సింగిల్ పేరెంట్‌గా జీవించడం సులభమేనా? వారి జీవితం ఎలా ఉంటుంది?

- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ కోసం
మాది చాలా పెద్ద కుటుంబం అని చెప్పుకునే స్థాయి నుంచి నేనొక సింగిల్ పేరెంట్ అని చెప్పుకునే స్థాయికి కుటుంబాలు వచ్చాయి.
ఒకప్పుడు కుటుంబం అంటే తాత, బామ్మ, అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు - ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నెమ్మదిగా కనుమరుగైపోతోంది.
కుటుంబాల సైజు మారుతోంది. సింగిల్ పేరెంట్ కుటుంబాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో.
నేనొక సింగిల్ పేరెంట్ అని చెప్పుకోవడానికి మహిళలు కూడా సంకోచించడం లేదు. బాలీవుడ్ నటీమణులు సుస్మిత సేన్, నీనా గుప్తా లాంటి వాళ్లు సింగిల్ పేరెంట్లుగా తమ ఉనికిని చాటుకున్నారు.
కొంతమంది అవివాహితులుగా, కొందరు పరిస్థితుల కారణంగా, ఇంకొందరు ఇష్టం కొద్దీ సింగిల్ పేరెంట్‌గా ఉండటానికి ఇష్టపడుతున్నారు.
సింగిల్ పేరెంట్‌గా జీవించడం, పిల్లల్ని పెంచడం, కుటుంబ బాధ్యతలు చూసుకోవడం.. ఈ ప్రయాణం సులభమేనా? ఎదురయ్యే ఒడిదుడుకులు ఏంటి?
ఈ విషయాలను తెలుసుకోవడానికి బీబీసీ కొంత మంది సింగిల్ పేరెంట్స్ తో మాట్లాడింది.


ఫొటో సోర్స్, Sarah

"ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టగానే ఎదురయ్యే మొదటి ప్రశ్న… మీ భర్త ఎవరు? ఏం చేస్తారు? అని. ఒక స్త్రీ ఉనికి భర్త చుట్టూనే అల్లుకుని ఉంది" అని హైదరాబాద్‌కు చెందిన రాజేశ్వరి అయ్యర్ అన్నారు.
రాజేశ్వరి అయ్యర్ (60) హైదరాబాద్‌లో ఒక పబ్లిక్ రిలేషన్స్ సంస్థ నిర్వహిస్తున్నారు.
ఈమె 20 ఏళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అప్పటికే వారికి పదేళ్ల కూతురు, 16 ఏళ్ల కొడుకు ఉన్నారు.
"భర్త మరొక మహిళతో సంబంధం పెట్టుకోవడంతో ఇంట్లోంచి బయటకు వచ్చి నా కెరీర్, జీవితాన్ని ప్రారంభించాను. ఆ సమయంలో నా అక్కాచెల్లెళ్లు సాయం చేశారు. నాకంటూ ఓ జీవితం, ఇల్లు లేని స్థితి నుంచి ఈ రోజు ఒక పబ్లిక్ రిలేషన్స్ సంస్థను నిర్వహించే స్థాయికి ఎదిగాను. పిల్లల్ని చదివించుకున్నాను. వాళ్లు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు" అని వివరించారు రాజేశ్వరి.
"నాకు, నా పిల్లలకు ఒక కుటుంబాన్ని కోరుకోవడం తప్పా? కానీ, తండ్రిగా పిల్లల పట్ల తన బాధ్యతను నిర్వర్తించాలని ఆయన అనుకోలేదు. ఒంటరిగా ఉండటం, పిల్లల్ని పెంచడం కష్టమే. ఈ ప్రయాణంలో చాలా ఒంటరితనం అనుభవించాను, కొంత మంది ఫంక్షన్స్ కి పిలిచేవారు కాదు. కొన్ని సార్లు తాంబూలాలు ఇచ్చేవారు కాదు. గుండెలో ముళ్లు గుచ్చుకున్నట్లు ఉండేది.


ఒక రోజు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకుని హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చాను. పిల్లలు నా చేతిని పట్టుకుని… 'మనం అందరం దూకేద్దాం. కానీ, ఒక క్షణం ఆలోచించు. ఇందుకేనా తాతగారు నిన్ను చదివించారు' అని అడిగారు. ఒక్క క్షణం ఆలోచించేలా చేశారు.
ఒక ఫ్రెండ్ సహాయంతో విడాకులకు అప్లై చేసి, తీసుకున్నాను. ఉండటానికి ఇల్లు కూడా లేదు. పిల్లల్ని మా అక్క దగ్గరకు పంపాను. స్నేహితురాలి ఇంట్లో కొన్ని రోజులున్నాను. పిల్లల దగ్గరకు వెళ్లడానికి ట్రైన్ టికెట్ కోసం కూడా డబ్బులు లేని పరిస్థితి.
పిల్లలూ నాతో పాటు కష్టాలు అనుభవించారు. ఎన్నో పనులు చేసి నాకు సాయంగా ఉండేవారు. కష్టపడి పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశాను. ప్రస్తుతానికి హాయిగా ఉన్నాం. ఇవాళ నేనొక సింగిల్ పేరెంట్ అని చెప్పుకోవడానికి గర్వపడతాను" అని రాజేశ్వరి ముగించారు.
మళ్లీ ఎవరినీ భాగస్వామిగా ఎంపిక చేసుకోవాలని అనుకోలేదా? అని అడిగినప్పుడు, జీవితం గడపడానికి పెట్టే పరుగులో అలాంటి ఆలోచన రాలేదని అన్నారు.
"పిల్లలు, కోడలు, అల్లుడు, మనవడితో నా కుటుంబం ఇప్పుడు పెద్దదే కదా. నాకెందుకు ఒంటరితనం" అంటూ ఓ నవ్వు నవ్వారు.

"భారత్‌లో అర్బన్ ప్రాంతాల్లో సింగిల్ పేరెంట్‌ని చూసే విధానంలో ఇటీవల మార్పు వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా పరిస్థితులు మారలేదనే చెప్పవచ్చు" అని హైదరాబాద్‌కి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ మృదుల అన్నారు.
"ఒక స్త్రీ, గృహ హింసకు లోనవుతూ ఉంటే భరిస్తూ ఉండమనే పెద్దలు సలహా ఇస్తారు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దని చెబుతారు. కానీ, నగరాల్లో పెళ్లిని చూసే ధోరణి కొంత మారింది. భరిస్తూ ఉండమని అయితే చెప్పడం లేదు. కానీ, ఈ ఆలోచనా తీరులో పూర్తి మార్పు వచ్చిందని చెప్పలేం" అని అన్నారు.
"మహిళలు సింగిల్ పేరెంట్‌గా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. అందరూ చదువుకుంటున్నారు. ఉద్యోగం చేస్తున్నారు. దీంతో, ఆర్థిక స్వాతంత్రం వస్తోంది. తమకి నచ్చినట్లు జీవించడానికి మరొకరి తోడు అవసరం అనే ఆలోచనలో మార్పు వస్తోంది.
సామాజికంగా, మానసికంగా తోడు కోసం మరొక వ్యక్తిపై ఆధారపడాలని ఇప్పుడు చాలామంది అనుకోవడం లేదు. తోడు కావాలనుకుంటే రెండో పెళ్లి చేసుకుంటున్నారు. రెండో పెళ్లి చేసుకోవడాన్ని తప్పుగా చూడటం నగరాల్లో చాలా వరకు తగ్గింది.
పని చేసే సంస్థల్లో కూడా మహిళలకు యాజమాన్యం సహకారం లభిస్తోంది. ముఖ్యంగా మహిళలు బయటకు వచ్చి తమకేది కావాలో చెప్పగలుగుతున్నారు" అని మృదుల అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలోని వెలుగొండ గ్రామానికి చెందిన గాజుల సుజాతది మరో కథ.
భర్త అకాల మరణంతో 20 ఏళ్లకే వైధవ్యం పాలయ్యారు. పెళ్లైన నాలుగేళ్లకే భర్తను కోల్పోయారు. ఆ సమయానికి మూడో బిడ్డ కడుపులో ఉన్నాడు.
ప్రస్తుతం ఆమెకు 40 ఏళ్లు. చదువు లేదు. బీడీలు చుట్టుకుంటూ, పుట్టింటి వాళ్లిచ్చిన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించి, పిల్లల్ని పెంచారు. అమ్మాయిని డిగ్రీ చదివించి, పెళ్లి చేశారు. అబ్బాయి ఉద్యోగం సంపాదించుకున్నాడు. మరో అబ్బాయి చదువుకుంటున్నాడు.
"ఒంటరిగా ప్రయాణం కష్టమే. నాకు పుట్టింటి సహాయం ఉంది. వాళ్ల సాయంతోనే ఇప్పటి వరకు ఇంటిని నడుపుతున్నాను.
అత్తింటితో సంబంధాలు ఉన్నాయి కానీ చాలా సూటి పోటి మాటలు వినాల్సి వచ్చింది. నువ్వే నా కొడుకును చంపావు అంటూ ఉంటారు.
నా చిన్న కొడుకు కడుపులో ఉండగా నా భర్త చనిపోవడంతో, వాడినొక దురదృష్ట జాతకుడిగా చూస్తారు. ఇప్పటి వరకు నా చిన్న కొడుకుతో మాట్లాడలేదు. మూఢ నమ్మకాలు ఉన్న సమాజంలో ఇవన్నీ భరిస్తూ బతకడం కాస్త కష్టమే. ఒక్కోసారి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు బతకాలి అనిపిస్తుంది. కానీ పిల్లల కోసం బతకాలి కదా" అని అన్నారు.
"ఆర్థిక ఇబ్బందులు, మానసిక కష్టాలు ఉన్నాయి. కానీ ఇలా గడిపేయడానికి సిద్ధపడిపోయాను. నా పిల్లలకు పెళ్లైతే, నా కుటుంబం కూడా పెరుగుతుంది కదా.
గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరి మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోంది. పరిస్థితులు పూర్తిగా మారాయని చెప్పలేం" అని అన్నారు సుజాత.


కుటుంబాలు చిన్నవిగా మారిపోవడం గురించి పదేళ్ల క్రితం భార్యను కోల్పోయిన నాగేశ్వర్ (పేరు మార్చాం) తో మాట్లాడాం. ఈయనో ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగి. క్యాన్సర్ బారిన పడి భార్య చనిపోయారు.
భార్య చనిపోయేనాటికి కూతురుకి పదేళ్లు. ఓ వైపు ఉద్యోగం, మరో వైపు కూతురు… పని మనుషులు, వంట వాళ్ల సాయంతో కుటుంబాన్ని నడుపుతూ, కూతురుని చదివిస్తూ ఇప్పటివరకు ఒంటరిగానే ఉన్నారు.
"జీవితంలో ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల కోసమే బతకాలని అనుకున్నాను. నా భార్యను అమితంగా ప్రేమించిన తర్వాత మరో అమ్మాయి వైపు ఎలా చూస్తాను? నా జీవితంలో మరొకరికి ఎలా చోటివ్వగలను? అందుకే అలాంటి ఆలోచనే చేయలేదు" అని నాగేశ్వర్ అన్నారు.
ఈ ప్రయాణం ఎలా అనిపించింది అని ఆయన్ను అడిగినప్పుడు, "మా అమ్మాయితో నాకు అనుబంధం చాలా ఎక్కువ. ఉద్యోగం, తన చదువు, ఇతర హాబీలతో నాకు మరో విషయం గురించి ఆలోచించే టైం కూడా లేదు.
నా తల్లితండ్రులు కూడా చనిపోయారు. బాగా ఒంటరిగా అనిపిస్తుంటుంది. కానీ నేను, నా కూతురు.. ఇప్పుడిదే నా కుటుంబం.
పండగల్లో, ఫంక్షన్స్ కు వెళ్లినప్పుడు ఏదో వెలితిగా ఉంటుంది. ఇంట్లో మామూలు రోజుల్లో మేమిద్దరమే, పండగ రోజుల్లో కూడా మేమే! జీవితపు పరుగులో బంధువులు, స్నేహితులను కూడా పెద్దగా ఏర్పరుచుకోలేదు. బంధువులున్నా ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీగా ఉంటారు.
ప్రస్తుతానికి నేనొక ప్రౌడ్ సింగిల్ పేరెంట్" అంటూ ముగించారు నాగేశ్వర్.


"సింగిల్ పేరెంట్స్ కూడా ఆత్మ స్థైర్యంతోనే ఉంటున్నారు. అయితే, తమ పిల్లల పెళ్లిళ్ల సమయంలో ఈ సింగిల్ పేరెంట్స్ కొంత మంది నుంచి రకరకాల ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎందుకు వదిలేశారు? ఒంటరిగా ఎందుకు ఉన్నారు? ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కొని తమ నిజాయతీని అవతలి వాళ్ల దగ్గర నిరూపించుకోవాల్సి వస్తోంది" అని మృదుల వివరించారు.
"కానీ, అంత అనుమానం ఉన్నప్పుడు ఆ కుటుంబంతో సంబంధం కలుపుకోవడం ఎందుకు? కానీ వారు ఇవేమీ ఆలోచించకుండా సింగిల్ పేరెంట్స్ ను ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటి తరంలో కొందరు తమ భాగస్వాములను తామే ఎంపిక చేసుకుంటున్నారు. కానీ, తల్లిదండ్రులే సంబంధాలు చూసి పెళ్లి చేయాలంటే మాత్రం సింగిల్ పేరెంట్స్ విషయంలో కొన్నిసార్లు అది కష్టంగా మారుతోంది. ముఖ్యంగా మధ్యతరగతిలో" అని మృదుల అన్నారు.
ఉమ్మడి కుటుంబం లేదని బాధపడటం కన్నా ఉన్న పరిస్థితుల్లో జీవితాన్ని ఆనందంగా ఎలా మలచుకోవాలో ఆలోచించడమే మంచిదని మృదుల సూచిస్తున్నారు.
"సింగిల్ పేరెంట్ కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. కానీ, మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ జీవితం గడపడం కంటే వేరే మార్గం లేదు. చుట్టూ ఉన్న స్నేహితులనే కుటుంబంగా మలుచుకుంటూ ఒక కొత్త ధోరణికి నాంది పలకడమే వారు చేయగలిగిన పని" అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














