76 మంది చనిపోయిన హోటల్‌లో సరైన అగ్నిమాపక వ్యవస్థ లేదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాలు కర్సినో, కథ్‌రిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
- హోదా, బీబీసీ న్యూస్
తుర్కియేలోని ప్రఖ్యాత స్కీ రిసార్ట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 76 మందికిపైగా మరణించారు.
మంటలనుంచి తప్పించుకునేందుకు కొందరు కిటికీల నుంచి కిందకు దూకారు.
బోలు నగరంలో చెక్కతో నిర్మించిన 12 అంతస్తుల ‘గ్రాండ్ కార్టల్ హోటల్’లో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో హోటల్‌లో 234 మంది ఉన్నారు. సెలవు రోజు కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది.
మంటలు అదుపులోకి రావడానికి 12 గంటల సమయం
మృతుల సంఖ్య భారీగా ఉన్నట్టు తుర్కియే ఇంటరీయర్(హోం) మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కిటికీ నుంచి దూకడానికి ప్రయత్నించి ఇద్దరు మరణించారు.
మంటలు అదుపులోకి తీసుకురావడానికి 12 గంటల సమయం పట్టిందని, హోటల్ యజమాని సహా 9మందిని అరెస్టు చేసినట్టు తుర్కియే న్యాయ శాఖ మంత్రి చెప్పారు.

మొత్తం 76 మంది మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
మృతుల్లో ఇస్తాంబుల్‌లోని ఫెనర్‌బాష్ స్పోర్ట్స్ క్లబ్ స్విమ్మర్, పదేళ్ల వెదియా నిల్ అపాక్, తన తల్లి ఫెర్డా ఉన్నట్టు నిర్ధరించారు.
ఘటన తీవ్రంగా బాధించిందని క్లబ్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తెలిపింది.
హోటల్‌లో చెఫ్ అయిన ఎస్లెమ్ ఉయానిక్, స్థానికంగా ప్రముఖ వ్యాపారవేత్త కూతురు సెరెన్ యమన్ డోగన్, ఆమె 17 ఏళ్ల కూతురు లలిన్ అగ్నిప్రమాదంలో చనిపోయారు.
సొజ్కు న్యూస్ పేపర్ రైటర్ నెదిమ్ తుర్క్‌మెన్, ఆయన భార్య ఐసె నేవా, వారి ఇద్దరు పిల్లలు మృతుల్లో ఉన్నారు. ఓజీన్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ డీన్, ప్రొఫెసర్ అటాకన్ యాల్సిన్ ప్రమాదంలో మరణించారు.
24 ఏళ్ల దిలారా ఎర్మానోగ్లు గాయపడ్డారు. ఆమెను వెతికేందుకు బోలు వెళ్లిన తండ్రికి గుండెపోటు వచ్చింది. ఆరోగ్య కార్యకర్తలు ఆయనకు చికిత్స అందించారు.

ఫొటో సోర్స్, Getty Images
తొలుత రెస్టారెంట్‌లో చెలరేగిన మంటలు
ప్రమాదంలో 51 మంది గాయపడ్డారని తుర్కియే ఆరోగ్య శాఖ మంత్రి కెమాల్ మెమిసోగ్లు తెలిపారు. వారిలో ఒకరు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారని, 17 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు.
కిటికీల నుంచి వేలాడుతున్న నారలాంటిదాన్ని పట్టుకుని మంటల్లో కాలుతున్న భవనం నుంచి తప్పించుకునేందుకు బాధితులు ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మంటలు చెలరేగినప్పుడు తాను రెండో అంతస్థులో ఉన్నానని స్కీ ఇన్‌స్ట్రక్టర్ నెస్మి కెప్సెటుటాన్ బీబీసీతో చెప్పారు. స్కీ గది నుంచి తాను తప్పించుకోగలిగానని తెలిపారు. తర్వాత ఆయన సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.
హోటల్ యాజమాని కుటుంబం ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. కుటుంబంలో కొందరిని బయట చూశానని కెప్సెటుటాన్ తెలిపారు.
ప్రమాదానికి కారణం ఇంకా గుర్తించలేదు. హోటల్ నాలుగో అంతస్తులోని రెస్టారెంట్ విభాగంలో మంటలు చెలరేగి పై అంతస్తులకు వ్యాపించామని ప్రాథమిక రిపోర్టులు తెలియజేస్తున్నాయని బోలు గవర్నర్ అబ్దులాజిజ్ ఐడిన్ చెప్పారు.
అగ్నిమాపక ఏర్పాట్లు ఏమయ్యాయి?
బోలు ప్రధాన ప్రాంతం నుంచి కర్టల్‌కయాలోని హోటల్‌కు వెళ్లే దారి అంతా మంచుతో గడ్డకట్టిన వాతావరణం ఉండడంతో అగ్నిమాపక యంత్రాలు ప్రమాద స్థలిని చేరుకోవడానికి గంటకు పైగా సమయం పట్టిందని ఐడిన్ తెలిపారు. 267 మంది సిబ్బందిని అత్యవసర సర్వీసుల విభాగం ప్రమాదస్థలానికి పంపింది.
మంటలు వ్యాపించినప్పుడు పిల్లలు సహా అతిథులు గదుల్లో చిక్కుకుని ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
హోటల్ నుంచి తప్పించుకునేందుకు రెండు సురక్షిత మార్గాలున్నాయని ఇంటీరియర్ మంత్రిత్వశాఖ తెలిపింది. తాను 30 నుంచి 35 మందిని రక్షించగలిగానని హోటల్ వర్కర్ ఒకరు చెప్పారు.
మంటలకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని న్యాయశాఖ మంత్రి యిల్మాజ్ టంక్ చెప్పారు.
2024లో హోటల్‌లో చివరిసారి తనిఖీలు జరిపారు. అగ్నిప్రమాదాల భద్రతకు సంబంధించి ఎలాంటి లోపాలు కనిపించలేదని పర్యటక శాఖమంత్రి చెప్పారు.
అయితే, నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ అగ్నిమాపక వ్యవస్థ ఉండాలని తుర్కియే ఇంజినీర్స్ ఆర్కిటెక్ట్స్ యూనియన్ చాంబర్స్(టీఎంఎంవోబీ) తెలిపింది.
ఆటోమాటిక్ స్ప్రింక్లర్ వ్యవస్థను 2008లో ఏర్పాటుచేసినట్టు హోటల్ వెబ్‌సైట్ ఫోటోల్లో కనిపిస్తోందని, నిజానికి దాన్ని ఏర్పాటుచేయలేదని యూనియన్ ఓ ప్రకటనలో తెలిపింది.
మృతులకు నివాళిగా తుర్కియేలో ఒక రోజు సంతాపదినం పాటిస్తున్నారు. తుర్కియే జెండాను సగానికి అవనతం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














