కుంభమేళాలో తొక్కిసలాట ఎలా జరిగింది, ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు?

ప్రయాగ్‌రాజ్‌లోని సంగమ్ దగ్గర బుధవారం అర్ధరాత్రి దాదాపు ఒంటిగంటన్నర సమయంలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా అమృతస్నానాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగింది.
తొక్కిసలాటలో 30మంది చనిపోయారని, 60మంది గాయపడ్డారని మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు.
గాయపడ్డవారిని పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు తొక్కిసలాట, వీడియో ఫుటేజ్‌లలో కనిపిస్తోంది. తొక్కిసలాటలో గాయపడ్డవారు, ఆ ఘటనతో ఇబ్బంది పడ్డవారు కుంభమేళా ఏర్పాట్లుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తొక్కిసలాటపై వదంతులను పట్టించుకోవద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తొక్కిసలాట ఎలా జరిగింది?
దిల్లీకి చెందిన భక్తుడు ఉమేశ్ అగర్వాల్ తొక్కిసలాట ఎలా జరిగిందనే దానిపై బీబీసీతో మాట్లాడారు. ఘాట్ దగ్గరకు తాను వెళుతున్న సమయంలో చాలామంది పెద్దసంఖ్యలో హడావుడిగా వెళ్లడాన్ని గమనించానని చెప్పారు.
''కొంతమంది అమృతస్నానాల కోసం వెళుతుంటే ...మరికొందరు భక్తులు బారికేడ్ల దగ్గర నిద్రపోతున్నారు. ఆ సమయంలో స్నానాల కోసం వెళుతున్న భక్తులు బారికేడ్ల వద్ద నిద్రపోతున్నవారి కాళ్లు తగిలి కింద పడ్డారు. అలా కిందపడ్డవారు వెనుకవస్తున్నవారికి తగలడంతో ఒకరిమీద ఒకరు పడ్డారు'' అని ఆయన వివరించారు.
అమృతస్నానం చేసేందుకు తాను వెళుతుండగా, అకస్మాత్తుగా ఓ గుంపు వెనకకనుంచి తనను నెట్టిందని కర్ణాటకలోని బెల్గాం నుంచి వచ్చిన భక్తురాలు విద్యా సాహు చెప్పారు.
తాను కర్ణాటక నుంచి 60 మంది భక్తులతో కలిసి వచ్చానని ఆమె చెప్పారు. తనతో వచ్చినవారిలో ఐదుగురు ఇప్పటికీ కనిపించడం లేదని ఆమె తెలిపారు. అధికారులు తమను అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారని ఆమె చెప్పారు.
తాను, తన తల్లిదండ్రులు, పిల్లలు తొక్కిసలాటలో చిక్కుకుపోయయామని మరో ప్రత్యక్షసాక్షి జై ప్రకాశ్ స్వామి చెప్పారు. హఠాత్తుగా భక్తుల సమూహం పెరిగిపోయిందని, కొందరు తనపై నడుచుకుంటూ వెళ్లిపోయారని ఆయన చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
సంఘటనాస్థలంలో మృతదేహాలు
తొక్కిసలాట జరిగిన తర్వాత సంగం ఒడ్డున తమను నిలిపివేశారని, అప్పటినుంచి తన బావ కనిపించడం లేదని చిత్రకూట్‌కు చెందిన ఇంద్రపాల్ చెప్పారు.
తన బావ కోసం వెతికేందుకు సంఘటనాస్థలానికి వెళ్లానని, అక్కడ మృతదేహాలు పడిఉన్నాయని తెలిపారు. మార్చురీకి వెళ్లాల్సిందిగా అధికారులు తనకు సూచించారని ఆయన తెలిపారు.
''అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. కదిలే చోటేలేదు. మేం చేతుల్లో పిల్లలను పెట్టుకుని సహాయం కోసం అర్ధించాం. చాలా మంది పిల్లల పరిస్థితి సీరియస్‌గా ఉంది.'' అని తొక్కిసలాటను ప్రత్యక్షంగా చూసిన ఓ మహిళా భక్తురాలు పీటీఐతో తెలిపారు.
''మా అమ్మ తొక్కిసలాటలో గాయపడ్డారు. అక్కడ పోలీసులు లేరు. మాకు సాయం చేసేందుకు ఎవరూ రాలేదు. కనీసం 40 మంది గాయపడ్డారు. మా అమ్మ సురక్షితంగా బయటపడ్డారో లేదో కూడా తెలియదు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది'' అని మధ్యప్రదేశ్ ఛతర్‌పుర్‌కు చెందిన భక్తుడు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మౌని అమావాస్య ప్రత్యేకత ఏంటి?
మౌని అమావాస్య రోజు ఆచరించే అమృత స్నానానికి మతపరంగా చాలా ప్రత్యేకత ఉంది. లక్షలమంది ప్రజలు స్నానాలకు తరలివస్తారు. ఈ సారి అమృతస్నానాలు త్రివేణి యోగ సమయంలో ఆచరించే అవకాశం వచ్చింది. దీంతో భక్తులరద్దీ చాలా ఎక్కువగా ఉంది. హిందువుల నమ్మకం ప్రకారం త్రివేణి యోగ 144 సంవత్సరాల తర్వాత వచ్చింది.
కుంభమేళాలో అమృతస్నానాలను అత్యంత పవిత్రమైనవిగా భక్తులు భావిస్తారు. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తారు.
అన్ని అమృతస్నానాల్లోనూ మౌని అమావాస్యను అత్యంత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. పవిత్ర నది ఆ సమయంలో అమృతంగా మారుతుందని భక్తుల విశ్వాసం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














