‘నా కూతురి తల ఓ చోట, కాళ్లు మరో చోట, ఎముకలు ఇంకో చోట చెల్లాచెదురుగా పడి ఉన్నాయి’ - గాజాలో ఓ తల్లి కడుపుకోత

అయా కుటుంబం
ఫొటో క్యాప్షన్, అయా ఫోటోతో కుటుంబ సభ్యులు
    • రచయిత, క్లాడియా అలెన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అక్కడంతా గందరగోళంగా ఉంది. పిల్లల స్కూల్ బ్యాగ్, రన్నింగ్ షూ, నొక్కుపోయిన స్టీల్ బిందె, మంచం, కుర్చీలు, కుక్కర్లు, పగిలిపోయిన దీపాల ముక్కలు, బద్దలైన కిటికీ అద్దాలు, గాజు గ్లాసులు, దుస్తులతో అంతా చెల్లాచెదురుగా ఉంది.

చెత్తలా మిగిలిపోయిన, దుమ్ముధూళిలో నిండిన ఈ చిత్తు సామానే ఆచూకీ తెలియకుండా పోయినవారిని గుర్తించడంలో కీలకంగా మారుతోంది.

''రఫా నుంచి ఇజ్రాయెల్ తన బలగాలను ఉపసంహరించుకున్నప్పటి నుంచి, ఇళ్ల శిథిలాల కింద తమ వారి మృతదేహాలు ఉన్నాయంటూ మాకు 150కి పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి'' రఫాలోని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీకి చెందిన ఎమర్జెన్సీ అండ్ అంబులెన్స్ సర్వీసెస్ డైరెక్టర్ హైతమ్ అల్ హోమ్స్ చెప్పారు.

సుమారు వెయ్యి మంది ఆచూకీ ఇంకా దొరకలేదని పాలస్తీనా ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. శిథిలాల్లో దుస్తులు వంటి సరైన ఆనవాళ్లు లేని చోట ఇరుగుపొరుగువారు, బంధువులు ఇచ్చిన సమాచారంపై సెర్చ్ టీమ్స్ ఆధారపడుతున్నాయి. దుర్గంధం వస్తున్న ప్రదేశాలలో శిథిలాల కింద వెదుకుతున్నారు.

(ఈ కథనంలో కలచివేసే అంశాలు ఉంటాయి)

బీబీసీ న్యూస్ తెలుగు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హైతమ్ అల్ హోమ్స్
ఫొటో క్యాప్షన్, రఫాలోని ఎమర్జెన్సీ అండ్ అంబులెన్సెస్ డైరెక్టర్ హైతమ్ అల్ హోమ్స్

బీబీసీతో పాటు ఇతర అంతర్జాతీయ వార్తా సంస్థలు గాజాలోకి ప్రవేశించకుండా, స్వతంత్రంగా రిపోర్టింగ్ చేయకుండా ఇజ్రాయెల్ ప్రభుత్వం నిషేధించింది.

గాజాలో ఆచూకీ లేకుండా పోయిన తమవారి కోసం గాలిస్తున్న ప్రజల వ్యథలను మీ ముందుకు తీసుకురావడానికి మేం గాజాలోని విశ్వసనీయులైన స్థానిక జర్నలిస్టుల మద్దతు తీసుకున్నాం.

హైతమ్ అల్ హోమ్స్ ప్రతిరోజు తమ బృందం గుర్తించిన ప్రజల జాబితాను అప్‌డేట్ చేస్తుంటారు.

ఆయన బృందం చాలా జాగ్రత్తగా శిథిలాలను తవ్వుతుంది. ఎందుకంటే వాటి కింద నుంచి బయల్పడేవి ఏంటో వారికి బాగా తెలుసు. వాటిని ఎముకల కుప్పగా చెప్పొచ్చు.

ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో చనిపోయిన వారిలో చాలామంది శరీరాలు తునాతునకలయ్యాయి.

తవ్వకాల్లో దొరికిన ఎముకలు, దుస్తుల ముక్కలను ఒక తెల్లటి మృతదేహాల సంచిలో ఉంచుతారు. ఆ సంచిపై హోమ్స్ అరబిక్ పదం 'మజౌల్' అని రాస్తారు. దీనర్థం ''గుర్తుతెలియకపోవడం''.

రఫా
ఫొటో క్యాప్షన్, శిథిలాల్లో దొరికన మానవ అవశేషాలు

ఒసామా సలేహ్, రఫా నివాసి. కాల్పుల విరమణ తర్వాత ఆయన తన ఇంటికి తిరిగి వెళ్లగా అందులో ఒక అస్థిపంజరం కనిపించింది. పుర్రె పగిలిపోయి ఉంది. నాలుగైదు నెలలుగా ఆ అస్థిపంజరం అక్కడే ఉందని ఆయన భావిస్తున్నారు.

''మనం మనుషులం. మనకు భావోద్వేగాలు ఉంటాయి. ఆ విషాదం ఎంత దయనీయంగా ఉందో నేను మీకు అర్థమయ్యేలా చెప్పలేను'' అని ఆయన అన్నారు.

కుళ్లిపోతున్న శవాల వాసనల మధ్య ప్రతిరోజు ఉండటం ఒక దారుణమైన అనుభవం. ఈ సామూహిక మరణాల తర్వాత పరిణామాలను చూసిన వారు తరచుగా ఆ దారుణ అనుభవాల గురించి చెబుతుంటారు.

ఒసామా
ఫొటో క్యాప్షన్, ఒసామా ఒక అస్థిపంజరాన్ని గుర్తించారు

''మృతదేహాలు భయంకరంగా ఉన్నాయి. మేం ఆ భయానక దృశ్యాలను చూస్తున్నాం. ఒట్టేసి చెబుతున్నా ఇది చాలా బాధాకరమైన అనుభవం. నేను ఏడ్చాను'' అని ఒసామా సలేహ్ చెప్పారు.

కుటుంబ సభ్యులు తమవారి అవశేషాల కోసం ఆసుపత్రులకు వస్తున్నారు. దక్షిణ గాజాలోని యూరోపియన్ ఆసుపత్రి ప్రాంగణంలో మృతదేహాల సంచుల్లో ఎముకలు, దుస్తుల అవశేషాలను ఉంచారు.

రఫాకు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ సలామ్ అల్ ముగయర్, షాబౌరా ప్రాంతంలో కనిపించకుండాపోయారు.

ఒకవేళ యుద్ధసమయంలో ఆ ప్రాంతంలోకి ఒకసారి వెళ్తే మళ్లీ తిరిగి రాలేరని అబ్దుల్ బంధువు జకీ అన్నారు.

''ఈ కారణంగానే మేం అబ్దుల్‌ను వెదకడం కోసం ఆ ప్రాంతానికి వెళ్లలేదు. వెళ్తే మళ్లీ తిరిగి రాకపోయేవాళ్లం'' అని జకీ చెప్పారు.

తన ముందున్న ఎముకలు, దుస్తులు ఆచూకీ లేకుండా పోయిన అబ్దుల్ సలామ్‌వేనని జకీ నమ్ముతున్నారు. ఆసుపత్రి వర్కర్ జిహాద్ అబుతో కలిసి ఆయన, అబ్దుల్ సోదరుడు రాకకోసం ఎదురు చూస్తున్నారు.

''ఈ అస్థికలు అతనివే అని 99 శాతం కచ్చితంగా చెప్పవచ్చు. కానీ, అబ్దుల్ సన్నిహితులు లేదా సోదరుడు వీటిని చూసి ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ప్యాంట్, బూట్లు అతనివి అని వారు గుర్తించాలి'' అని అబు అన్నారు.

అల్ మవాసిలో టెంట్లతో ఏర్పాటు చేసిన ఒక శరణార్థి శిబిరం నుంచి అబ్దుల్ సోదరుడు వచ్చారు. ఆయన ఫోన్‌లో అబ్దుల్ సలామ్ ఫోటో ఉంది. ఆ ఫోటోలో అబ్దుల్ వేసుకున్న రన్నింగ్ షూలు ఉన్నాయి.

అతను మోకాలిపై కూర్చొని బాడీ బ్యాగ్‌లోని అవశేషాలను చూశారు. పుర్రె, దుస్తులను తాకారు. షూలు చూడగానే ఆయన కళ్లలో నీళ్లు నిండాయి. దీంతో గుర్తింపు పూర్తయింది.

మరో కుటుంబం కూడా ఇలాగే బాడీ బ్యాగ్‌లను చూస్తూ ముందుకెళ్లింది. వారిలో ఒక బామ్మ, ఆమె కుమారుడు, ఒక యువతి, ఒక చిన్నపిల్లాడు ఉన్నారు. పెద్దావిడ, ఆమె కుమారుడు ఒక బాడీ బ్యాగ్‌లోని కవర్‌లోకి చూశారు. కొన్ని సెకన్లు అలాగే చూసి, బాధతో విలవిల్లాడారు.

తర్వాత ఆసుపత్రి సిబ్బంది సహాయంతో అవశేషాలను వారు తీసుకెళ్లారు.

అయా

ఫొటో సోర్స్, Handout

ఫొటో క్యాప్షన్, స్కూల్లో ఉన్నప్పుడు 13 ఏళ్ల అయా అల్ దబా చనిపోయారు

అయా అల్ దబేహ్ వయస్సు 13 ఏళ్లు. ఆమె తన కుటుంబం, వందల మంది ఇతర శరణార్థులతో కలిసి గాజా నగరంలోని తాల్ అల్ హవా స్కూల్లో ఉండేవారు. అక్కడున్న తొమ్మిదిమంది పిల్లల్లో ఆమె ఒకరు.

యుద్ధం మొదలైన తొలినాళ్లలో ఒకరోజు అయా, పాఠశాల పై అంతస్థులో ఉన్న బాత్రూంకు వెళ్లినప్పుడు ఒక ఇజ్రాయెల్ స్నైపర్ ఆమెను ఛాతీలో కాల్చారని కుటుంబీకులు చెప్పారు.

తాము పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, హమాస్ ఈ పని చేసిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆరోపించాయి.

అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో ఇజ్రాయెల్ బలగాలు తీవ్రంగా కాల్పులు జరిపాయని, ఫలితంగా మరణాలు సంభవించాయని యుద్ధం సమయంలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం పేర్కొంది.

పాఠశాల పక్కనే అయాను కుటుంబీకులు ఖననం చేశారు. ఒకవేళ సమాధి చెదిరిపోతే వాన, ఎండల బారిన పడకుండా అయా మృతదేహాన్ని ఆమె తల్లి లీనా అల్ దబేహ్ (43) బ్లాంకెట్‌లో చుట్టి ఖననం చేశారు.

ఇజ్రాయెల్ ఆర్మీ ఆ స్కూల్‌ను చుట్టుముట్టినప్పుడు లీనా, దక్షిణ గాజా వైపు పారిపోయారు. ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లతో కలిసి తన భర్త దగ్గరకు వెళ్లారు. ఆమె భర్త అంతకుముందే తమ మిగతా పిల్లల్ని తీసుకొని ఆ స్కూల్ నుంచి దక్షిణ గాజాకు పారిపోయారు.

అయాను పాతిపెట్టిన చోటే వదిలేయడం తప్ప లీనాకు ఇంకో మార్గం లేదు. యుద్ధం ఆగిన తర్వాత వెనక్కి వచ్చి అయా అస్థికలను తీసుకెళ్లి సరైన రీతిలో అంత్యక్రియలు చేస్తాననే ఆశతో ఆమె అక్కడినుంచి వెళ్లిపోయారు.

''అయా చాలా మంచిపిల్ల. అందరికీ తనంటే చాలా ఇష్టం. అయా అందరితో ప్రేమగా ఉండేది. తన టీచర్లు అంటే అయాకు గౌరవం. చదువులో ముందుండేది. అందరూ బాగుండాలని కోరుకునేది'' అని లీనా గుర్తు చేసుకున్నారు. కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చినప్పుడు ఉత్తర గాజాలో నివసిస్తున్న తమ బంధువులను అయా సమాధి ఎలా ఉందో చూడమని లీనా కోరారు. తర్వాత ఆమెకు గుండె పగిలే వార్త తెలిసింది.

అయా

''అయా తల ఒకచోట, ఆమె కాళ్లు మరోచోట, పక్కటెముకలు ఇంకెక్కడో పడి ఉన్నాయని వారు మాకు చెప్పారు. అయాను ఖననం చేసిన చోటును చూడటానికి వెళ్లిన వ్యక్తి అది చూసి షాకై మాకు ఫోటోలు పంపించారు. అది చూసిన తర్వాత నాకేం అర్థం కాలేదు. నా కూతురిని సమాధిలో నుంచి ఎవరు బయటకు తీశారు? ఆమెను కుక్కలు ఎలా తిన్నాయో నాకు అర్థం కాలేదు. అది చూశాక తట్టుకోవడం నా వల్ల కాలేదు'' అని లీనా ఆవేదన వ్యక్తం చేశారు.

వారి బంధువులు అయా అస్థికలను సేకరించారు. త్వరలోనే లీనా, ఆమె కుటుంబం ఉత్తర గాజాకు వెళ్లి అయాకు సరైన రీతిలో అంత్యక్రియలు చేయనున్నారు. లీనాను అంతులేని దు:ఖం, సమాధానం లేని ప్రశ్నలు వేధిస్తున్నాయి. గాజాలో పిల్లలను పోగొట్టుకున్న చాలామంది తల్లిదండ్రులు ఇదే వేదనను అనుభవిస్తున్నారు.

''నేను ఆమెను పాతిపెట్టిన చోటు నుంచి తీసుకెళ్లలేకపోయాను. అయినా నేను ఆమెను ఎక్కడికని తీసుకెళ్లను?'' అంటూ లీనా ప్రశ్నించారు.

అదనపు రిపోర్టింగ్ మలక్ హసోనా, అలైస్ దొయార్డ్, ఆడమ్ క్యాంప్‌బెల్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)