అమెరికా విధించే భారీ సుంకాలను తప్పించుకోవడానికి చైనా ఏం చేస్తోంది?

చైనా ఉత్పత్తులపై 10శాతం సుంకం

ఫొటో సోర్స్, Xiqing Wang/ BBC

    • రచయిత, లారా బికర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శనివారం (ఫిబ్రవరి 1) నుంచి మెక్సికోపై 25 శాతం, కెనడాపై 25 శాతం, చైనాపై అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారని వైట్‌హౌస్ ప్రకటించింది.

ట్రంప్ మొదటి టర్మ్ సమయంలో చైనా, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి, బైడెన్ హయాంలో అదే పరిస్థితి కొనసాగింది.

అమెరికా తాజా సుంకాలు చైనా తయారీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపనుంది?*

చైనా-యుఎస్ సంబంధాల విషయంలో ఇలాంటి పరిణామాలు వ్యాపారవేత్తలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి, మేం మొదట చైనాలోని కౌబాయ్ బూట్ ఫ్యాక్టరీకి వెళ్లాం.

చైనా తూర్పు తీరంలో ఉన్న ఈ కర్మాగారంలో లెదర్‌ను కంప్రెష్డ్ ఎయిర్ ఉపయోగించి బూట్‌కు కావాల్సిన ఆకృతినిస్తున్నారు.

ఇది అమెరికన్ కౌబాయ్ బూట్‌ మాదిరే ఉంది. పక్కనే కుట్లు, కటింగ్ శబ్దాలు కూడా ప్రతిధ్వనిస్తాయి.

"మేం ఏటా సుమారు పది లక్షల జతల బూట్లు అమ్మేవాళ్లం" అని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పెంగ్ అనే 45 ఏళ్ల సేల్స్ మేనేజర్ చెప్పారు. డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యే వరకు ఈ వ్యాపారం కొనసాగింది.

ట్రంప్ మొదటి టర్మ్‌లో విధించిన సుంకాలు ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీశాయి. మళ్లీ ఆరు సంవత్సరాల తరువాత ట్రంప్ వైట్ హౌస్‌కి తిరిగి రావడంతో తదుపరి ఎపిసోడ్‌కు చైనా వ్యాపారాలు తమను తాము సిద్ధం చేసుకుంటున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
చైనాలో ఒక లెదర్ జత బూట్ల తయారీకి వర్కర్లు వారం రోజులు సమయం తీసుకుంటారు .

ఫొటో సోర్స్, Xiqing Wang/BBC

వాణిజ్య యుద్ధం..

పాశ్చాత్య దేశాలు బీజింగ్ ప్రణాళికల విషయంలో జాగ్రత్తగా ఉన్నాయి. ప్రత్యేకించి చైనా ఆర్థిక వ్యవస్థ ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఇపుడు చైనా వస్తువులపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తుందని ఇప్పటికే ప్రకటించారు.

కాగా, చైనా నుంచి ఎన్ని కంపెనీలు తరలిపోతున్నాయనే దాని గురించి కచ్చితమైన గణాంకాలను పొందడం కష్టం. అయితే నైకి, అడిడాస్, ప్యూమా వంటి ప్రధాన కంపెనీలు ఇప్పటికే వియత్నాంకు మకాం మార్చాయి.

అయినప్పటికీ చైనా ఇప్పటికీ కీలకంగానే ఉంది. ఉత్పత్తిని ఆగ్నేయాసియాకు తరలించాలని ఫ్యాక్టరీ యజమానులు, వారి పోటీదారులు ఆలోచిస్తున్నట్లు పెంగ్ చెప్పారు. ఈ చర్యలు కంపెనీలను రక్షిస్తాయి కానీ, ఉద్యోగులను కోల్పోవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్న చాలామంది ఉద్యోగులు సమీపంలోని నాంటాంగ్ నగరానికి చెందినవారు. 20 సంవత్సరాలకు పైగా ఇక్కడ పనిచేస్తున్నారు.

"మా బాస్ కార్మికులను ఒంటరిగా వదలకూడదని నిశ్చయించుకున్నారు" అని పెంగ్ అంటున్నారు.

2019లో ట్రంప్ మొదటి టర్మ్‌లో విధించిన 15 శాతం సుంకాల ప్రభావం నుంచి వారు ఇంకా కోలుకోలేదు. చైనా దుస్తులు, బూట్లు వంటి వినియోగ వస్తువులపై ఆ భారం పడింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీ ఆర్డర్‌లు క్షీణించాయి. ఇక్కడ పనిచేసేవాళ్ల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది.

శ్రమతో కూడిన ఉత్పత్తిని సమర్థవంతంగా, చౌకగా నిర్వహించగల సామర్థ్యం కారణంగా చైనా అగ్రశ్రేణి తయారీదారుగా నిలిచింది.

ఫొటో సోర్స్, Xiqing Wang/ BBC

ప్రపంచంలో అగ్రశ్రేణి తయారీదారు

అమెరికన్ కొనుగోలుదారులలో కొందరు ఇప్పటికే చైనా నుంచి వ్యాపారాలను తరలించడం, సుంకాల ముప్పు గురించి ఆలోచిస్తున్నందున ఖర్చులను తగ్గించుకోవడానికి ఫ్యాక్టరీలు ప్రయత్నిస్తున్నాయి.

కానీ ఇది నైపుణ్యం కలిగిన కార్మికులను కోల్పోయేలా చేస్తుంది. ఒక లెదర్ జత బూట్ల తయారీకి వారం సమయం తీసుకుంటారు వర్కర్లు. శ్రమతో కూడిన ఉత్పత్తిని సమర్థవంతంగా, చౌకగా నిర్వహించగల సామర్థ్యం కారణంగా చైనా అగ్రశ్రేణి తయారీదారుగా నిలిచింది.

2015 నుంచి ఫ్యాక్టరీలో పని చేస్తున్న పెంగ్ మాట్లాడుతూ "గతంలో చెక్ ఇన్ చేయడం, వస్తువులను పంపించడం అనేది ఒక స్థిరమైన ప్రక్రియ. కానీ ఇపుడు ఆర్డర్లు తగ్గిపోయాయి" అని చెప్పారు.

ఈ కౌబాయ్ బూట్లు మొదటగా వైల్డ్ వెస్ట్‌లోని వ్యక్తుల కోసం తయారు చేయడం మొదలుపెట్టారు. దశాబ్ధాల నుంచి ఈ బూట్లు ఇక్కడ తయారవుతున్నాయి. ఈ కథ జియాంగ్సు ప్రావిన్స్ దక్షిణ భాగంలో అందరికీ తెలిసిందే. యాంగ్జీ నది వెంబడి ఉన్న ఒక తయారీ కేంద్రమిది. ఈ ప్రావిన్స్ వస్త్రాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తుంది.

ఈయూ కూడా..

చైనా ప్రతి సంవత్సరం అమెరికాకు ఎగుమతి చేసే బిలియన్ల డాలర్ల విలువైన వస్తువులలో ఇది ఒకటి. చైనాకు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారడంతో ఈ సంఖ్య క్రమంగా పెరిగింది.

అయితే, ట్రంప్ మొదటి పదవీకాలంలో ఈ 'హోదా' ముగిసింది. కానీ ఆయన తర్వాత వచ్చిన జో బైడెన్ హయాంలో దాన్ని పునరుద్ధరించలేకపోయారు. చైనాతో క్షీణించిన సంబంధాల కారణంగా ట్రంప్ హయాంలో విధించిన చాలా సుంకాలను బైడెన్ అలాగే ఉంచారు.

చైనా ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై యూరోపియన్ యూనియన్ కూడా సుంకాలు విధించింది. తరచుగా ప్రభుత్వ రాయితీల సహాయంతో చైనా అధికంగా ఉత్పత్తి చేస్తోందని ఈయూ ఆరోపించింది. చైనా 'అన్యాయమైన' వాణిజ్య పద్ధతులు విదేశీ పోటీదారులకు ప్రతికూలతను కలిగిస్తాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ ఏం కోరుకుంటున్నారు?

చైనాకు వ్యతిరేకంగా టారిఫ్‌లను విధించడం తన "గొప్ప శక్తులలో ఒకటి"గా ట్రంప్ అభివర్ణిస్తారు.

తన మొదటి పదవీకాలంలో ఉత్తర కొరియా లీడర్ కిమ్ జోంగ్ ఉన్‌ను కలవడానికి షీ జిన్‌పింగ్ సహాయం కోరేందుకు ట్రంప్ బీజింగ్‌ వెళ్లారు.

ఈసారి యుక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్‌కు జిన్‌పింగ్ మద్దతు అవసరమని భావిస్తున్నారు. ఈ విషయంలో చైనాకు చాలా సామర్థ్యం ఉందని కూడా ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు.

మెక్సికో, కెనడాలకు చైనా ఫెంటానిల్‌ను పంపుతోందని భావించి ట్రంప్ 10 శాతం సుంకం విధించారు. దీన్ని అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని చైనాను ట్రంప్ కోరవచ్చు. టిక్ టాక్ కొనుగోలుపై అమెరికా వ్యాపారులు ఆసక్తితో ఉన్నారు. కాబట్టి, యాప్ యాజమాన్యం, సాంకేతికత గురించి బీజింగ్ చర్చలు జరపాలనుకోవచ్చు.

టిక్‌టాక్ ఒప్పందం అమెరికా-చైనా సంబంధాలను తిరిగి గాడిన పెట్టడంలో సహాయపడుతుంది. అయితే, ఈ ఒప్పందం ఆమోదం పొందకపోతే ట్రంప్, జిన్‌పింగ్ మధ్య మరింత ఘర్షణ వాతావరణానికి దారితీయవచ్చు.

చైనాలో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన వార్షిక సర్వేలో అమెరికా-చైనా సంబంధాలు క్షీణించడంపై సగానికి పైగా ఆందోళన చెందుతున్నారని తేలింది. చైనా పట్ల ట్రంప్ మెతక వైఖరి కొంత ఉపశమనం కలిగించేది.

అయితే సుంకాల ముప్పు కొనుగోలుదారులను చైనా నుంచి దూరంగా తరలించడానికి, తయారీని అమెరికాకి తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుందని ట్రంప్ ఆశిస్తున్నారు.

కొన్ని చైనీస్ కంపెనీలు నిజంగా బయటికి వెళుతున్నాయి. కానీ, అవి అమెరికా వైపు కాదు.

చైనాలో ప్రొడక్షన్ ఉంటే 10 శాతం సుంకాల వల్ల తన ఆదాయం నుంచి 8 లక్షల డాలర్ల వరకు తగ్గిపోనుందని హువాంగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Xiqing Wang/ BBC

పక్క దేశాలకు చైనా కంపెనీలు..

అమెరికన్ దిగ్గజ కంపెనీలు వాల్‌మార్ట్, కాస్ట్‌కో నుంచి వస్తున్న భారీ ఆర్డర్‌లను డెలివరీ చేయడానికి వ్యాపారవేత్త హువాంగ్ జాడోంగ్ కంబోడియా రాజధాని నమ్ పెన్ సమీపంలో కొత్త ఫ్యాక్టరీని నిర్మించారు. కంబోడియాలో ఇది ఆయన రెండో కర్మాగారం. ఇది ప్రతి నెలా చొక్కాల నుంచి లోదుస్తుల వరకు ఐదు లక్షల దుస్తులను ఉత్పత్తి చేస్తుంది.

కొన్ని చైనీస్ కంపెనీలతో వారి కస్టమర్లు "మీరు ప్రొడక్షన్‌ను విదేశాలకు తరలించకపోతే, ఆర్డర్‌లను రద్దు చేస్తాం" అని చెప్పినట్లు హువాంగ్ తెలిపారు.

"సరఫరాదారులు, రిటైలర్‌లకు సుంకాలు కష్టమైన ఎంపికలను ఇచ్చాయి. అయితే ఈ భారాన్ని ఎవరు భరిస్తారనేదానిపై స్పష్టత లేదు. కొన్నిసార్లు సప్లయర్లదే భారం'' అని హువాంగ్ స్పష్టంచేశారు.

"ఉదాహరణకు వాల్‌మార్ట్‌ను తీసుకోండి. నేను వారికి దుస్తులను 5 డాలర్లకు విక్రయిస్తాను. వారు దానిని 3.5 రెట్లు పెంచి విక్రయిస్తారు. అధిక సుంకాల కారణంగా మా ఖర్చులు పెరిగితే, నేను విక్రయించే ధర 6 డాలర్లు ఉంటుంది. అదే 3.5 రెట్లు వారు పెంచితే రిటైల్ ధర భారీగా పెరగనుంది" అని ఆయన అన్నారు.

చైనాలో ప్రొడక్షన్ ఉంటే 10 శాతం సుంకాల వల్ల తన ఆదాయం నుంచి 8 లక్షల డాలర్ల వరకు తగ్గిపోనుందని హువాంగ్ చెప్పారు. తనకు వచ్చే లాభం కంటే ఇది చాలా ఎక్కువని ఆయన అంటున్నారు. చైనాలో ఉంటే అలా సుంకాలు చెల్లించడం భరించలేనిదని ఆయన స్పష్టంచేశారు.

చైనీస్ వస్తువులపై ప్రస్తుత అమెరికా సుంకాలు ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం నుంచి స్టీల్, అల్యూమినియంపై 25 శాతం వరకు ఉంటాయి. ఇప్పటి వరకు టీవీలు, ఐఫోన్‌ల వంటి ఎలక్ట్రానిక్స్‌తో సహా అత్యధికంగా అమ్ముడైన అనేక వస్తువులకు టారిఫ్ మినహాయింపు ఇచ్చారు.

అయితే ట్రంప్ ప్రతిపాదించిన 10 శాతం బ్లాంకెట్ టారిఫ్ చైనాలో తయారై, యుఎస్‌కి ఎగుమతి చేసే ప్రతిదాని ధరపై ప్రభావం చూపుతుంది. ఇది బొమ్మలు, టీ కప్పుల నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు చాలా వాటికి వర్తిస్తుంది. ఇది ఫ్యాక్టరీలను ఇతర దేశాలకు తరలిపోయేలా చేస్తోందని హువాంగ్ అభిప్రాయపడ్డారు.

హువాంగ్ ఉండే ప్రాంతం చుట్టూ అనేక కొత్త వర్క్‌షాప్‌లు వెలిశాయి. చైనా కంపెనీలు షాన్‌డాంగ్, జెజియాంగ్, జియాంగ్‌సు, గ్వాంగ్‌డాంగ్ వంటి వస్త్ర ఉత్పత్తి ప్రాంతాల నుంచి శీతాకాలపు జాకెట్లు, ఉన్ని దుస్తులను తయారు చేయడానికి తరలిపోతున్నాయి.

రీసెర్చ్ అండ్ మార్కెట్స్ నివేదిక ప్రకారం.. కంబోడియాలో దాదాపు 90 శాతం వస్త్ర కర్మాగారాలు చైనా యాజమాన్యంలో లేదా చైనా వారే నడుపుతున్నారు. కంబోడియా విదేశీ పెట్టుబడుల్లో సగం చైనా నుంచే వస్తోంది. చైనా ప్రభుత్వ మీడియా ప్రకారం కంబోడియాలో 70 శాతం రోడ్లు, వంతెనలు చైనా రుణాలతో నిర్మించారు.

ఇక్కడ రెస్టారెంట్లు, దుకాణాలపై అనేక సైన్ బోర్డులు చైనీస్, స్థానిక భాష అయిన ఖైమర్‌లో ఉన్నాయి. చైనా అధ్యక్షుని గౌరవార్థం షీ జిన్‌పింగ్ బౌలేవార్డ్ అనే రింగ్ రోడ్డు కూడా ఉంది.

ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్

ఫొటో సోర్స్, Xiqing Wang/ BBC

ఆగ్నేయాసియాలో చైనా పట్టు

అయితే, కంబోడియాలో మాత్రమే చైనా పెట్టుబడులు పెట్టలేదు.

'ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్' కింద చైనా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇది చైనా ప్రభావాన్ని విస్తరించే వాణిజ్య, మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. అంటే చైనాకు ఆప్షన్లు ఉన్నాయి.

చైనా దిగుమతులు, ఎగుమతులలో సగానికి పైగా ఇప్పుడు 'బెల్ట్, రోడ్ దేశాల' నుంచి వస్తున్నాయని, వీటిలో ఎక్కువ భాగం ఆగ్నేయాసియాలో ఉన్నాయని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది.

ఇవేవీ రాత్రికి రాత్రి జరగలేదని కెన్నీ యావో చెప్పారు. సుంకాల గురించి వ్యవహరించడంపై చైనీస్ కంపెనీలకు కెన్నీ సలహాలు ఇస్తుంటారు.

ట్రంప్ మొదటి టర్మ్ సమయంలో చాలా చైనా కంపెనీలు టారిఫ్ బెదిరింపులపై సందేహపడ్డాయని కెన్నీ బీబీసీతో అన్నారు.

'ఇప్పుడు ట్రంప్ సప్లై చెయిన్‌ను చూసి ఇతర దేశాలపై కూడా సుంకాలు విధిస్తారా? అని వారు అడుగుతున్నారు. అదే జరిగితే, చైనా వ్యాపారాలు సుదూర ప్రాంతాలపై దృష్టి పెట్టడం తెలివైన పని' అని కెన్నీ సూచించారు.

"ఉదాహరణకు ఆఫ్రికా లేదా లాటిన్ అమెరికా. ఇలా వెళ్లడం చాలా కష్టం కానీ, మీరు ఇంతకుముందు చూడని ప్రాంతాలపై దృష్టి పెట్టడం మంచిది" అని ఆయన చెప్పారు.

చైనా

ఫొటో సోర్స్, Xiqing Wang/BBC

అమెరికా తన సొంత ప్రయోజనాలతో ముందుకు సాగుతుండటంతో, స్థిరమైన వాణిజ్య భాగస్వామిగా కనిపించడానికి చైనా తన వంతు ప్రయత్నం చేస్తోంది.

సింగపూర్‌లోని ఐసియాస్ యూసోఫ్-ఇషాక్ థింక్ ట్యాంక్ చేసిన సర్వే ప్రకారం, ఆగ్నేయాసియాలోని దేశాలకు ప్రాధాన్యత కలిగిన ఎంపికగా ఇంతకుముందు అమెరికా ఉండేది, ఇపుడు చైనా ముందువరుసలో ఉంది.

ఉత్పత్తి విదేశాలకు మారినప్పటికీ డబ్బు ఇప్పటికీ చైనాకు చేరుతోంది. నమ్ పెన్‌లోని హువాంగ్ ఫ్యాక్టరీలలో బట్టలు తయారు చేయడానికి ఉపయోగించే దాదాపు 60 శాతం పదార్థాలు చైనా నుంచే వచ్చాయి.

అంతేకాకుండా సోలార్ ప్యానెళ్ల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు అత్యాధునిక తయారీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నందున చైనా ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి.

గత సంవత్సరం, ప్రపంచానికి చైనా ఎగుమతులు రికార్డు స్థాయిలో 992 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆ దేశ ఎగుమతులు ప్రతి సంవత్సరం 6 శాతం పెరుగుతున్నాయి. అయినప్పటికీ జియాంగ్సు, నమ్ పెన్‌లోని చైనా వ్యాపారాలు అనిశ్చితి కాలానికి సిద్ధమవుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)