కేంద్ర బడ్జెట్: నిర్మలాసీతారామన్ ప్రసంగంలో 5 ముఖ్యాంశాలు

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనలు, అరుపుల మధ్య తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె తెలుగు కవి గురజాడ అప్పారావు గేయాన్ని ప్రస్తావించారు. 'దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్' అన్న గురజాడ స్ఫూర్తితో దేశ ప్రజల మంచికోసం పనిచేస్తున్నట్లు చెప్పారు.
పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతే ప్రధానంగా ఈ బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు.
బడ్జెట్ ప్రసంగానికి ముందు కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశం తర్వాత ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి.

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజన
దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. 1.73 కోట్ల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
కందులు, మినుములను కేంద్రమే కొనుగోలు చేయనుందని ప్రకటించారు. బిహార్‌లో మఖానా బోర్డ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కిసాన్ క్రెడిట్ కార్డులపై రుణ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. దీనివల్ల 7.7 కోట్ల మంది రైతులకు లబ్ధి కలుగుతుందన్నారు.

ఎంఎస్ఎంఈలకు ఊతం
ఎంఎస్ఎంఈలకు రూ. 10 కోట్ల వరకు రుణాలు
స్టార్టప్‌లకు ఇచ్చే రుణాల పరిమితి రూ. 20 కోట్లకు పెంపు
దేశంలో బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం

ఐఐటీలు, మెడికల్ కాలేజీలలో సీట్ల పెంపు
ఐఐటీలలో మౌలిక వసతుల పెంపు. మరో 6,500 మంది విద్యార్థులకు అవకాశం.
దేశంలోని మెడికల్ కాలేజీలలో వచ్చే అయిదేళ్లలో 75 వేల సీట్లు పెరగనున్నాయని తెలిపారు.

కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనాలు
గిగ్ వర్కర్లను ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసి వారికి గుర్తింపు కార్డులు.
పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా

పర్యటక రంగం
దేశంలోని 50 పర్యటక స్థలాలను కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో అభివృద్ధి చేస్తారు.
పర్యటక రంగంలో ఉపాధి కల్పనకు ప్రత్యేక ప్రణాళిక.
హోం స్టేస్‌కు ముద్ర యోజన పథకం వర్తింపజేయడం. టూరిస్ట్ డెస్టినేషన్లకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం.
దేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రైవేట్ రంగంతో కలిసి అభివృద్ధి చేస్తామన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయి..
బడ్జెట్ ప్రసంగం ముందు లాభాల్లో నడిచిన స్టాక్ మార్కెట్లు.. ఆ తర్వాత మళ్లీ నష్టాల బాట పట్టాయి. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో నిఫ్టీ 147 పాయింట్లు, సెన్సెక్స్ 362 పాయింట్ల నష్టంలో కొనసాగాయి.
శనివారం అయినప్పటికీ బడ్జెట్ సందర్భంగా ఈ రోజు మార్కెట్లు ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














