బ్రిక్స్ దేశాలకు ట్రంప్ మళ్లీ వార్నింగ్, భారత్ ఇప్పుడేం చేయనుంది?

డోనల్డ్ ట్రంప్, అమెరికా, మోదీ, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)
    • రచయిత, దీపక్ మండల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు.

బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో డాలర్‌ను వినియోగించడం మానేస్తే, అమెరికా వాటిపై 100 శాతం పన్నులు విధిస్తుందని ట్రంప్ అన్నారు.

బ్రిక్స్ దేశాలు డాలర్ కాకుండా కొత్త బ్రిక్స్ కరెన్సీని ఏర్పాటు చేసుకుంటే, అమెరికా చూస్తూ మౌనంగా కూర్చోదని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ హెచ్చరించారు.

కెనడా, మెక్సికోలపై ట్రంప్ సుంకాలను ప్రకటించారు.

బ్రిక్స్ వ్యవస్థాపక దేశాల్లో భారత్ ఒకటి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో అమెరికా పర్యటనకు వచ్చే అవకాశం ఉందని కూడా ట్రంప్ ఇంతకుముందు చెప్పారు.

అయితే, మోదీతో స్నేహం ఉందని చెప్పుకునే ట్రంప్, భారత్ కీలక భాగస్వామిగా ఉన్న గ్రూప్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారనేదే ఇక్కడ ప్రశ్న.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డోనల్డ్ ట్రంప్, అమెరికా

ఫొటో సోర్స్, TRUTH SOCIAL

ట్రంప్ ఏమన్నారంటే..

బ్రిక్స్ దేశాలు డాలర్‌ను కాదని దూరం జరుగుతుంటే, అమెరికా చూస్తూ ఉండే శకం ముగిసిందని ట్రంప్ అన్నారు.

ఈ దేశాలు కొత్త బ్రిక్స్ కరెన్సీని స‌ష్టించబోమని, లేదా శక్తిమంతమైన డాలర్‌ను భర్తీ చేసేలా మరే కరెన్సీకి మద్దతు ఇవ్వబోయేది లేదన్న నిబద్దత ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ట్రూత్ సోషల్‌లో ఆయన ఇలా రాశారు, ''వాళ్లు అలా చేస్తే వంద శాతం సుంకాలను భరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, అమెరికా లాంటి గొప్పదేశానికి వారి వస్తువులు విక్రయించాలనే కలను వదులుకోవాల్సి ఉంటుంది.''

''ఏ కొత్త బ్రిక్స్ కరెన్సీ కూడా డాలర్‌ను భర్తీ చేసే అవకాశం లేదు. అంతర్జాతీయ వాణిజ్యంలోనైనా, మరెక్కడైనా అమెరికా డాలర్‌ను బ్రిక్స్ భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదు.

అయితే, బ్రిక్స్ దేశాలు తమ సొంత కరెన్సీ ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం, వారు అమెరికాతో వాణిజ్యానికి వీడ్కోలు చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి'' అన్నారు ట్రంప్.

పుతిన్, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, SERGEI BOBYLEV/SPUTNIK/KREMLIN POOL/EPA-EFE

ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌(ఎడమ)తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్

ట్రంప్ గురి చైనా, రష్యా పైనేనా?

భారత్ సభ్యదేశంగా ఉన్న బ్రిక్స్‌ను ట్రంప్ బెదిరించినప్పటికీ, అసలు గురి చైనా, రష్యా పైనేనని విశ్లేషకులు అంటున్నారు.

అమెరికా ముందున్న అతిపెద్ద సవాల్ చైనా. అమెరికాను చైనా ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. అలాగే, అమెరికా కూడా తమకు ఆర్థికపరంగా అతిపెద్ద సవాల్ చైనానేనని భావిస్తోంది.

యుక్రెయిన్‌పై దాడి, రష్యాపై ఆర్థిక ఆంక్షల తర్వాత డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని ప్రోత్సహించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.

రష్యాపై పాశ్యాత్య దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత, చైనా రూబుల్స్‌లో చమురు కొనుగోళ్లు చేయడం ప్రారంభించింది.

రష్యాతో రూబుల్స్, రూపాయల్లో వ్యాపారం జరిగింది.

2024 అక్టోబర్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో, వాణిజ్య వ్యవహారాల్లో అమెరికన్ డాలర్‌పై ఆధారపడడాన్ని తగ్గించే దిశగా స్థానిక కరెన్సీల వినియోగాన్ని పెంచడం, కొత్త బ్రిక్స్ కరెన్సీని సృష్టించడం గురించి బ్రిక్స్ దేశాలు చర్చించాయి.

ఆ సమయంలో కూడా, బ్రిక్స్ దేశాలు అమెరికన్ డాలర్ స్థానంలో మరో కరెన్సీకి మద్దతు ఇస్తే 100 శాతం సుంకాలు భరించాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.

అయితే, అమెరికాతో బలమైన ఆర్థిక సంబంధాలకు కట్టుబడి ఉన్నామని, అమెరికా డాలర్‌ను బలహీనపరిచే ఉద్దేశం లేదని భారత్ పునరుద్ఘాటించింది.

కానీ, డాలర్‌పై ఆధారపడడాన్ని తగ్గించేందుకు భారత్ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ప్రోత్సహించేందుకు కూడా ప్రయత్నిస్తోంది. రష్యాతో రూపాయిల్లో వాణిజ్యం జరపడమే అందుకు ఉదాహరణ.

డోనల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, MANDEL NGAN/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 2020 ఫిబ్రవరిలో డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి హోదాలో భారత్‌లో పర్యటించారు, దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ట్రంప్ - మోదీ కలుసుకున్న చిత్రం ఇది.

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో, సెంటర్ ఫర్ చైనీస్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ అరవింద్ యేలేరీ మాట్లాడుతూ, ''ట్రంప్ అసలు గురి చైనా. ఎందుకంటే, డాలర్‌ను సవాల్ చేయడానికి చైనా నిరంతరం ప్రయత్నిస్తోంది. భారీగా అమెరికన్ బాండ్లు కలిగివున్నది కూడా చైనానే. వాటిపై వడ్డీని కూడా ఆర్జిస్తోంది. కానీ, ఇప్పుడు అమెరికన్ బాండ్లలో పెట్టుబడులను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. వాటికి బదులుగా రష్యా, జపాన్ బాండ్లు కొనుగోలు చేయడం మొదలుపెట్టింది.''

''ఇక భారత్‌పై కఠిన చర్యల విషయానికొస్తే, ట్రంప్ లావాదేవీలు ఎలా జరుగుతున్నాయనేది చూస్తారు. వాణిజ్య వ్యవహారాల్లో మిత్రదేశాలకు కూడా ఎలాంటి రాయితీలూ ఇవ్వరు. కానీ, కఠినమైన ఆంక్షలను సడలిస్తున్నామనే పేరుతో మిత్రదేశాల నుంచి చాలా తీసుకుంటారు. అమెరికా కోసం భారత్ తన మార్కెట్లను బార్లా తెరవాలని కోరుకుంటున్నారు. భారత్‌తో అమెరికా వాణిజ్య లోటును తగ్గించాలి. అందువల్ల, కఠిన వైఖరి తీసుకోకుండా భారత్ నుంచి మరిన్ని రాయితీలు పొందాలనుకుంటున్నారు'' అని అరవింద్ అన్నారు.

భారత్, మోదీ, జైశంకర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ (ఫైల్ ఫోటో)

భారత్ వైఖరి ఎలా ఉండొచ్చు?

భారత్ వైఖరి కూడా డాలర్ వ్యవహారంలో కానీ, ఇతర వాణిజ్య విషయాల్లో కానీ ట్రంప్ ప్రభుత్వంతో ఘర్షణపడే ఉద్దేశం లేదన్నట్లుగానే సూచిస్తోంది.

ట్రంప్‌‌ను భారత్‌కు స్నేహితుడిగా లేదా శత్రువుగా భావిస్తున్నారా? అని గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ను అడిగారు.

దానికి ఆయన బదులిస్తూ, డోనల్డ్ ట్రంప్ 'అమెరికన్ నేషనలిస్ట్' (అమెరికా జాతీయవాది) అన్నారు.

ట్రంప్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా భారీ మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని, అయితే తమ ప్రయోజనాలకు అనుగుణంగా భారత్ నిర్ణయాలు ఉంటాయని ఆయన చెప్పారు.

భారత్ - అమెరికా మధ్య కొన్ని విభేదాలున్నాయని, కానీ పరిస్థితులు భారత్‌కు అనుకూలించే అంశాలు కూడా చాలానే ఉన్నాయన్నారు.

''అమెరికాతో సంబంధాలు బాగున్నాయి, అలాగే ప్రధాని మోదీతో ట్రంప్ సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి. అవి దేశానికి ఉపయోగకరం'' అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)