డ్రై పోర్ట్ అంటే ఏమిటి? తెలంగాణలో ఎక్కడ నిర్మించాలని అనుకుంటున్నారు

డ్రైపోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డ్రై పోర్ట్ ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, కమలాదేవి నల్లపనేని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సాధారణంగా ఓడ రేవులంటే సముద్ర ప్రాంతాలలో ఉంటాయి. కానీ, సముద్రం లేని చోట పోర్టులు నిర్మిస్తారా? దీనికి సమాధానమే డ్రై పోర్ట్.

పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమ అధికారుల బృందంతో కలిసి ఇటీవల దావోస్‌లో పర్యటించిన సమయంలో తెలంగాణలో డ్రై పోర్ట్ నిర్మిస్తామని ప్రకటించారు.

తెలంగాణకు తీరప్రాంతం లేని లోటును పూడ్చేందుకు డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని, ఆ పోర్టును మచిలీపట్నంతో రోడ్డు, రైలు మార్గాల ద్వారా అనుసంధానిస్తామని ప్రకటించారు.

డ్రై పోర్ట్ నిర్మాణంతో తెలంగాణను వేర్‌హస్ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.

డ్రై పోర్ట్ అంటే ఏమిటి?

డ్రై పోర్ట్‌ను ఇన్‌ల్యాండ్ పోర్ట్ లేదా మల్టీమోడల్ లాజిస్టిక్స్ సెంటర్ అని కూడా పిలుస్తారు.

డ్రై పోర్ట్‌లను రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఓడ రేవులకు అనుసంధానిస్తారు.

ఈ డ్రై పోర్ట్‌లు ఎగుమతి, దిగుమతులకు రవాణా కేంద్రంగా ఉంటాయి.

నౌకాశ్రయంలో రవాణా సంబంధిత కార్యకలాపాలు నిర్వహించినట్లే డ్రై పోర్ట్‌లో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.

అయితే అది సముద్రానికి దగ్గరగా ఉండదు కాబట్టి దీన్ని డ్రై పోర్ట్ అంటారు.

సీ పోర్టులో రద్దీని తగ్గించడానికి డ్రై పోర్ట్ ఉపయోగపడుతుంది.

కంటైనర్ యార్డులు, వేర్‌హౌస్‌లు, రైల్వే సైడింగ్స్, కార్గో నిర్వహణ సామగ్రి, ఎగుమతులు, దిగుమతుల క్లియరెన్స్‌కు డ్రై పోర్ట్‌లో అధికార యంత్రాంగం, ఇతర వ్యవస్థ ఉంటుంది.

సీ పోర్టు తరహాలోనే ఇక్కడా కస్టమ్స్ వ్యవస్థ ఉంటుంది.

తనిఖీలు, పేపర్ వర్క్, ఇతర లాంచనాలన్నీ ఇక్కడే పూర్తి చేస్తారు.

డ్రై పోర్ట్‌కు అనుసంధానించిన సీ పోర్ట్ ద్వారా నేరుగా వస్తువులు ఎగుమతి, దిగుమతి చేసుకోవచ్చు. డ్రై పోర్ట్ వల్ల సీ పోర్ట్‌లపై భారం తగ్గుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో డ్రై పోర్ట్ ఎక్కడ నిర్మిస్తారు..?

సంగారెడ్డిజిల్లా తూప్రాన్ సమీపంలోని మనోహరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం డ్రై పోర్ట్ నిర్మించబోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్ బీబీసీకి చెప్పారు.

ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్య పద్ధతిలో, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా డ్రై పోర్ట్ నిర్మిస్తాయని చెప్పారు.

ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీనిపై చర్చించారని తెలిపారు.

ఇప్పటికే 350 ఎకరాల భూసేకరణ పూర్తయిందన్నారు.

జాతీయ రహదారికి సమీపంలో ఉన్న మనోహరాబాద్ ప్రాంతం డ్రైపోర్టును రోడ్డు, రైలు మార్గం ద్వారా మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించడానికి అనువుగా ఉంటుందని జయేశ్ రంజన్ చెప్పారు.

డ్రైపోర్టు

ఫొటో సోర్స్, Getty Images

డ్రై పోర్ట్ ప్రతిపాదన ఎప్పటినుంచి ఉంది?

తెలంగాణ ఆవిర్భావం నుంచి డ్రై పోర్ట్ నిర్మాణం గురించి చర్చ జరుగుతోంది.

తర్వాత నల్గొండ జిల్లాలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది.

తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, చైనాకు చెందిన నిర్మాణరంగ సంస్థ శానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు మధ్య 2015 లో ఎంవోయూ కుదిరినట్టు బీఆర్ఎస్ వెబ్‌సైట్‌లో ఉంది.

డ్రై పోర్ట్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ-ఇప్పుడు టీజీఐఐసీ) దీనిపై అధ్యయనం జరిపి నాలుగు ప్రాంతాలను సూచించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా 2019లో ఓ కథనంలో తెలిపింది.

నల్గొండను తొలి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని టీఎస్ఐఐసీ సూచించింది. జహీరాబాద్, జడ్చర్ల, నిజామాబాద్‌ కూడా డ్రై పోర్ట్ నిర్మాణానికి అనువుగా ఉన్నాయని తెలిపింది.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, Telangana CMO

ఫొటో క్యాప్షన్, డ్రైపోర్టు ఏర్పాటుపై దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.

డ్రై పోర్ట్ ఏర్పాటుకు ప్రయత్నాలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి కూడా డ్రైపోర్టుపై చర్చ జరుగుతోంది. ఉత్తర తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని గత ఏడాది అక్టోబరులో బిజినెస్ లైన్ తన కథనంలో పేర్కొంది.

2021 జూలైలో కేసీఆర్ ప్రభుత్వం నల్గొండ దగ్గర 1,400 ఎకరాల్లో డ్రై పోర్ట్ నిర్మాణానికి ప్రతిపాదన ఆమోదించిందని కూడా ఆ కథనంలో తెలిపింది.

తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో డ్రై పోర్ట్‌పై ప్రకటన చేయడంతో మరోసారి దీనిపై చర్చ జరుగుతోంది.

తూప్రాన్ దగ్గరలోని మనోహరాబాద్‌ను డ్రై పోర్ట్ నిర్మాణానికి అనువైన ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించి భూసేకరణ జరిపిందని, ఫిబ్రవరిలో డ్రై పోర్ట్ నిర్మాణంపై విధివిధానాలు విడుదల చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు.

బందరు పోర్టు
ఫొటో క్యాప్షన్, మచిలీపట్నం పోర్టులోని జెట్టీ

డ్రై పోర్ట్‌తో ఉపయోగాలేమిటి?

డ్రై పోర్ట్ నిర్మాణం వల్ల తెలంగాణకు ఆర్థికంగా లాభం కలుగుతుందని విశాఖ పోర్ట్ ఇంజినీరింగ్అడ్వైజర్ ఎ.వేణు ప్రసాద్ తెలిపారు.

డ్రై పోర్ట్‌తో కార్గో నిర్వహణ, స్టోరేజ్, ప్రాసెసింగ్ వంటివి స్థానికంగా చేసుకునే వీలు కలుగుతుందని, మచిలీపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయని చెప్పారు.

తెలంగాణ డ్రై పోర్ట్‌ను అనుసంధానించాలని భావిస్తున్న మచిలీపట్నం పోర్ట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)