'నకిలీ గ్రామం' పేరుతో రూ. 43 లక్షల ప్రభుత్వ నిధులను కాజేశారా? ఈ ఊరి కథేంటి?

- రచయిత, కుల్‌దీప్ బ్రార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ‘న్యూ గట్టి రజోకే’ అనే గ్రామానికి వివిధ కేంద్ర పథకాల కింద లక్షల రూపాయల నిధులు కేటాయించారు.
ఇందులో ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే, పంజాబ్‌లో అలాంటి పేరు గల ఊరే లేదు.
సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాల ప్రకారం.. భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో గట్టి రజోకే అనే ఊరు ఉంది. అయితే, వివిధ కేంద్ర పథకాల కింద నిధులు వచ్చేలా చేసి, వాటిని కొల్లగొట్టేందుకు అధికారులు ‘న్యూ గట్టి రజోకే’ అనే పేరుతో మరో గ్రామాన్ని కాగితాల మీద సృష్టించారు.
ఈ వ్యవహారం మొత్తం గురుదేవ్ సింగ్ అనే ఆర్టీఐ కార్యకర్త వెలుగులోకి తెచ్చారు. ఆయన గతంలో పీర్ ఇస్మాయిల్ ఖాన్ గ్రామ సమితిలో సభ్యుడిగా ఉండేవారు.
కాగితాల మీద ఊరును సృష్టించి, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు మింగేస్తున్న స్కామ్ చాలా కాలంగా జరుగుతున్నట్లు తాను అనుమానించానని గురుదేవ్ సింగ్ తెలిపారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ నకిలీ గ్రామాన్ని సృష్టించారని ఆయన ఆరోపించారు.
ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని ఫిరోజ్‌పూర్ జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు.


సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి..
పంజాబ్‌లో గట్టి రజోకే అనే గ్రామం ఉంది. అయితే ఈ ఊరి పేరుకు ముందు ‘న్యూ’ పెట్టి లేని గ్రామాన్ని రికార్డుల్లో సృష్టించారు.
న్యూ గట్టి రజోకే అనే ఊరు గూగుల్ మ్యాప్స్‌లో కనిపించదు, అసలు అలాంటి ఊరు భూమి మీద ఎక్కడా లేదని ఆర్టీఐ కార్యకర్త గురుదేవ్ సింగ్ చెప్పారు.
న్యూ గట్టి రజోకే అనే గ్రామం గురించి తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నించినప్పుడు, ఈ ఊరిని 2013లో కాగితాల మీద సృష్టించినట్లు ఆయనకు తెలిసింది.
ఆ సమయంలో గట్టి రజోకే గ్రామానికి అమర్‌జీత్ కౌర్ సర్పంచ్‌గా ఉన్నారు. న్యూ గట్టి రజోకే గ్రామానికి కూడా సర్పంచ్ ఆమేనని రికార్డుల్లో నమోదు చేశారు.
అయితే ఈ న్యూ గట్టి రజోకే అనే ఊరిని కాగితాల మీద సృష్టించిన విషయం ఆమెకు కూడా తెలియదు.

ఉపాధి హామీ పథకం కూడా..
కాగితాల మీద ఉన్న గ్రామం గురించి వెతికేందుకు తాను ప్రయత్నించగానే అధికారుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయని గురుదేవ్ సింగ్ చెప్పారు.
"2013లో సృష్టించిన న్యూ గట్టి రజోకే గ్రామానికి 43 లక్షల రూపాయల నిధులు కేటాయించారు. ఊరి కోసం 55 రకాల ప్రాజెక్టుల్ని సిద్ధం చేశారు. వీటితో పాటు ఉపాధి హామీ పథకం కింద 141 మందికి జాబ్ కార్డులు ఇచ్చారు" అని గురుదేవ్ సింగ్ వివరించారు.
ఈ కార్డుల్లో ఉన్న పేర్లు కలవారెవరూ గట్టి రజోకే గ్రామంలో లేరు. 35 ప్రాజెక్టుల్ని పూర్తి చేసినట్లు రికార్డుల్లో చూపించారు.

గ్రామస్థులేమన్నారు?
గట్టి రజోకే గ్రామస్థులతో బీబీసీ ప్రతినిధి కుల్‌దీప్ బ్రార్ మాట్లాడేందుకు ప్రయత్నించినప్పపుడు, ఆ గ్రామ ప్రజలు కెమెరా ముందు మాట్లాడేందుకు నిరాకరించారు.
కాగితాల మీద సృష్టించిన న్యూ గట్టి రజోకే గ్రామం, ఆ రికార్డుల్లో గట్టి రజోకే గ్రామం పక్కనే ఉన్నట్లు చూపించారు.
గట్టి రజోకే గ్రామానికి చెందిన కొందరు తమ పేరు వెల్లడించకూడదనే షరతుతో బీబీసీతో మాట్లాడారు.
తమ గ్రామాన్ని నయా గట్టి రజోకే అని కూడా అంటారని, అయితే ఇంగ్లీష్‌లో ‘న్యూ’ అని పెట్టి కొత్త ఊరిని సృష్టించారని చెప్పారు.
"మా ఊరి పేరు నయా గట్టి రజోకే. కొంతమంది ఉద్యోగులు దాన్ని న్యూ గట్టి రజోకే అని పిలుస్తారు. అయితే ఆ విషయం మాకు తెలియదు. న్యూ అనేది ఆంగ్ల పదం. పంజాబీలో నయీ అనే పదాన్ని వాళ్లు న్యూ అంటున్నారేమో అని మేము అనుకున్నాం" అంటూ గట్టి రజోకే మాజీ సర్పంచ్ లాల్ సింగ్ చెప్పారు.
"నేను 2019లో సర్పంచ్ అయ్యాను. మా ఊరు చాలా కాలం నుంచి ఉంది. ఉపాధి హామీ పథకం కింద మా ఊరితో పాటు చుట్టు పక్కల ఊళ్లలోనూ చాలా పనులు చేశాం. వాటికి సంబంధించిన నిధులు ఇంకా రావాల్సి ఉంది" అని ఆయన చెప్పారు.
ఆర్టీఐ కార్యకర్త గురుదేవ్ సింగ్ మీద లాల్ సింగ్ ఆరోపణలు చేశారు.
"న్యూ, నయా మధ్య వివాదం ఏంటో అధికారులకు తెలుసు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన వ్యక్తి మా ఊరికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఆయన డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారు" అని లాల్‌సింగ్ ఆరోపించారు.
ఈ వ్యవహారంలో చర్యలు తీసుకునేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని, ఎందుకంటే ఇందులో ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందని కొంతమంది గ్రామస్థులు తనతో చెప్పినట్లు బీబీసీ ప్రతినిధి కుల్‌దీప్ బ్రార్ అంటున్నారు.

అధికారులేమంటున్నారు?
ఈ వ్యవహారంపై జిల్లా అధికారుల నుంచి సమాచారం తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.
అయితే ఏ అధికారి కూడా దీని గురించి కెమెరా ముందు మాట్లాడేందుకు ముందుకు రాలేదు.
ఫోన్ ద్వారా ప్రశ్నించినప్పుడు జిల్లా డిప్యూటీ కమిషనర్ లక్వీందర్ సింగ్ తాను ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
"రికార్డులు కావాలని రెవెన్యూ విభాగాన్ని అడిగాం. మా వద్దకు రికార్డులన్నీ పూర్తిగా రాలేదు. దర్యాప్తు పూర్తైన తర్వాతే ఏదైనా చెప్పగలం" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














