‘భోపాల్ విషం మాకొద్దు’

- రచయిత, విష్ణుకాంత్ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కూరగాయల వ్యాపారి శివనారాయణ్ దాసన తమ గ్రామంలోకి ఇంతమంది పోలీసులు రావడం గతంలో ఎప్పుడూ చూడలేదు.
మధ్యప్రదేశ్‌లో ఆటోమొబైల్, ఫార్మా కంపెనీలకు పేరుగాంచిన పారిశ్రామిక పట్టణం పీథంపూర్‌లోని తారాపూర్‌లో 60 ఏళ్ల శివనారాయణ్ నివసిస్తారు.
మూడు వారాలుగా ఈ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రపంచంలోని అత్యంత ఘోర పారిశ్రామిక విపత్తుల్లో ఒకటైన భోపాల్ గ్యాస్ లీక్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 337 టన్నుల విష వ్యర్థాలను కలిగి ఉన్న కంటైనర్లు ఈ పట్టణంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. డిస్పోజ్ చేయడానికి ఆ వ్యర్థాలను ఇక్కడికి తీసుకొచ్చారు.
భోపాల్‌లో ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి ఈ వ్యర్థాలను తరలించారు.
1984లో ఈ ఫ్యాక్టరీలో జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటనలో వేల మంది చనిపోయారు. అక్కడి రసాయన వ్యర్థాల తరలింపుతో స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
వ్యర్థాలను తమ ఇళ్లకు సమీపంలో డిస్పోజ్ చేస్తే, తమ ఆరోగ్యాలకు హాని కలుగుతుందని, పర్యావరణ విపత్తుకు కూడా కారణమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోకి వ్యర్థాలను తీసుకొచ్చిన మరుసటి రోజు, అంటే జనవరి 3న అక్కడ నిరసనలు చెలరేగాయి. రాళ్లు రువ్వడం, ఆత్మాహుతికి ప్రయత్నించడం వంటి ఘటనలతో తీవ్రరూపు దాల్చాయి.
అప్పటినుంచి డిస్పోజల్ ఫెసిలిటీ సమీపంలో పహారా కాస్తున్న భారీ పోలీస్ బలగాలతో తారాపూర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు సైనిక స్థావరాలుగా కనిపిస్తున్నాయి.
నిరసనలు మొదలైనప్పటి నుంచి వంద మందిపై పోలీసులు 7 కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ, పట్టణ ప్రజలు చిన్న చిన్న సమావేశాల్లో పారిశ్రామిక కాలుష్యం గురించి ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.


ఇలా డిస్పోజ్ చేస్తారు..
భోపాల్ ఫ్యాక్టరీ నుంచి తొలగించిన విష వ్యర్థాల్లో అయిదు రకాల ప్రమాదకర పదార్థాలు ఉన్నాయి. పురుగుమందుల అవశేషాలు సహా మాన్యుఫాక్చరింగ్ ప్రక్రియలో వెలువడిన రసాయనాలు ఇందులో ఉన్నాయి.
ఈ రసాయనాల్లోని విష లక్షణాలు ఎల్లప్పటికీ అలాగే ఉండనున్నందున వీటిని 'ఫరెవర్ కెమికల్స్' అని పిలుస్తున్నారు.
దశాబ్దాలుగా ఈ ఫ్యాక్టరీలోని రసాయనాలు చుట్టుపక్కల పర్యావరణంలోకి వ్యాపించి, సమీప ప్రజలను తీవ్రమైన అనారోగ్యాల బారిన పడేలా చేస్తున్నాయి.
వ్యర్థాలను డిస్పోజ్ చేయడం వల్ల పీథంపూర్‌లో పర్యావరణ సమస్యలు రావొచ్చనే భయాలను అధికారులు కొట్టివేశారు.
ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా సీనియర్ అధికారి స్వతంత్ర కుమార్ సింగ్, వ్యర్థాలను డిస్పోజ్ చేసే ప్రక్రియను వివరించారు.
''ప్రమాదకరమైన వ్యర్థాలను 1200 సెంటిగ్రేడ్ వద్ద దహనం చేస్తారు. తర్వాత అంతా సురక్షితమేనని నిర్ధరించుకున్న తర్వాత మూడు నెలల వ్యవధిలో మొదట 90 కేజీల బ్యాచ్‌లను, తర్వాత 270 కేజీల బ్యాచ్‌ల వ్యర్థాలను తగులబెడతారు. దహనం తర్వాత వచ్చే పొగను నాలుగు పొరల వడపోతతో శుద్ధి చేస్తాం. ఈ ప్రక్రియ వల్ల విషపదార్థాలు గాలిలో కలవవు. బూడిదను రెండంచెల పొరల్లో సీల్ చేసి మట్టి, భూగర్భజల వనరులు కలుషితం కాకుండా నిరోధించేందుకు దాన్ని ఒక ప్రత్యేక స్థలంలో పాతిపెడతారు'' అని సింగ్ వివరించారు.
''మేం వంద మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చాం. ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు వ్యర్థాలను డిస్పోజ్ చేసే ప్రక్రియను వివరించే కార్యక్రమాలను చేపడుతున్నాం'' అని అడ్మినిస్ట్రేటర్ ప్రియాంక్ మిశ్రా అన్నారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా వ్యర్థాల డిస్పోజల్ ప్రక్రియను సమర్థించారు. ఇది సురక్షితమైనది, ఆవశ్యకమైనదని ఆయన అన్నారు.
హైకోర్టు ఆదేశించిన తర్వాతే డిస్పోజల్ ప్రక్రియ చేపట్టామని, ప్రజలు తమ సమస్యలను చట్టబద్ధంగా వినిపించాలని ఆయన కోరారు.
అయితే ఈ ప్రక్రియపై పర్యావరణ వేత్తలు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సరిగ్గా డిస్పోజ్ చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని సుభాష్ సి పాండే నమ్ముతున్నారు. అయితే, దహనానికి ప్రత్యామ్నాయం చూడాలంటూ శ్యామల మణి అన్నారు. దహనం వల్ల అవశేషాలు పెరుగుతాయని, వాటి నుంచి మెర్క్యురీ, డైఆక్సిన్స్ వంటి విషవాయువులు విడుదల అవుతాయని ఆమె అంటున్నారు.

''అవి కేవలం వ్యర్థాలు కావు, విషపూరితమైనవి. స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేకపోతే, శుభ్రమైన నీరు తాగలేకపోతే బతికి ఉండి ఏం ప్రయోజనం?'' అని తారాపూర్ గ్రామానికి చెందిన గాయత్రి తివారీ ప్రశ్నించారు. ఆమెకు అయిదుగురు పిల్లలు.
పీథంపూర్‌లో కాలుష్యం ఉందనేది కాదనలేని వాస్తవం. ఇక్కడి ప్రజలు తమ భయాలకు గతంలో భూగర్భజలాలు కలుషితం కావడం, తలెత్తుతోన్న ఆరోగ్య సమస్యలను కారణాలుగా చూపిస్తున్నారు.
1980లలో ఈ పట్టణంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగడంతో ప్రమాదకర వ్యర్థాలు పోగుపడటం, నీళ్లు కలుషితం అయ్యాయి. మట్టిలో మెర్క్యురీ, ఆర్సెనిక్, సల్ఫేట్లు చేరాయి. 2017 నాటికి ఈ ఏరియాలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం ఉన్నట్లు కేంద్ర సంస్థ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గుర్తించింది.
చాలా కంపెనీలు ప్రమాదకరం కాని వ్యర్థాలను డిస్పోజ్ చేసే విషయంలో నిబంధనల్ని పాటించడం లేదని, వాటిని నీళ్లలో, మట్టిలో పారేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నీళ్లలో హానికర పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు 2024లో జరిపిన పరీక్షల్లో తేలింది.
''మా ఇళ్లలోని వాటర్ ఫిల్టర్లు రెండు నెలలకు మించి పనిచేయవు. ఇప్పుడు చర్మ వ్యాధులు, కిడ్నీల్లో రాళ్లు రావడం వంటి సమస్యలు సాధారణం అయ్యాయి. కాలుష్యంతో అతలాకుతలం అవుతున్నాం'' అని చిరాఖన్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల పంకజ్ పటేల్ అన్నారు.
పీథంపూర్‌లో పారిశ్రామిక అభివృద్ధి పూర్వ పరిస్థితుల్ని ఆశించడం అవాస్తవికంగా ఉంటుందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి శ్రీనివాస్ ద్వివేది అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అనేక పెద్ద సమస్యల నుంచి దృష్టి మరల్చడం కోసం వ్యర్థాల డిస్పోజల్ ప్రక్రియను ముందుకు తెచ్చారని భోపాల్‌లో కార్యకర్తలు అంటున్నారు. పీథంపూర్‌కు 230 కిలోమీటర్ల దూరంలో భోపాల్ ఉంటుంది.
నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ల 2010 నాటి నివేదిక ప్రకారం, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ప్రదేశంలో కలుషితంగా మారిన నేల 11 లక్షల టన్నుల కంటే ఎక్కువగా ఉంది.
''337 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను డిస్పోస్ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. కానీ, ఇంతకంటే ఎంతో పెద్దదైన సమస్యను నిర్లక్ష్యం చేస్తోంది'' అని ప్రముఖ పర్యావరణవేత్త నిత్యానంద్ జయరామన్ అన్నారు.
''ఇన్నేళ్లలో కాలుష్యం అధ్వాన్న స్థితికి పెరిగింది. కానీ, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చేసిందేమీ లేదు'' అని మరో పర్యావరణ కార్యకర్త రచనా దింగ్రా అసంతృప్తి వ్యక్తం చేశారు.
భోపాల్ గ్యాస్ లీక్ అయిన వెంటనే 3,500 మంది చనిపోయినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. క్రమంగా ఈ సంఖ్య 15,000కి పెరిగిందని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అయితే మరణాల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని, ఆనాటి విషం కారణంగా బాధితులు ఇప్పటికీ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్నారని పర్యావరణ కార్యకర్తలు అంటున్నారు.
''పీథంపూర్ కాలుష్య చరిత్ర ప్రకారం చూస్తే, అక్కడి నివాసితుల భయాలు సరైనవే'' అని జయరామన్ అన్నారు.
కోర్టు ఆదేశాల మేరకు వ్యర్థాల సంగతి మాత్రమే చూస్తున్నామని అధికారులు అన్నారు.
భోపాల్‌లో జరుగుతున్న పరిణామాలు పీథంపూర్ ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచాయి. వ్యర్థాలను డిస్పోజ్ చేయడానికి వ్యతిరేకంగా వారంతా మళ్లీ వీధుల్లోకి వచ్చి నిరసన చేసేందుకు సిద్ధమమ్యారు.
''ఇక్కడ మా ఆందోళన వ్యర్థాల గురించి మాత్రమే కాదు. ఇది మా మనుగడ, మా పిల్లల భవిష్యత్‌కు సంబంధించినది'' అని కూరగాయల వ్యాపారి శివనారాయణ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














