రమేశ్ కార్తీక్: ఇంత చిన్న వయసులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎలా సాధించారంటే..

రమేశ్ కార్తీక్ నాయక్‌‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది.

ఫొటో సోర్స్, Ramesh Karthik Nayak

ఫొటో క్యాప్షన్, రమేశ్ కార్తీక్ నాయక్‌‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది
    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బంజారా రచయిత రమేశ్ కార్తీక్ నాయక్‌ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్నారు. నిజమాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన రమేశ్ కార్తీక్ గోర్ బంజారాగా పిలిచే ఒక లంబాడా తెగకు చెందినవారు. తమ మాతృభాష అయిన బంజారా భాషతో పాటూ, తెలుగు, ఇంగ్లీషుల్లో కూడా కవిత్వం, కథలు రాస్తుంటారు.

ఆయన రాసిన ‘ఢావ్లో – గోర్ బంజారా కతలు’ అనే కథా సంపుటికి 2024 సంవత్సరానికి గానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈ జనవరిలో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఉత్కళ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ అవార్డు అందుకున్నారు.

''ఇంత చిన్న వయసులో (26) ఈ ఘనత సాధించిన తొలి గిరిజనుడిని నేనే'' అని రమేశ్ కార్తీక్ బీబీసీతో చెప్పారు.

సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమేశ్ సాహితీ ప్రయాణం కోసం ఎన్నో ప్రయాసలు ఎదుర్కొన్నారు. చిన్నప్పటి నుంచి కవిత్వం రాసుకోవడం ఆయనకు అలవాటు. మొదట్లో అనేక అంశాలపై కవిత్వం రాసిన రమేశ్, క్రమంగా తన తెగకు సంబంధించిన నేపథ్యంలో కవిత్వం, కథలు రాయడం ప్రారంభించారు.

ఢావ్లో అనే కథల సంపుటికి గాను ఆయనకు ఈ అవార్డు వచ్చింది. ఢావ్లో అంటే అర్థం విషాద గీతం. లంబాడీ తెగకే పరిమితమైన కొన్ని ఆచారాల కేంద్రంగా ఈ కథలు ఉంటాయి.

చావు, పుట్టుక సహా అనేక అనుభవాలను పాటల రూపంలో పాడుకుంటారు లంబాడీ మహిళలు. అలాంటి ఒక మహిళ విషాద గీతం ఉన్న కథ ఢావ్లో. దీనితో పాటు మరికొన్ని కథలు ఆ పుస్తకంలో ఉన్నాయి.

రమేశ్ కార్తీక్‌

ఫొటో సోర్స్, Ramesh Karthik Nayak

అవార్డు కమిటీ ఏం చెప్పింది?

''లంబాడాల పెళ్లి నెలల తరబడి సాగుతుంది. పెళ్లి ఇష్టం లేని ఒక లంబాడీ అమ్మాయి తన దగ్గర కోడి, నక్క, ఎద్దులను కలిసి తన పెళ్లి ఆపాలంటూ ఎలా కోరుకున్నదో చెప్పే కథాంశం ఉంది'' అని బీబీసీతో చెప్పారు రమేశ్.

''ఢావ్లో-గోర్ బంజారా కతలు, తెలుగు రాష్ట్రాల్లోని గోర్ బంజారా అనే గిరిజన సంచార తెగల జీవిన శైలికి అద్దం పట్టిన కథలు. గోర్ బంజారాల సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను లోతైన సున్నితత్వం , సామాజిక శ్రద్ధతో చిత్రీకరిస్తుంది ఈ సంపుటి. అద్భుత కథా సాంకేతికత, సంప్రదాయం, గోర్ బంజారాల ఆచారాలు, సంస్కృతి ఖచ్చితమైన కథనం, ఆకట్టుకునే పాత్ర, భాష.. ఈ కథల కొన్ని విశిష్ట లక్షణాలు. అందుకుగాను రమేశ్ కార్తీక్ నాయక్ రాసిన ఢావ్లో- గోర్ బంజారా కతల సంపుటికిగాను తెలుగులో సాహిత్య అకాడమీ యువ పురస్కారం-2024 ఇవ్వడానికి సాహిత్య అకాడమీ నిర్ణయించింది'' అంటూ అవార్డు కమిటీ వివరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బల్దేర్ బండి

‘బల్దేర్ బండి’ అనే కవితా సంపుటితో రమేశ్ కార్తీక్ ప్రస్థానం మొదలైంది. 2018లో ఈ పుస్తకం విడుదలైంది. తరువాత 2021లో ఢావ్లో కథల సంపుటి విడుదల చేశారు.

2022 ఆగష్టులో ‘కేసులా’ పేరుతో తొలి గోర్ బంజారా కథల సంపుటిని ఆచార్య సూర్య ధనంజయ్‌తో కలిసి విడుదల చేశారు. 2023 ఆగష్టులో ‘చక్మక్’ అనే ఇంగ్లిష్ కవిత్వ సంపుటిని విడుదల చేశారు.

ఢావ్లో పుస్తకం

ఫొటో సోర్స్, Ramesh Karthik Nayak

''నా మొదటి పుస్తకం బల్దేర్ బండి ప్రచురణ కోసం అపర్ణ తోట, చైతన్య పింగళి మరికొందరు తెలుగు రచయితలు, ఔత్సాహికులు సహకరించారు. తరువాత ఢావ్లో పుస్తకం విషయంలో తోటి రచయితల సలహా మేరకు సిసలైన బంజారా యాసలో రాశాను'' అని తెలిపారు రమేశ్.

''తెలుగులో లంబాడాల జీవనం గురించి వచ్చిన పుస్తకాలు తక్కువ. అందులో స్వయంగా లంబాడాలు రాసుకున్నవి ఇంకా తక్కువ. ఆ క్రమంలో తెలుగు సాహిత్యం పెద్దగా స్పృశించని లంబాడాల జీవితాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా'' అని చెప్పారు.

రమేశ్ కార్తీక్‌

ఫొటో సోర్స్, Ramesh Karthik Nayak

సాహిత్యం మీదే ధ్యాస

రమేశ్ కార్తీక్‌కి బడి వయసు నుంచే కవిత్వంపై ఆసక్తి ఉండేది.

ఇంట్రోవర్ట్‌గా ఉండే తనకు హైదరాబాద్ సాహితీ వాతావరణం, ఇక్కడి సాహితీ మిత్రుల పరిచయం ఎంతో తోడ్పడిందన్నారు రమేశ్.

తనకు అండగా నిలిచిన పలువురు రచయితలు, పబ్లిషర్ల గురించి బీబీసీతో చెప్పారు.

రమేశ్ తల్లితండ్రులు వ్యవసాయం చేస్తారు. తమ కుమారుడు బాగా చదువుకుని ఉద్యోగంలో స్థిరపడాలన్నది వారి కోరిక.

''కానీ నా ధ్యాస మ్యాథ్స్ కంటే సాహిత్యం మీద ఎక్కువ ఉండేది. ఆ విషయంలో వారికి కొంత కోపం ఉండేది. దీనిపై ఇంట్లో గొడవలు అయ్యాయి. చివరకు నేను వెళ్ళే దారి కూడా మంచిదేనని వారు గుర్తించారు. ప్రస్తుతం మా అమ్మానాన్నలు కూడా సహకరిస్తున్నారు'' అని ఆయన వివరించారు.

ప్రస్తుతం పీహెచ్‌డీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న రమేశ్ కార్తీక్, కొంత కాలం జూనియర్ లెక్చరర్‌గా పనిచేసి, దూరదర్శన్‌లో సాహిత్య కార్యక్రమ యాంకర్‌గా కూడా పార్ట్ టైంలో పనిచేస్తున్నారు. ఐటీఐ డిప్లొమాతో పాటూ డిస్టెన్సులో డిగ్రీలు చేశారు. అలాగే కొన్ని పుస్తకాల సంపాదకత్వ బాధ్యతల్లో కూడా ఉన్నారు.

రమేశ్ కార్తీక్‌కు యువ పురస్కారం

ఫొటో సోర్స్, Ramesh Karthik Nayak

తెలుగుతో పాటు ఇంగ్లీషులో కూడా కవిత్వం రాయడం ఒక ప్రత్యేకత. అయితే, ఈయన కవిత్వం తెలుగు, తమిళం, కన్నడ, అస్సామీ, బెంగాలీ, హిందీ వంటి భారతీయ భాషల్లోకి కూడా అనువాదం అయ్యాయి. తన పుస్తకాలు, సాహిత్యాన్ని కొన్ని విద్యా సంస్థలు సిలబస్‌లో చేర్చుకున్నాయి.

‘బల్దేర్ బండి’ కవితా సంపుటిని విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం డిగ్రీ తెలుగు సెకండ్ ఇయర్ సిలబస్‌లో చేర్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)