బ్యాంక్ లోన్ తీర్చలేదని గిరిజన మహిళ ఇంటి ముందు మంట పెట్టిన అధికారులు.. ఆర్‌బీఐ నిబంధనలు ఏం చెప్తున్నాయి

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
''నీకు దండం పెడతా సార్, ఊరు ముందు ఇంతలా ఇజ్జత్ (పరువు) తియ్యకు అని అన్నాను. డబ్బులు కట్టు, లేదంటే నీ ఇంటి ముందే వంట వండుకుని తింటామని అన్నారు. అందరూ చూస్తుండగా మూడు రాళ్లతో పొయ్యి ఏర్పాటు చేశారు. ఇక నేను బతికి ఎందుకు అని ఏడ్చేశాను.''
రుణ బకాయిల వసూలు కోసం వచ్చిన బ్యాంక్ సిబ్బంది తనతో వ్యవహరించిన తీరును వివరిస్తూ అంగోత్ లక్ష్మి (60) కంటనీరు పెట్టుకున్నారు.
బ్యాంకులు, వారి ద్వారా నియమించిన ఏజెంట్లు అప్పు వసూలుకు వచ్చినప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.
అప్పు వసూళ్ల కోసం అనైతిక పద్దతులు అనుసరించొద్దని సూచించింది.
లక్ష్మి లంబాడ (బంజార) వర్గానికి చెందినవారు. ఆమెది జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దతాండ గ్రామం.
ఇరుగుపొరుగు మహిళలతో కలిసి 'తారా' పేరుతో నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయ సంఘానికి గ్రూపు లీడర్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు.
తారా గ్రూపు సభ్యులు గతంలో సింగరాజుపల్లి బ్రాంచ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి సుమారు 6 లక్షల రుణం తీసుకున్నారు. లక్ష్మి వంతుగా సుమారు 60 వేల రూపాయలు రుణం వచ్చింది. కొన్ని నెలలు వాయిదాలు చెల్లించాక, వివిధ కారణాలతో రుణ చెల్లింపు కొన్నేళ్లుగా వాయిదా పడింది.


జనవరి 23న సెర్ప్, ఐకేపి, గ్రామీణ బ్యాంక్ సభ్యులతో కూడిన బృందం పెద్దతాండ గ్రామానికి వచ్చింది. మొండి బకాయిల వసూలు కార్యక్రమంలో భాగంగా అంగోత్ లక్ష్మి ఇంటి ముందు వారు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో ఒకటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల కోసం జనవరి 28న పెద్దతాండ గ్రామానికి బీబీసీ వెళ్లినప్పుడు అంగోత్ లక్ష్మి ఇంటికి తాళం వేసి కనిపించింది. అక్కడికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామన్న గూడెం అనే గ్రామానికి ఆమె కూలి పనులకోసం వెళ్లినట్లు గ్రామస్థులు చెప్పారు.
అక్కడి నుంచి రామన్నగూడెం గ్రామానికి వెళ్లిన బీబీసీ మిరపతోటలో పనిచేస్తున్న లక్ష్మిని కలిసింది.
"ఆరోజు కూలికి వెళ్లిన నన్ను సెర్ప్ సిబ్బంది బైక్‌పై ఊర్లోకి తీసుకొచ్చారు. నీ తాత సొమ్ము అనుకున్నావా, అవి మా డబ్బులు. 5 లేదా 10 వేలు కట్టు. లేదంటే నీ ఇంటి ముందే ఉంటాం. ఇక్కడే వంట చేసుకుని తింటాం అని బ్యాంక్ మేనేజర్ అన్నారు. నీకు దండం పెడతా సార్, నెల రోజులు సమయం ఇవ్వండన్నా వినలేదు. చివరకు మా మరిది వద్ద పది వేలు అప్పు తీసుకుని కట్టాను'' అని బీబీసీతో లక్ష్మి చెప్పారు.

'ఆ వేధింపులు తట్టుకోలేక చావాలని అనుకున్నా. బీపీ డౌన్ అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్లి సూది వేయించుకున్నా. గోళీలు వేసుకుని కాసేపు పడుకున్నా'' అని లక్ష్మి తెలిపారు.
తన భర్తకు జబ్బు చేసిన సమయంలో ఆ రుణం తీసుకున్నానని, ఆ తర్వాత ఆయన చనిపోయారని, వివిధ ఖర్చుల కోసం రుణం డబ్బులు వాడానని లక్ష్మి చెప్పారు.
జనవరి 24న రుణ రికవరి క్యాంప్‌లో భాగంగా పెద్దతాండ పక్కనే ఉన్న దేవునిగుట్ట తాండకు అధికారులు వెళ్లారు. అక్కడ అధికారులు వ్యవహరించిన తీరును ఆ గ్రామస్థులు వివరించారు.
''కొద్ది రోజుల్లో డబ్బులు కడతాం సార్ అని అన్నాను. బాగా తిప్పలు పెట్టారు. పొయ్యి వెలిగించి బువ్వ వండుకుని తింటాం అన్నారు. అలా చేయవద్దని బతిమాలాను. నాకు కాలు నడవ రాదు, పనికి వెళ్లే పరిస్థితుల్లో లేను అని చెప్తే, పొయ్యి మీద నీళ్ల కుండ పెట్టి నీకు స్నానం చేపిస్తాం అమ్మా అని అన్నారు'' అని ధరావత్ జమ్ము (65) బీబీసీతో చెప్పారు.
'గతంలో మా మహిళా సంఘం తరఫున నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్ర కమీషన్ చెక్కుల్లో కొన్ని డబ్బులు కట్ చేసుకున్నారు. ఇప్పుడు రెండు వేలు కట్టాను'' అని జమ్ము అన్నారు.
కరోనా లాక్‌డౌన్ సమయంలో ఏర్పడిన పరిస్థితుల తర్వాత గ్రామంలో మహిళా సంఘాల రుణ వాయిదాల చెల్లింపులు గాడి తప్పాయని బీబీసీతో పెద్దతాండకు చెందిన అంగోత్ యాదగిరి అన్నారు. రెండేళ్లు పంటలు సరిగా పండలేదని, డబ్బులు సర్దుబాటైన సభ్యులు తమ వంతు వాయిదాలు కడితే, మరికొందరు కట్టలేకపోయారని ఆయన తెలిపారు.

'మైక్రో ఫైనాన్స్‌ల బారిన పడొద్దనే..'
ఈ మొత్తం వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ కత్తి శ్రీనివాస్‌ను కలిసేందుకు సింగరాజుపల్లి బ్రాంచ్‌కు బీబీసీ వెళ్లింది. అయితే, ఆయన అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేసింది.
బ్యాంక్ పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లినందున స్వయంగా కలవలేనని బీబీసీకి మెసేజ్ చేశారు కత్తి శ్రీనివాస్.
''సుమారు 20 మంది సెర్ప్, ఐకేపీ శాఖలకు చెందిన మహిళా సిబ్బందితో రుణాల రికవరీ క్యాంప్‌కు వెళ్లాం. అధిక వడ్డీలు వసూలు చేసే మైక్రోఫైనాన్స్‌ల బారిన పడకుండా స్వయం సహాయక మహిళా సంఘాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని'' మేసేజ్‌లో ఆయన తెలిపారు.
బ్యాంక్, సెర్ప్ అధికారుల వ్యవహారంపై జనగామ 'జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ' అధికారి (డీఆర్డీవో) వసంతను బీబీసీ కలిసింది.
''కమ్యూనిటీ బేస్డ్ రికవరీ మెకానిజంలో భాగంగానే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రుణాలు తిరిగి కట్టించేందుకు బ్యాంక్ అధికారులు, మా శాఖ బృందం ఆ గ్రామాలకు వెళ్లింది. మధ్యాహ్నం ఆకలితో ఉన్నామంటే, అక్కడే వంట చేసుకోండని వారు అనడం వల్లే అక్కడ పొయ్యి లాగా ఏర్పాటు చేశారు. ఇది దురదృష్టకరమైన సంఘటన. దీనిపైన వారినుంచి రాతపూర్వక సంజాయిషీ తీసుకున్నాం. భవిష్యత్‌లో సున్నితంగా వ్యవహరించాలని వారికి చెప్పాం. ఇలాంటి సంఘటనలు తిరిగి జరగకుండా చూస్తాం'' అని డీఆర్డీవో వసంత బీబీసీతో అన్నారు.

'మహిళలపై రుణాల ఒత్తిడి పెరుగుతోంది'
తనాఖా లేని బ్యాంకు రుణాల రూపంలో మహిళలపై ఒత్తిడి పెరుగుతోందని, అప్పు తీర్చడం కోసం ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తోందని మహిళా రైతుల గురించి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి.
''అప్పు వసూలు చేయడానికి ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి సమయంలో వారి సామాజిక వర్గం, భూమి ఉన్నవారా? లేదా, వారి ఆర్థిక స్థితి కూడా అధికారులు చూడాలి. తనఖా లేకండా అప్పులు ఇస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, మహిళా సంఘాలు బ్యాంకుల్లో పొదుపు చేసిన డబ్బుల నుంచే వారికి రుణాలు ఇస్తున్నారు. నిజానికి అవి వారి డబ్బులే.
రుణాలు తీసుకోవడం వారికి అలవాటు చేశారు. ఇలా తీసుకున్న రుణాలు మహిళలు తమ స్వంతానికి వినియోగించేది తక్కువే. వ్యవసాయం, కుటుంబ అవసరాలకు వాడుతున్నారు. తెచ్చిన అప్పు తీర్చే బాధ్యత మహిళలపైనే ఉండటంతో వారిపై ఒత్తిడి పెరిగి అదనపు కూలీ, శ్రమ చేస్తున్నారు.
మగవారికి ఇల్లు, భూమి తనాఖా పెడితే తప్పా అప్పులు దొరకవు. పరోక్షంగా మగవారు తమ కుటుంబ బాధ్యతలు మహిళల నెత్తిన వేశారు. దీంతో కుటుంబాల్లో గతంలో ఉన్న మహిళల అణిచివేత కాస్త తగ్గినా, మొత్తం మీద ఇది బాధ్యత కంటే మహిళలకు భారంగా మారుతోంది'' అని మహిళా కిసాన్ అధికార్ మంచ్ (మకామ్ ) సంస్థకు చెందిన ఎస్. ఆశాలత బీబీసీతో అన్నారు.

ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి?
బ్యాంకులు తాము ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు చేసుకోవడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
అప్పు వసూలులో భాగంగా బ్యాంకులు లేదా వారి తరఫున నియమించిన కలెక్షన్ ఏజెన్సీల ప్రవర్తన, చర్యలు అనైతికంగా ఉండొద్దని, భయపెట్టడం, తిట్టడం, వేధింపులకు పాల్పడటం వంటివి చేయొద్దని ఆర్బీఐ సూచించింది. గౌరవమర్యాదలకు భంగం కలగని రీతిలో వసూళ్ల ప్రక్రియ ఉండాలని స్పష్టం చేసింది.
అప్పు పడ్డ వారి వ్యక్తిగత సమాచార గోప్యత, సింగిల్ పేమెంట్ సెటిల్మెంట్‌ల కోసం చర్చించడం, లీగల్ నోటీసులు ఇవ్వడం, రుణ రికవరీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం, తనాఖా పెట్టిన ఆస్తులను అమ్మి అప్పు కట్టించుకోవడం లాంటి పద్ధతులను క్రమపద్ధతిలో అనుసరించాలని ఆర్బీఐ గైడ్‌లైన్స్‌లో పేర్కొంది.
బ్యాంకుల తరఫున వచ్చే కలెక్షన్ ఏజెంట్‌ల ప్రవర్తనకు బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














