తొమ్మిదేళ్ల బాలిక పొట్టలో కేజీ జుట్టు

ఫొటో సోర్స్, Vivek
- రచయిత, సిటు తివారి
- హోదా, బీబీసీ ప్రతినిధి
బిహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లాలో డాక్టర్లు తొమ్మిదేళ్ల బాలిక పొట్టలో నుంచి పెద్ద మొత్తంలో జుట్టును తొలగించారు.
రెండు గంటల ఆపరేషన్ తర్వాత బయటకు తీసిన ఈ జుట్టు బరువు కేజీ ఉన్నట్లు తేలింది.
ముజఫర్‌పుర్‌లోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్‌లో వైద్యులు ఆపరేషన్ చేశారు.
9ఏళ్ల బాలిక పొట్టలోకి అంత జుట్టు ఎలా వచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Vivek
ఇదెలా జరిగింది?
జనవరి 18న కడుపు నొప్పితో బాధ పడుతున్న 9 ఏళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొచ్చారు.
తర్వాత ఆ బాలికకు మూడేళ్ల నుంచి జుట్టు పీక్కుని తినే అలవాటు ఉన్నట్లు తెలిసింది.
‘ఆమె తన జుట్టు పీక్కుని తినేది. మేం ఆమెను ఆపినా కూడా ఆగేది కాదు. ఒక దశలో మేం విసిగిపోయాం. ఆమెకు గుండు చేయించాం. ఆ తర్వాత 15 రోజులకు ఆమెకు కడుపునొప్పి మొదలైంది" అని బాలిక తండ్రి బీబీసీతో చెప్పారు.
కడుపు నొప్పి మొదలైన తర్వాత ఆ బాలిక తినడం, తాగడం మానేసింది.
"మేం బాగా ఒత్తిడి చేస్తే కొద్దిగా తినేది. తర్వాత వాంతి చేసుకునేది. దీంతో ఆమెను మేం స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లాం. ఆయన బాలికను పరీక్షించి ఆమె పొట్టలో ఏదో చాలా పెద్ద పదార్థం ఉందని చెప్పారు" అని బాలిక తండ్రి చెప్పారు.
డాక్టర్ సలహాతో ఆ కుటుంబం బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది.


ఫొటో సోర్స్, Getty Images
ఈ జబ్బు ఏంటంటే..
బాలికను ముజఫర్‌పుర్ మెడికల్ కాలేజ్‌లో చేర్పించిన తర్వాత ఆమెకు రక్తంలో హిమోగ్లోబిన్ కేవలం 5.2 శాతం మాత్రమే ఉన్నట్లు పిల్లల వైద్యుడు అశుతోష్ కుమార్ చెప్పారు. జనవరి 21న ఆయనతో పాటు మరో ఇద్దరు డాక్టర్లు బాలికకు సర్జరీ చేశారు.
"బాలిక నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమె హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంది. బయట నుంచి పొట్ట మీద నొక్కి చూసినప్పుడు ఆమె పొట్ట లోపల రాయిలా గట్టిగా ఉంది. తర్వాత మేము ఆమెకు రక్తం ఎక్కించాం. పాప సాధారణ పరిస్థితికి చేరుకున్న తర్వాత ఆపరేషన్ చేశాం. పొట్ట నుంచి కేజీ బరువున్న జుట్టు బయటకు తీశాం" అని డాక్టర్ అశుతోష్ కుమార్ చెప్పారు.
బాలిక పొట్ట మొత్తం జుట్టుతో నిండిపోయింది. దీని వల్లే ఆమె 15 రోజులుగా ఘన పదార్ధాలు ఏమీ తినలేకపోయింది.
మనుషులు తమ జుట్టు పీక్కుని తినడం ఏదైనా కొత్త జబ్బా? తొమ్మిదేళ్ల చిన్నారి ఎందుకిలా చేసిందన్న ప్రశ్నలకు అశుతోష్ కుమార్ సమాధానం చెప్పారు.
‘ఆ పాపకు ట్రికోటిలోమేనియా అనే మానసిక జబ్బు ఉంది. దీని వల్ల ఆమెకు ట్రికోబీజర్ అనే వ్యాధి సోకింది. ఈ జబ్బు సోకిన వారు మింగిన జుట్టంతా పొట్టలో పోగు పడుతుంది. దీన్ని శస్త్ర చికిత్స ద్వారా తొలగించాలి" అని డాక్టర్ అశుతోష్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రికోటిలోమేనియా, ట్రికోబీజర్, పికా అంటే ఏంటి?
ట్రికోటిలోమేనియా గురించి బీబీసీ క్లినికల్ సైకాలజిస్ట్ నిధి సింగ్‌తో మాట్లాడింది.
నిధిసింగ్ పట్నా యూనివర్సిటీలో క్లినికల్ సైకాలజిస్టుగా పని చేస్తూ సైకాలజీ బోధిస్తున్నారు.
"ట్రికోటిలోమేనియా మానసిక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు తమ తల మీద జుట్టుతో పాటు కనబొమ్మలు, శరీరం మీద వెంట్రుకలు పీకేసి విసిరేస్తుంటారు. అలా కాకుండా పీకేసిన జుట్టును విసిరేయకుండా తినే మానసిక స్థితిని "పికా" అని అంటారు. ఇలాంటి మానసిక పరిస్థితి ఎవరికైనా ఉంటే వారు జుట్టు మాత్రమే కాదు, తినడానికి పనికి రాని వస్తువులు ఏవైనా, చివరకు చెత్త కూడా తింటారు. ఈ రెండు రకాల మానసిక రోగాలు ఒకే వ్యక్తికి ఉండటం చాలా అరుదు. రెండు జబ్బులు ఉన్నవారు తమ జుట్టు పీక్కుని తింటారు" అని నిధి సింగ్ చెప్పారు.
"పికా" సోకడానికి మూడు కారణాలు ఉంటాయని నిధి సింగ్ చెప్పారు. మొదటిది శరీరంలో పోషకాల లోపం, ప్రత్యేకించి ఐరన్, విటమిన్ బి లోపం ఉన్నవారు ఇలా చేస్తారు. ఆ తర్వాత సరిగ్గా తిండి తినకుండా జుట్టు తినడాన్ని అలవాటు చేసుకున్నవారు, మూడోది ఏదైనా మానసిక వ్యాధి ముదిరి ఆందోళన, కుంగుబాటు పెరిగి ఇలా చేస్తారు.
ఇందులో దేని వల్లనైనా అలాంటి మానసిక రోగం వస్తే దాన్ని వైద్య పరిభాషలో ట్రికోబీజర్ అంటారు.
"జుట్టు అరగదు. అది పొట్టలో గోడలకు అంటుకుపోయి ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి నిరంతరంగా వెంట్రుకల్ని తింటుంటే అవి పొట్టలోపలకు పోయిన తర్వాత ఒక కుప్పగా మారతాయి. దీని వల్ల ఆ వ్యక్తి ఘన పదార్ధాలు తిన్నా వెంటనే వాంతి చేసుకుంటారు. అలా ట్రికోబీజర్ అనేది పెరుగుతుంది" అని అశుతోష్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయి?
ఈ ప్రశ్నకు సమాధానంగా సైకాలజిస్టు నిధిసింగ్ ఇలా చెప్పారు.
"పికా కంటే ఎక్కువగా ట్రికోటిలోమేనియా కేసులు వస్తుంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పికా సాధారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆహారం కొరత, పౌష్టికాహార లోపం దీనికి కారణంగా చెప్పవచ్చు. అయితే మానసిక వ్యాధికి సంబంధించిన కేసులు చాలా అరుదుగా మాత్రమే వైద్యుల దృష్టికి తీసుకు వస్తుంటారనే విషయం మనం మర్చిపోకూడదు"
ఏ వయసు వారైనా, ఎవరికైనా ఈ వ్యాధులు సోకే అవకాశం ఉంది.
సర్జరీ తర్వాత బాలిక ముజఫర్‌పుర్ మెడికల్ కాలేజ్‌లో కోలుకుంటోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, సర్జరీ సమయంలో వేసిన కుట్లు మానడానికి వారం రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పారు,
కుట్లు విప్పిన తర్వాత బాలికను మానసిక వ్యాధుల విభాగానికి పంపిస్తామని డాక్టర్ అశుతోష్ కుమార్ చెప్పారు.
"అక్కడ ఆమెకు బిహేవియరల్ థెరపీ ఇస్తారు. అయితే ఈ కేసులో బాలిక చాలా బలహీనంగా ఉంది. ఆమె పూర్తిగా కోలుకోవడం అవసరం" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














