ఏపీ, తెలంగాణల మధ్య వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టు ఏంటి?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి– బనకచర్ల ప్రాజెక్టు వివాదంగా మారింది.
గోదావరి జల వివాద ట్రైబ్యునల్ అవార్డుకు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి ఈ ప్రాజెక్టు వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా నిరోధించాలని కేంద్రాన్ని కోరుతోంది.
మరోవైపు సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీళ్లను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు వచ్చే నష్టం ఏమిటని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.
అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకంటే..
ఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
కృష్ణా నదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగా రావట్లేదు. మరోవైపు గోదావరి నుంచి సగటున ఏటా 2 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 200 టీఎంసీలను వరదల సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
కేవలం వరద వచ్చే రోజుల్లోనే నీళ్లు తరలించనుండటంతో గోదావరి డెల్టాకు ఇబ్బంది ఉండదని భావిస్తోంది.


ఫొటో సోర్స్, UGC
రూ.80,112 కోట్లతో ప్రతిపాదనలు
రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు కొత్తగా మూడు లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించడం, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో రూ.80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది.
దీనికి ప్రధానమంత్రి కృషి సింఛాయ్ యోజన (పీఎంకేఎస్‌వై)– అక్సిలిరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రాం (ఏఐబీపీ) కింద సహాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇంట్రా స్టేట్ లింక్ (రాష్ట్ర పరిధిలో అనుసంధానం) ప్రాజెక్టు కింద నిధులివ్వాలని కోరారు. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సీఎం చర్చించారు.

ఫొటో సోర్స్, UGC
మూడు దశల్లో
మూడు దశల్లో గోదావరి–బనకచర్ల అనుసంధానం చేపట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనల్లో పేర్కొంది.
గోదావరిలో వరద వచ్చినప్పుడు రోజుకు రెండు టీఎంసీల చొప్పున ఏటా 200 టీఎంసీలను పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలోకి, అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్‌లోకి, అక్కడి నుంచి నల్లమల అభయారణ్యంలో తవ్వే సొరంగం ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని తెలిపింది.
మొదటి దశ: పోలవరం నుంచి కృష్ణా నదికి జలాల మళ్లింపు
పోలవరం జలాశయం నుంచి గోదావరి వరద జలాలు మళ్లిస్తారు. ఇందుకోసం పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచుతారు. ప్రస్తుతం కుడికాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్కులు ఉండగా, దాన్ని 38,000 క్యూసెక్కులకు పెంచుతారు.
అలానే తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 1,400 నుంచి పది వేల క్యూసెక్కులకు పెంచుతారు. కొత్తగా 25 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం కుడి కాలువకు సమాంతరంగా వరద కాలువ తవ్వుతారు.
పోలవరం కుడి కాలువతో పాటు ఈ కొత్త వరద కాలువను ఉపయోగించుకుని వరద జలాలను వైకుంఠపురం వరకు మళ్లిస్తారు. వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై ఆక్విడెక్ట్‌పై నిర్మించి అక్కడ ఈ వరద జలాలను కలుపుతారు.
రెండో దశ: బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి, అక్కడికి నీళ్లు తరలించి అందులో నింపడం
కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ కుడి కాల్వలో 80వ కిలోమీటరు వద్ద నీటిని కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచి జలాలను తరలిస్తారు.
సాగర్ కుడికాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి నీటిని లిఫ్ట్ చేసి, పల్నాడు జిల్లా బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్‌లోకి తరలిస్తారు. 150 టీఎంసీల నిల్వ చేసేలా బొల్లాపల్లి జలాశయం నిర్మిస్తారు.
మూడో దశ: బొల్లాపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు నీళ్లు మళ్లించడం
బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నల్లమల అరణ్యం మీదు బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలిస్తారు. ఇందుకోసం నల్లమల అడవుల్లో 26.8 కిలోమీటర్ల మేర తవ్వే సొరంగం ద్వారా నీటిని మళ్లిస్తారు.
మొత్తంగా తొలి దశ పనులకు రూ.13,511 కోట్లు, రెండో దశ పనులకు రూ.28,560 కోట్లు, మూడో దశ పనులకు రూ.38.041 కోట్లు మొత్తంగా రూ.80,112 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
48 వేల ఎకరాల భూసేకరణ
ఈ ప్రాజెక్టు కోసం 48 వేల ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో 17 వేల ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. ఈ బనచకర్ల ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు 4 వేల మెగావాట్ల విద్యుత్తు అవసరమని ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొంది.
రెండుచోట్ల టన్నెళ్లు, 9 చోట్ల పంపు హౌస్‌ల నిర్మాణం అవసరమనీ, అలానే గ్రావిటీ కాలువ అవసరమైన చోట తవ్వాలని పేర్కొంది.
ఏపీ ప్రభుత్వం చేపట్టదలిచిన గోదావరి–బనకచర్ల అనుసంధాన (లింక్) ప్రాజెక్టుపై వివరాలు ఇవ్వాలని గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులను కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) లేఖ రాసింది.
కాగా, దీనిపై సీడబ్ల్యూసీ తెలంగాణకు కూడా లేఖ రాసి, ఆ రాష్ట్రం అభిప్రాయం తీసుకున్న తర్వాత దాన్ని కేంద్రానికి పంపించనుంది.

ఫొటో సోర్స్, facebook/Uttam Kumar Reddy
తెలంగాణ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
ఏపీ ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల ప్రతిపాదిత ప్రాజెక్టును తెలంగాణ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని ఆరోపిస్తోంది. గోదావరి–బనకచర్ల ఆనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్‌ను వినియోగించడాన్ని ప్రధానంగా తెలంగాణ తప్పు పడుతోంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి.. గోదావరి, కృష్ణా బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘానికి లేఖలు రాయాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా నిరోధించాలని, టెండర్లు పిలవకుండా చర్య తీసుకోవాలని కోరాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు, జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖలు రాశారు.
సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా చూడాలని ఆయన కోరారు.

ఫొటో సోర్స్, I&PR
చంద్రబాబు ఏమన్నారు?
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. దీనిపై ఆయన నాలుగురోజుల కిందట అమరావతిలో మీడియాతో మాట్లాడారు.
కేవలం గోదావరి వరద నీళ్లను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. నదీ ప్రవాహానికి సంబంధించినంత వరకూ ఏపీకి తెలంగాణ ఎగువ రాష్ట్రమని తెలిపారు.
గోదావరిపై తెలంగాణ రాష్టం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ కానుందని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీకి సైతం ఈ ప్రాజెక్టు నివేదిక పంపిస్తున్నామని సీఎం చెప్పారు. కేంద్రమే మొత్తం భరించలేదు కాబట్టి హైబ్రిడ్ మోడల్‌లో నిధుల సమీకరణ ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
గోదావరి –బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పూర్తైతే దేశంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. డీపీఆర్ పూర్తి చేసి రెండు, మూడు నెలల్లో టెండర్లు పిలుస్తామని ఆయన వెల్లడించారు.
నీటి పారుదల నిపుణులు ఏమంటున్నారు?
''తెలంగాణకు సంబంధించి గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన నాలుగు ప్రాజెక్టుల డీపీఆర్‌లు (సీతమ్మ సాగర్, సమ్మక్కసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతి, వార్ధా) పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా పూర్తిస్థాయి అనుమతులు రావాల్సి ఉంది. ఈలోగా అదే గోదావరి నది నీళ్లను ఏపీ ఎలా తరలిస్తుంది'' అని తెలంగాణకు చెందిన ఇరిగేషన్ రిటైర్డ్ ఎస్‌ఈ శ్రీధర్ దేశ్‌పాండే ప్రశ్నించారు.
''తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ఆ మేరకే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. మరి ఏపీ ఏకంగా ఒకేసారి 200 టీఎంసీల నీటిని ఎలా వినియోగించాలని ప్రతిపాదిస్తుందో అర్ధం కావడం లేదు. విభజన చట్టం ప్రకారం ఏదైనా రాష్ట్రం అదనంగా గోదావరి నీళ్ల వినియోగంతో పాటు కొత్త ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదిస్తే ముందుగా పక్క రాష్ట్రానికి తెలియజేయాలి. అలా కాకుండా ఏపీ ప్రభుత్వం నేరుగా కేంద్రానికి లేఖ రాసి నిధులు అడగడం అన్యాయం. ఇది విభజన చట్టానికి విరుద్ధం'' అని బీబీసీతో శ్రీధర్ అన్నారు .
కాగా, ఇదే విషయమై మాట్లాడేందుకు ఏపీ నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావును సంప్రదించగా ఆయన ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. రాగానే అప్‌డేట్ చేస్తాం.
'తెలంగాణకు నికర జలాలపైనే హక్కు'
''గోదావరి నికర జలాలపైనే తెలంగాణ రాష్ట్రానికి హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ఏపీ ప్రభుత్వం చెబుతోంది ఏమిటంటే.. కేవలం సముద్రంలోకి పోయే వరద నీటిని మాత్రమే ఎత్తి పోస్తామంటోంది. దానిపై మాట్లాడే హక్కు తెలంగాణకు లేదు'' అని నీటిపారుదల రంగ నిపుణులు టి. లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ''1980లో గోదావరి నదీ జలాలపై బచావత్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. ఆ తీర్పులో గోదావరి జలాలను కృష్ణాకు 80 టీఎంసీలను తరలిస్తామన్నారు. ఆ 80 టీఎంసీలలో 45 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రకు, 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రలకు కేటాయించారు. కానీ ఈ కేటాయింపులన్నీ నికర జలాలకు సంబంధించినవి మాత్రమే. అలాగే గోదావరి నికర జలాలలో 1,480 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించింది. ఇవన్నీ నికర జలాలకి సంబంధించినవి, వాటిపై ఆయా రాష్ట్రాలకు హక్కులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏపీ ప్రతిపాదించేది నికర జలాల గురించి కాదు సముద్రంలో కలిసే వరద నీటిని మాత్రమే. దానిమీద అడిగే హక్కు ఎవరికీ లేదు'' అని ఆయన అన్నారు.
గోదావరి–బనకచర్ల ఆచరణ సాధ్యమేనా?
అయితే గోదావరి– బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యంకాని ప్రాజెక్టు అని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. గోదావరి 180 అడుగుల ఎత్తులో ఉండగా, బనకచర్ల వద్ద 880 అడుగుల ఎత్తులో ఉన్న శ్రీశైలంలోకి నీటిని మళ్లించడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
''రూ.80 వేల కోట్లతో ఎంతో కష్ట సాధ్యమైన ఆ ప్రాజెక్టు చేపట్టే బదులు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల జాబితాలో కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలోని హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, ప్రకాశం జిల్లాలోని వెలుగొండ, వెనుకబడిన ఉత్తరాంధ్రలోని వంశధార రెండవ దశ, తోటపల్లి బ్యారేజీ, వంశధార నాగవల్లి అనుసంధాన పథకం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులకు అవసరమైన నిధులను కేటాయించి నిర్మాణం చేయుట ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాలు సాగుదలకు వస్తుంది. ఈ ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం కృషి చేయాలి'' అని లక్ష్మీనారాయణ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














