క్షయవ్యాధి నిర్మూలనపై కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం జరుగుతోంది?

బాబూ నాయక్

ఫొటో సోర్స్, jugal purohit

ఫొటో క్యాప్షన్, టీబీతో బాధపడుతున్న బాబూ నాయక్ ఒడిశాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు
    • రచయిత, జుగల్ పురోహిత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ ఏడాది దేశంలో టీబీ(ట్యూబర్‌క్యులోసిస్)ని నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది తమ లక్ష్యమని తెలిపింది.

ప్రపంచంలో ఎక్కువమంది మరణానికి కారణమవుతున్న అంటువ్యాధి టీబీ. దీని కారణంగా 2023లో అన్ని దేశాల్లో కలిపి 12,50,000 మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనావేసింది.

ఓ బ్యాక్టీరియా ద్వారా క్షయ వ్యాధి వ్యాపిస్తుంది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. టీబీ బారిన పడ్డ వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఉమ్మినప్పుడు ఇది వ్యాప్తిచెందుతుంది.

ఈ వ్యాధి ప్రభావం భారత్‌లో చాలా ఎక్కువగా ఉంది. ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు ఈ వ్యాధి కారణంగా చనిపోతున్నారు.

2023లో భారత్‌లో 85 వేల మంది టీబీతో చనిపోయారు. ఈ లెక్కలను గత ఏడాది ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలియజేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 టీబీ నియంత్రణ కార్యాలయం

ఫొటో సోర్స్, jugal purohit

ఫొటో క్యాప్షన్, ఒడిశాలోని టీబీ నియంత్రణ కార్యాలయం

అనుకున్నలక్ష్యం ఎంతవరకు నెరవేరింది?

2030 నాటికి టీబీని అంతమొందించాలని ప్రపంచం లక్ష్యంగా పెట్టుకోగా, భారత్ మాత్రం 2025 నాటికే క్షయ వ్యాధిని నిర్మూలిస్తామని తెలిపింది.

2015తో పోలిస్తే కొత్త కేసుల్లో 80 శాతం తగ్గుదల, 2015తో పోలిస్తే మరణాల్లో 90 శాతం తగ్గుదల, టీబీ కారణంగా వైద్య ఖర్చుల భారంతో సతమతమవుతున్న కుటుంబాల సంఖ్య పూర్తిస్థాయిలో తగ్గించడం భారత్ లక్ష్యాలు.

2015తో పోలిస్తే భారత్‌లో టీబీ వల్ల మరణించిన వారి సంఖ్య 18 శాతం తక్కువగా ఉంది. 2015తో పోలిస్తే 2023లో క్షయ వ్యాధి కేసుల సంఖ్య 17.7 శాతం తగ్గింది.

2025 నాటికి భారత్‌ను టీబీ రహిత దేశంగా మారుస్తామన్న ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నామని గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం తెలిపింది.

టీబీ నిర్మూలన కార్యక్రమానికి 2022-23లో రూ. 910.83 కోట్ల బడ్జెట్ ఉండగా, 2023-24లో రూ. 1,179.68 కోట్లకు పెంచారు.

ఆమోదించిన బడ్జెట్ మొత్తం కూడా 2022-23లో రూ.1,666.33 కోట్లు ఉండగా, 2023-24లో రూ. 1,888.82 కోట్లకు చేరింది.

ఇలాంటివి జరిగినప్పటికీ కేసులు, మరణాలు తగ్గించడంలో భారత్ అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయిందని డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ టీబీ నివేదికలో పొందుపరిచిన విషయాలు గమనిస్తే అర్థమవుతుంది. 2023లో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేదని భారత్ కూడా అంగీకరించింది.

క్షయవ్యాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2023లో భారత్‌లో 85 వేల మంది టీబీతో చనిపోయారు

దిల్లీ, ఒడిశాల్లో పరిస్థితి ఎలా ఉంది?

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తమ దేశం డబ్ల్యుహెచ్ఓ నుంచి బయటికొస్తుందని ప్రకటించడం, ప్రపంచ ఆరోగ్యసంస్థకు సమస్యలు తెచ్చిపెడుతోంది. డబ్ల్యుహెచ్ఓకు అమెరికా అతిపెద్ద నిధుల సరఫరాదారు. దాని బడ్జెట్‌లో ఐదోవంతు కేటాయిస్తోంది. కార్యక్రమాల కొనసాగింపు, నిధుల కేటాయింపు, నైపుణ్యంపై ట్రంప్ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.

టీబీని నిర్మూలించాలన్న భారత లక్ష్యం నెరవేరే అవకాశం చాలా తక్కువగా ఉందని అనేకమంది అధికారులు, నిపుణులు, కార్యకర్తలు బీబీసీతో చెప్పారు.

దిల్లీ, ఒడిశాలోని టీబీ చికిత్స కేంద్రాలను పరిశీలించి రోగులు, డాక్టర్లు, ఇతర సేవలందించేవారు, ప్రభుత్వ అధికారులు, నిపుణులతో తీసుకున్న 10కి పైగా ఇంటర్వ్యూలను గమనిస్తే, ప్రభుత్వ కార్యక్రమంలో అనేక లోపాలు ఉన్నాయని తేలింది.

జాతీయ ట్యుబర్‌క్యులోసిస్ నిర్మూలన కార్యక్రమం(ఎన్‌టీఈపీ)తో సంబంధం ఉన్న భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడేందుకు చేసిన అనేక ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదు.

కాంచుచరణ్ సాహు

ఫొటో సోర్స్, jugal purohit

ఫొటో క్యాప్షన్, సాహు ఇద్దరు కుమార్తెలు టీబీ బారిన పడ్డారు.

నా కుమార్తెను వదిలేయాలన్న ఆలోచనా వచ్చింది

32 ఏళ్ల కాంచూచరణ్ సాహు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో నివసిస్తున్నారు.

సాహు నిర్మాణ కూలీగా పనిచేస్తున్నారు. ఆయనకు రిద్ధి, సిద్ధి అనే ఇద్దరు కవల ఆడ పిల్లలు ఉన్నారు. 2023 డిసెంబరు, 2024 జనవరి మధ్య వారిద్దరికీ టీబీ సోకినట్టు నిర్ధరించారు.

ప్రభుత్వ కార్యక్రమం కింద రిద్ధికి చికిత్స పూర్తికావొస్తుంది. సిద్ధికి చికిత్స కొనసాగుతోంది.

''దాదాపు మూడు నెలలు నుంచి మాకు ఔషధాలు అందడం లేదు'' అని సాహు చెప్పారు.

''ప్రయివేట్‌గా మందులు కొనాలంటే నెలకు 1,500 రూపాయలు అవుతాయి. అంత ఖర్చు పెట్టే స్థితిలో లేము. దీంతో కొన్నిసార్లు నా కూతుళ్లు మందులు వేసుకోలేకపోతున్నారు'' అని ఆయన చెప్పారు.

టీబీ రోగులకు ఆర్థిక సాయం కింద ప్రభుత్వం అందించే డబ్బు కూడా సరిగ్గా అందడం లేదని సాహు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పథకం కింద కేంద్రం చికిత్స జరిగినంత కాలం నెలకు రూ.1,000 అందిస్తుంది.

''నా కూతురు ఆరోగ్యం బాగవడం లేదు. మాకు చాలా నిరాశగా ఉంటోంది. ప్రభుత్వ మందుల దుకాణం దగ్గర మా కూతురిని వదిలేసిరావాలన్న ఆలోచన కూడా కలుగుతోంది. ఆమె బాధపడడం ఇంకెంతమాత్రం చూడలేకుండా ఉన్నాం'' అని ఇంట్లో ఏడుస్తున్న తన కూతురును ఓదార్చుతూ సాహు చెప్పారు.

ఒడిశాలోని ఖోర్దా ప్రాంతంలో ఉన్న టీబీ జిల్లా కార్యాలయం కూడా ప్రభుత్వ కార్యక్రమం దయనీయస్థితిని తెలియజేస్తోంది. అక్కడ కార్యాలయంలో ఒకే ఒక్క అధికారి ఉన్నట్టు బీబీసీ గుర్తించింది. ఆయన కూడా ఆయన సగం నిద్రలో ఉన్నారు.

సాహు కుమర్తెల గురించి ప్రశ్నించగా ఆ అధికారి..వారి కుటుంబానికి మందులు, ఆర్థిక సాయం అందకపోవడానికి కమ్యూనికేషన్ లోపం కారణమని ఆరోపించారు.

''మేం కోరిన మందులు, కావాల్సినన్ని లభించడం చాలా తక్కువ. ఉన్నవాటినే మేం సర్దుబాటు చేయాల్సివస్తుంది'' అని ఆయనన్నారు.

సాహు కేసు అసాధారణమైనదేమీ కాదు.

గత రెండేళ్లలో మందుల కొరత సాధారణమైపోయిందని విజయలక్ష్మి రౌత్రే చెప్పారు. ఆమె ఈ ప్రాంతంలో రోగులకు అండగా నిలిచేందుకు సహ్‌యోగ్ అనే ప్రాజెక్టు నిర్వహిస్తున్నారు. ''చికిత్సలో ఔషధాలు కీలకమైనవి. మరి వాటి కొరత ఉన్నప్పుడు టీబీని నిర్మిస్తామని ఎలా మాట్లాడగలం?'' అని ఆమె ప్రశ్నించారు.

కాంచుచరణ్ సాహు

ఫొటో సోర్స్, jugal purohit

ఫొటో క్యాప్షన్, భార్య, ఇద్దరు పిల్లలతో సాహు

దిల్లీ రోగులదీ ఇదే దుస్థితి

దేశరాజధాని దిల్లీలోన నివసించే అతుల్ కుమార్(అభ్యర్థన మేరకు పేరు మార్చాం) పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. వృత్తిరీత్యా మెకానిక్ అయిన ఆయన కూడా ఇలా పిల్లల ఆరోగ్యం కోసం ఆందోళన చెందుతున్న తండ్రుల జాబితాలోనే ఉన్నారు. ఆయన 26ఏళ్ల కూతురు ఔషధాలను తట్టుకునే టీబీ బారిన పడ్డారు. ఏడాదిన్నరపైగా కాలం నుంచి ఆమె చికిత్స పొందుతున్నారు.

మొనోపాస్ అనే పేరున్న 22 ట్యాబ్లెట్లు తన కూతురు ప్రతిరోజూ వాడాలని కుమార్ చెప్పారు. ''గడచిన 18 నెలల్లో కనీసం రెండు నెలలకోసారయినా ప్రభుత్వం నుంచి మోనోపాస్ ట్యాబ్లెట్ అందలేదు'' అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రతివారం తాను 1,400 రూపాయలు ఖర్చుపెట్టి ప్రయివేట్ మెడికల్ కేంద్రాల నుంచి ఔషధాలు కొనుక్కుంటున్నానని ఆయన చెప్పారు. దీనివల్ల తాను అప్పుల ఊబిలో కూరుకుపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు.

దిల్లీ టీబీ కార్యాలయానికి కుమార్ కేసు గురించి బీబీసీ తెలియజేసింది.

పార్లమెంటరీ నివేదిక ప్రకారం దేశంలో టీబీ కేసులు ఎక్కువగా ఉంది దిల్లీలోనే. లక్ష కేసుల్లో 700కుపైగా దిల్లీలోనే నమోదవుతున్నాయి. స్వచ్ఛమైన గాలి, వెలుతురు లేని ఇళ్లల్లో ఎక్కువమంది నివసించడం, పోషకాహార లోపం దీనికి కారణమని నిపుణులు చెప్పినట్టు ఆ నివేదిక తెలిపింది.

కావాల్సిన ఔషధాలు సమకూర్చుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ టీబీ డివిజన్ బాధ్యత. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు మందులు కొనుగోలు చేయగలవు.

సెంట్రల్ టీబీ డివిజన్‌కు అనేకసార్లు ఫోన్ చేశాం, మెయిల్స్ పంపాం, చివరకు కార్యాలాయానికి కూడా వెళ్లాం. కానీ అక్కడి అధికారులు మాత్రం రోగులు ఎందుకు సమస్యలు ఎదుర్కోవాల్సివస్తుందనేదానిపై వివరణ ఇవ్వలేదు.

సిబ్బంది కొరత

ఫొటో సోర్స్, jugal purohit

ఫొటో క్యాప్షన్, ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది లేక రోగులు అవస్థలు పడుతున్నారు.

అన్ని స్థాయిల్లోనూ ఖాళీగా ఉన్న పోస్టులు

టీబీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది విషయంలో కూడా భారత్ సమస్యలు ఎదుర్కొంటోంది.

సాహు ఇంటికి కొన్న కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి ఈ పరిస్థితిని కళ్లకు కడుతోంది.

బీబీసీ అక్కడకు వెళ్లినప్పుడు టీబీ వార్డులో డాక్టరు లేరు. తర్వాత జనరల్ డ్యూటీ డాక్టర్ ఆ వార్డును సందర్శించారు. టీబీకి చికిత్స అందించే ప్రత్యేక వైద్యులు ఆ ఆస్పత్రిలో లేరని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్ డాక్టర్ చెప్పారు. ప్రత్యేక వైద్యుడు వారంలో ఒకసారి మాత్రమే ఆస్పత్రికి వస్తారని తెలిపారు.

టీబీ నిర్మూలన కార్యక్రమంలో రాష్ట్రాల్లో అన్ని స్థాయిల్లో సిబ్బంది కొరత, ఖాళీ పోస్టులు ఉన్నాయని 2023 పార్లమెంటరీ రిపోర్టు తెలిపింది.

లేబొరటేరీ టెక్నీషియన్లు, సూపర్‌వైజర్ల కొరత 30 నుంచి 80 శాతం మధ్య ఉందని ఆ నివేదిక తెలిపింది.

టీబీ సెంటర్

ఫొటో సోర్స్, jugal purohit

ఫొటో క్యాప్షన్, ఒడిశాలో టీబీ సెంటర్

టీబీ అన్ని రోగాల్లాంటిది కాదు

టీబీ ఇతర రోగాల లాంటిది కాదు.

''ఒకసారి ఆ జబ్బు బారిన పడితే, రోగం ముదిరే అవకాశం 5 నుంచి 10 శాతం ఉంటుంది'' అని డబ్ల్యుహెచ్‌ఓ ప్రతినిధి ఎపిడెమియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ డాక్టర్ లాన్సెలాట్ పింటో చెప్పారు.

పోషకాహార లోపం, పేదరికం, రద్దీ వంటి సామాజిక ఆర్థిక కారణాలతో పాటు ఇతర అనారోగ్యాలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నాయని ఆయన తెలిపారు.

వ్యాధి గుర్తింపుకు అధునాతన పరికరాలు అందుబాటులో లేకపోవడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ''మైక్రోస్కోపిక్ పరీక్ష కోసం కఫంతో రోగులు నా దగ్గరకు వస్తుండడం ఇప్పటికీ జరుగుతోంది. జన్యుపరమైన పరీక్షలతో పోలిస్తే..ఈ పరీక్ష వల్ల తేలే ఫలితం చాలా తక్కువ'' అని పింటో వివరించారు.

ఔషధాల లభ్యత, రోగులు ఆరు నెలలు చికిత్స పొందేలా చేయడం కూడా సవాల్‌గా మారుతుందని చెప్పారు.

భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న బాబూ నాయక్ దీనికి ఉదాహరణ. 50 ఏళ్ల బాబూ నాయక్‌కు 2023లో టీబీ సోకింది. తన గ్రామంలో కొన్నిరోజులు ఔషధాలు వాడిన ఆయన తర్వాత తిరిగి పనిలో చేరారు.

''ప్రభుత్వ మందులు నా గ్రామంలో మాత్రమే అందుతాయి. వాటి కోసం భువనేశ్వర్ నుంచి ప్రయాణించడం సాధ్యం కాదు. నాకు బాగయినట్టు అనిపించి నేను మందులు వాడడం ఆపేశాను. అది పెద్ద తప్పు'' అని ఆయన చెప్పారు.

బీబీసీతో మాట్లాడుతున్న సమయంలో నాయక్ ఊపిరి తీసుకోవడానికి తరచూ ఇబ్బందిపడ్డారు. ఆయనకు మళ్లీ వ్యాధి సోకినట్టు పరీక్షల్లో తేలింది.

వ్యాధి నిర్మూలన కోసం తీసుకుంటున్న ప్రయత్నాలను వికేంద్రీకరించడంపై కేంద్రం దృష్టిపెట్టాలని ఆరోగ్య కార్యకర్త డాక్టర్ నరేంద్ర గుప్తా చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం ఆయన నాలుగు దశాబ్దాలపాటు కృషిచేశారు.

''ప్రజారోగ్యం అన్నది రాష్ట్రం పరిధిలోని అంశం. రాష్ట్రం, జిల్లాలు, గ్రామాల స్థాయిలో ఎక్కువ బాధ్యతలు కట్టబెట్టాలి. వ్యూహాలను అమలుపరచమని ఆదేశాలిస్తూ..తరచూ నివేదికలు తెప్పించుకుని కేంద్రం పరిశీలిస్తుండాలి'' అని ఆయన సూచించారు.

టీబీ నిర్మూలన

ఫొటో సోర్స్, JUGAL PUROHIT

ఫొటో క్యాప్షన్, విజయలక్ష్మి రౌత్రే

ముఖ్యమైన విషయం

డబ్ల్యుహెచ్ఓ నుంచి అమెరికా బయటకు రావడం ఆ సంస్థ ప్రాధాన్యతల్లో అనిశ్చితికి కారణమవుతుందని, ఇది టీబీ, ఇతర వ్యాధుల నిర్మూలనకు భారత్ సొంతంగా చేస్తున్న ప్రయత్నాలపైనా ప్రభావం చూపుతుందని డాక్టర్ పింటో విశ్లేషించారు.

ఎయిడ్స్‌, టీబీ, మలేరియా నిర్మూలనకు కృషిచేసే గ్లోబల్ ఫండ్ నుంచి భారత టీబీ కార్యక్రమం లాభపడుతోంది.

టీబీ, హెచ్ఐవీ కార్యక్రమాల కోసం ఆ ఫండ్ 2023-2025 కాలానికి 500మిలియన్ డాలర్లు కేటాయించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలకు సాంకేతిక సహకారం, మద్దతు అందించేందుకు డబ్ల్యుహెచ్ఓ, గ్లోబల్ ఫండ్ కలిసి పనిచేస్తున్నాయి. అతిపెద్ద దాత అయిన అమెరికా డబ్ల్యుహెచ్ఓ నుంచి బయటకు వస్తే ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

వందరోజుల ప్రచారం

వ్యాధిని పూర్తిగా నిర్మూలించడమనే లక్ష్యం నెరవేరడానికి చాలా కాలం పడుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ఆ దిశగా కొన్ని అడుగులు పడుతున్నాయి. కేసులను వేగంగా గుర్తించడానికి వీలుగా, డిసెంబరులో ప్రభుత్వం వందరోజుల ప్రచారం కార్యక్రమం ప్రారంభించింది. మరణాలు తగ్గించడం, వ్యాప్తిని నివారించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టింది.

'' గతంలో మేం రోగులు లక్షణాలు చెప్పేవరకు ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడు మేం వ్యాధి సోకే అవకాశమున్న అనేకమందిని పరిశీలించడం ద్వారా ఆ లక్షణాలున్న రోగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని ఒడిశాలో ఒక అధికారి చెప్పారు.

టీబీ కారణంగా అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య ఇటీవలి సంవత్సరాల్లో నెమ్మదిగా తగ్గుతోందని డబ్ల్యుహెచ్ఓ 2024 గ్లోబల్ టీబీ రిపోర్టులో తెలిపింది. టీబీ కారణంగా మరణిస్తున్నవారి సంఖ్యలోనూ ప్రపంచవ్యాప్తంగా తగ్గుదల స్థిరంగా కనిపిస్తోందని వెల్లడించింది.

టీబీని నిర్మూలించేందుకు ఇతర దేశాలు అవలంబించిన కొన్ని పద్ధతులను భారత్ అనుసరించవచ్చు. పొరుగునే ఉన్న మియన్మార్ 2023లో సాధించిన ఘనత దీనికి ఉదాహరణ. దక్షిణాసియాలో 2015తో పోలిస్తే క్షయవ్యాధి కేసులను 20శాతం తగ్గించాలన్న లక్ష్యం సాధించిన ఏకైక దేశం మియన్మార్ అని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది.

టీబీ నిర్మూలనలో విజయం సాధించామని ప్రకటించేవిషయంలో భారత్ జాగ్రత్తగా ఉండాలి.

తన బాధ్యతను ప్రభుత్వేతర సంస్థలకు బదలాయించి ఆత్మసంతృప్తి చెందడంపై ప్రభుత్వాన్ని 2023లో పార్లమెంటరీ నివేదిక హెచ్చరించింది. నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, టీబీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో బాధ్యతలను సంపూర్తిగా నెరవేర్చేలా చూసే ప్రభావవంతమైన పర్యవేక్షణ వ్యవస్థలు ఉండాలని సూచించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)