150 కేజీల పువ్వు.. దుర్వాసన భరించలేం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టెస్సా వాంగ్, గావిన్ బట్లర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఆస్ట్రేలియాలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. 'కార్ప్స్ ఫ్లవర్' అనే పిలిచే ఒక పువ్వు వికసించింది. ఈ ప్రత్యేక క్షణాలను ఆన్‌లైన్‌లో వేలాదిమంది వీక్షించారు.
ఈ పువ్వును టైటాన్ అరమ్ అని కూడా పిలుస్తారు. ఇది సిడ్నీలోని రాయల్ బొటానిక్ గార్డెన్స్‌లో ఉంది.
చాలా ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ పువ్వు వికసిస్తుంది. అది కూడా 24 గంటలు మాత్రమే ఉండటం దీని ప్రత్యేకత.
ఈ పువ్వును 'పుట్రిసియా' అని కూడా పిలుస్తుంటారు. మిగతా పుష్పాల్లా సువాసన కాకుండా ఇది దుర్వాసన వెదజల్లుతుంది.
తడిసిన సాక్స్, కుళ్లిన జంతు కళేబరాల నుంచి వచ్చే దుర్వాసనను పోలి ఉంటుంది.
ఈ పుష్పం వికసిస్తుండడాన్ని లైవ్‌స్ట్రీమింగ్‌లో చూసిన కొందరు దీనిపై జోకులు కూడా వేశారు.
"WWTF" అంటూ కొందరు కామెంట్ చేశారు. దీని అర్థం "వియ్ వాచ్ ది ఫ్లవర్".
ఈ పువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?
'పుష్పం' వికసించే దృశ్యాన్ని గురువారం ప్రత్యక్ష ప్రసారం చేశారు. మొదటగా 8,000 మంది హాజరయ్యారు. పుష్పం నెమ్మదిగా దాని ఆకారాన్ని మార్చుకుంటుండగా ఆ సంఖ్య కొన్నిగంటల్లోనే రెట్టింపు అయింది.
వీక్షకుల ఉత్సాహం చూస్తే 2020 సిడ్నీ ఒలింపిక్స్‌లా అనిపించిందని రాయల్ బొటానిక్ గార్డెన్స్‌లోని హార్టికల్చర్ డైరెక్టర్ జాన్ సీమన్ అన్నారు.
"పువ్వు వికసించడానికి ముందే 15,000 మంది చూశారు" అని సీమన్ చెప్పారు.
ఈ మొక్కకు సుమారు 10 సంవత్సరాల వయస్సు ఉంటుందని సీమన్ వివరించారు.
''మొక్క మూడు సంవత్సరాల వయస్సులో ఉండగా లాస్ ఏంజెలస్ బొటానిక్ గార్డెన్ నుంచి తీసుకువచ్చాం. గత ఏడేళ్లుగా మా బృందం దానిని సంరక్షిస్తోంది'' అని ఆయన అన్నారు.
"చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 15 సంవత్సరాలలో మొదటిసారి పుష్పించింది" అని సీమన్ పేర్కొన్నారు.
స్తబ్దుగా ఉన్న చాలారోజుల తర్వాత పుట్రిసియా ఎరుపు వెల్వెట్ రోప్ నుంచి వికసించడం మొదలవడంతో లైవ్ స్ట్రీమ్ ఉత్సాహంగా మారింది. పువ్వు వికసించినప్పుడు వీక్షకులకు స్పాట్ అనే మెరూన్ లేదా ముదురు ఎరుపు స్కర్ట్ లాంటి భాగం కనిపించింది. ఇది మధ్యలో పొడవుగా ఉన్న స్పాడిక్స్ చుట్టూ వీడుతూ కనిపించింది.


ఫొటో సోర్స్, Getty Images
ఈ పువ్వు 3 మీటర్లు పొడవు వరకు పెరుగుతుంది.
చాలా నెమ్మదిగా..
పుట్రిసియా పూర్తిగా ఎప్పుడు వికసిస్తుందో "కచ్చితంగా తెలుసుకోవడం కష్టం" అని నిర్వాహకులు చెప్పారు. అయినా కూడా వేలాదిమంది ఆన్‌లైన్‌లో దీనికోసం వేచి ఉన్నారు.
"పుట్రిసియా ఎలా ఉందో చూడటానికి మళ్లీ వచ్చాను" అని ఒక వీక్షకుడు అన్నారు.
"ఇది అత్యంత నెమ్మదైన ప్రదర్శన" అని మరొకరు అన్నారు.
ఇంకొకరు "రాత్రంతా చూశాను, నిద్రలోకి జారుకున్నాను, మేల్కొన్నాను. మళ్లీ చూశాను. అలసిపోయాను, కానీ పుట్రిసియా బలంగా ఉంది. WWTF." అని రాశారు.
వీక్షకుల నుంచి వచ్చిన ఇతర ఫన్నీ పద బంధాలలో WDNRP (వి డోంట్ రష్ పుట్రిసియా), BBTB (బ్లెస్డ్ బీ ది బ్లూమ్) ఉన్నాయి.
పువ్వు చరిత్ర ఏమిటి?
కార్ప్స్ ఫ్లవర్ ఇండోనేషియాలోని సుమత్రా వర్షారణ్యాలలో మాత్రమే పెరుగుతుంది. అక్కడ దీనిని "బుంగా బంగ్కై" అని పిలుస్తారు. ఇండోనేషియాలో ఈ పదానికి "కార్ప్స్ ఫ్లవర్" అని అర్థం. దీని శాస్త్రీయ నామం, అమోర్ఫోఫాలస్ టైటానమ్. ప్రాచీన గ్రీక్ నుంచి వచ్చినదే ఈ పదం. దానికి ‘వికృత రూపంలో ఉన్న భారీ పురుషాంగం’ అని దానికి అర్థం.
పువ్వు వికసించినప్పుడు పొడవైన స్పాడిక్స్ కుళ్లిన మాంసం వంటి వాసనను వెదజల్లుతుంది. ఇది మాంసాహారమని భావించి కీటకాలు దానిపైకి వస్తుంటాయి. కాబట్టి అవి మగ, ఆడ పువ్వుల మధ్య పుప్పొడిని వ్యాప్తి చేయడంలో సహాయపడతాయి. కార్ప్స్ ఫ్లవర్ 3 మీటర్లు పొడవు వరకు పెరుగుతుంది. 150 కేజీల వరకు బరువు ఉంటుంది స్పాడిక్స్ దిగువన వందల కొద్దీ చిన్న పువ్వులు ఉంటాయి.
సిడ్నీలోని రాయల్ బొటానిక్ గార్డెన్స్‌లో ఉన్న అనేక టైటాన్ ఆర్మ్‌లలో పుట్రిసియా ఒకటి, ఇక్కడ 15 సంవత్సరాల క్రితం పువ్వు చివరిగా వికసించింది.
ఇటీవల, మెల్‌బోర్న్, అడిలైడ్‌లోని బొటానిక్ గార్డెన్‌లు సహా ఆస్ట్రేలియా అంతటా ఇతర కార్ప్స్ ఫ్లవర్స్ వికసించాయి. వేలాదిమంది సందర్శకులు వచ్చారు. టైటాన్ అరమ్ మొట్టమొదట సుమత్రా వెలుపల 1889లో లండన్‌లోని క్యూ గార్డెన్స్‌లో వికసించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














