ఇరావతి కార్వే: జర్మనీకి వెళ్లి నాజీల జాత్యాహంకార సిద్ధాంతాలను సవాల్ చేసిన భారతీయ మహిళా శాస్త్రవేత్త

ఫొటో సోర్స్, Urmilla Deshpande
- రచయిత, చెరీలాన్ మోలాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇరావతి కార్వే చుట్టూ ఉన్న ఇతరులకు భిన్నంగా తన జీవితాన్ని గడిపారు.
బ్రిటీష్ పాలిత భారత్‌లో ఆమె పుట్టారు. ఆ సమయంలో మహిళలకు ఎలాంటి స్వేచ్ఛ, హక్కులు ఉండేవి కాదు.
కానీ, ఇరావతి కార్వే ఊహకందని రీతిలో తన ప్రతిభను నిరూపించుకున్నారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. కాలేజీ ప్రొఫెసర్ అయ్యారు. భారత్ తొలి మహిళా మానవ శాస్త్రవేత్త (ఆంత్రోపాలజిస్ట్) కూడా ఈమె.
తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. బాతింగ్ సూట్‌లో ఈత కొట్టేవారు. స్కూటర్ నడిపేవారు. తన డాక్టరేట్ మార్గదర్శి అయిన ప్రముఖ జర్మన్ ఆంత్రోపాలజిస్ట్ యూజెన్ ఫిషర్ జాత్యాహంకార సిద్ధాంతాలను కూడా ఇరావతి కార్వే సవాలు చేసే సాహసం చేశారు .
భారతీయ సంస్కృతి, నాగరికత, దాని కుల వ్యవస్థపై ఆమె రాసిన రచనలు సంచలనంగా మారాయి. భారత కళాశాలలో పాఠ్యాంశాల్లో అవి కూడా భాగమయ్యాయి.
చరిత్రలో ఆమె గురించి ప్రముఖంగా ప్రస్తావించకపోవడంతో, ఇప్పటికీ ఆమె గురించి చాలామందికి తెలియదు.
ఆమె మనవరాలు ఊర్మిళా దేశ్‌పాండే, విద్యావేత్త థియాగో పింటో బార్బోసా రాసిన ''ఇరు: ది రిమార్కబుల్ లైఫ్ ఆఫ్ ఇరావతి కార్వే'' పుస్తకం ఆమె జీవితాన్ని ప్రజల ముందుకు తెచ్చింది. మహిళలకు, పురుషులకు స్ఫూర్తిదాయకమైన మార్గాన్ని అందించేందుకు ఆమె ధైర్యంగా ఎదుర్కొన్న ఎన్నో అవరోధాలను ఈ పుస్తకం ద్వారా వెలుగులోకి తెచ్చారు.
1905లో బర్మాలో (ప్రస్తుత మయన్మార్‌లో) పుట్టిన ఇరావతికి ఇరావాడి అనే నది పేరు పెట్టారు. ఆరుగురు తోబుట్టువుల్లో ఆమె ఒక్కతే అమ్మాయి. దీంతో, ఆమెను చాలా ఆప్యాయంగా, గారాబంగా పెంచారు.
కానీ, ఇరావతి జీవితం ఎన్నో అనుకోని మలుపులు తిరిగింది. ఈ అనుభవాల ఫలితమే ఆమెను ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చాయి.
సహానుభూతి, ప్రగతిశీల భావాలున్న పురుషులు ఆమెకు ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు సాయపడి, ఆమెను ప్రోత్సహించారు.
ఏడేళ్ల వయసులోనే ఆమె పుణేలోని బోర్డింగ్ స్కూల్‌కు వెళ్లారు. చాలామంది అమ్మాయిలకు పెళ్లిళ్లు అయ్యే ఆ సమయంలో, ఆమెకు తన తండ్రి నుంచి దక్కిన అరుదైన అవకాశం ఇది. పుణేలో ఆమె ప్రముఖ విద్యావేత్త ఆర్‌పీ పరాంజేపేను కలుసుకున్నారు. వారు అనధికారికంగా ఇరావతిని దత్తత తీసుకుని, ఆమెను పెంచారు.
పరాంజేపే ఇంట్లోనే విమర్శనాత్మక ఆలోచనను, నీతివంతమైన జీవితాన్ని ఎలా గడపాలో, ఒకవేళ అది భారతీయ సమాజానికి వ్యతిరేకమైనప్పటికీ జీవితం ఎలా ముందుకు సాగించాలో తెలుసుకున్నారు. పరాంజేపేని ఇరావతి ''అప్పా'' లేదా ''రెండోనాన్న''అంటూ పిలిచేవారు.
కాలేజీ ప్రిన్సిపాల్, మహిళల విద్యను గట్టిగా సమర్థించే వ్యక్తి అయిన పరాంజేపే నాస్తికుడు కూడా. ఆయన ద్వారా సాంఘిక శాస్త్రాలు, సమాజంపై వాటి ప్రభావాన్ని ఇరావతి తెలుసుకున్నారు.


ఫొటో సోర్స్, Urmilla Deshpande
బెర్లిన్‌లో ఆంత్రోపాలజీలో డాక్టరేట్ చేయాలని ఇరావతి నిర్ణయించుకున్నప్పుడు, తండ్రి నుంచి ఆమెకు వ్యతిరేకత ఎదురైంది. కానీ, పరాంజేపే, ఆమె భర్త, సైన్స్ ప్రొఫెసర్ దినకర్ కార్వే నుంచి ఇరావతికి పూర్తి మద్దతు లభించింది.
1927లో ఆమె జర్మన్ వెళ్లారు. నౌకలో ఎన్నో రోజుల ప్రయాణం తర్వాత అక్కడకు చేరుకున్నారు. ఆంత్రోపాలజీ, యూజెనిక్స్‌లో ప్రసిద్ధ ప్రొఫెసర్ ఫిషర్ నేతృత్వంలో ఆమె పరిశోధన ప్రారంభించారు.
అప్పటికీ జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధం ప్రభావంతో కొట్టుమిట్టాడుతోంది. హిట్లర్ ఇంకా అధికారంలోకి రాలేదు. యూదు వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఇరావతి దీనికి సాక్ష్యంగా నిలిచారు. ఒకరోజు ఆమె బిల్డింగ్ వద్ద ఒక యూదు విద్యార్థి హత్యకు గురైనట్టు ఆమె గుర్తించారు.
ఆమె ఉంటున్న బిల్డింగ్ బయట ఫుట్‌పాత్‌పై పడి ఉన్న ఒక వ్యక్తి శరీరాన్ని, అక్కడ కాంక్రీట్ అంతటా రక్తం ఏరులై పారడం చూసి ఆమె చాలా భయపడినట్లు, షాక్‌కు గురైనట్లు ఈ పుస్తకంలో రచయితలు రాశారు.
ఫిషర్ ఇచ్చిన థిసీస్‌పై పనిచేస్తూనే ఇరావతి తన భావోద్వేగాలతో చాలా పోరాడాల్సి వచ్చింది. శ్వేతజాతి యూరోపియన్లు చాలా తార్కికమైన, తెలివైన వారని నిరూపించాల్సి ఉంది. అందుకే శ్వేతజాతియేతర యూరోపియన్ల కంటే జాతిపరంగా వారు ఉన్నతమైన వారని చెప్పాలి. దీనికోసం, 149 మానవ పుర్రెలపై ఆమె క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి వచ్చింది.
శ్వేతజాతీయ యూరోపియన్లకు కుడివైపు అతిపెద్ద ఫ్రంటల్ లోబ్స్ అమరిక వల్ల అసిమెట్రికల్ స్కల్స్ ఉంటాయని, అందువల్లే వారికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయని ఫిషర్ తన థిసీస్‌లో చెప్పారు. కానీ, జాతికి, స్కల్ అసిమెట్రీకి (అసమానంగా ఉండే పుర్రెకు) ఎలాంటి సంబంధం లేదని ఇరావతి తన పరిశోధనల్లో కనుగొన్నారు.
ఫిషర్ సిద్ధాంతాన్నే కాదు, ఆ సంస్థ సిద్ధాంతాన్ని, ఆ సమయంలో ప్రధానస్రవంతిలోని సిద్ధాంతాలను కూడా ఆమె విభేదించారు అని రచయితలు ఆ పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Urmilla Deshpande
ఇరావతి తన గురువు ఆగ్రహాన్ని చూస్తానని తెలిసినా, ఆమె డిగ్రీని పణంగా పెట్టి మరీ తన పరిశోధనలను సమర్పించారు. ఫిషర్ ఆమెకు తక్కువ గ్రేడ్ వేశారు. వివక్షను సమర్థించేందుకు మానవుల మధ్య అంతరాలను ఉపయోగించుకోవాలనుకోవడాన్ని ఆమె పరిశోధన విశ్లేషణాత్మకంగానూ, శాస్త్రీయంగానూ తిరస్కరించింది.
ఆ తర్వాత నాజీలు ఫిషర్ జాతి ఆధిక్య సిద్ధాంతాలను వాడుకుని, వారి ఏజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. అప్పుడే ఫిషర్ నాజీ పార్టీలో చేరారు.
ఇరావతి కార్వే జీవితమంతా ఇదే ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇతరుల పట్ల సహానుభూతితో ఉండేవారు. ముఖ్యంగా మహిళలపై అంతులేని అభిమానాన్ని ప్రదర్శించేవారు.
మహిళలు ఇంటి నుంచి బయటికి దూరంగా వెళ్లడం ఊహించడానికే కష్టంగా ఉండే రోజుల్లో, ఆమె స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, భారత్‌లోని పలు మారుమూల గ్రామాలకు క్షేత్రస్థాయి పర్యటనల కోసం వెళ్లేవారు.
కొన్నిసార్లు పురుష సహోద్యోగులతో, కొన్నిసార్లు విద్యార్థులతో, కొన్నిసార్లు పిల్లలతో వెళ్లాల్సి వచ్చేది. ఆమె పలు గిరిజన జాతుల జీవితాలపై అధ్యయనం చేశారు.
ఆమె 15 వేల ఏళ్ల కాలం నాటి ఎముకలను వెలికి తీసేందుకు పురావస్తు విభాగంలో చేశారు. గతానికి, వర్తమానానికి అవే ఆధారం. ఈ పర్యటనలలో ఆమె అడవుల్లోకి వెళ్లేవారు. వారాలు లేదా నెలల తరబడి ఆమె కష్టమైన ప్రదేశాల్లో ఉండాల్సి వచ్చేది.
ఆమె గోదాముల్లో లేదా ట్రక్కు పరుపులపై పడుకునే వారని, రోజుల తరబడి చాలీచాలని ఆహారంతో కడుపు నింపుకునే వారని ఈ పుస్తకంలో వివరించారు.
అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో మమేకమైనప్పుడు, ఇరావతి తనకు ఎదురైన సామాజిక, వ్యక్తిగత అవరోధాలను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు.
సంప్రదాయంగా శాకాహారానికి చెందిన అగ్రవర్ణ హిందూ కమ్యూనిటీకి చెందిన చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఇరావతి, పరిశోధనల కోసం ఒక గిరిజన నాయకుడు ఇచ్చిన ఉడికీ ఉడకని మాంసాన్ని ధైర్యంగా ఎలా తిన్నారో ఈ పుస్తకంలో వివరించారు.
దాన్ని ఆమె స్నేహానికి చిహ్నంగా, విధేయతకు పరీక్షగా చూశారు. నిర్మోహమాటంగా, కుతూహలంతో ఆమె ఆ మాంసాన్ని తిన్నారు.
ఆమె అధ్యయనాలు మానవత్వం పట్ల సహానుభూతిని పెంపొందించడమే కాక, ఆ తర్వాత హిందూ మతంతో పాటు ఇతర మతాల్లో ఉన్న ఛాందసవాదాన్ని వ్యతిరేకించాయి. భారతదేశం అనేది తమ సొంతిల్లుగా భావించే ప్రతి ఒక్కరిదీ అని ఆమె నమ్మేవారు.
యూదులపై నాజీల అరాచకాలు మానవ స్వభావాలను అర్ధం చేసుకోవడంలో ఆమె ఆలోచనా ధోరణిని సంపూర్ణంగా మార్చివేశాయి అని ఈ పుస్తకం వివరించింది.
హిందూ తత్వశాస్త్రంలో ఉన్న ఎన్నో క్లిష్టమైన పాఠాలను ‘‘అంతా నువ్వే, నువ్వు కూడా’’ అని ఆమె నేర్చుకున్నారని రచయితలు రాశారు.
1970లో మరణించిన ఇరావతి, తన పనుల ద్వారా వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ప్రజలకు ఇప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














