ఛత్తీస్‌గఢ్: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి మృతి

ఫొటో సోర్స్, DEVENDRA SHUKLA
- రచయిత, అలోక్ పుతుల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి కొనసాగుతున్న భారీ ఎన్‌కౌంటర్‌లో 20 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందినట్టు భద్రతా బలగాలు ప్రకటించాయి.
'ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇప్పటికీ చాలామంది మావోయిస్టులు ఉన్నారు. డ్రోన్ల సహాయంతో వారందరిని గుర్తించి చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటివరకు మరణించిన మావోయిస్టుల సంఖ్య 20మందికి పైనే ఉంటుంది' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.
అయితే పోలీసులు ఇప్పటివరకు 14 మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులలో ఒడిశా సీపీఐ మావోయిస్టు పార్టీ ఇంచార్జ్ జయరాం అలియాస్ చలపతి ఉన్నారు.
మావోయిస్టు పార్టీలో చలపతి కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. సైద్ధాంతిక విషయాలలో నిపుణుడిగానూ, మంచి వ్యూహకర్తగానూ ఆయనకు పార్టీలో పేరుంది.


ఫొటో సోర్స్, DEVENDRA SHUKLA
నాలుగు రోజుల కిందట కూడా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఆ ఎన్‌కౌంటర్‌లో 18 మంది ‘కామ్రేడ్లు’ మరణించారని మావోయిస్టులు వెల్లడించారు.
మృతి చెందిన వారిలో మావోయిస్టు సంస్థ టాప్ లీడర్ దామోదర్ కూడా ఉన్నారని వారు తెలిపారు. దామోదర్‌పైన 50 లక్షల రివార్డు ఉంది.
దేశవ్యాప్తంగా 38 జిల్లాలను మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Madhya Pradesh Public Relations Department
భద్రతా బలగాలు ఆపరేషన్ ను నిర్వహించిన కుల్హదీఘాట్ బాగా దట్టమైన అటవీ ప్రాంతం.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.. సోనియా గాంధీతో కలిసి ఈ ప్రాంతాన్ని 1985 జులై 14న సందర్శించి, ఇక్కడే విడిది చేశారు. దీంతో అప్పట్లో కుల్హదీఘాట్ వార్తల్లో నిలిచింది.
ఇప్పుడీ ప్రాంతంలోనే ఆదివారం సీఆర్పీఎఫ్ బృందం, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ బృందం సంయుక్తంగా మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ను చేపట్టాయి.
ఒడిశా నుంచి 7 కంపెనీల భద్రతా బలగాలు, ఛత్తీస్‌గఢ్ నుంచి 3 కంపెనీల భద్రత బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.
కుల్హదీఘాట్ ప్రదేశంలోని భాలుదిగి, టర్ ఝర్ అడవుల్లో ఆదివారం సాయంత్రం ఎన్‌కౌంటర్ మొదలైంది. ఘటనాస్థలంలో అనుకున్న కంటే ఎక్కువ మంది మావోయిస్టులు ఉన్నారు.
సోమవారం మధ్యాహ్నానికల్లా ఇద్దరు మావోయిస్టులు చనిపోయారనే వార్త వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు.
మావోయిస్టులను గుర్తించేందుకు రీకొనైసాన్స్ డ్రోన్లను ఉపయోగించారు. ఈ డ్రోన్ సమాచారంతో మావోయిస్టులను గుర్తించి భద్రతా బలగాలు వారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి.
మంగళవారం ఉదయానికల్లా భద్రతా బలగాలు మరో పన్నెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. దీంతో మృతుల సంఖ్య 14కు చేరింది.

ఫొటో సోర్స్, Devendra Shukla
ఈ ఆపరేషన్‌లో భద్రతాబలగాలకు చెందిన ఒకరు గాయపడ్డారు. ఆయనను హెలికాప్టర్‌లో రాయ్‌పుర్ తరలించారు. మావోయిస్టుల నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
మావోయిస్టులను చుట్టుముట్టే ప్రయత్నాలు మంగళవారం మధ్యాహ్నం వరకు కొనసాగాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. మావోయిస్టులను చుట్టుముట్టిన ప్రాంతంలో చెట్లు తక్కువ, రాళ్లు ఎక్కువగా ఉండటంతో ఆపరేషన్ అమలు సులభమైందని పోలీసులు చెప్తున్నారు.
గరియాబంద్ ప్రాంతానికి మరిన్ని భద్రతా బలగాలను పిలిపించినట్లు పోలీసు అధికారి చెప్పారు. అలాగే గరియాబంద్ లోని భాటిగఢ్ స్టేడియం వద్ద మోహరించిన పోలీసులను అప్రమత్తంగా ఉండమని ఆదేశాలు జారీ అయ్యాయి. పలువురు పోలీసు ఉన్నతాధికారులు గరియాబంద్‌కు చేరుకున్నారు.
2024లో 219మంది మావోయిస్టులను హతమార్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులను పోలీసులు హతమార్చింది 2024లోనే.
2025లో 21 రోజుల్లోనే 43మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు.
ఇది మరో మైలురాయి: అమిత్ షా
నక్సల్ రహిత భారతదేశం విషయంలో మన భద్రతా బలగాలు మరో మైలురాయిని చేరుకున్నాయి. ఇది నక్సలైట్లకు మరో పెద్ద దెబ్బ’’ అని కేంద్ర హోం శాఖమంత్రి మంత్రి మంగళవారం ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
సీఆర్పీఎఫ్, ఒడిశా పోలీస్ ప్రత్యేక బృందం,ఒడిశా పోలీసులు కలిసి 14మంది నక్సలైట్లను హతమార్చారు .జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయని అమిత్ షా చెప్పారు.
'నక్సల్-రహిత భారత దేశ సంకల్పానికి భద్రతా బలగాల తోడ్పాటు కారణంగా దేశంలో నక్సలిజం కొనఊపిరితో ఉంది' అని అమిత్ షా అన్నారు.
ఈ ఘటనపై ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి స్పందిస్తూ 2026 మార్చినాటికల్లా నక్సలిజం ఆనవాలు ఉండవన్నారు.
మరోవైపు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ కూడా ‘‘ప్రజాస్వామ్య వ్యతిరేకులకు గుణపాఠం నేర్పినందుకు మన భద్రతా బలగాలను అభినందిస్తున్నాను’’ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














