'వెనక్కి వెళ్లడమే, మరో ఛాన్స్ లేదు': ట్రంప్ ఆదేశాలతో శరణార్థులకు నిద్రలేకుండా పోయింది

మెక్సికో, అమెరికా, టిజువానా, డ్రగ్ కార్టెల్స్, అమెరికా- మెక్సికో సరిహద్దు
ఫొటో క్యాప్షన్, అమెరికా- మెక్సికో సరిహద్దులో అమెరికా బయట ఏర్పాటు చేసిన టెంట్లు
    • రచయిత, విల్ గ్రాంట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వణికించే చలిలో ఒక టీనేజీ అబ్బాయి హుడీని తలపై కప్పుకుని ఉన్నాడు. ఇతరులకు తన గుర్తింపు తెలియకుండా ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు.

ఒక డ్రగ్ ముఠా ఏడాది క్రితం అతన్ని తీసుకెళ్లింది. అతనిది మెక్సికోలోని మిచో అకన్ రాష్ట్రం. అతని వయసు 16 ఏళ్లు.

అయితే, ఆ ముఠా నుంచి తప్పించుకుని, తన కుటుంబం కట్టుబట్టలతో అమెరికా సరిహద్దు దగ్గరికి వచ్చానని మార్కోస్(పేరు మార్చాం) చెప్పాడు.

తన తల్లి పంటి నొప్పికి, నొప్పి నివారణ మాత్రలు కొనేందుకు మందుల షాపుకు వెళ్తున్న సమయంలో ఆయుధాలు పట్టుకున్న నలుగురు వ్యక్తులు ట్రక్కులో వచ్చి తనను చుట్టుముట్టారని మార్కోస్ చెప్పారు.

"బండి ఎక్కు.. లేదంటే నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తాం" అని వారు బెదిరించారని ఆ అబ్బాయి చెప్పాడు.

వారు అతన్ని తీసుకెళ్లి ఒక గుడిసెలో పడేశారు. అక్కడ తన లాంటివారు అనేక మంది యువకులు ఉన్నారని మార్కోస్ చెప్పాడు.

ఆ సమయంలో తన పరిస్థితి ఇష్టం లేని యుద్ధం చేస్తున్న సైనికుడి మాదిరిగా ఉండేదని మార్కోస్ చెప్పారు. డ్రగ్ ముఠాలోని ఓ వ్యక్తి తనపై జాలి చూపించడంతో, అతని సాయంతో అక్కడ నుంచి పారిపోయానని తెలిపాడు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మెక్సికో, అమెరికా, టిజువానా, డ్రగ్ కార్టెల్స్, అమెరికా- మెక్సికో సరిహద్దు
ఫొటో క్యాప్షన్, ట్రంప్ ఆదేశాలతో అమెరికాలోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్న మెక్సికన్లు కన్నీటి పర్యంతం అయ్యారు

ఇక ఎవరికీ ఆశ్రయం లేనట్లేనా?

మార్కోస్ అమెరికాలో ఆశ్రయం పొందేందుకు మెక్సికన్ సరిహద్దు నగరం టిజువానాలో కొన్ని నెలల పాటు శరణార్థుల శిబిరంలో ఉన్నారు. మెక్సికోలో తనకు డ్రగ్ ముఠా నుంచి ముప్పు ఉందన్న విషయాన్ని అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ కోర్టులు నమ్ముతాయని మార్కోస్ బలంగా విశ్వసించారు.

అయితే తాజాగా వలసలు, సరిహద్దు భద్రత గురించి అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో తమకు అమెరికాలో ఆశ్రయం దక్కే అవకాశాలు లేకుండా పోతాయని వారు ఆందోళన చెందుతున్నారు.

"వారు ప్రతి ఒక్కరి కేసు విని, ఆ కేసులో ఉన్న అంశాల గురించి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. అవసరమైన వారికి సాయం చేసే విషయంలో ట్రంప్ కాస్త మృదువుగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను" అని మార్కోస్ చెప్పారు.

జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే ట్రంప్ తన ఎన్నికల ప్రచార హామీల్లో కీలకమైన అంశానికి సంబంధించిన ఆదేశాలపై సంతకం చేశారు. అమెరికా సరిహద్దుల గుండా దేశంలోకి వస్తున్న అక్రమ వలసదారుల్ని, ఆశ్రయం కోరుతున్న వారిని వెనక్కి పంపడం ఆ ఆర్డర్ సారాంశం.

కొన్ని డ్రగ్ ముఠాలను, తీవ్రవాద సంస్థలను దేశం నుంచి బయటకు తరిమేసేందుకు సైనిక చర్య చేపట్టాలనే ప్రతిపాదన కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయంలో ఉంది.

మెక్సికోలో డ్రగ్ ముఠాల నుంచి బెదిరింపులు, హెచ్చరికలు ఎదుర్కొన్న వారి కోసం పాస్టర్ అల్బర్ట్ రివేరా శరణార్థి శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ట్రంప్ జారీ చేసిన ఆదేశాలతో ఈ శిబిరాన్ని ఖాళీ చేయించే అవకాశం ఉంది.

"వాళ్లు గ్యాంగుల నుంచి తప్పించుకుని వచ్చామని, తీవ్రవాదుల నుంచి పారిపోయి వచ్చామని చెబుతున్నవారికి మీరు(అమెరికా) ఆశ్రయం ఇవ్వడానికి ఇంత కంటే బలమైన కారణం ఏముంటుంది?" అంటూ ట్రంప్‌ను ప్రశ్నిస్తున్నారు రివేరా.

మెక్సికో, అమెరికా, టిజువానా, డ్రగ్ కార్టెల్స్, అమెరికా- మెక్సికో సరిహద్దు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెక్సికోలో డ్రగ్ ముఠాల నుంచి తప్పించుకునేందుకు యువకులు అమెరికాలో ఆశ్రయం కోసం అమెరికా- మెక్సికో సరిహద్దులకు వస్తున్నారు

సన్నగిల్లుతున్న ఆశలు

సరిహద్దులకు అవతల దక్షిణ కాలిఫోర్నియాలోని ట్రంప్ మద్దతుదారులు మాత్రం కఠిన చర్యలు కచ్చితంగా తీసుకోవాల్సిందే అంటున్నారు.

శాన్‌ డీయాగో కౌంటీ రిపబ్లికన్ పార్టీ చైర్ విమెన్‌‌గా ఉన్న పౌలా విసెల్ దీనిపై మాట్లాడారు.

"బయట నుంచి వస్తున్న వారితో శాన్ డీయాగో కౌంటీ మీద చాలా భారం పడుతోంది. వారికి సరిపడా వనరుల్లేవు. వాళ్లందరినీ భరించేందుకు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు" అని ఆమె చెప్పారు.

ట్రంప్ తీసుకుంటున్న చర్యలు వలసదారులకు వ్యతిరేకం కాదని ఆమె గట్టిగా చెబుతున్నారు. "మేమింకా వలసదారుల దేశంగానే ఉన్నాం. అయితే ఇక్కడ సరైన పత్రాలు లేకుండా అక్రమంగా ఉంటున్న నేరస్తుల్ని, సరిహద్దుల గుండా మనుషుల్ని అక్రమ రవాణా మార్గంలో తీసుకు వస్తున్న గ్యాంగుల్ని తరిమి కొట్టాలి" అని చెప్పారు.

అయితే అమెరికాలో ఆశ్రయం కోసం మెక్సికోలో ఎదురు చూస్తున్న వారు మాత్రం తాము ఎలాంటి తప్పు చేయలేదని, ఆశ్రయం కోరే హక్కు తమకు ఉందని చెబుతున్నారు.

మెక్సికో, అమెరికా, టిజువానా, డ్రగ్ కార్టెల్స్, అమెరికా- మెక్సికో సరిహద్దు

యాప్ మూసివేత

ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాతి రోజు ఉదయం టిజువానాలోని చపర్రాల్ క్రాసింగ్ వద్ద 60 మంది శరణార్థులు సమావేశం అయ్యారు. ఆశ్రయం కోసం తాము పెట్టకున్న దరఖాస్తుల పరిస్థితి ఏంటని అమెరికన్ సరిహద్దుల్లో గార్డులను అడిగేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే వారికి అలాంటి అవకాశం దక్కలేదు. వారిని మెక్సికన్ అధికారులు బస్సులు ఎక్కించి శిబిరానికి తీసుకెళ్లారు.

అమెరికాలో ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ట్రంప్ ప్రభుత్వం సీబీపీ వన్ అనే మొబైల్ యాప్ తీసుకొచ్చింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ ఈ యాప్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన అధ్యక్షుడైన తర్వాత ఈ యాప్‌ను మూసివేశారు.

అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో ఉండి అమెరికాలో ఆశ్రయం కోరుకునే శరణార్థులకు ఈ యాప్ చట్టబద్దమైన మార్గం. ప్రస్తుతం యాప్ మూసివేసి, అప్పాయింట్‌మెంట్లను రద్దు చెయ్యడంతో మెక్సికన్లు సరిహద్దుల్ని దాటే అవకాశం లేదు.

దీంతో అమెరికాలో ఆశ్రయం ఎదురు చూస్తున్న వారు తమకు అన్ని దారులు మూసుకుపోయాయని భావిస్తున్నారు.

ఒరాలియా తన ఇద్దరు పిల్లలతో అమెరికా సరిహద్దుకు కూత వేటు దూరంలో ఒక నైలాన్ టెంటులో ఏడు నెలలుగా ఉంటున్నారు.

మిచోవకన్‌లో డ్రగ్ కార్టెల్స్ బెదిరింపుల వల్ల తాను అక్కడ నుంచి పారిపోయినట్లు ఆమె చెప్పారు. తన పదేళ్ల కుమారుడికి మూర్చ రోగం ఉందని, అమెరికా వెళితే అతనికి వైద్యం చేయించవచ్చని, అక్కడ తాము భద్రంగా ఉంటామని ఆమె భావించారు.

అయితే సీబీఐ వన్ యాప్‌ లేకుండా, తన ఆవేదన వారికి వినిపిస్తుందనే ఆశ లేదని ఒరాలియా చెప్పారు.

"వెనక్కి వెళ్లి ఏమీ జరక్కూడదని దేవుడిని ప్రార్థించడం మినహా మాకు మరో మార్గం లేదు" అని ఆమె అన్నారు.

అయితే, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో కొంతకాలం వేచి చూడాలని స్థానికంగా వలసదారుల హక్కుల న్యాయవాది ఒకరు ఆమెతో చెప్పారు. అయితే ఆమె వెళ్లిపోవడానికే సిద్ధంగా ఉన్నారు.

ఆమె బ్యాగుల్ని ప్యాక్ చేసుకున్నారు. ఆమె ఏడాదికాలంగా తన ఇల్లు అని భావిస్తున్న టెంట్ ఇప్పుడు వేరే కుటుంబం కోసం సిద్ధమవుతోంది.

"ఇంత అన్యాయమా" అంటూ ఆమె కన్నీటిని తుడుచుకున్నారు.

"మెక్సికో తన పౌరుల్ని ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఆహ్వనిస్తుంది. అయితే అది మా జీవితాలకు పూర్తిగా భరోసా కల్పించదు. దేవుడే ఆయన్ని( ట్రంప్‌ను) కదిలించాలి. ఎందుకంటే మాలాంటి కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయి" అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)