్రతిభావంతమైన ఇంజినీర్లను అమెరికా ఆకర్షిస్తోందని ఆయన తెలిపారు.
కాగా, మస్క్ సంస్థల్లో హెచ్1బి వీసాను పొందిన వాళ్ల కోసం భర్తీ చేసే ఉద్యోగ ఖాళీల ప్రకటన స్క్రీన్ షాట్‌ను ఆన్‌లైన్‌లో పోస్టు చేసిన కొందరు, వాటికి ఇచ్చే వేతనాలు 2 లక్షల డాలర్లు లేదా అంతకన్నా తక్కువ ఉన్నాయని ఆరోపించారు.
ఇది యూఎస్‌లో జన్మించిన వారి వేతనాలను కూడా తగ్గించే ప్రయత్నమే తప్ప ప్రతిభగల ఇంజినీర్లను నియమించే ఉద్దేశం కాదని వారు విమర్శించారు.
ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిల అభిప్రాయాలను నిక్కీ హేలీ వ్యతిరేకించారు.
''అమెరికన్లలో గాని, సంస్కృతిలో గాని ఎలాంటి లోపాలు లేవు. ఒకసారి అమెరికా సరిహద్దుకు వెళ్లి చూస్తే, ఎంతమంది మాలాంటి జీవితాలు కోరుకుంటున్నారో తెలుస్తుంది. ఉద్యోగాలలో అమెరికన్లకు ప్రాధాన్యమివ్వాలి, వారిపై పెట్టుబడి పెట్టాలి. విదేశీ ఉద్యోగులపై కాదు'' అని ఆమె అన్నారు.
హేలీ కూడా భారత సంతతి వ్యక్తి.

ఫొటో సోర్స్, Getty Images
ఏటా 85 వేల వీసాలు
‘వైట్ హౌస్ సీనియర్ అడ్వయిజర్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’గా భారత్‌లో పుట్టిన శ్రీరామ్ కృష్ణన్‌ను నియమించడాన్ని ట్రంప్‌కి గట్టి మద్దతుదారు, ఇస్లాం వ్యతిరేక కార్యకర్త అయిన లారా లూమర్ తప్పుబట్టారు.
ఆయన గతంలో వామపక్షవాది అని.. ట్రంప్ అమెరికా ఫస్ట్ లక్ష్యానికి శ్రీరామ్ నియామకం వ్యతిరేకమని ఆమె ఆరోపించారు.
భారతీయులను ఆక్రమణదారులని ఆరోపిస్తూ, శ్రీరామ్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.
కాగా, తన పోస్టుల మీద కామెంట్‌లను పరిమితం చేయడంతో ఎలాన్ మస్క్ మీద విమర్శలు చేశారు.
అమెరికా ఏటా 65,000 హెచ్1బీ వీసాలను ఇస్తుంది. అమెరికన్ విద్యాసంస్థల్లో మాస్టర్స్ విద్య చదివిన విదేశీ విద్యార్థులకు మరో 20,000 వీసాలను కల్పిస్తుంది. ఇది చట్టపరమైన పరిమితి.
అయితే ఇందులో 73 శాతం వీసాలను భారతీయులు, 12శాతం వీసాలను చైనీయులు పొందుతున్నట్లు ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థ ‘బౌండ్ లెస్’ తన నివేదికలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
'మస్క్ చేతుల్లో అధికారం లేదు'
అధికారం చేపట్టిన వెంటనే సరైన పత్రాలు లేని వలసదారులను దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభిస్తానని ట్రంప్ గతంలోనే ప్రకటించారు.
ఇటీవలే అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. మస్క్ సహా తన ప్రచారానికి మద్దతు ఇచ్చిన ఇతర బిలియనీర్ల ప్రభావంలో ఉన్నారన్న ఆరోపణలను కొట్టివేశారు.
ఆదివారం అరిజోనాలో జరిగిన కన్జర్వేటివ్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. తాను మస్క్ వల్ల ప్రభావితం కావట్లేదని అన్నారు.
టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ నిర్వహించిన అమెరికా ఫెస్ట్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ 'ఇప్పుడు నా వ్యతిరేకులు మరో కొత్త వదంతి ప్రారంభించారు. నేను నా అధ్యక్షతను మస్క్ చేతిలో పెట్టేశానని అపోహలు సృష్టిస్తున్నారు. అదంతా అవాస్తవం' అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














