చార్లెస్ శోభరాజ్: జైలు సిబ్బందికి మత్తు మాత్రలు ఇచ్చి తప్పించుకున్న ఈయన ఇప్పుడు ఎక్కడున్నారు?

చార్లెస్ శోభరాజ్ 1944 ఏప్రిల్ 6న వియత్నాంలో జన్మించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చార్లెస్ శోభరాజ్ 1944 ఏప్రిల్ 6న వియత్నాంలో జన్మించారు.
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సునీల్ కుమార్ గుప్తా 1981 మే 8న ఏఎస్పీగా తన నియామక పత్రంతో తీహార్ జైలు సూపరింటెండెంట్ బీఎల్ విజ్ కార్యాలయానికి చేరుకున్నారు.

తీహార్‌లో ఉద్యోగం వచ్చిన వెంటనే ఉత్తర రైల్వేలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు సునీల్. అప్పటికి ఆయన వయస్సు 24 ఏళ్లు. మే 7వ తేదీన రైల్వేశాఖ ఆయనను రిలీవ్ చేసింది. మరుసటి రోజే సునీల్ కొత్త ఉద్యోగంలో చేరడానికి తీహార్ జైలుకు చేరుకున్నారు.

సునీల్ గుప్తా ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ "జైలు సూపరింటెండెంట్ బీఎల్ విజ్ నన్ను చూసి.. ఏఎస్పీ ఉద్యోగం లేదన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నా దగ్గర అపాయింట్‌మెంట్ లెటర్ ఉందని చెప్పాను. రైల్వే జాబ్ వదిలే ముందు తనకు చెప్పాల్సిందన్నారు.’’

దీంతో ఏం చెయ్యాలో తెలియక, బయటికి వచ్చి ఆలోచిస్తున్న సునీల్‌కు కోటు, టై ధరించిన ఒక వ్యక్తి కనిపించారు. ఆయన పేరు తెలియకపోయినా, ఆయన రూపం ఆకట్టుకుందని, ఆయన్ని చూడగానే లేచి నిలబడ్డానని సునీల్ చెప్పారు.

సునీల్ గుప్తా ఆ ఘటనను గుర్తుచేసుకున్నారు. "నేను అక్కడికి ఎందుకొచ్చానని ఆయన ఇంగ్లీషులో అడిగారు. నేను జరిగిందంతా చెప్పాను. చింతించకండి, నేను మీకు సాయం చేస్తానని చెప్పారు. ఆయన విజ్ కార్యాలయం లోపలికి వెళ్లారు. ఓ గంట తర్వాత తీహార్‌లో నన్ను ఏఎస్పీగా నియమిస్తున్నట్టు రాసి ఉన్న లేఖను నా చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఇంత పలుకుబడి ఉన్న ఈ వ్యక్తి ఎవరు అని అక్కడే ఉన్న ఓ వ్యక్తిని అడిగా. ‘‘ఆయనే చార్లెస్ శోభరాజ్. ఈ జైలుకు సూపర్ ఐజీ ఆయనే. ఇక్కడ అన్నీ ఆయన అనుకున్నట్టుగానే సాగుతాయి’’ అని చెప్పాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సునీల్ కుమార్ గుప్తా
ఫొటో క్యాప్షన్, సునీల్ కుమార్ గుప్తా, బ్లాక్ వారెంట్ పుస్తక రచయిత

నగల దుకాణంలో చోరీ

గురుముఖ్ చార్లెస్ శోభరాజ్ 1944 ఏప్రిల్ 6న వియత్నాంలోని సైగాన్‌లో జన్మించారు. ఆయన తల్లి వియత్నామీస్ సంతతికి చెందినవారు, తండ్రి భారతీయ సింధీ.

చార్లెస్‌ను, ఆమె తల్లిని వదిలి ఆయన తండ్రి వేరుగా ఉండేవారు. డేవిడ్ మోరిసే 'ది బికినీ కిల్లర్' పేరుతో శోభరాజ్ జీవిత చరిత్రను రాశారు. ఆ పుస్తకంలో ‘‘ చార్లెస్ బాల్యం అంత ఆహ్లాదంగా గడపలేకపోయాడు. పెద్దాయ్యక పారిస్‌కు చెందిన చంతల్ కంపాగ్నాన్‌ అనే మహిళను కలిశారు. ఆ రోజు వారిద్దరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, కానీ అదేరోజు దొంగిలించిన కారును నడిపాడనే ఆరోపణలపై పోలీసులు చార్లెస్‌ను అరెస్టు చేశారు" అని తెలిపారు.

చార్లెస్‌ ఇండియాలో మొదటిసారిగా 1971లో ముంబయిలో అరెస్టయ్యారు. దిల్లీలోని అశోకా హోటల్‌లో నగల దుకాణంలో విలువైన రత్నాలను ఆయన దొంగిలించారు. అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ భారతదేశానికి వచ్చి అశోకా హోటల్‌లో బస చేసిన సమయంలోనే చార్లెస్ ఈ నేరానికి పాల్పడ్డారు.

చార్లెస్‌ని అరెస్ట్ చేసిన మధుకర్ జెండే మాట్లాడుతూ "చార్లెస్ అక్కడ కాబరే డ్యాన్సర్‌తో స్నేహం చేసి, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. నగల దుకాణం యజమానికి తాను నేపాల్ యువరాజునని, షాపులోని రత్నాలను గదికి పంపించాలని చెప్పారు. దుకాణ ఉద్యోగి ఒకరు రత్నాలతో గదికి వచ్చారు. అయితే, కాఫీలో మత్తుమందు కలిపి ఆ వ్యక్తికి స్పృహ లేకుండా చేశారు చార్లెస్" అని గుర్తుచేసుకున్నారు.

"తర్వాత వజ్రాలన్నీ తీసుకుని చార్లెస్ పారిపోయారు. ఉద్యోగి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో దుకాణ యజమాని చార్లెస్ గది వద్దకు వచ్చారు. అక్కడ గది తలుపులు వేసి ఉండటం చూశారు. హోటల్ గదిని డూప్లికేట్ తాళంతో తెరిచి చూడగా..దుకాణ ఉద్యోగి అపస్మారక స్థితిలో కనిపించారు. అయితే, అక్కడే ఒక పాస్‌పోర్ట్‌ కనిపించింది, దానిపై చార్లెస్ శోభరాజ్ అని ఉంది'' అని మధుకర్ తెలిపారు.

హెన్రీ కిస్సింగర్, అప్పటి యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్

తీహార్‌లో శోభరాజ్‌దే రాజ్యం

హోటల్లో దొంగతనం తరువాత చార్లెస్‌ను అరెస్ట్ చేశారు. కానీ దిల్లీ పోలీసులు ఆయనను ఎక్కువ కాలం కస్టడీలో ఉంచలేకపోయారు. కడుపునొప్పి వచ్చినట్లు నటించి, పోలీసులకు తెలియకుండా వెల్లింగ్టన్ ఆస్పత్రి నుంచి తప్పించుకున్నారు చార్లెస్.

తరువాత ఎట్టకేలకు పోలీసులు చార్లెస్‌ను 1976లో అరెస్ట్ చేయగలిగారు. ఆ సమయంలో ఆయన ఫ్రెంచ్ పర్యటకుల పాసుపోర్టులను చోరీ చేస్తూ పోలీసులకు చిక్కాడు. దిల్లీలోని విక్రమ్ హోటల్లో ఫ్రెంచ్ పర్యటకులకు మత్తుమందు ఇచ్చి చార్లెస్ పాస్‌పోర్టులు చోరీ చేయాలని భావించారు. కానీ టూరిస్టులకు సకాలంలో మెలకువరావడంతో చార్లెస్ ఎత్తుగడ ఫలించక, పోలీసులకు చిక్కారు. తరువాత ఆయనను దిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు.

దేశంలోని అత్యంత ప్రసిద్ధ జైళ్లలో తీహార్ ఒకటి. కానీ చార్లెస్ శోభరాజ్ కొద్దికాలంలోనే ఈ జైలులో తన 'సామ్రాజ్యాన్ని' నిర్మించుకున్నారు.

"చార్లెస్‌ను ఎప్పుడూ సెల్‌లో ఉంచలేదు. ఆయన ఎక్కువగా పరిపాలనా కార్యాలయంలోనే కూర్చునేవారు. చార్లెస్ దోపిడీల గురించి నా స్నేహితులు తరచుగా మాట్లాడుతుండేవారు. నేను కూడా ఒక సమయంలో ఆయన ద్వారా లాభపడ్డానని వారికి తెలియదు" అని సునీల్ గుప్తా అన్నారు.

"ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లేవారు. జైలు సూపరింటెండెంట్‌తో పాటు కిందిస్థాయి ఉద్యోగులను కూడా సమానంగా చూసేవారు. ఆయన వద్ద ఒక టేప్ రికార్డర్ ఉండేది. అందులో జైలు అధికారులు లంచాలు అడగడాన్ని ఆయన రికార్డు చేశారు" అని సునీల్ చెప్పారు.

'చార్లెస్ సాహెబ్'

సునీల్ గుప్తా మాట్లాడుతూ "శోభరాజ్ 10 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు గల సెల్‌లో ఒంటరిగా ఉన్నారు. జైలులో ఆయనకు సీ క్లాస్ ఖైదీలను సేవకులుగా ఇచ్చారు. వారు ఆయనకు మసాజ్ చేసేవారు, బట్టలు ఉతికేవారు, వంట కూడా చేసి పెట్టేవారు. ఆయన సెల్‌లో పుస్తకాల షెల్ఫ్ ఉండేది. అతనికి మంచం, టేబుల్, కుర్చీ కూడా ఇచ్చారు. అతని సెల్ స్టూడియో అపార్ట్‌మెంట్ మాదిరి ఉండేది. ఖైదీలు, జైలు సిబ్బంది తరపున ఆయన పిటిషన్లు రాసేవారు" అని చెప్పారు.

"అసలు లాయర్లు రాసే పిటిషన్ల కంటే ఆయన రాసిన పిటిషన్లు ఎక్కువ ప్రభావం చూపేవి. ఖైదీలకు డబ్బు అవసరమైతే శోభరాజ్ ఇచ్చేవారు. అందుకే అతను తనకు తాను ఖైదీలకు, జైలు సిబ్బందికి నాయకుడిగా భావించేవారు" అని సునీల్ చెప్పారు.

తీహార్‌లో ఖైదీలు ఆయనను 'చార్లెస్ సాహెబ్' అని పిలిచేవారు.

చార్లెస్ శోభరాజ్

ఫొటో సోర్స్, Getty Images

జైల్లో శోభరాజ్ నిర్ణయమే ఫైనల్

తీహార్ జైల్లో శోభరాజ్ మాటకు తిరుగులేదని, అంతిమ నిర్ణయం ఆయనదే అని 1981 సెప్టెంబరులో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక వార్త ప్రచురించింది.

శోభరాజ్, ఆయన స్నేహితులు జైలునే తమ స్థావరంగా మార్చుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) అదే ఏడాది ఓ రిపోర్టులో తెలిపింది.

''ఎవరైనా వారిని వ్యతిరేకిస్తే శోభరాజ్, ఆయన స్నేహితులు వారిని కొట్డానికి కూడా వెనకాడరు. బ్యాంకు దోపిడీదారులు సునీల్ బాత్రా, విపిన్ జగ్గి, రవి కపూర్ శోభరాజ్ మిత్రబృందంలో ఉన్నారు. వాళ్లంతా మంచి కుటుంబాల నుంచి వచ్చారు. బాగా చదువుకున్నవారు'' అని పీయూసీఎల్ తెలిపింది.

రాకేశ్ కౌశిక్ కేసులో దిల్లీ హైకోర్టు చార్లెస్ పేరు చెప్పకుండా ఇంటర్‌పోల్ వెతుకుతున్న విదేశీ ఖైదీ అని తెలిపింది.

''ఈ విదేశీయునికి జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ మద్దతు ఉంది. వారి ఆఫీసులను ఆనుకుని ఉన్న గదుల్లోనే ప్రతిరోజూ బయటివాళ్లతో ఆయన సమావేశాలు జరుపుతున్నారు. తన గదిలో లైంగిక కార్యకలాపాలకూ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆ ఖైదీని అనుమతిస్తున్నారు'' అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

''అలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ఆ ఖైదీ నుంచి జైలు సూపరింటెండెండ్, ఆయన కిందిస్థాయి అధికారులు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బలు తీసుకుంటున్నారు. తన రెండు పుస్తకాలు ప్రచురించిన తర్వాత ఆ విదేశీ ఖైదీ సంపన్నుడయ్యారు'' అని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.

కూతురు మురియల్ అనౌక్‌తో చార్లెస్ శోభరాజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కూతురు మురియల్ అనౌక్‌తో చార్లెస్ శోభరాజ్

శోభరాజ్‌ వద్దకు హోంమంత్రి

చార్లెస్ శోభరాజ్ స్నేహితురాలు షిరిన్ వాకర్. ఆయన ఆమెను భారత్‌కు ఆహ్వానించారు. ఆమె ఎప్పుడు దిల్లీ వచ్చినా ఫైవ్ స్టార్ హోటల్‌లోనే ఉండేవారు.

''వరుసగా ఆరు రోజుల పాటు షిరిన్ వాకర్ గంటల తరబడి చార్లెస్ శోభరాజ్‌ను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గదిలో కలుసుకున్నారు'' అని పీయూసీఎల్ రిపోర్టు తెలిపింది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో శోభరాజ్ వార్త వచ్చిన తర్వాత అప్పటి హోం మంత్రి జ్ఞానీ జైల్ సింగ్ తీహార్ జైలును ఆ రాత్రి సందర్శించాలని అకస్మాత్తుగా నిర్ణయించుకున్నారు.

''సెప్టెంబరు 1న రాత్రి ఏడున్నర గంటల సమయంలో హోంమంత్రి వచ్చారని చెప్పేందుకు ఒక గార్డు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ఆయన్ను లోపలకి అనుమతించాలా అని అడిగారు'' అని సునీల్ గుప్తా గుర్తుచేసుకున్నారు.

''ఇప్పుడా మాట వినడానికి విచిత్రంగా ఉంది కానీ, జైలు అధికారుల అనుమతి లేకుండా జైల్లోకి ఎవరినీ రానివ్వకూడదని తీహార్ జైల్లోని ప్రతి గార్డుకూ శిక్షణ ఇచ్చినట్టు అక్కడ పరిస్థితులు తెలియజేస్తున్నాయి. భారత హోం మంత్రిని సైతం బయట ఎదురు చూడాలని గార్డు చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది'' అని ఆయన తెలిపారు.

''నేను గేటు దగ్గరకు పరిగెత్తాను. చార్లెస్ శోభరాజ్ సెల్ దగ్గరకు నన్ను తీసుకెళ్లాలని ఆయన కోరారు. శోభరాజ్‌ను కలిసిన వెంటనే ఆయన హిందీలో అడిగిన ప్రశ్న ''ఎలా ఉన్నావు? నీకిక్కడ ఏమన్నా సమస్య ఉందా?''అని. నేను ఆ మాటలను అనువదించి శోభరాజ్‌కు చెప్పాను. తాను బాగున్నానని, ఎలాంటి సమస్యలూ లేవని శోభరాజ్ ఇంగ్లీషులో బదులిచ్చారు'' అని సునీల్ గుప్తా చెప్పారు.

కేంద్ర హోం మంత్రి జైల్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అప్పటి కేంద్ర హోం మంత్రి జైల్ సింగ్ అర్థరాత్రి తీహార్ జైలును ఆకస్మికంగా సందర్శించారు.

సునీల్ గుప్తా సస్పెన్షన్

''నేను జైల్ సింగ్‌ని తర్వాతి వార్డుకు తీసుకెళ్లా. అక్కడ భజ్జీ, దినా అనే ఇద్దరు ఖైదీలు ఉన్నారు. వారు అకస్మాత్తుగా ''చాచా నెహ్రూ జిందాబాద్'' అని అరవడం ప్రారంభించారు.

జైల్‌సింగ్ సెక్రటరీ వాళ్లను పక్కకు తీసుకెళ్లారు. 'ఇక్కడ అన్నీ దొరుకుతాయి. డ్రగ్స్, ఆల్కహాల్, ఎవరేం కోరుకుంటే అది' అని వారు చెప్పారు. ''జైలు లోపలకి ఎంత తేలిగ్గా అది తెచ్చుకోవచ్చో తెలియజేస్తూ ఖైదీలు ఖాళీ లిక్కర్ బాటిల్ మంత్రి సెక్రటరీకి చూపించారని మరుసటిరోజు వార్తాపత్రికలో వచ్చింది''

''ఇది జరిగిన రెండు రోజుల తర్వాత హోం మంత్రిత్వశాఖ కార్యాలయం ఆరుగురు తీహార్ జైలు అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో నేనొకరిని. ఆ ఖైదీలు మంత్రి ముందుకు రావడం నాకు సంబంధం లేని విషయమని నేను నిరసన వ్యక్తంచేశా. ఒకటిన్నర నెల తర్వాత నన్ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు''

సస్పెన్షన్ సమయంలో కూడా చార్లెస్ శోభరాజ్ సునీల్ గుప్తాతో టచ్‌లో ఉన్నారు. ఆయనకు ఆర్థిక సాయం చేస్తానన్నారు. కానీ సునీల్ గుప్తా అందుకు అంగీకరించలేదు.

తీహార్ జైలులో చార్లెస్

ఫొటో సోర్స్, Getty Images

తీహార్ జైలు నుంచి పరారీ

భద్రతాసిబ్బంది కళ్లు గప్పి తీహార్ జైలు నుంచి చార్లెస్ శోభరాజ్ 1986, మార్చి 16న తప్పించుకున్నారు.

దీనిగురించి మొదట హెచ్చరించింది కానిస్టేబుల్ ఆనంద్ ప్రకాశ్. డిప్యూటీ సూపరింటెండెండ్ ఆఫీసు బెల్ నొక్కిన తర్వాత ఆయన నోటి నుంచి ఎలాంటి మాటలు రాలేదు. 'తొందరగా పరుగెత్తుకుంటూ రండి' ఆయన నోటి నుంచి వచ్చింది ఈ మాటొక్కటే.

''జైలు గేట్లన్నీ తెరిచి ఉన్నాయి. డ్యూటీ ఆఫీసర్ శివరాజ్ యాదవ్ సహా గేట్ దగ్గర కాపలా ఉండే గార్డు, భద్రతా సిబ్బంది..ఇలా జైలు సిబ్బంది మొత్తం నిద్రపోతున్నారు లేదంటే ఆశ్చర్యంతో నిలబడి కనిపించారు. జైలు గేటు తాళాలు అవి ఉండాల్సిన చోట లేవు'' అని జైలు నంబర్ 3 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ వీడీ పుష్‌కర్ణ చెప్పారు.

తీహార్ జైలు దగ్గర తమిళనాడు పోలీసులను మోహరించారు. వాళ్లు ఉత్తర భారతదేశపు క్రిమినల్స్‌తో కలిసిపోరు. కానీ వారు కూడా స్పృహ కోల్పోయి ఉన్నారు.

తీహార్ జైలో ఉన్న 900 మంది ఖైదీల్లో 12 మంది ఆరోజు తప్పించుకుపోయారు.

చార్లెస్ శోభరాజ్

ఫొటో సోర్స్, Getty Images

మిఠాయిల్లో మత్తుమందు

''ఆ రోజు నేను ఇంట్లో దూరదర్శన్‌లో సినిమా చూస్తున్నా. హఠాత్తుగా సినిమా ఆగిపోయి చార్లెస్ శోభరాజ్ తీహార్ జైలు నుంచి తప్పించుకుపోయారనే ప్రకటన వచ్చింది. నేను వెంటనే జైలు దగ్గరకు వెళ్లాను. అక్కడ గమనించిన విషయం ఏంటంటే స్పృహ కోల్పోయి ఉన్న ప్రతి భద్రతా సిబ్బంది చేతిలో 50 రూపాయల నోటు ఉంది'' అని సునీల్ గుప్తా గుర్తుచేసుకున్నారు.

''తన పుట్టినరోజు వేడుకలని చెబుతూ శోభరాజ్ మొదట కానిస్టేబుళ్లకు 50 రూపాయల నోటును ఎరగా ఇచ్చి, తర్వాత డ్రగ్స్ కలిపిన స్వీట్లు వారికి ఇచ్చాడని ఊహించాం''

''ఇద్దరు వ్యక్తులు జైలు దగ్గరకు వచ్చారు, ఓ ఖైదీ బర్త్ డే వేడుకల్లో భాగంగా అందరికీ స్వీట్లు, పండ్లు పంచిపెట్టాలని కోరారు. వార్డెన్ శివరాజ్ యాదవ్ అనుమతి ఇచ్చిన తర్వాత మత్తు కలిపిన స్వీట్లను యాదవ్‌తో పాటు ఇతర గార్డులకు ఇచ్చారు. స్వీట్లు తిన్న తర్వాత అందరూ స్పృహ తప్పిపడిపోయారు. కొన్ని గంటలు గడిచాకే వారు స్పృహలోకి రాగలిగారు'' అని దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అజయ్ అగర్వాల్ మీడియాకు చెప్పినట్టు సునీల్ గుప్తా తెలిపారు.

''బ్రిటిష్ పౌరుడు డేవిడ్ హాల్ తీహార్ జైలు నుంచి కొన్ని రోజుల క్రితం విడుదలయినట్టు దర్యాప్తులో తేలింది. డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలపై ఆయన అరెస్టయ్యారు. శోభరాజ్, ఆయన స్నేహితులయ్యారు. డేవిడ్ హాల్ బెయిల్ పిటిషన్‌ వేయడంలో శోభరాజ్ సాయం చేయడంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది'' అని సునీల్ గుప్తా చెప్పారు.

''శోభరాజ్ పారిపోయేముందు ఆయన్ను హాల్ కలుసుకున్నట్టు, ఒక ప్యాకెట్ ఇచ్చినట్టు రికార్డుల్లో ఉంది. హాల్‌కు కేవలం 12వేల రూపాయలకే బెయిల్ లభించింది. సాధారణ నేరస్థులు బెయిల్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తారు. కానీ హాల్ తీహార్ జైలుకు తిరిగి వచ్చి శోభరాజ్ తప్పించుకునేందుకు సాయపడ్డారు'' అని సునీల్ గుప్తా తెలిపారు.

''తీహార్ జైలు బయట శోభరాజ్ కోసం ఓ కారు ఉంది. తీహార్ జైలు కానిస్టేబుల్ ఒకరిని కిడ్నాప్ చేసి శోభరాజ్ తన వెంట తీసుకెళ్లారు. దీంతో పోలీసుల అనుమతితోనే శోభరాజ్ జైలు నుంచి బయటకు వెళుతున్నారని, తాము అనుకున్నామని తమిళనాడు పోలీసులు చెప్పారు'' అని సునీల్ గుప్తా వివరించారు.

శోభరాజ్

ఫొటో సోర్స్, Getty Images

గోవాలో అరెస్టు

ఒక రిపోర్టు ప్రకారం, శోభరాజ్ లార్పోస్' అనే మత్తు బిళ్లలను వినియోగించాడు. సిబ్బందికి ఇచ్చిన స్వీట్లలో 820 దాకా మాత్రలను కలిపారు.

ఈ సంఘటన తర్వాత, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ హెచ్‌కెఎల్ కపూర్, పోలీస్ కమిషనర్ వేద్ మార్వా తీహార్ జైలును సందర్శించి, విడి పుష్కర్ణ, మరో ఐదుగురు అధికారుల అరెస్టుకు ఆదేశించారు.

కానీ, శోభరాజ్ తీహార్ జైలు బయట 23 రోజులు మాత్రమే ఉండగలిగారు. తర్వాత ఆయన గోవాలోని ఒక రెస్టారెంట్‌లో ఉండగా, ముంబయికి చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ మధుకర్ జెండే అరెస్టు చేశారు.

శోభరాజ్ ఒకోకెరా రెస్టారెంట్‌కు రావచ్చని వారికి ఉప్పందండంతో కాపుకాసి అరెస్టు చేశారు.

"ఏప్రిల్ 6వ తేదీ రాత్రి 10:30 గంటలకు టీవీలో ఇండియా-పాకిస్తాన్ హాకీ మ్యాచ్ ప్రసారమవుతోంది. హోటల్‌లో ఒక పెద్ద హాల్ ఉంది. అక్కడే ఒక ఇన్నర్ రూమ్ కూడా ఉంది. మేం అందులో కూర్చుని ఉన్నాం" అని జెండే ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నారు.

"గేటు బయట టాక్సీ నుంచి ఇద్దరు వ్యక్తులు దిగడం నేను చూశాను. వాళ్ళు టోపీ ధరించి ఉన్నారు. రాత్రివేళ ఆ టోపీలు ఎందుకు ధరించారా అని నేను ఆశ్చర్యపోయాను. ఇంకాస్త ముందుకు వచ్చాక ఒక వ్యక్తి చార్లెస్ శోభరాజ్ లాగా కనిపించారు. ఆయన స్నేహితుడు డెవిడ్ హాల్ కూడా పక్కనే ఉన్నారు. ఆయన్ను చూడగానే నా గుండె దడదడలాడింది. నేను ఒక్క ఉదుటన లేచి వెనుక నుండి ఆయనను పట్టుకుని, 'చార్లెస్' అని అరిచాను" అని జెండే వివరించారు. అందుకు ఆ వ్యక్తి చార్లెస్ ఎవరు?' అని అడిగారు. వెంటనే నేను 'యూ బ్లడీ చార్లెస్ శోభరాజ్' అన్నాను. దానికి ఆయన 'నీకు పిచ్చి పట్టిందా?' అన్నారు. '' 1971లో నిన్ను పట్టుకున్న జెండేను నేనే' అన్నాను. నేను అలా చెప్పడంతో ఆయన ధైర్యం కోల్పోయారు." అని జెండే వివరించారు.

" అప్పుడు మేం సంకెళ్లు కూడా తీసుకుని రాలేదు. ఏదైనా తాడు ఉంటే ఇవ్వమని హోటల్ యజమానిని అడిగాం. తాడుతో కట్టివేసి, చార్లెస్‌ను పట్టుకున్నామని చెప్పడానికి కమిషనర్‌కు ఫోన్ చేశా." అని జెండే వెల్లడించారు.

గోవాలో చార్లెస్ శోభరాజ్‌ని మధుకర్ జెండే అరెస్టు చేశారు

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, గోవాలో చార్లెస్ శోభరాజ్‌ని అరెస్ట్ చేసిన మధుకర్ జెండే

జైలులో సంకెళ్లు

దిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ అమోద్ కాంత్, శోభరాజ్‌ను జెండే నుంచి అదుపులోకి తీసుకుని ప్రత్యేక విమానంలో దిల్లీకి తీసుకువచ్చారు. తప్పించుకున్న కారణంగా శోభరాజ్‌కు జైలు శిక్ష పెరిగింది.

మరణ శిక్షకు అవకాశం ఉండే కేసులున్న థాయిలాండ్‌కు అతని అప్పగింత నిలిచి పోయింది. తీహార్ జైలుకు తిరిగి వచ్చిన తర్వాత అతని స్వేచ్ఛకు పూర్తిగా కోతపడింది. ఇతర ఖైదీల నుంచి వేరుచేసి, చేతికి సంకెళ్లు వేసి ఉంచారు. సెక్యూరిటీ లేకుండా ఎక్కడికీ కదలకుండా నిషేధించారు. కానీ, కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆయన బయటి వ్యక్తులతో మాట్లాడుతుండేవారు.

ఇండియా టుడే తన సెప్టెంబర్ 1986 సంచికలో ఇలా రాసింది.

"చార్లెస్ వీలైనంత ఎక్కువ సమయం కోర్టులో గడపాలని కోరుకునేవారు. దీనివల్ల ఆయనకు సంకెళ్ల నుంచి కాస్త విముక్తి లభించేది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు తనకు ఇష్టమైన ఆహారం పెట్టాలని కోర్టును కోరేవారు. తన న్యాయవాది స్నేహ్ సెంగర్‌ను కలిసేవారు. తన కేసుకు సంబంధించిన ఫైళ్లను చూడాలని డిమాండ్ చేసి వాటిని తీసుకుంటుండేవారు." అని రాసింది.

"అతని దృష్టి పాలిథిన్ సంచిలో తన కోసం తెచ్చిన చికెన్ బిర్యానీ వైపు మళ్లేది. తరువాత తనకు లిమ్కా కావాలని అక్కడి వ్యక్తిని అడిగేవారు." అని పేర్కొంది.

జైలులో అంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న సమయంలో కూడా ఆయన దగ్గర కొంత గంజాయి దొరికింది. రెండు బ్రెడ్ ముక్కల మధ్య అది ఆయన దగ్గరకు చేరింది. దీనికి బాధ్యులైన ఇద్దరు కానిస్టేబుళ్లను మొదట సస్పెండ్ చేసి, తరువాత ఉద్యోగం నుంచి తొలగించారు.

కిరణ్ బేడి

ఫొటో సోర్స్, Getty Images

కిరణ్ బేడి బదిలీ

తీహార్ జైలు ఐజీ కిరణ్ బేడీ బదిలీకి చార్లెస్ శోభరాజ్ కారణమని సునీల్ గుప్తా అన్నారు.

కిరణ్ బేడీ ఆయన్ను తీహార్ జైలులోని లీగల్ సెల్‌కు అటాచ్ చేశారు.

ఖైదీల పిటిషన్లను టైప్ చేయడానికి ఆయనకు టైప్‌ రైటర్ ఇచ్చారు.

ఇందులో చట్ట విరుద్ధమైనది ఏమీ లేదు. అయితే, బదిలీకి కారణం ఏమిటంటే, టైప్‌రైటర్ అనే ఒక విలాసవంతమైన వస్తువు ఆయన చేతికి రావడంతో, తన దోపిడీలు కీర్తించుకుంటూ ఆయన పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. ఆయనకు ఈ సౌకర్యం కల్పించినందుకు కిరణ్ బేడీని మరో చోటకు బదిలీ చేశారు.

చార్లెస్ శోభరాజ్

ఫొటో సోర్స్, Getty Images

నేపాల్ జైలులో 19 సంవత్సరాలు

తీహార్ జైలులో 20 సంవత్సరాలు గడిపిన తర్వాత, చార్లెస్ శోభరాజ్ 1997 ఫిబ్రవరి 17న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.

ఆ సమయంలో ఆయన వయస్సు 53 సంవత్సరాలు. కానీ, ఆయన కష్టాలు అక్కడితో ముగియలేదు. ఆరేళ్ల తరువాత 2003 లో ఆయన్ను మళ్లీ నేపాల్‌లో అరెస్టు చేశారు.

2022 డిసెంబర్ 21న నేపాల్ సుప్రీంకోర్టు ఆయన్ను విడుదల చేయాలని ఆదేశించింది.

అక్కడి నుంచి ఆయన్ను ఫ్రాన్స్‌కు పంపారు. ఇప్పటికీ ఆయన అక్కడే నివసిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)