ఒకరికి ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండొచ్చు? ఏడాది పాటు కార్డ్ వాడకపోతే ఏమవుతుంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నాగేంద్ర సాయి కుందవరం
- హోదా, బిజినెస్ అనలిస్ట్, బీబీసీ కోసం
మీరు క్రెడిట్ కార్డును సరైన రీతిలోనే వాడుతున్నారా? క్రెడిట్ కార్డును ఎలా వాడాలో తెలిసి ఉండటం చాలా ముఖ్యం.
అసలు ఒక వ్యక్తి దగ్గర గరిష్ఠంగా ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండొచ్చో మీకు తెలుసా? క్రెడిట్ కార్డుకు సంబంధించిన చాలా కీలక వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎక్కువ కార్డులుంటే ఇబ్బందులు పడతామా?
ఒక్కొక్కరికి ఇన్నే క్రెడిట్ కార్డులుండాలి అనే పరిమితి లేదు. మన క్రెడిట్ ప్రొఫైల్, చెల్లింపుల చరిత్ర బాగుండి, ఉద్యోగస్థులం అయితే బ్యాంకులు వెంటపడి మరీ కార్డులు ఇస్తాయి.
ప్రయాణాలు, ఫ్యూయల్, ఫుడ్ డెలివరీ, ఆన్‌లైన్ ఆర్డర్ల కోసమంటూ రకరకాల కార్డుల్ని ఆఫర్ చేస్తుంటాయి.

అయితే, ఆ క్రెడిట్ కార్డు వల్ల మీకు కచ్చితంగా ప్రయోజనం ఉంటుందని భావిస్తేనే కొత్తవాటిని తీసుకోండి. లేదంటే నిర్మొహమాటంగా తిరస్కరించండి.
ఎక్కువ కార్డులుంటే గొప్ప అని అనుకోవద్దు. సాధారణంగా ఎన్ని ఎక్కువ కార్డులు ఉంటే రిస్క్ అంత ఎక్కువ ఉంటుంది.
తక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్న కార్డులు నాలుగైదు ఉంచుకునే బదులు ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్న కార్డ్ ఒక్కటి చాలు.
ఎక్కువ కార్డులతో వచ్చే తలనొప్పులు ఏంటంటే.
- ఎక్కువ కార్డులుంటే పొగొట్టుకునే ప్రమాదం పెరుగుతుంది
- బిల్లింగ్ సైకిల్స్, పేమెంట్ మేనేజ్‌మెంట్ కష్టం అవుతుంది
- అధికంగా ఖర్చు చేసే ప్రమాదం ఎక్కువ.
- ఒక కార్డ్‌లో బిల్ పేమెంట్ కోసం మరో కార్డ్ వాడకం వంటివి పదే పదే చేస్తుంటే సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది.
- చెల్లింపులు చేయలేకపోతే సిబిల్‌పైన తీవ్ర ప్రభావం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎక్కువ కార్డులతో ఎలా లబ్ధి పొందాలంటే...
ఉదాహరణకు మీ దగ్గర లక్ష రూపాయల లిమిట్ ఉన్న ఒక క్రెడిట్ కార్డ్ ఉందనుకుందాం. అందులో మీరు రూ. 90 వేలు వాడేస్తే, మీ సిబిల్ స్కోర్‌పై వ్యతిరేక ప్రభావం పడుతుంది.
అదే మీ దగ్గర రెండు కార్డులున్నాయనుకోండి. అప్పుడు మీ రెండు కార్డుల నుంచి సగం సగం మొత్తాన్ని వాడుకుంటే, మీ యుటిలైజేషన్ తగ్గుతుంది. అది సిబిల్ స్కోర్‌కు పాజిటివ్ అవుతుంది.
సులభంగా చెప్పాలంటే, ఒకే కార్డులో మొత్తం క్రెడిట్ వాడుకోకుండా, మీ రిస్క్‌ను సమానంగా అన్ని కార్డులకు సర్దుబాటు చేసుకోవచ్చు.
క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో తక్కువ వాడేవారికి బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తాయని మీరు గుర్తుంచుకోవాలి.
ఒకవేళ కార్డులో ఎక్కువ మొత్తం వాడినా ఎలాంటి ఆలస్యం లేకుండా చెల్లింపులు చేస్తుంటే రిస్క్ తగ్గుతుంది. లేకపోతే మాత్రం డెట్ ట్రాప్‌లో మెల్లిమెల్లిగా కూరుకుపోతున్నట్టే లెక్క.
ఒక్క డిఫాల్ట్ చాలు, మన స్కోర్‌పైన, మన భవిష్యత్ క్రెడిట్ లిమిట్ ఎన్‌హాన్స్‌మెంట్‌పైన వ్యతిరేక ప్రభావం చూపించడానికి.

ఫొటో సోర్స్, Getty Images
క్రెడిట్ యుటిలైజేషన్ ఎలా లెక్కిస్తారు?
బ్యాంకులు ముఖ్యంగా చూసేది క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో.
అంటే, మీకు ఓ బ్యాంక్ రూ. లక్ష క్రెడిట్ లిమిట్ ఇచ్చిందని అనుకుందాం.
అందులో మీరు గరిష్ఠంగా ఎంతవరకు వాడారనేది బ్యాంకులు చూస్తాయి. రూ. 80-90వేలు వాడేసి కార్డు పరిమితి దాదాపు పూర్తి చేశారని అనుకుందాం. అప్పుడు బ్యాంకులు మిమ్మల్ని క్రెడిట్ క్రేవింగ్, మనీ క్రేవింగ్ పర్సన్‌గా చూస్తాయి.
క్రెడిట్ లిమిట్‌లో గరిష్ఠంగా 30 శాతం వరకు వాడుకుంటే ఇబ్బంది ఉండదు. అంతకుమించి వాడితే మన సిబిల్ స్కోర్‌పై ఎఫెక్ట్ ఉంటుంది.
ఇంకో ఉదాహరణ చూద్దాం..
మీకు ఓ బ్యాంక్ రూ.50 వేల క్రెడిట్ లిమిట్, మరో బ్యాంక్ రూ. లక్ష రూపాయలు, ఇంకో బ్యాంక్ రూ. 1.5లక్షల క్రెడిట్ లిమిట్‌తో కార్డులు ఇచ్చాయనుకోండి. ఇప్పుడు ఓవరాల్‌గా మీ క్రెడిట్ లిమిట్ రూ.3 లక్షలు. అందులో మీరు గరిష్ఠంగా 30 శాతం, అంటే రూ.90వేల వరకు (3 కార్డులు కలిపి) వాడుకోవచ్చు.
ఎక్కువ వాడి, టైమ్‌కు కట్టేసినంత మాత్రాన అమాంతం క్రెడిట్ లిమిట్ పెరిగే అవకాశాలుండవు. బ్యాంకులు మన లావాదేవీలను మాత్రమే కాకుండా, మనకు వస్తున్న ఆదాయం ఎంత? అందులో మనం అప్పుగా ఉపయోగిస్తున్నది ఎంత? అనే దానిపై ఎక్కువ దృష్టి పెడతాయి.
వీటితో పాటు మన చెల్లింపుల చరిత్ర కూడా చాలా ముఖ్యం. మనం చేసే పని, పనిచేస్తున్న సంస్థ, క్రెడిట్ హిస్టరీ, అప్పటికే ఉన్న లోన్లు వంటివన్నీ క్రెడిట్ లిమిట్‌ను నిర్ణయించే అంశాలే. ఈ డేటా అంతా సిబిల్ రిపోర్ట్‌లో బ్యాంకులు చూడగలుగుతాయని గుర్తుంచుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఉన్న కార్డులు వాడకపోతే?
ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏడాది పాటు కార్డు వాడకపోతే సదరు బ్యాంక్ ఆ కస్టమర్‌కు సమాచారాన్ని అందించి కార్డును రద్దు చేయొచ్చు. 30 రోజుల గ్రేస్ పీరియడ్ తర్వాత రద్దయిన కార్డును రీయాక్టివేట్ చేసుకునే సౌలభ్యాన్ని హెచ్‌డీఎఫ్‌సీ వంటి కొన్ని బ్యాంకులు అందిస్తున్నాయి.
ఇవి అన్‌సెక్యూర్డ్ లోన్స్ కాబట్టి, ఎన్ని ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే బ్యాంకులకు అంత రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. అందుకే ఎప్పుడైనా మేజర్ లోన్లు అవసరమైనప్పుడు ఇవి సమస్యగా మారవచ్చు.
సాధారణంగా మనం సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలంటే సాఫ్ట్ ఎంక్వైరీ చేస్తాం. దానికి ఎలాంటి స్కోర్ డిడక్ట్ కాదు. కానీ, బ్యాంకులు మన రుణ చరిత్రను చెక్ చేస్తే అది హార్డ్ ఎంక్వైరీ. ఇది స్కోర్‌పై ప్రభావం చూపిస్తుంది. అందుకే కార్డులు ఇస్తామంటూ బ్యాంకుల నుంచి ఫోన్ రాగానే అనవసరంగా దాన్ని తీసుకుని, మీ క్రెడిట్ హెల్త్ పాడు చేసుకోవద్దు.
ఎక్కువ కార్డులుండి, వాటిని ఉపయోగించకపోయినా సిబిల్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. కార్డ్ ఉంది కదా అని వాడాల్సిన పనిలేదు. అవసరమైతేనే వాడండి. లేదా రెండు, మూడు నెలలకోసారి ఎంతో కొంత వాడి సకాలంలో చెల్లించండి.

ఫొటో సోర్స్, Getty Images
క్రెడిట్ కార్డు రద్దు చేసుకోవాలంటే?
క్రెడిట్ కార్డ్ తీసేయాలనుకుంటే ముందుగా కొత్త కార్డులను తీసేయడం మంచిది. ఎందుకంటే పాత కార్డులకు క్రెడిట్ హిస్టరీ ఎక్కువగా ఉంటుంది. కొత్త లోన్లు తీసుకునే సమయంలో ఇది ఉపయోగపడుతుంది.
ఉదాహరణకు మీకు ఓ బ్యాంక్ 2008లో కార్డ్ ఇచ్చిందనుకుందాం. మరో బ్యాంక్ 2015లో కార్డ్ ఇచ్చిందనుకుందాం. కార్డ్ తీసేయాలనే నిర్ణయానికొస్తే 2015లో తీసుకున్న కార్డ్ తీసేయండి.
మొదటగా ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ అంతా క్లియర్ చేయండి. ఎంత చిన్న మొత్తం పెండింగ్‌లో ఉన్నా స్కోర్‌పై ఎఫెక్ట్ ఉంటుంది.
కార్డ్ క్లోజింగ్‌కు ఫీజు లేదా పెనాల్టీ ఉందేమో బ్యాంక్‌తో చెక్ చేసుకోండి.
మీరు కార్డును క్లోజ్ చేస్తున్నట్టు బ్యాంకుకు ఈమెయిల్ ద్వారా సమాచారం పంపించండి. వాళ్ల నుంచి కన్ఫర్మేషన్ రావడం ముఖ్యం. ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ లేదని బ్యాంక్ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవడం ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
మీ దగ్గరున్న ఫిజికల్ కార్డును కత్తిరించేయండి. మ్యాగ్నటిక్ స్ట్రిప్, చిప్ పూర్తిగా పాడయ్యేలా చూసుకోండి.
ఏదైనా మేజర్ మార్ట్‌గేజ్ లోన్ తీసుకునే ముందు క్రెడిట్ కార్డులు రద్దు చేయకండి. ఒక్కోసారి ఇవి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించవచ్చు.
కానీ, ఎప్పటికైనా అప్పు ముప్పే. ఒకసారి ఈ అప్పుల ఊబిలోకి దిగితే బయటపడటం చాలా కష్టం.
ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ అని, తక్కువ ప్రాసెసింగ్ ఫీజ్ అని, క్రెడిట్ కార్డ్‌పై ఫెస్టివల్ ఆఫర్స్ అని ఈఎంఐల వలయంలో కూరుకుపోతే పరిస్థితి మారిపోతుంది.
మినిమిం పేమెంట్ చేయడంతో మొదలై 36-48 శాతం వరకు వడ్డీ చెల్లించే స్థాయికి దిగజారుతుంది. చూస్తుండగానే అప్పు కొండలా పేరుకుపోతుంది. అసలు కంటే వడ్డీ ఎక్కువ కట్టే పరిస్థితి రావొచ్చు.
అందుకే కార్డ్ వాడకం కత్తిమీద సాములాంటిది. ఎప్పుడు, ఎంతవరకు, ఎలా వాడాలో తెలిసినప్పుడే వీటిని వాడటం మంచిది.
(గమనిక: ఇది అవగాహన కోసం మాత్రమే. నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించండి)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














