గ్రీన్‌ల్యాండ్, పనామా కెనాల్‌లను స్వాధీనం చేసుకుంటానని బెదిరిస్తున్న ట్రంప్...

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, అలిస్ డేవిస్, మైక్ వెండ్లింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
గ్రీన్‌ల్యాండ్, పనామా కాలువల విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలేయకూడదని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సంకేతాలు ఇస్తున్నారు. ఇవి రెండు అమెరికా భద్రతకు అత్యంత కీలకమైనవని ఆయన చెబుతున్నారు.
గ్రీన్‌ల్యాండ్, పనామా కాలువను స్వాధీనం చేసుకునేందుకు సైనిక లేదా ఆర్థిక పరమైన బలాన్ని ప్రయోగిస్తారా అని రిపోర్టర్ ఒకరు అడిగిన ప్రశ్నపై స్పందించిన డోనల్డ్ ట్రంప్ ‘రెండూ కాదు’ అని సమాధానమిచ్చారు.
"అయితే ఓ విషయం చెబుతాను. ఆర్థిక పరమైన భద్రత కోసం అవి మనకు అవి అవసరం" అని ట్రంప్ అన్నారు. ఫ్లోరిడాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యల పట్ల ట్రంప్ ఎంత సీరియస్‌గా ఉన్నారా లేక వాటి కోసం బేరమాడే ఎత్తుగడలో ఇదొక భాగమా అనే దానిపై స్పష్టత లేదు.

తమ భూభాగాలను వదులుకోవాలన్న ప్రతిపాదనలకు అటు పనామా, ఇటు డెన్మార్క్ తిరస్కరించాయి.
కెనడాను కూడా అమెరికాలో కలుపుకుంటారా అని అడిగిన ప్రశ్నకు అవసరమైతే 'ఆర్థిక శక్తిని కూడా ప్రయోగిస్తాం' అని ట్రంప్ అన్నారు. కెనడా, అమెరికా మధ్య ఉన్న సరిహద్దు రేఖను ‘కృత్రిమంగా గీసిన రేఖ’ గా అభివర్ణించారు.
1700లో అమెరికాను కనుగొన్న తర్వాత కెనడాతో ఆ దేశం చేసుకున్న ఒప్పందం వల్ల ఈ రెండు దేశాల మధ్య ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దు రేఖ ఏర్పడింది.
కెనడా భద్రత కోసం అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తోందని ట్రంప్ అన్నారు. కెనడా నుంచి కార్లు, పాల ఉత్పత్తులు, కలపను దిగుమతిచేసుకోవడంపై విమర్శలు చేశారు.
"వారు కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలా ఉండాలి" అని రిపోర్టర్లతో అన్నారు.
రెండు దేశాలు కలిసిపోతాయనడానికి ‘పిసరంత అవకాశం కూడా లేద’ని పదవి నుంచి వైదొలగనున్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అన్నారు.
ట్రంప్ ఇంకా అనేక అంశాల పైనా స్పందించారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చాలని సూచించారు. విండ్ పవర్‌పై తన వ్యతిరేకతను మరోసారి స్పష్టం చేశారు. విండ్ టర్బైన్ల వల్ల సముద్రంలో తిమింగలాలు భయపడుతున్నాయని అన్నారు.
డోనల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ గ్రీన్‌ల్యాండ్‌ను సందర్శిస్తున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గ్రీన్‌ల్యాండ్ రాజధాని నూక్ చేరుకోవడానికి ముందు తాను ‘వ్యక్తిగత పర్యటన’ కోసం అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు వెళుతున్నట్లు ట్రంప్ జూనియర్ చెప్పారు. అధికారులతో ఎలాంటి సమావేశాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు.
ట్రంప్ జూనియర్ గ్రీన్‌ల్యాండ్ పర్యటన గురించి డెన్మార్మ్ ప్రధాని మీటీ ఫ్రెడరిక్సన్‌ను అడిగినప్పుడు, "గ్రీన్‌ల్యాండ్ స్థానిక ప్రజలకే చెందుతుంది, వారి భవిష్యత్‌ను వాళ్లే నిర్ణయించుకుంటారు’’ అని ఆమె అన్నారు.
"గ్రీన్‌ల్యాండ్ అమ్మకానికి పెట్టలేద’ని ఆమె అన్నారు. అయితే అదే సమయంలో నేటోలో కీలక సభ్యదేశంగా ఉన్న డెన్మార్క్, అమెరికాతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నార్త్ అమెరికా నుంచి యూరప్ దేశాలకు చేరుకోవడానికి గ్రీన్‌ల్యాండ్ దగ్గరి మార్గం. అమెరికా అంతరిక్ష ప్రయోగాలకు ఇది అతి పెద్ద కేంద్రం కూడా.
దీంతో పాటు ఇక్కడ బ్యాటరీలు, హైటెక్ వస్తువుల తయారీకి అవసరమైన ఖనిజ వనరులు భారీ స్థాయిలో ఉన్నాయి.
ప్రపంచమంతటా తిరుగుతున్న చైనా, రష్యా నౌకల రాకపోకల గురించి తెలుసుకోవడానికి, సైనిక కార్యక్రమాల కోసం ఈ ఐలండ్ చాలా కీలకమైనదని ట్రంప్ చెబుతున్నారు.
"నేను ఈ ప్రపంచాన్ని రక్షించడం గురించి మాట్లాడుతున్నా" అని ట్రంప్ అన్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి ట్రంప్ అమెరికా విస్తరణ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. అందులో భాగంగా పనామా కాలువను స్వాధీనం చేసుకుంటానని చెబుతున్నారు.
పనామా కాలువ అమెరికాకు కీలకమని, దీన్ని ఇప్పుడు చైనా నిర్వహిస్తోందని ట్రంప్ చెప్పారు.

ఫొటో సోర్స్, PANAMA CANAL AUTHORITY
గతంలో పనామా కాలువ గుండా ప్రయాణిస్తున్న అమెరికన్ నౌకల నుంచి డబ్బులు ఎక్కువగా వసూలు చేశారని ట్రంప్ ఆరోపించారు. పనామా కాలువ అట్లాంటింక్, పసిఫిక్ మహా సముద్రాలను కలుపుతోంది.
ట్రంప్ ఆరోపణల్ని పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తోసిపుచ్చారు. కాలువ నిర్వహణలో చైనా జోక్యం ఏమీ లేదన్నారు.
హాంకాంగ్‌కు చెందిన సీకే హచిసన్ హోల్డింగ్స్ పనామా కాలువకు రెండు వైపులా ఉన్న రెండు పోర్టులను నిర్వహిస్తోంది.
పనామా కాలువను 1900లో నిర్మించారు. 1977 దాకా ఈ ప్రాంతం అమెరికా స్వాధీనంలో ఉంది. జిమ్మీ కార్టర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కుదిరిన ఒప్పందాల వల్ల ఈ భూభాగాన్ని పనామాకు కేటాయించారు.
"పనామా కాలువను పనామాకు ఇవ్వడం చాలా పెద్ద తప్పిదం. కార్టర్ చాలా మంచి వ్యక్తి అయినప్పటికీ ఆయన ఈ తప్పు చేశారు" అని ట్రంప్ అన్నారు.
పనామా కాలువను తిరిగి తీసుకునే విషయంలో ట్రంప్ ఎంత సీరియస్‌గా ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. కెనడా విషయానికొస్తే, ఆ దేశంలో నాలుగు కోట్ల మందికిపైగా ప్రజలు జీవిస్తున్నారు. విస్తీర్ణంపరంగా అది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














