లక్పా షెర్పా: బాల్య వివాహం నుంచి తప్పించుకుని, 10 సార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన మహిళ

లక్పా షెర్పా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లక్పా షెర్పా
    • రచయిత, హెలెన్ బుష్బీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

(గమనిక: ఈ కథనంలో గృహ హింసకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని కలచివేయవచ్చు)

ఆశ్చర్య పరిచే జీవిత కథ లక్పా షెర్పాది. ఆమె 10 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారని చాలామందికి తెలుసు. కానీ, తెరవెనుక ఆమె వ్యక్తిగత జీవితం ప్రమాదకరంగా, భయానకంగా ఉందని ఎంతమందికి తెలుసు?

తాను ఎవరెస్ట్‌ను అధిరోహించేటప్పుడు పలుమార్లు తన భర్త నుంచి గృహ హింసను ఎదుర్కొన్నట్లు లక్పా చెప్పారు.

అమెరికాలో ఉండే ఆమె, కిరాణా దుకాణంలో పనిచేయడంతోపాటు, క్లీనర్‌గానూ చేసి తన ముగ్గురు పిల్లలను పెంచారు.

ఆమె జీవితంతో పాటు పర్వతారోహణ సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి వివరిస్తూ నెట్‌ఫ్లిక్స్‌లో ‘మౌంటైన్ క్వీన్: ది సమ్మిట్స్ ఆఫ్ లక్పా షెర్పా’ అనే పేరుతో జులైలో ఒక డాక్యుమెంటరీ విడుదలైంది. దీనికి లూసీ వాకర్ దర్శకత్వం వహించారు.

ఇది చూసి లక్పా చాలా గర్వపడుతున్నారు.

‘’మహిళలు కూడా ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించగలరని నేను ప్రపంచానికి చూపించాలనుకున్నాను’’ అని లక్పా బీబీసీతో చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె కొద్దిపాటి శిక్షణతోనే రికార్డులు నెలకొల్పారు.

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఎంతో సాహసంతో కూడిన పని.

ఫిట్‌గా ఉండటం కోసం ఆమె అమెరికాలోని కనెక్టికట్ పర్వతాలలో నడవడం ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తుంది. అలాగే ఆమె సాధారణ జీవితాన్ని కొనసాగించడాన్ని కూడా అందులో చూపించారు.

"మీరు అసాధారణమైన అథ్లెట్. చాలా పొడవుగా, బలంగా ఉంటారు" అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెతో డైరెక్టర్ వాకర్ అన్నారు.

"ఒక మహిళ రోజువారీ ఉద్యోగం చేసుకుంటూ.. ఎవరెస్ట్‌ను అధిరోహించడం అంటే మామూలు విషయం కాదు’’ అని వాకర్ అన్నారు.

అందుకు లక్పా షెర్పా స్పందిస్తూ... "నాకు చదువు రాదు. కానీ పర్వతాలు అధిరోహించడం మాత్రం బాగా తెలుసు" అని అన్నారు.

వాట్సాప్
నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నుంచి తీసిన స్క్రీన్ షాట్

ఫొటో సోర్స్, NETFLIX

ఫొటో క్యాప్షన్, నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ స్క్రీన్ షాట్

ఎవరీ లక్పా షెర్పా?

నేపాల్ హిమాలయాలలోని ఒక రైతు కుటుంబంలో లక్పా షెర్పా జన్మించారు. 11 మంది సంతానంలో ఆమె ఒకరు.

ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆడపిల్లలకు చదువు అవసరం లేదనుకునే ప్రాంతంలో ఆమె పెరిగారు.

ఆమె రోజూ గంటల తరబడి పర్వతాలలో నడిచి తన తమ్ముడిని పాఠశాలకు తీసుకెళ్లేవారు. ఆమెకు మాత్రం పాఠశాల లోపలికి అనుమతి ఉండేది కాదు.

ఇప్పుడు నేపాల్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. మహిళల అక్షరాస్యత 1981లో 10 శాతం ఉండగా, 2021 నాటికి 70 శాతానికి పెరిగింది.

కానీ లక్పా షెర్పాకు ఇప్పటికీ చదవడం కూడా రాదు. ఒక టీవీ రిమోట్‌ని ఉపయోగించినట్లుగా తన జీవితాన్ని ఇతరులు కంట్రోల్ చేయడం ఆమెకు చాలా కష్టంగా అనిపించేది.

90వ దశకం చివరిలో జన్మించిన ఆమె కుమారుడు నిమా, కూతుళ్లు సన్నీ (22), షైనీ (17)లు ఆ అంతరాలను తగ్గించడంలో లక్పాకు సాయపడతారు.

చదువులేనప్పటికీ 15 ఏళ్ల వయసులో పర్వత యాత్రలలో పోర్టర్‌గా పని చేశారు. ఆ పని కారణంగానే బాల్య వివాహం నుంచి ఆమె తప్పించుకోగలిగారు.

కాగా, నేపాల్ రాజధాని కఠ్మాండూలో కొద్దికాలం పాటు ఒక వ్యక్తితో కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఆమె గర్భవతి కావడంతో జీవితం కష్టంగా మారింది. పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యాక తిరిగి ఇంటికి వెళ్లే ధైర్యం చేయలేకపోయారు .

నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నుంచి తీసిన స్క్రీన్ షాట్

ఫొటో సోర్స్, netflix

ఫొటో క్యాప్షన్, నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ స్క్రీన్ షాట్

‘భర్త నుంచి ఎందుకు విడిపోయానంటే..’

రొమేనియన్‌ అయిన పర్వతారోహకుడు, హోమ్ రెనోవేషన్ కాంట్రాక్టర్ జార్జ్ డిజ్‌మెరెస్‌తో లక్పా షెర్పా ప్రేమలో పడ్డారు.

2002లో వారు వివాహం చేసుకున్నారు. వివాహమైన తర్వాత ఇరువురు కనెక్టికట్‌కు వెళ్లారు. కానీ తమకు ఇద్దరు పిల్లలు పుట్టాక, తన భర్త హింసాత్మకంగా మారడం వల్ల విడిపోవాల్సి వచ్చిందని లక్పా షెర్పా చెప్పారు.

“2004లో మేం న్యూ ఇంగ్లండ్ క్లైంబింగ్ గ్రూప్‌తో ఎవరెస్ట్‌ను అధిరోహించినప్పుడు, శిఖరం దగ్గరికి చేరుకున్నాక ప్రతికూల వాతావరణం ఎదురైంది. దీంతో వెంటనే జార్జ్ ప్రవర్తన మారిపోయింది” అని స్థానిక పత్రిక కోసం వార్త రాసిన పాత్రికేయుడు మైఖేల్ కోడాస్ చెప్పారు.

జార్జ్ చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయనకు శత్రువులుగా మారాయని కోడాస్ అన్నారు.

డేరా కింద ఉన్న లక్పా షెర్పా మాట్లాడుతూ.. "ఆయన దారుణంగా ప్రవర్తిస్తున్నారు. గట్టిగా అరుస్తూ నన్ను కొట్టారు" అని అన్నారు. ఆమె స్పృహ తప్పి పడిపోయినప్పుడు కోడాస్ తీసిన కొన్ని ఫోటోలు కూడా మనం ఈ డాక్యుమెంటరీలో చూడొచ్చు.

జార్జ్ తన భార్యను డేరా నుంచి ఈడ్చుకెళ్తూ "ఈ చెత్తను ఇక్కడి నుంచి తీసేయండి" అని చెప్పడాన్ని తాను చూశానని కోడాస్ తెలిపారు.

షెర్పా

ఫొటో సోర్స్, Netflix

ఫొటో క్యాప్షన్, లక్పా షెర్పా

ఆసుపత్రి ఘటనే టర్నింగ్ పాయింట్..

‘‘స్పృహ లేకుండా పడి ఉండడం అంటే, మన శరీరం మనల్ని వదిలేసి వెళ్లిపోయినట్టు అనిపించే అనుభవం’’ అని లక్పా షెర్పా అన్నారు.

“మా అమ్మ దగ్గరకి వెళ్లాను. అక్కడ అంతా చూశాను. నేను చేసిన పనికి బాధపడ్డాను. చనిపోవాలనుకున్నాను" అని ఆమె చెప్పారు.

అప్పుడు ఆమెకు తన పిల్లలు గుర్తొచ్చారు. "నేను చనిపోవడానికి సిద్ధంగా లేను" అని ఆమె అనుకున్నారు.

2008లో కోడాస్ రాసిన పుస్తకం ‘హై క్రైమ్స్: ది ఫేట్ ఆఫ్ ఎవరెస్ట్ ఇన్ ఏజ్ ఆఫ్ గ్రీడ్‌’లో ఈ సంఘటన గురించి ప్రస్తావించారు.

మొదట వారి బంధం దెబ్బతిన్నప్పటికీ, చాలా సంవత్సరాలపాటు కలిసే ఉన్నారు. కానీ 2012లో జార్జ్ మళ్లీ తనపై దాడి చేయడంతో ఆసుపత్రిలో చేరానని లక్పా చెప్పారు.

అప్పుడే ఆమె జీవితం మలుపు తిరిగింది. ఒక సామాజిక కార్యకర్త సహాయంతో పిల్లలతో కలిసి స్త్రీల రక్షణ శిబిరానికి చేరుకున్నారు లక్పా షెర్పా.

2015లో విడాకులు తీసుకున్నారు. కుమార్తెల బాధ్యతను పూర్తిగా లక్పా షెర్పాకే అప్పగిస్తూ.. 2016లో కోర్టు తీర్పు ఇచ్చింది.

జార్జ్ డిజ్‌మెరెస్‌ 2020లో క్యాన్సర్‌తో చనిపోయారు.

నెట్‌ఫ్లిక్స్ సిరీస్ టీం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పెద్ద కూతురు సన్నీ, డైరెక్టర్ లూసీ వాకర్, లక్పా షెర్పా, చిన్న కూతురు షైనీ (ఎడమ నుంచి కుడికి)

'రహస్యంగా ఉంచాలనుకున్నా'

డాక్యుమెంటరీ కోసం తమ బంధం గురించి మాట్లాడే సమయంలో లక్పా షెర్పా ఇబ్బందికి లోనయ్యారు.

"నా జీవితంలో చోటు చేసుకున్న ఈ కల్లోలం అంతా రహస్యంగా ఉండాలనుకున్నాను. నా జీవితంలో జరిగిందంతా అందరికీ తెలియాలని నేను కోరుకోవడం లేదు" అని ఆమె చెప్పారు.

అయితే, డైరెక్టర్ వాకర్ గురించి తెలిసిన తర్వాత, ఈ డాక్యుమెంటరీకి అంగీకరించాలని లక్పాకు ఆమె కుమారుడు సలహా ఇచ్చారు.

దాంతో డాక్యుమెంటరీకి ఆమె ఓకే చెప్పారు.

'పర్వతారోహణ ఒక చికిత్స'

పర్వాతాల అధిరోహణ ఆమెకు అభిరుచి మాత్రమే కాదు, ఒక చికిత్స కూడా.

"నా చీకటిని నేను పర్వతంపై వదిలివేస్తాను" లక్పా షెర్పా చెప్పారు. ఆమె 2022లో 10వ సారి ఎవరెస్ట్‌ను అధిరోహించారు.

ఆమె కుమార్తెలు తమ తల్లిని చూసి గర్వపడుతున్నారు.

అమెరికాలో తన పిల్లలకు విద్యను అందించడంతోపాటు వారికి మెరుగైన జీవితాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు.

"నాకు పర్వతాలు తెలుసు. నా నైపుణ్యం, అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలనుకుంటున్నాను" అని లక్పా షెర్పా అన్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)