‘చలో దిల్లీ’ పేరుతో వెళ్తున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం, శంభు సరిహద్దులో ఏం జరిగింది?

రైతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

పంటకు మద్దతు ధరతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతులు ‘చలో దిల్లీ’ పేరిట నిరసనలు చేపట్టారు.

ఆదివారం శంభు సరిహద్దులో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులపై పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.

పలువురు రైతులకు గాయాలయ్యాయి. ఒకరు తీవ్రంగా గాయపడ్డారని పంజాబ్ రైతు సంఘం నేత సర్వన్ సింగ్ పంధేర్‌ తెలిపారు.

రైతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాము శాంతియుతంగా దిల్లీకి వెళ్తామని చెప్పినా పోలీసులు అనుమతించడంలేదని రైతులు అంటున్నారు

దిల్లీలో నిరసన తెలిపేందుకు అనుమతి తీసుకోవాలని, ఇప్పటికే అనుమతి తీసుకుంటే పత్రాలు చూపించాలని రైతులను హరియాణా పోలీసులు అడిగారు.

అయితే, తమ దగ్గర ఎలాంటి ఆయుధాలూ లేవని, శాంతియుతంగా దిల్లీకి వెళ్తామని రైతులు చెప్పారు. తమను ముందుకు వెళ్లనివ్వాలని కోరారు. పోలీసులు అందుకు అంగీకరించలేదు.

రైతులను అడ్డుకునేందుకు పంజాబ్, హరియాణా సరిహద్దులో రోడ్డుకు అడ్డంగా పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

రైతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బారికేడ్లను, ముళ్ల కంచెలను తొలగించేందుకు యత్నించిన రైతులను పోలీసులు చెదరగొట్టారు

నిరసన తెలిపేందుకు ముందస్తు అనుమతి తీసుకోకుండా, గుర్తింపు కార్డులు చూపించకుండా ముందుకెళ్లేందుకు ఈ రైతులను అనుమతించలేమని హరియాణాకు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

దాంతో వెనక్కి తగ్గిన రైతులు, కాసేపయ్యాక మళ్లీ నిరసన తెలుపుతూ వచ్చారు. రోడ్డుపై అడ్డంగా పోలీసులు పెట్టిన సిమెంటు దిమ్మెలను, ముళ్ల కంచెలను తొలగించేందుకు యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. దాంతో, రైతులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

రైతులు

ఫొటో సోర్స్, Getty Images

అంతకుముందు, డిసెంబర్ 6 (శుక్రవారం) కూడా శంభు సరిహద్దు గుండా దిల్లీ వైపు వెళ్లేందుకు యత్నించిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

తదుపరి కార్యాచరణ ఏంటన్నది చర్చించి నిర్ణయిస్తామని రైతు సంఘాల నేతలు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)