చిన్నారికి వైద్యం అందించకుండా ప్రార్థనలు.. తర్వాత ఏమైందంటే

ఫొటో సోర్స్, Jayde Struhs
- రచయిత, హన్నా రిచీ
- హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ
డయాబెటిస్‌తో బాధపడుతున్న ఎనిమిదేళ్ల బాలికకు వారం పాటు మందులు ఇవ్వకుండా ప్రార్థనలు చేసి.. వ్యాధి నయం చేస్తామంటూ ఆమె మరణానికి కారణమైన 14 మందిని దోషులుగా కోర్టు తేల్చింది.
2022లో ఎలిజబెత్ స్ట్రూ అనే బాలిక, డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌తో బాధపడుతూ తన ఇంట్లోనే చనిపోయారు.
డయాబెటిక్ కీటోయాసిడోసిస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అత్యధికంగా పెరుగుతాయి. ఇది ప్రాణాంతకం.
వైద్యాన్ని వ్యతిరేకించిన సెయింట్స్ అనే గ్రూపు సభ్యులు, దేవుడే ఆమె ప్రాణాలను కాపాడుతారని నమ్ముతూ ఎలిజబెత్‌కు చికిత్సను నిలిపివేశారని కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో బాలిక తండ్రి జేసన్ స్ట్రూ, రెలిజియస్ గ్రూపు లీడర్ బ్రెండర్ స్టీవెన్స్‌ను నిందితులుగా చేర్చి విచారించారు.
అయితే, నరహత్య కంటే తక్కువ స్థాయి అభియోగాలపై వీరిని దోషులుగా నిర్ధరించారు.
ఎలిజబెత్ తల్లి, సోదరుడు సహా మిగిలిన 12 మందిని నరహత్యకు సంబంధించిన అభియోగాల్లో దోషులుగా తేల్చారు. తామంతా నిర్దోషులమని వారు పేర్కొన్నారు.


ఫొటో సోర్స్, ABC News: Sharon Gordon
ఎలిజబెత్ తల్లిదండ్రులు, ఇతర నిందితులు అందరితో సహా ఆ చర్చిలోని ప్రతి సభ్యుడు ఆ బాలికను ప్రేమగా చూసుకున్నారనేది నిజమే అయినప్పటికీ, వారి చర్యలు ఆమె మరణానికి కారణమయ్యాయని బుధవారం తీర్పు సందర్భంగా జస్టిస్ మార్టిన్ బర్న్స్ అన్నారు.
‘ఎలిజబెత్‌ను అన్ని విధాలుగా ప్రేమగా చూసుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, దేవుడే కాపాడతారనే ఒక నమ్మకంతో ఆమె ప్రాణాలను కాపాడగలిగే వైద్యానికి ఆమెను దూరం చేశారు'' అని జడ్జి వ్యాఖ్యానించారు.
ఈ సెయింట్‌లు ఆస్ట్రేలియాలోని ఏ చర్చికి అధికారికంగా అనుబంధంగా లేరు.
ఈ గ్రూప్‌లో మూడు కుటుంబాలకు చెందిన రెండు డజన్ల మంది ఉంటారు.
క్వీన్స్‌లాండ్ సుప్రీంకోర్టులో నిరుడు జులైలో మొదలైన ఈ కేసు విచారణ నెలల పాటు సాగింది.
ప్రాసిక్యూటర్లు 60 మంది సాక్షులను విచారించారు. చివరి రోజుల్లో ఆ బాలిక అనుభవించిన వేదనను తెలుసుకున్నారు.
‘ఆమె చాలా తక్కువగా మాట్లాడేవారు. సహాయం లేకుండా టాయ్‌లెట్‌కు కూడా వెళ్లలేకపోయారు. వాంతులు, విపరీతమైన అలసట, స్పృహ కోల్పోవడం వంటి వాటితో ఇబ్బందిపడ్డారు’ అని ప్రాసిక్యూటర్ కరోలిన్ మార్కో చెప్పారు.
బాలిక ఆరోగ్యం క్షీణించి ఇంట్లో మంచానికే పరిమితమైన సమయంలోనూ ఈ గ్రూప్ సభ్యులు ఆమె కోసం ప్రార్థనలు, పాటలు పాడటం చేశారని పేర్కొన్నారు.
బ్రిస్బేన్‌కు 125 కిలోమీటర్లు దూరంలోని టూవూంబాలో ఎలిజబెత్ ఇల్లు ఉంటుంది.

ఫొటో సోర్స్, ABC News: Sharon Gordon
డాక్టర్‌ను సంప్రదించేందుకు వారు ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు. బాలిక చనిపోయిన 36 గంటల వరకు కూడా ఈ విషయం సంబంధిత అధికారులు ఎవరికీ తెలియదు. బాలిక మళ్లీ పునరుజ్జీవం పొందుతుందని ఆ గ్రూపు సభ్యులు విశ్వసించారని కోర్టులో తెలిపారు.
ఈ 14 మంది గ్రూపు సభ్యుల వయసు 22 నుంచి 67 ఏళ్ల మధ్య ఉంటుంది. కోర్టు విచారణ సందర్భంగా వారు తమ తరఫున న్యాయవాదులు ఎవరూ అవసరం లేదని చెప్పి తమ వాదనలు తామే వినిపించారు. వారి తరఫున నిర్దోషి పిటిషన్లను కోర్టు దాఖలు చేయాల్సి వచ్చింది.
ఎలిజబెత్‌కు ఇన్సులిన్‌ను నిలిపివేయాలని ఆమె తండ్రి తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిలిచినందుకు, సహాయపడినందుకు ఈ గ్రూపు సభ్యుల్లో చాలామందిని నిందితులుగా చేర్చినట్లు కోర్టులో తెలిపారు.
జేసన్ స్ట్రూ (53) గతంలో ఎలిజబెత్‌కు వైద్యం అందించడానికి మద్దతు ఇచ్చారని కోర్టులో ప్రాసిక్యూటర్లు చెప్పారు. ఆయన భార్య కెర్రీ (49) చర్చిలోకి మారిన చాలా కాలానికి జేసన్ వారితో కలిశారని వెల్లడించారు.
ఈ గ్రూపులోకి బాప్తిజం తీసుకున్న తర్వాతే జేసన్ మనసు మార్చుకున్నారని, తన నిర్ణయం వల్ల కూతురి ప్రాణం పోతుందని ఆయనకు తెలుసని కోర్టులో ప్రాసిక్యూటర్లు వాదించారు.
కోర్టు విచారణలో మాట్లాడటానికి తన వంతు వచ్చినప్పుడు జేసన్ కన్నీళ్లతో మాట్లాడుతూ, తాను ఎలిజబెత్ కలిసి ఇన్సులిన్ ఆపాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
తన కూతురు పునరుజ్జీవం పొందుతుందని తాను ఇప్పటికీ నమ్ముతున్నానని అన్నారు.
''ఎలిజబెత్ నిద్రపోతోంది. నేను మళ్లీ ఆమెను చూస్తాను'' అని కోర్టులో ఆయన చెప్పారు.
గ్రూపు తీసుకున్న చర్యలు విశ్వాసాలకు సంబంధించినవని గ్రూపు లీడర్ స్టీవెన్స్ (63) సమర్థించారు. కోర్టు విచారణను మతపరమైన హింసగా ఆయన అభివర్ణించారు.
విచారణ సందర్భంగా ఎలిజబెత్ సోదరి జేడ్ స్ట్రూ మాట్లాడుతూ, తాను స్వలింగ సంపర్కురాలినని తేలడంతో 16 ఏళ్ల వయస్సులోనే ఈ సెయింట్స్ నుంచి, ఇంట్లో నుంచి పారిపోయానని చెప్పారు. తిరిగొచ్చిన తర్వాత వారికి దూరంగా జీవిస్తున్నానని తెలిపారు.
ఈ గ్రూప్ సభ్యులు వైద్య సంరక్షణకు దూరంగా ఉండాలి అనే కఠినమైన అభిప్రాయాలతో ఉంటారని ఆమెతో పాటు ఇతర సాక్షులు తెలిపారు. క్రిస్మస్, ఈస్టర్‌లను అన్యమత పండుగలుగా భావిస్తారని చెప్పారు.
ఎలిజబెత్ 2019లో డయాబెటిక్ కోమాతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో ఆమె బరువు కేవలం 15 కేజీలేనని, బలహీనంగా ఉండటంతో కనీసం నడవలేకపోయారని కోర్టులో పేర్కొన్నారు.
ఆమెకు టైప్-1 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఆమెకు రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కుటుంబీకులకు చెప్పారు.
ఈ ఘటన విషయంలో తల్లిదండ్రులిద్దరిపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే జేసన్ తన భార్యకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చి కాస్త తక్కువ నేరంలో దోషిగా తేలారు.
ఏళ్లుగా సెయింట్ల గ్రూపులో సభ్యురాలిగా ఉన్న తన భార్య, మతపరమైన కారణాల వల్ల తమ పిల్లలకు వైద్య చికిత్స చేయించడాన్ని ఇష్టపడకపోయేవారని, వైద్యాన్ని నమ్మకపోయేవారని జేసన్ కోర్టులో చెప్పారు.
తన కూతురికి వైద్యం అందించనందుకు ఆయన బహిరంగంగా విచారం వ్యక్తం చేశారు.
ఎలిజబెత్‌ను చంపడానికి లేదా ఆమెకు తీవ్ర హాని తలపెట్టడానికి జేసన్, స్టీవెన్స్ ప్రయత్నించినట్లు ప్రాసిక్యూటర్లు రుజువు చేయలేకపోయినందున వారు హత్యకు పాల్పడినట్లు నిర్ధరించలేమని తీర్పు సందర్భంగా జస్టిస్ బర్న్స్ పేర్కొన్నారు.
కానీ, ఆమె మరణానికి గ్రూపులోని 14 మంది కారణమంటూ తీర్పునిచ్చారు.
కోర్టు వచ్చే నెలలో వీరికి శిక్షను ఖరారు చేయనుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














