విశాఖ జువైనల్ హోమ్: నిద్ర మాత్రలిచ్చి మానసిక రోగులను చేస్తున్నారంటూ బాలికల ఆందోళన

జువైనల్ హోమ్ గోడెక్కిన బాలికలు
ఫొటో క్యాప్షన్, జువైనల్ హోమ్ గోడెక్కిన బాలికలు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

"నిద్ర మాత్రలు ఇచ్చి మమ్మల్ని మానసిక రోగులుగా మారుస్తున్నారు. మేం ఇక్కడ ఉండం" అంటూ విశాఖ జువైనల్ హోమ్‌(ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనం)కు చెందిన అయిదుగురు బాలికలు గోడపైకి ఎక్కి నిరసన తెలిపారు.

బుధవారం, గురువారం ఈ నిరసనలు జరిగాయి. బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా బాలికలు గోడపైకి ఎక్కి నినాదాలు చేస్తూ కిందకు దిగి రోడ్డుపైకి వచ్చారు. జువైనల్ హోమ్‌లో ఉండలేమంటూ రోడ్డుపై ఆందోళన చేశారు.

ఆ సమయంలోనే బాలికల కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు.

"నా తల్లి దగ్గరకు నన్ను పంపించడం లేదు. ఎందుకంటే, ఆమె నన్ను అమ్మేస్తుందని సూపరింటెండెంట్ మేడం చెబుతున్నారు'' అని ఒక బాలిక చెప్పారు.

జువైనల్ హోమ్ నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాలికలను తిరిగి హోమ్ లోపలకు పంపించారు.

కానీ, మళ్లీ గురువారం కూడా బాలికలు గోడలెక్కి ఆందోళనలు చేశారు.

ఇంతకీ జువైనల్ హోమ్‌లో బాలికలు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు?

బాలికలు ఏమంటున్నారు? అధికారులు ఏం చెబుతున్నారు? చైల్డ్ రైట్స్ కమిషన్ విచారణలో ఏం తేలింది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖ జువైనల్ హోమ్

అసలేం జరిగిందంటే...

బుధవారం మధ్యాహ్నం విశాఖ వ్యాలీ స్కూల్ సమీపంలో ఉన్న జువైనల్ హోమ్ గోడపైకి ఎక్కి, పైన ఉన్న కంచెను దాటుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు బాలికలు.

జువైనల్ హోమ్‌లో తాము ఉండలేమంటూ గోడపైనుంచే నినాదాలు చేశారు.

అది గమనించిన హోమ్ సిబ్బంది వారిని కిందకు దింపే ప్రయత్నం చేశారు.

ఓవైపు గోడపైకెక్కి బాలికల నినాదాలు, మరోవైపు వారు కింద పడిపోతారేమోననే ఆందోళనతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కాసేపటికి బాలికలు గోడ దిగి రోడ్డుపైకి వచ్చారు.

ఆందోళన చేస్తున్నారనే విషయం తెలియడంతో, కొందరు బాలికల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు జువైనల్ హోమ్‌కు చేరుకున్నారు.

"మాకు లోపల నరకం చూపిస్తున్నారు. స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చి మమ్మల్ని మానసిక రోగులుగా మారుస్తున్నారు. మేం ఆత్మహత్య చేసుకుంటాం" అంటూ బాలికలు రోడ్లపై అరుస్తూ, దారిన పోతున్నవారికి, అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులకు చెప్పుకొచ్చారు.

ఇది జరుగుతుండగానే బాలికలు, వారి తల్లిదండ్రులతో పోలీసులు మాట్లాడారు.

బాలికలు చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాలికలు తిరిగి జువైనల్ హోమ్ లోపలకు వెళ్లారు.

రెండో రోజూ గోడెక్కి ఆందోళనలు

బుధవారం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అంతా అనుకున్నారు. కానీ, మళ్లీ గురువారం కూడా గోడపైకి ఎక్కి బాలికలు ఆందోళన చేశారు.

తామిక్కడ ఉండలేమని, తమని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారంటూ వారు అన్నారు.

బాలికలు కొంతసేపు ఆందోళన చేసిన తర్వాత జువైనల్ హోమ్ సిబ్బంది, స్థానిక పోలీసులు వారిని తిరిగి హోమ్ లోపలకు పంపించారు.

ఈ ఘటనపై హోం మంత్రి అనిత వంగలపూడి స్పందించారు.

"జువైనల్ హోమ్‌లోని బాలికలు చేసిన ఆరోపణల గురించి వారితో మాట్లాడి అధికారులు తెలుసుకుంటున్నారు. మహిళా పోలీసుల సమక్షంలో విచారణ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీస్ కమిషనర్‌తో పాటు స్థానిక తహశీల్దార్‌కు ఆదేశాలిచ్చాం. బాలికల ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని అనిత అన్నారు.

జువైనల్ హోమ్
ఫొటో క్యాప్షన్, జువైనల్ హోమ్ సూపరింటెండెంట్ సునీత

జువైనల్ హోమ్ సూపరింటెండెంట్ ఏమన్నారంటే...

నిద్ర మాత్రలిస్తున్నారంటూ బాలికలు చేసిన ఆరోపణలపై జువైనల్ హోమ్ సూపరింటెండెంట్ సునీత బీబీసీతో మాట్లాడారు.

"జువైనల్ హోమ్‌లో ప్రస్తుతం 60 మంది పిల్లలున్నారు. వీరిలో అయిదుగురితో మాత్రమే సమస్యలున్నాయి. రెండు రోజులు నుంచి ఈ అయిదుగురు పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి కూడా తీసుకువెళ్లాం. వీరిలో నలుగురు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన వారు. ఒకరు కోర్టు ద్వారా హైదరాబాద్ నుంచి వచ్చారు" అని సునీత వివరించారు.

ఇంతకుమించి వీరి వివరాలు చెప్పలేమని ఆమె తెలిపారు.

జేజే యాక్ట్ (జువైనల్ జస్టిస్ - పిల్లల సంరక్షణ చట్టం 2000) ప్రకారం పిల్లలు, వారి తల్లిదండ్రుల పేర్లు, వివరాలు బహిర్గతం చేయకూడదని చెప్పారు.

"చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కున్న మైనర్లను జువైనల్ హోమ్స్‌కు పంపుతారు. అయితే, ఇక్కడకు వచ్చిన కొంతమంది తమను బయటకు పంపాలని గొడవ చేస్తుంటారు. తీవ్ర నేరాలకు పాల్పడిన, చట్ట విరుద్ధమైన పనులు చేసిన మైనర్లను జువైనల్ బోర్డు ముందు హాజరు పరుస్తారు. దీనినే జువైనల్ జస్టిస్ బోర్డు అంటారు.

వారిని ఎన్నాళ్లు జువైనల్ హోమ్‌లో ఉంచాలి, వారికి ఏదైనా ప్రత్యేక వైద్యం లేదా సదుపాయం కల్పించాలా అనే విషయాలను కూడా ఆ బోర్డే నిర్ణయిస్తుంది. నేర స్వభావం ఉన్న పిల్లలను, నేరాలు చేసిన పిల్లలను చైల్డ్ వేల్ఫేర్ కమిటీ, ఈ బోర్డు వద్దకు తీసుకెళ్తుంది'' అని సునీత వివరించారు.

''బాలికలు ఎవరినీ రానివ్వడం లేదు''

బాలికలు గోడ ఎక్కి తమను విడిచిపెట్టాలని నినాదాలు చేయడంతో రెండో రోజూ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

బుధవారం జరిగిన ఘటనపై విచారణ జరిపేందుకు విద్యార్థి, మహిళ, బాలల హక్కుల పరిరక్షణ సమితి, చైల్డ్ వేల్ఫేర్ కమిటీ, ఏపీ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు జువైనల్ హోమ్‌కు చేరుకున్నారు.

వారిపై బాలికలు రాళ్లు విసిరారు. తమను బయటకు పంపాలని అరుస్తూ సభ్యులతో మాట్లాడేందుకు నిరాకరించారు.

"ఎవరినీ లోపలకు రానివ్వడం లేదు. మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. మాపై రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు" అని బీబీసీతో ఏపీ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యుడు సీతారాం చెప్పారు.

ఈ సంఘటనల నేపథ్యంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల ప్రకారం, ఈ బాలికలను జువైనల్ హోమ్‌లో కొనసాగించాలా, మరో చోటుకు పంపించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని జువైనల్ హోమ్ సూపరింటెండెంట్ సునీత చెప్పారు.

జువైనల్ హోమ్

‘టాబ్లెట్లు వేయడం కోసం అన్నం తినమంటాం’

హోమ్‌లో మానసిక సమస్యలు ఉన్నవారు కూడా ఉన్నారని సూపరింటెండెంట్ సునీత చెప్పారు.

''వారు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. వారందరు టాబ్లెట్స్ వేసుకున్నారా లేదా అనేది రోజూ చెక్ చేస్తాం. అన్నం తింటే కానీ టాబ్లెట్ వేయడం కుదరదు. వీళ్లు అన్నం తినరు. ఆ సందర్భంలో అన్నం తినాలని వాళ్లకు మేం చెబుతాం. దాన్ని కూడా బలవంతపెడుతున్నారంటే ఏం చేయగలం?" అని ఆమె వివరించారు.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా తమ వద్దకు పిల్లలు వస్తారని, అలా వచ్చిన వారి చదువు, ఇతర వివరాలు తీసుకుని హోమ్‌లో చేర్చుకుంటామని ఆమె చెప్పారు.

''చదువుపై ఆసక్తి ఉన్నవారికి ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు కూడా రాయిస్తుంటాం. వాళ్లకు 18 ఏళ్లు వచ్చే వరకు ఇక్కడ ఉంచుతాం. ఇక్కడ ఉండటం నచ్చని వారు ఏవో ఆరోపణలు చేసి, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటారు" అని సునీత అన్నారు.

‘ఆ అధికారం మాకు లేదు’

జువైనల్ హోమ్ నుంచి పంపించే అధికారం కానీ, చేర్చుకునే అధికారం కానీ తమకు లేదని సునీత స్పష్టం చేశారు.

"కమిటీ ఆర్డర్లతోనే వాళ్లకి కావలసిన సదుపాయాలు కల్పిస్తాం, విద్య నేర్పిస్తాం. వాళ్లని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలంటే కమిటీ, జేజేబీ ఆర్డర్స్ ఉండాలి.

చిన్న చిన్న నేరాలకు పాల్పడుతూ తరచూ ఇళ్ల నుంచి పారిపోతూ ఉండేవారు, బెగ్గింగ్ చేస్తూ నేరాలకు పాల్పడేవారు, పోక్సో కేసుల్లో శిక్ష పడినవారు... ఇలాంటి వారంతా జువైనల్ హోమ్‌లో ఉంటారు. ఇప్పుడు ఆందోళనలకు దిగిన అయిదుగురిలో నలుగురు కేర్ అండ్ ప్రొటెక్షన్ అంటే తీవ్రమైన నేరాలకు పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడకు వచ్చిన వారే.

ఈ అయిదుగురిలో నలుగురు మానసిక చికిత్సాలయంలో చికిత్స పొందుతున్నారు. మానసిక వైద్యుల సలహా మేరకు వారికి చికిత్స అందుతుంది. దానికి సంబంధించిన మందులు క్రమం తప్పకుండా ఇస్తుంటాం. కొన్నిసార్లు ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రిలో కొన్ని రోజులు ఉంటారు. ఆ తర్వాత ఇక్కడికి వస్తారు" అని సునీత వివరించారు.

"శిక్ష పూర్తయిన వారిని తల్లిదండ్రులకు అప్పగించాలన్నా లేదా కొత్తవారిని జువైనల్ హోమ్‌లో చేర్చుకోవాలన్నా చైల్డ్ వేల్ఫేర్ కమిటీదే తుది నిర్ణయం" అని సునీత చెప్పారు.

జువైనల్ హోమ్

మత్తు మందులు ఇస్తున్నారా?

విశాఖ జువైనల్ హోమ్‌లో బాలికల ఆందోళన నేపథ్యంలో ఏపీ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ అక్కడ విచారణ చేపట్టింది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యుడు సీతారాంతో బీబీసీ మాట్లాడింది.

కానీ, బాలికలు తమకు సహకరించడం లేదని కమిషన్ సభ్యులు బీబీసీకి చెప్పారు.

"బాలికలు రెండు రోజులుగా మందులు వేసుకోలేదని తెలుస్తోంది. బాలికలు హోమ్ సిక్‌తో ఇంటికెళ్లాలని అలా ప్రవర్తించారని అధికారుల నుంచి వచ్చిన సమాచారం ద్వారా అర్థమవుతోంది" అని సీతారాం చెప్పారు.

అలాగే, మత్తు కలిగించే మందులు ఇస్తున్నారనే బాలికల ఆరోపణలపైనా కమిషన్ సభ్యులు మాట్లాడారు.

"మానసిక వ్యాధులకు చికిత్సలో భాగంగా కొంత మత్తు కలిగించే టాబ్లెట్స్ ఇస్తుంటారని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. పిల్లలతో మాట్లాడేందుకు మేం ప్రయత్నిస్తుంటే వారు సహకరించడం లేదు. వీరిని తల్లిదండ్రులకు లేదా వేరే హోమ్‌కు అప్పగించాలంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జేజేబీ ద్వారా నిర్ణయం తీసుకోవాలి. ఆ ప్రొసీజర్ ప్రస్తుతం నడుస్తోంది" అని సీతారాం బీబీసీతో చెప్పారు.

మానసిక వ్యాధులకు ఇచ్చే మందులన్నింటిలో కొంత మత్తు కలిగించే లక్షణాలున్నవే ఉంటాయని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ లీలా చెప్పారు.

నిరంతర పర్యవేక్షణ అవసరం: మానసిక నిపుణులు

జువైనల్ హోమ్‌లలో పిల్లలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే విషయంపై సైకాలజిస్టులతో బీబీసీ మాట్లాడింది.

ఆందోళనలు చేసే పరిస్థితులకు ఎలాంటి కారణాలు దోహదపడతాయో సైకాలజిస్ట్, ఏయూ సైకాలజీ విభాగం ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు బీబీసీకి వివరించారు.

"జువైనల్ హోమ్‌కు రాకముందు వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనేది ప్రధానం. వాళ్లను ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితులే వారి ప్రవర్తనపై ప్రభావం చూపుతుంటాయి.

జువైనల్ హోమ్‌కు వచ్చిన వారిలో దాదాపు సగానికి పైగా పిల్లలు మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి నిరంతర చికిత్స అవసరం.

జైళ్లలో, జువైనల్ హోమ్‌లలో సైకాలజిస్టులతో నిరంతర చికిత్స అందించాలి. లేదంటే మానసిక వ్యాధులు పెరిగిపోయి, ఆత్మహత్మలకు దారి తీసే ప్రమాదం ఉంది" అని ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)