గ్రీన్‌ల్యాండ్: మంచు నిండిన ఇక్కడి పర్వతాల కింద టన్నుల కొద్ది బంగారం ఉందా, అందుకే ట్రంప్ దీనిపై కన్నేశారా?

నలునాక్ పర్వతం దగ్గరున్నమైనింగ్
    • రచయిత, అడ్రియన్ ముర్రే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గ్రీన్‌ల్యాండ్‌ ప్రాంతం తమ నియంత్రణలోకి వస్తుందని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఆర్కిటిక్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆర్థిక భద్రతను కారణంగా చూపుతున్నారాయన.

మరోవైపు డెన్మార్క్ ఆధీనంలో స్వతంత్ర ప్రాంతంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ అమ్మకానికి సిద్ధంగా లేదని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే, ఇక్కడున్న విస్తారమైన ఖనిజ వనరులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉంది.

గ్రీన్‌ల్యాండ్‌లో దక్షిణ భాగం అంచున సముద్ర తీర ప్రాంతాలు, హిమనీ నదాల గుండా ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా బూడిద రంగులో శిఖరాలు మా ముందు కనిపించాయి.

'' చాలా ఎత్తుగా ఉన్న ఈ పర్వతాలు గోల్డ్ బెల్టులు'' అని మైనింగ్ కంపెనీ అమరోఖ్ మినరల్స్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే ఎల్దుర్ ఒలాఫ్సన్ అన్నారు.

రెండు గంటల పాటు ప్రయాణించిన తర్వాత నలునాక్ పర్వతం కింద ఒక మారుమూల లోయకు చేరుకున్నాం. అక్కడ అమరోఖ్ మినరల్స్‌ సంస్థ బంగారం కోసం డ్రిల్లింగ్ చేస్తోంది.

చుట్టుపక్కల ఉన్న పర్వతాలను, లోయలను తవ్వుతున్నారు. ఇతర విలువైన ఖనిజాల కోసం అన్వేషిస్తోంది ఆ సంస్థ. 10 వేల చదరపు కి.మీల విస్తీర్ణానికి పైగా ఖనిజాల అన్వేషణ కోసం ఇది లైసెన్సులను పొందింది.

''మేం కాపర్, నికెల్ లాంటి అరుదైన ఖనిజాల కోసం చూస్తున్నాం'' అని ఒలాఫ్సన్ చెప్పారు.

ఈ ప్రాంతం పెద్దగా ఎవరికీ తెలియదని, ఇక్కడ మరిన్ని వనరులు ఉండే అవకాశం ఉందని ఆయన వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నలునాక్ పర్వతం
ఫొటో క్యాప్షన్, నలునాక్ పర్వతం వద్ద మైనింగ్‌కు సంబంధించిన నిర్మాణాలు

నలునాక్ పర్వతం దిగువన, కంపెనీ తన క్యాంపులను ఏర్పాటు చేసింది. అక్కడే తాత్కాలిక భవనాలను, గుడారాలను వేసింది.

ఇక్కడ 100 మందికి పైగా ఉద్యోగులున్నారు. వీరందరూ గ్రీన్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో పని చేసిన మాజీ కోల్ మైనర్లు.

క్యాంపుల నుంచి లోయకు వెళ్లేందుకు రోడ్లు ఉన్నాయి. పర్వతంలోకి ఒక చీకటి సొరంగం కూడా ఉంది. దీనిగుండానే, గోల్డ్ మైన్‌లోకి తాము వెళ్లగలుగుతున్నామని చెప్పారు.

''ఇక్కడ చూడండి! బంగారం, బంగారం, బంగారం. ఎక్కడ చూసినా బంగారమే. ఇది అద్భుతం కాదా?'' అని ఒలాఫ్సన్ మార్వెల్స్ అన్నారు.

2015లో ఈ మైన్‌ను అమరోఖ్ మినరల్స్ కొనుగోలు చేసింది. దీనికి ముందు కూడా చాలా ఏళ్లుగా ఈ సంస్థ తన కార్యకలాపాలను అక్కడ సాగించింది.

అయితే, బంగారం ధరలు తగ్గిపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఇక్కడి కార్యకలాపాలను నిలిపేసింది. ప్రస్తుతం ఈ గని తమకు లాభాదాయకమని, ఈ ఏడాది ఉత్పత్తిని పెంచుతామని అమరోఖ్ చెప్పారు.

ఇక్కడొక కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌ను కూడా కంపెనీ ఏర్పాటు చేసింది.

''ప్రతినెలా శుద్ధి చేసిన బంగారంతో నిండిన సూట్‌కేసునుగానీ, 30 వేల టన్నుల బంగారు ముడి ఖనిజాన్నిగానీ రవాణా చేయగలం.'' అని ఒలాఫ్సన్ వివరించారు.

గ్రీన్‌ల్యాండ్‌లో మంచి సంపద ఉందని, ఇక్కడి ఖనిజ వనరులు చాలా వరకు వెలికితీయకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయని ఆయన అన్నారు.

అది మాత్రమే కాదు, భవిష్యత్‌లో పశ్చిమ దేశాలకు అవసరమైన అన్ని ఖనిజ వనరులు గ్రీన్‌ల్యాండ్‌లో దొరుకుతాయని ఒలాఫ్సన్ చెప్పారు. అవే, గ్రీన్‌ల్యాండ్‌కు ప్రత్యేక హోదా అందిస్తాయని అన్నారు.

అయితే, ప్రస్తుతం ఈ మొత్తం ద్వీపంలో కేవలం రెండు గనులు మాత్రమే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. డెన్మార్క్‌కు చెందిన స్వతంత్ర ప్రాంతమే గ్రీన్‌ల్యాండ్. ఈ ప్రాంతంలో ఉన్న సొంత వనరులను అదే చూసుకుంటుంది.

నలునాక్ మైన్ వద్ద గుడారాలు
ఫొటో క్యాప్షన్, నలునాక్ మైన్ వద్ద గుడారాలు

అరుదైన ఖనిజాల నిల్వలలో గ్రీన్‌ల్యాండ్ ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ అరుదైన ఖనిజాలను ఫోన్ల నుంచి బ్యాటరీలు, ఎలక్ట్రిక్ మోటార్ల వరకు అనేక వస్తువుల తయారీలో ఉపయోగించవచ్చు.

లిథియం, కోబాల్ట్ వంటి ఇతర నిత్యావసర ఖనిజాలు కూడా గ్రీన్‌ల్యాండ్‌లో పుష్కలంగా లభిస్తున్నాయి.గ్రీన్‌ల్యాండ్‌లో ఆయిల్, గ్యాస్ నిల్వలు కూడా చాలానే ఉన్నాయి.

అయితే, ఈ ప్రాంతంలో కొత్తగా డ్రిల్లింగ్ కార్యకలాపాలు చేపట్టడాన్ని నిషేధించారు. సముద్ర గర్భ మైనింగ్ కార్యకలాపాలను కూడా నిలిపివేశారు.

''ప్రపంచంలో అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌ల్యాండ్‌పై ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఆసక్తి పెరుగుతోంది.'' అని గ్రీన్‌ల్యాండ్ బిజినెస్ అసోసియేషన్ డైరెక్టర్ క్రిస్టియాన్ కెల్ట్‌సెన్ అన్నారు.

చైనా దగ్గర అరుదైన ఖనిజ నిల్వలు భారీగా ఉన్నాయి. పశ్చిమ దేశాలు తాము కూడా వీటికి ప్రత్యామ్నాయాలను సమకూర్చుకోవాలని భావిస్తున్నాయి.

నిత్యావసర ముడి వనరులను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడంలో చైనా ఆధిపత్య స్థానంలో ఉందన్నారు కెల్ట్‌సెన్. ఫలితంగా గ్రీన్‌ల్యాండ్ మినరల్స్‌ను కొనుగోలు చేయడంపై పశ్చిమ దేశాలలో ఆసక్తి పెరుగుతోందని ఆయన తెలిపారు.

ఇక్కడ చైనా ప్రమేయం ఉన్నా అది అంతంతమాత్రంగానే ఉందనీ, గత ఐదేళ్లుగా ఈ ప్రాంతంలో ఖనిజాలపై ఆసక్తి పెరుగుతోందని గ్రీన్‌ల్యాండ్ ట్రేడ్, కామర్స్, రా మినరల్స్ మినిస్టర్ నాజా నథానియెల్సెన్ చెప్పారు.

గ్రీన్‌ల్యాండ్ వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో మైనింగ్ అనుమతులు మంజూరు చేశారు. ఇక్కడున్న ఖనిజాల నిల్వలను అన్వేషించేందుకు కంపెనీలకు అనుమతిచ్చారు.

చాలా వరకు లైసెన్సులు బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలోని మైనింగ్ కంపెనీలకు దక్కాయి.

కేవలం ఒకే ఒక్క ప్రాంతంలో అమెరికాకు లైసెన్స్ లభించింది. ఈ ప్రాంతాలను గనులుగా మార్చేందుకు చాలా మార్గాలున్నాయి.

గ్రీన్‌ల్యాండ్

గ్రీన్‌ల్యాండ్ జీడీపీ ఏడాదికి 3 బిలియన్ డాలర్లకు ( సుమారు రూ.26 వేల కోట్లు) పైనే. ఇప్పటికీ ప్రభుత్వ రంగం, మత్స్య పరిశ్రమలే ఆర్థిక వ్యవస్థను నడపిస్తున్నాయి.

మైనింగ్ వల్ల మరింత రెవెన్యూ వస్తే, ఈ ప్రాంతానికి వార్షికంగా డెన్మార్క్ నుంచి వచ్చే 600 మిలియన్ డాలర్ల రాయితీపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని గ్రీన్‌ల్యాండ్‌లోని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. దీనివల్ల, స్వతంత్రంగానే ఏదైనా కార్యకలాపాలు చేపట్టేందుకు ఇది సాయపడుతుందని వారు అంటున్నారు.

గ్రీన్‌ల్యాండ్‌కు ఎక్కువగా ఆదాయం పర్యటక రంగం నుంచే వస్తుంది. అధికారికంగా స్వతంత్రాన్ని పొందేందుకు గ్రీన్‌ల్యాండ్‌కు ఈ మైనింగ్ చాలా కీలకమని యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్‌ల్యాండ్ ఆర్కిటిక్ సోషల్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ హెడ్ జేవియర్ అర్నాడ్ అన్నారు. కానీ, చాలా కొద్ది సంఖ్యలోనే మైనింగ్ లైసెన్స్‌లను జారీ చేసినట్లు చెప్పారు.

‘‘అమెరికా, ఈయూ వంటి దేశాలతో సంబంధాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఈ రంగంలోకి అంత ఎక్కువగా పెట్టుబడులు రాకపోవడాన్ని మీరు చూడొచ్చు’’ అని నథానియెల్సెన్ అన్నారు. వచ్చే పదేళ్లలో మూడు నుంచి ఐదు మైన్లను ఆపరేషన్‌లోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే, గ్రీన్‌ల్యాండ్‌లో మైనింగ్ చాలా పెద్ద సవాలు. ఎందుకంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు, కఠినమైన వాతావరణ పరిస్థితులు మైనింగ్‌కు సమస్యలుగా నిలుస్తాయి.

గ్రీన్‌ల్యాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. 80 శాతం మంచుతోనే నిండి ఉంటుంది. పర్వతాలు, జనావాసాల మధ్యలో రహదారులు లేకపోవడం సమస్యను మరింత పెంచుతున్నాయి.

''ఇది ఆర్కిటిక్ భూభాగం. పర్యావరణ మార్పులు, పరిమిత మౌలిక సదుపాయాలతో ఈ కఠినతరమైన పరిస్థితులు మనకు సమస్యగా నిలుస్తున్నాయి. మైన్‌ను తెరవడం ఇక్కడ చాలా ఖరీదైన వ్యవహారం.'' అని గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్‌లో జియోలాజికల్ సర్వే చేసిన జాకోబ్ క్లోవ్ కీడింగ్ చెప్పారు. ఈ ప్రాంతంలో ఖనిజ నిల్వలను ఆయన మ్యాప్ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా మెటల్స్‌కు ధరలు తగ్గుతుండటం కూడా ఇన్వెస్టర్లు వెనకాడేలా చేస్తోంది.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

పర్యావరణాన్ని కాపాడేందుకు గ్రీన్‌ల్యాండ్ కఠినమైన నిబంధనలను అనుసరిస్తోంది. స్థానిక కమ్యూనిటీలపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటోంది. దీనివల్ల, అనుమతులు ఆలస్యంగా లభిస్తున్నాయి.

చాలా కమ్యూనిటీలు మైనింగ్‌ను సపోర్టు చేస్తున్నాయని, ఎందుకంటే దీనివల్ల స్థానిక ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుందని నథానియెల్సన్ అన్నారు.

''విదేశీ మైనర్లు చాలా వరకు స్థానిక స్టోర్ల నుంచే వస్తువులను కొంటుంటారు. లోకల్ స్టాఫ్‌నే నియమించుకుంటుంటారు. స్థానిక పడవను లేదా హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుంటుంటారు.'' అని వివరించారు.

దేశానికి మైనింగ్ ఆదాయం రాదేమోనన్న భయం కూడా ప్రజల్లో ఉందని స్థానిక కార్మిక సంఘం ‘సిక్’ అధినేత జెస్ బెర్తెల్సన్ అన్నారు. ఇది గ్రీన్‌ల్యాండ్‌కు అంత మంచిది కాదని చెప్పారు.

''చేపలు పట్టడం నుంచే కాకుండా మరిన్ని మార్గాల్లో గ్రీన్‌ల్యాండ్‌కు ఆదాయం కావాలి'' అని బెర్తెల్సన్ అన్నారు.

అయితే, గ్రీన్‌ల్యాండ్ విషయంలో ట్రంప్ చర్యలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. ''అమెరికాతో కూడా మేం వ్యాపారం చేయాల్సి ఉంది. మైనింగే దానికి మార్గం'' అని గ్రీన్‌ల్యాండ్ ప్రధానమంత్రి మూడ్ ఎగెడే అన్నారు.

అయితే, ట్రంప్ పంపుతున్న సంకేతాలపై అనిశ్చితి దీర్ఘకాలం కొనసాగితే, పెట్టుబడులపై అది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)