ఎంఎఫ్ హుస్సేన్ గీసిన వినాయకుడు, హనుమంతుడి చిత్రాలు సీజ్ చేయాలని ఆదేశించిన కోర్ట్

ఎంఎఫ్ హుస్సేన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నికితా యాదవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలోని ప్రముఖ చిత్రకారుల్లో ఒకరైన ఎంఎఫ్ హుస్సేన్ వేసిన రెండు చిత్రాలు 'అభ్యంతరకరం'గా ఉన్నాయని పేర్కొంటూ వాటిని స్వాధీనం చేసుకోవాలని దిల్లీలోని పటియాలా కోర్టు పోలీసులను ఆదేశించింది.

హిందూ దేవుళ్లు ఉన్న ఈ చిత్రాలు హిందువుల మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్న ఫిర్యాదుపై విచారించిన న్యాయస్థానం, వాటిని సీజ్ చేయాల్సిందిగా సోమవారం ఆదేశించింది.

2011లో 95 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఎంఎఫ్ హుస్సేన్ అంతకుముందు కూడా హిందూ దేవుళ్లను నగ్నంగా చిత్రించి విమర్శలు ఎదుర్కొన్నారు.

తాజాగా ఈ రెండు చిత్రాలు ప్రదర్శించిన దిల్లీ ఆర్ట్ గ్యాలరీ (డీఏజీ) స్పందిస్తూ తాము ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయస్థానం సరైన తీర్పు ఇస్తుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది.

గ్యాలరీలో కనిపించని చిత్రాలు

‘హుస్సేన్: ది టైమ్‌లెస్ మోడర్నిస్ట్’ అనే ఎగ్జిబిషన్‌లో భాగంగా అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 14 వరకు దిల్లీ ఆర్ట్ గ్యాలరీలో 100కి పైగా చిత్రాలను ప్రదర్శించారు.

అమిత సచ్‌దేవా అనే న్యాయవాది అందులో రెండు చిత్రాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 4న గ్యాలరీలో ఈ "అభ్యంతరకర పెయింటింగ్స్" చూసి, ఫోటోలు తీసినట్లు ఆమె ‘ఎక్స్‌’లో తెలిపారు. హుస్సేన్‌పై గతంలో ఏమైనా ఫిర్యాదులున్నాయా? అని పరిశీలించిన అమిత, డిసెంబర్ 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డిసెంబరు 10న ఆమె విచారణ అధికారితో కలిసి గ్యాలరీకి వెళ్లారు, కానీ అక్కడ సదరు చిత్రాలను అప్పటికే తొలగించారు.

అంతేకాదు, ఆ పెయింటింగ్స్‌ను ఎప్పుడూ ప్రదర్శించలేదని గ్యాలరీ సిబ్బంది వాదించినట్లు ఆమె ఆరోపించారు.

అయితే, అమిత తాను తీసిన పెయింటింగ్స్ ఫొటోలు ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. హిందూ దేవుళ్లయిన వినాయకుడు, హనుమంతుడి పక్కన నగ్నంగా అమ్మాయిలున్నట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది.

రిపోర్ట్ దాఖలు చేయడంలో దిల్లీ పోలీసులు విఫలమయ్యారని కూడా ఆమె ఆరోపించారు.

మీడియా కథనాల ప్రకారం.. పెయింటింగ్స్ ప్రదర్శనలో ఉన్నాయని నిరూపించడానికి గ్యాలరీ నుంచి సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకోవాలని అమిత సచ్‌దేవా కోర్టును కోరారు.

సోమవారం దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులోని న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఫుటేజీని పరిశీలించి పోలీసులు రిపోర్టును సమర్పించారని చెప్పారు. ఎగ్జిబిషన్ ఒక ప్రైవేట్ స్థలంలో నిర్వహించారని, చిత్రకారుడి అసలు పెయింటింగ్స్ ప్రదర్శించడానికే దానిని నిర్వహించారని విచారణ రిపోర్టులో ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

పోలీసుల దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని దిల్లీ ఆర్ట్ గ్యాలరీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎగ్జిబిషన్‌కు సుమారు 5,000 మంది సందర్శకులు వచ్చారని.. మీడియా, ప్రజల నుంచి సానుకూల సమీక్షలు వచ్చాయని గ్యాలరీ పేర్కొంది.

చిత్రాలపై అమిత సచ్‌దేవా మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం చేశారని గ్యాలరీ పేర్కొంది. ఆమె సోషల్ మీడియా, టీవీలలో చిత్రాలను షేర్ చేశారని చెప్పారు. సదరు చిత్రాలు తన మతపరమైన భావాలను దెబ్బతీశాయని ఆమె పేర్కొన్నారని, అయితే ఆమె సోషల్ మీడియా, టీవీ వార్తలలో అవే చిత్రాలను పంచుకున్నారని, వాటిని ఎక్కువమంది ప్రేక్షకులకు కనిపించేలా చేశారని గ్యాలరీ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పికాసో ఆఫ్ ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

‘మదర్ ఇండియా’కు క్షమాపణలు

"పికాసో ఆఫ్ ఇండియా"గా పేరుగాంచిన మక్బూల్ ఫిదా హుస్సేన్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ చిత్రకారులలో ఒకరు. ఆయన పెయింటింగ్స్ కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. అయినప్పటికీ, ఎంఎఫ్ కళ తరచుగా వివాదానికి దారితీసేది.

హిందూ దేవతలను నగ్నంగా చిత్రించినందుకు ఆయన హిందువుల నుంచి విమర్శలను ఎదుర్కొన్నారు.

మదర్ ఇండియా పెయింటింగ్ వేసినందుకు హుస్సేన్ 2006లో క్షమాపణలు చెప్పారు. ఆ చిత్రంలో ఆయన భారతదేశం మ్యాప్ ఆకారంలో నగ్న మహిళను గీశారు. అదే సంవత్సరం హుస్సేన్ దేశం వదిలి వెళ్లారు. ఆయన మరణించే వరకు లండన్‌లోనే నివసించారు.

2008లో భారత సుప్రీంకోర్టు హుస్సేన్‌పై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేసింది. ఆయన పెయింటింగ్‌లు అశ్లీలంగా లేవని తీర్పు చెప్పింది. భారతీయ కళ, చరిత్రలో నగ్నత్వం అనేది ఒక సాధారణ అంశం అని కోర్టు పేర్కొంది.

గతంలో భోపాల్, ఇందోర్, రాజ్‌కోట్‌లలో హుస్సేన్‌పై దాఖలైన క్రిమినల్ కేసులను హైకోర్టు నిలిపివేసింది. దీంతో ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ప్రవాసంలో జీవిస్తున్న హుస్సేన్‌ను పిలిపించి ఆయన చిత్రాలను వివరించాలన్న డిమాండ్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. ఆయన కళాకృతులు మతపరమైన భావాలను దెబ్బతీసేలా, జాతీయ ఐక్యతకు ముప్పు కలిగించేలా ఉన్నాయని పిటిషన్ ఆరోపించింది.

‘ఇలాంటి ఫోటోలు, పబ్లికేషన్‌లు చాలా ఉన్నాయి. వీటన్నింటిపైనా కేసులు పెడతారా? గుడి నిర్మాణాల సంగతేంటి?. హుస్సేన్‌ పనే ఆర్ట్, నచ్చకపోతే చూడకండి. చాలా దేవాలయాల నిర్మాణాలపై ఇలాంటి కళారూపాలున్నాయి’ అని సుప్రీం అప్పట్లో వ్యాఖ్యానించింది.

దేశంలో కళాత్మక స్వేచ్ఛకు ముప్పు పెరుగుతోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్‌లో ప్రముఖ కళాకారులు ఎఫ్‌ఎన్ సౌజా, అక్బర్ పదమ్‌సీల కళాఖండాలు అసభ్యకరంగా ఉన్నాయని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యను బాంబే హైకోర్టు విమర్శించింది.

నగ్న చిత్రాలన్నీ అశ్లీలమైనవి కావని తెలిపింది. జప్తు చేసిన ఏడు పెయింటింగ్‌లను విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)