మాజీ ఎమ్మెల్యేపై ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన యువకుడు పట్టాలపై శవమై తేలాడు.. హత్యా? ఆత్మహత్యా?

అనంతపురం, రాప్తాడు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల శ్రీరామ్

ఫొటో సోర్స్, Thopudurthi Mahesh Reddý (Mahesh)/facebook

ఫొటో క్యాప్షన్, మహేష్ రెడ్డి జనవరి 26న సోములదొడ్డి - నాగిరెడ్డి గ్రామాల మధ్య రైలుపట్టాలపై శవమై కనిపించారు.
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

అనంతపురం జిల్లాలో రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యువకుడు రైలు పట్టాలపై శవమై కనిపించాడంటూ ఇటీవల స్థానిక మీడియాలో వచ్చిన కథనాలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి.

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరులకు వ్యతిరేకంగా అదే గ్రామానికి చెందిన వారి బంధువు మహేష్ రెడ్డి గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో, జనవరి 26న మహేష్ రెడ్డి.. సోములదొడ్డి, నాగిరెడ్డి గ్రామాల మధ్య రైలుపట్టాలపై శవమై కనిపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

యువకుడి మృతి ఘటనలో తోపుదుర్తి సోదరులపై తమకు అనుమానాలు ఉన్నాయని మృతుడి తండ్రి మల్లిరెడ్డి, ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ ఆరోపణలు చేశారు.

అయితే, ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ యువకుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చెప్పారు. యువకుడి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

యువకుడి మృతి వ్యవహారం రాజకీయ మలుపు తీసుకోవడంతో అసలు దీనివెనుక ఏం జరిగింది, ఎవరు ఏం చెబుతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

అనంతపురం, రాప్తాడు, పరిటాల శ్రీరామ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

ఫొటో సోర్స్, Thopudurthi Mahesh Reddý (Mahesh)/facebook

ఫొటో క్యాప్షన్, రైలు పట్టాల పక్కన మృతదేహం పడి ఉందని గ్రామస్తులు చెప్పడంతో వెళ్లి చూశామని మహేష్ రెడ్డి తండ్రి మల్లిరెడ్డి చెప్పారు

అసలేం జరిగింది..

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తి గ్రామంలో మహేష్ రెడ్డి కుటుంబం ఉంటోంది. బెంగళూరులో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసిన 24 ఏళ్ల మహేష్ రెడ్డి కరోనా సమయంలో స్వగ్రామనికి వచ్చారు. అప్పటి నుంచి గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనులు చూసుకునేవారు.

అయితే, గత ఏడాది నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అనంతపురంలో రూమ్ తీసుకుని ఉంటున్నాడని, ఇంటికి వస్తూపోతూ ఉండేవాడని మహేష్ తండ్రి మల్లిరెడ్డి బీబీసీతో చెప్పారు.

''శనివారం సాయంత్రం పోన్ చేశాడు. తర్వాత రాత్రి పాలచెర్లకు చెందిన మురళి అనే స్నేహితుడితో కలిసి.. సోములదొడ్డి గ్రామంలోని బస్టాప్‌ దగ్గరకు వెళ్లాడు. తనకు పని ఉందని, పూర్తి చేసుకుని మళ్లీ ఫోన్‌ చేస్తానని తనతో వచ్చిన యువకుడికి మహేష్ రెడ్డి చెప్పాడు. దీంతో అతడు అక్కడి నుంచి అనంతపురం వెళ్లిపోయాడు. తర్వాత రాత్రి 10.30 గంటలకు మహేష్‌కు పోన్ చేస్తే కలవలేదు. దీంతో మురళి నాకు పోన్ చేశాడు. అతని స్నేహితులకు చేస్తే ఫోన్ చార్జింగ్ అయిపోయి ఉంటుందిలే అన్నారు. దాంతో శనివారం 25 రాత్రి ఇక గమ్మునే ఉండిపోయాం'' అని ఆ రోజు జరిగిన విషయాలను మల్లిరెడ్డి వివరించారు.

తర్వాత రోజే తన కొడుకు రైలు పట్టాలపై శవమై కనిపించాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

''ఆదివారం, 26 ఉదయం ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో నేను బయలుదేరి వెళ్లి, మురళిని తీసుకుని సోములదొడ్డికి వెళ్లా. అక్కడ మా బంధువులు ఉన్నారు. వాళ్ల ఇంటికి వెళ్లి పడుకున్నాడేమోనని అక్కడ విచారించాం. అంతలోనే సోములదొడ్డి- నాగిరెడ్డి గ్రామాల మధ్య మృతదేహం ఉన్నట్లు గ్రామస్తులు చెప్పడంతో అక్కడికి వెళ్లి చూశాం. అక్కడ మహేష్ రెడ్డి రైలుపట్టాల పక్కన శవమై కనిపించాడు'' అన్నారు మల్లి రెడ్డి.

అనంతపురం, రాప్తాడు

ఫొటో సోర్స్, Thopudurthi Mahesh Reddý (Mahesh)/facebook

ఫొటో క్యాప్షన్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరులు బెదిరించారని మల్లిరెడ్డి ఆరోపిస్తున్నారు

తోపుదుర్తి సోదరులపై ఆరోపణలు..

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్‌ రెడ్డి తన కుమారుడికి ఫోన్ చేసి బెదిరించాడని మహేష్ రెడ్డి తండ్రి మల్లిరెడ్డి బీబీసీతో చెప్పారు.

''వైసీపీ హయాంలో మా భూమిని ఆన్‌లైన్‌ నుంచి తొలగించారు. దీంతో నా కొడుకు పరిటాల శ్రీరామ్‌ను కలిశాడు. అప్పుడు 2021, 2022 ప్రాంతంలో నా కొడుకును తీసుకెళ్లి కొట్టడమే కాకుండా అక్రమంగా గంజాయి కేసు సహా 5 కేసులు పెట్టించారు. 2025 జనవరి 1న నా కొడుకు పరిటాల శ్రీరామ్‌ను కలిసి ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టి, నాపై అక్రమ కేసులు పెట్టినవారు ఎక్కడ దాక్కున్నారు అని ప్రశ్నించాడు. దీంతో కోపం పెంచుకున్నతోపుదుర్తి సోదరులు బెదిరింపులకు పాల్పడ్డారు. వారి కుటుంబానికి మేం అనుచరులుగా ఉన్నాం. వారి కోసం ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నా. వాటిలో తిరుగుతూ నేను నా భార్యను పోగొట్టుకున్నా. ఇప్పుడు నా కొడుకును ఇలా చేశారు'' అని మల్లిరెడ్డి బీబీసీతో చెప్పారు.

తన కొడుకు జీవితాన్ని కూడా తోపుదుర్తి సోదరులు నాశనం చేశారని తండ్రి మల్లిరెడ్డి ఆరోపించారు.

''వాడికి లవ్ ఎఫైర్ ఉందని అంటున్నారు. మహేష్ రెడ్డి 8 నెలల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన కమ్మ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, వాడిపైన గంజాయి, ఫ్యాక్షన్ కేసులు పెట్టించారు. దానికి కారణం కూడా మాజీ ఎమ్మెల్యే సోదరులే. కేసులు ఉన్నాయని తెలిసి ఆ అమ్మాయి వెళ్లిపోయింది. నా కొడుకుపై అక్రమ కేసులు పెట్టారని ఆ అమ్మాయితో కూడా మాట్లాడతానని శ్రీరామ్ చెప్పారు. ఇంతలోనే ఇలా జరిగింది'' అన్నారు.

అనంతపురం, రాప్తాడు, తోెపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల శ్రీరామ్

ఫొటో సోర్స్, Thopudurthi Mahesh Reddý (Mahesh)/facebook

ఫొటో క్యాప్షన్, మహేష్ రెడ్డి మరణం అనుమానాస్పదంగా ఉందని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అన్నారు

అనుమానాస్పదంగా ఉంది: పరిటాల శ్రీరామ్

తోపుదుర్తి మహేష్ రెడ్డి మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. మహేష్ రెడ్డి మృతి విషయం తెలియగానే అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన పరిటాల శ్రీరామ్, మార్చురీలో ఆయన మృతదేహాన్ని పరిశీలించారు.

2019 తర్వాత తోపుదుర్తి మహేష్ రెడ్డి తనను కలిశాడని.. అప్పటి నుంచే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరులు అతన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు శ్రీరామ్. ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక కేసులు పెట్టించినా, ఆ ఒత్తిళ్లను తట్టుకున్న మహేష్ రెడ్డి, ఇప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడని శ్రీరామ్ ప్రశ్నిస్తున్నారు.

''మహేష్ రెడ్డి మరణం అనుమానాస్పదంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇందులో అనుమానితుడిగా భావిస్తున్నాం. ఎందుకంటే, ఈ జనవరి నెల మొదటి నుంచి అతనికి ఫోన్ చేసి బెదిరించారు. ళ్ల నాన్నకి ఫోన్ చేసి కొడతాం, చంపుతామంటూ బెదిరించారు. ఇవి మామూలు బెదిరింపులే అనుకున్నారు'' అన్నారు పరిటాల శ్రీరామ్.

మహేష్ రెడ్డి మృతిపై పూర్తిస్థాయి విచారణ జరగాలని పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేశారు.

''దీని వెనకాల ఎవరి ప్రోద్బలం ఉంది. ఎవరు చేశారనేది తెలియాల్సిన అవసరం ఉంది. గత వారం నుంచి ఫేస్‌బుక్‌లో జరుగుతున్న సంభాషణలను కూడా ఎవిడెన్సుగా తీసుకోవాలి. దీనిపైన కరెక్ట్‌గా విచారణ జరిపించాలి'' అన్నారు.

అనంతపురం, రాప్తాడు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల శ్రీరామ్

ఫొటో సోర్స్, Thopudurthi Prakash Reddy/facebook

ఫొటో క్యాప్షన్, మహేష్ రెడ్డి వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటే, దానిని రాజకీయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చెప్పారు

ఆత్మహత్య చేసుకుంటే రాజకీయం చేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

మహేష్ రెడ్డి మరణంపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో బీబీసీ మాట్లాడింది.

మహేష్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. దానిపై రాజకీయం చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బీబీసీతో అన్నారు.

పరిటాల శ్రీరామ్‌ ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న మహేష్ రెడ్డి తమ గ్రామానికి చెందినవారని, తమకు వరుసకు బంధువు కూడా అవుతారని చెప్పారు.

"మహేష్ తండ్రి మల్లిరెడ్డి 30 ఏళ్లుగా మా చిన్నాన్న, మా సోదరుడికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. మా గ్రామంలో ఉన్న యువత చెడుమార్గంలో తిరగకూడదనే ఉద్దేశంతో, నేరాలు, చట్టం గురించి తెలియకుండా వ్యవహరిస్తున్న మహేష్ రెడ్డికి మా సోదరుడు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. మహేష్ రెడ్డి వ్యక్తిగత ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడితే.. దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు?'' అని ప్రశ్నించారు ప్రకాష్ రెడ్డి.

అనంతపురం, రాప్తాడు

ఫొటో సోర్స్, Thopudurthi Mahesh Reddý (Mahesh)/facebook

ఫొటో క్యాప్షన్, మహేష్ రెడ్డి కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు

పోలీసులు ఏం చెప్పారు?

దర్యాప్తు కొనసాగుతోందని యువకుడి మృతిపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు బీబీసీతో చెప్పారు. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు.

రైలు పట్టాల దగ్గర మృతదేహం పడివున్న తీరును బట్టి మహేష్ రెడ్డిది ఆత్మహత్యగా భావిస్తున్నామని అనంతపురం రైల్వే ఎస్ఐ వెంకటేష్ బీబీసీతో చెప్పారు.

''మహేష్ తండ్రి మల్లిరెడ్డి ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నాం. పోస్టుమార్టం రిపోర్టులో హత్య అని వస్తే, ఈ కేసును తదుపరి దర్యాప్తు కోసం సివిల్ పోలీసులకు అప్పగిస్తాం'' అని వెంకటేష్ చెప్పారు.

అలాంటి పరిస్థితులు లేవు

‘ప్రభుత్వం మారడంతో తోపుదుర్తి సోదరులపై కేసులు నమోదవుతున్నాయి. వారు హైదరాబాదులో ఉంటున్నారు. అయితే, సోములదొడ్డి చుట్టుపక్కల ఉన్న మూడు గ్రామాల్లో రెడ్డి ప్రాబల్యం ఉంటుంది. అక్కడ తోపుదుర్తి అనుచరులు ఎక్కువగా ఉంటారు. వారు ఏమైనా చేశారా? అనే అనుమానంతో టీడీపీ నాయకులు ఆరోపణలు చేసుండొచ్చు’ అని అనంతపురానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అమర్ బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)