మిస్టర్ బీస్ట్, ఎలాన్ మస్క్: టిక్‌టాక్‌ను ఎవరు కొనబోతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లిల్లీ జమాలి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మిస్టర్ బీస్ట్‌గా పిలిచే అమెరికన్ యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్‌సన్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు తన లక్షలాది మంది టిక్‌టాక్ ఫాలోవర్లతో చెప్పారు.
‘నేను మీ కొత్త సీఈవో కావొచ్చు! చాలా ఉత్సాహంగా అనిపిస్తోంది’ అంటూ డొనాల్డ్‌సన్ ఒక ప్రైవేట్ జెట్‌లో కూర్చుని చెప్పారు.
అంతేకాదు, తన కొత్త ఫాలోవర్లలో ఐదుగురిని యాదృచ్ఛికంగా ఎంపిక చేసి రూ. 8.6 లక్షలు బహుమతిగా ఇచ్చారు. ఆయన పోస్ట్‌కు సోమవారం నుంచి 7.3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
అయితే, దీని గురించి వివరాలను పంచుకోలేనని డొనాల్డ్‌సన్ చెప్పారు.
‘అర్థం చేసుకోండి, ఇది క్రేజీగా ఉంటుంది’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
టిక్‌టాక్ కోసం చట్టం
టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వారిలో డొనాల్డ్‌సన్ ఒకరు. ఈ ప్లాట్‌ఫామ్ అమెరికా రాజకీయాల్లో ఇరుక్కుంది.
టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్‌డాన్స్ చైనాలో ఉంది. దీంతో 2024లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ జనవరి 19 సరికి టిక్‌టాక్‌ను బైట్‌డాన్స్ విక్రయించేయాలని.. లేదంటే అమెరికాలో నిషేధం ఎదుర్కోవాలనే చట్టాన్ని తీసుకొచ్చారు.
చైనా ప్రభుత్వంతో టిక్‌టాక్ సంబంధాలపై ఆందోళనలు వ్యక్తం చేసిన అమెరికా, ఈ యాప్ అమెరికా భద్రతకు ప్రమాదంగా పరిణమించవచ్చనే అనుమానంతో ఈ చట్టం తీసుకొచ్చింది.


ఫొటో సోర్స్, Reuters
మరోవైపు, టిక్‌టాక్ మనుగడ కోసం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ జాయింట్ వెంచర్ ఆలోచనను సూచించారు.
"అమెరికాలో 50 శాతం ఓనర్‌షిప్ ఉండాలని కోరుకుంటున్నా. ఇది చేస్తే టిక్‌టాక్‌ను రక్షించొచ్చు. సురక్షితమైన చేతుల్లో ఉంటుంది. దానిని ఇక్కడ కొనసాగించవచ్చు'' అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఆదివారం తెలిపారు.
టిక్‌టాక్ మరో 75 రోజుల పాటు యాక్టివ్‌గా ఉండేందుకు వీలు కల్పించే ఆర్డర్‌పై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు.
ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, ట్రంప్ మిత్రుడు ఎలాన్ మస్క్‌కు టిక్‌టాక్‌ను విక్రయించడం గురించి చైనా ఆలోచిస్తున్నట్లు ఈ నెల ప్రారంభంలో బ్లూమ్‌బర్గ్ రిపోర్టు చేసింది. మస్క్ ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(ట్విటర్)ను కొనుగోలు చేశారు.
''నేను చాలాకాలంగా టిక్‌టాక్ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఎందుకంటే అది వాక్ స్వాతంత్య్రానికి విరుద్ధం'' అని మస్క్ ఎక్స్‌లో పోస్టు చేశారు. "అమెరికాలో టిక్‌టాక్ ఆపరేట్ చేయడానికి అనుమతి దక్కింది కానీ, చైనాలో ఎక్స్‌ను అనుమతించకపోవడం బ్యాలెన్సింగ్‌గా లేదు. మారాల్సిన అవసరం ఉంది'' అని మస్క్ చెప్పారు.
మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఒక రిపోర్టర్ ట్రంప్‌ను ఎలాన్ మస్క్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడం మీకు సమ్మతమేనా? అని అడిగారు.
"అతను కొనాలనుకుంటే నాకు ఓకే" అని ట్రంప్ బదులిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
రేసులో ఒరాకిల్..
తనకు చాలాకాలంగా మద్దతుదారుడిగా ఉన్న ఒరాకిల్ చైర్మన్ లారీ ఎలిసన్ గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ "లారీ దానిని కొనుగోలు చేసినా ఇష్టమే" అని అన్నారు.
టిక్‌టాక్ ప్రధాన సర్వర్ ప్రొవైడర్‌లలో ఒరాకిల్ ఒకటి. బిలియన్ల కొద్దీ టిక్‌టాక్ వీడియోలను స్టోర్ చేసే డేటా సెంటర్‌లను నిర్వహించడంలో ఈ సంస్థ సహాయపడుతోంది.
టిక్‌టాక్‌ను నిషేధించడం వల్ల తన వ్యాపారానికి నష్టం వాటిల్లుతుందని గత ఏడాది ఒరాకిల్ హెచ్చరించింది. 2020లో ట్రంప్ టిక్‌టాక్ యాప్‌ను నిషేధించాలని ప్రయత్నించినపుడు ఒరాకిల్ కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది.
బిలియనీర్, పెట్టుబడిదారు ఫ్రాంక్ మెక్‌కోర్ట్ కూడా టిక్‌టాక్‌పై ఆసక్తి కనబరిచారు. చాలా నెలలుగా కొనుగోలు అవకాశాల గురించి మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
టిక్‌టాక్ తాను స్థాపించిన 'ప్రాజెక్ట్ లిబర్టీ ఇన్‌స్టిట్యూట్' పర్యవేక్షించే టెక్నాలజీతో పనిచేయాలని కోరుకుంటున్నట్లు మెక్‌కోర్ట్ చెప్పారు. సోషల్ మీడియా కంపెనీల డేటా సేకరణ పద్ధతులపై ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు.
అంతిమంగా, టిక్‌టాక్ అమెరికా కొనుగోలుదారుని ఎంచుకోవడంలో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ది ప్రధాన పాత్ర ఉండే అవకాశం ఉంది.
"డోనల్డ్ ట్రంప్‌కు రాజకీయంగా మద్దతు ఇచ్చే వ్యక్తికి దక్కొచ్చు" అని అమెరికాలోని జార్జ్‌టౌన్ లా స్కూల్ ప్రొఫెసర్ అనుపమ్ చందర్ అన్నారు.
50-50 ఉమ్మడి యాజమాన్యం అనే ఆలోచన చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదని చందర్ వివరించారు. ఇది చట్టాన్ని మార్చడానికి ట్రంప్ కాంగ్రెస్‌పై ఒత్తిడి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం, టిక్‌టాక్ భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది.
టిక్‌టాక్ ఎవరికి దక్కాలనే దానిపై అధ్యక్షుడికి అధిక నియంత్రణను ఇవ్వడానికి చట్టంలో అవకాశం కల్పించి బైడెన్ ప్రభుత్వం తప్పు చేసిందని ప్రొఫెసర్ చందర్ అభిప్రాయపడ్డారు.
"ఇంత ముఖ్యమైన ప్లాట్‌ఫామ్ భవిష్యత్తును రాజకీయాల్లోకి నెట్టడం మంచి ఆలోచన కాదు" అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














