జాకియా జాఫ్రీ: గుల్బర్గ్ ఊచకోత కేసులో తుది శ్వాస వరకు పోరాడిన మహిళ

జాకియా జాఫ్రీ, గుజరాత్ అల్లర్లు, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

గుజరాత్ అల్లర్ల సమయంలో అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీ ఊచకోతలో హత్యకు గురైన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ కేసులో తుది వరకు పోరాడిన ఆయన భార్య జాకియా జాఫ్రీ శనివారం మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు తన్వీర్ జాఫ్రీ బీబీసీకి ధృవీకరించారు.

"ఆమె వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడ్డారు. నా సోదరి నిస్రీన్‌ దగ్గర ఉండేందుకు ఆమె సూరత్ నుండి అహ్మదాబాద్‌కు వెళ్లారు. శనివారం ఉదయం ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఉదయం 11:30 గంటలకు ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మా పూర్వీకులను ఖననం చేసిన అహ్మదాబాద్‌లోని కలుపుర్ శ్మశానవాటికలోనే ఆమె అంత్యక్రియలు జరుగుతాయి." అని తన్వీర్ జాఫ్రీ తెలిపారు.

గుల్బర్గ్ సొసైటీలో హత్యకు గురైన తన భర్త ఎహ్సాన్ జాఫ్రీ కేసులో న్యాయం జరగాలంటూ జాకియా జాఫ్రీ 2002 నుంచి పోరాడారు. గుల్బర్గ్ సొసైటీ కేసుగా పేరున్న ఈ కేసు విషయంలో ఆమె తనకున్న అన్ని చట్టపరమైన ఆప్షన్లను ఉపయోగించుకుని న్యాయం కోసం పోరాడారు.

అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీతో సహా 63 మందిపై జాకియా జాఫ్రీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు సిట్‌ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ను ఏర్పాటు చేసింది.

జాకియా జాఫ్రీ, గుజరాత్ అల్లర్లు, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Tanvir Jafri

2002లో గుజరాత్‌లోని గోద్రాలో అల్లర్లు చెలరేగాయి. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు కరసేవకులు మరణించారు.

ఆ తర్వాత జరిగిన గుల్బర్గ్ సొసైటీ ఊచకోతలో ఎహ్సాన్ జాఫ్రీతో సహా 69 మంది మరణించారు. సొసైటీలోని అనేక ఇళ్లకు నిప్పంటించారు.

అప్పటికి అనారోగ్యంతో ఉన్న జాకియా జాఫ్రీని ఆమె భర్త ఎహ్సాన్ జాఫ్రీ మేడ మీదకు పంపించారు. అలా ఆమె గుల్బర్గ్ సొసైటీ ఊచకోత నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, ఈ ఘటనలో ఎహ్సాన్ జాఫ్రీ హత్యకు గురయ్యారు.

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించిన జాకియా, బుర్హాన్‌పూర్‌కు చెందిన న్యాయవాది ఎహ్సాన్ జాఫ్రీని వివాహం చేసుకున్నారు.

1969 అల్లర్లలో వారి ఇల్లు ధ్వంసమైంది. ఆ సమయంలో, గుల్బర్గ్ సొసైటీ నిర్మాణం జరుగుతోంది. అప్పుడే వారి కుటుంబం అక్కడికి వెళ్లింది.

‘‘ఇంత దారుణమైన నేరాలకు కారకులైన నరేంద్ర మోదీ లేదంటే మరెవరైనా క్షమించడానికి అర్హులు కాదు’’ అని ఆమె గతంలో బీబీసీతో అన్నారు.

"నేను ఎవరినైనా ఎలా క్షమించాలి? నేను పోగోట్టుకున్నది తిరిగి వస్తుందా? బాధ్యులను శిక్షించాలి. అప్పుడే భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగవు. నేను చనిపోయే వరకు న్యాయం కోసం పోరాడుతా" అని ఆమె అప్పట్లో అన్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జాకియా జాఫ్రీ, గుజరాత్ అల్లర్లు, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫిబ్రవరి 28, 2002న అహ్మదాబాద్‌లోని ముస్లింలు అధికంగా నివసించే గుల్బర్గ్ సొసైటీపై ఒక మూక దాడి చేసింది. ఈ దాడిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీతో సహా 69 మంది మరణించారు.

ఆ గుంపు దాడి నుండి తప్పించుకోవడానికి అనేక మంది ముస్లింలు ఎహ్సాన్ జాఫ్రీ ఇంట్లో ఆశ్రయం పొందారు.

ఈ కమ్యూనిటీని అన్నివైపుల నుండి అల్లరి మూకలు చుట్టుముట్టాయి. చాలామంది సజీవ దహనానికి గురయ్యారు.

అల్లర్లు చెలరేగడంతో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతోపాటు, పోలీసులను సంప్రదించేందుకు తన భర్త అనేకమార్లు ప్రయత్నించారని, కానీ ఎవరూ ఆయనకు సహాయం చేయలేదని జాకియా జాఫ్రీ అప్పట్లో ఆరోపించారు.

నరేంద్ర మోదీతో సహా మొత్తం 63 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాకియా జాఫ్రీ జూన్ 2006లో గుజరాత్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు అప్పీల్ చేశారు.

అల్లర్ల సమయంలో మోదీతో సహా అందరూ ఉద్దేశపూర్వకంగానే బాధితులను రక్షించడానికి ప్రయత్నించలేదని జాకియా జాఫ్రీ ఆరోపించారు.

డీజీపీ తన అప్పీల్‌ను తిరస్కరించడంతో, గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జాకియా జాఫ్రీ. అయితే, 2007లో హైకోర్టు కూడా ఆమె దరఖాస్తును తిరస్కరించింది.

జాకియా జాఫ్రీ, గుజరాత్ అల్లర్లు, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

గుల్బర్గ్ సొసైటీ కేసులో ఎప్పుడు ఏం జరిగింది?

మార్చి 2008లో, జాకియా జాఫ్రీ, ఎన్జీవో సంస్థ 'సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్' సంయుక్తంగా సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు.

సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్‌ను ఈ కేసులో అమికస్ క్యూరీగా నియమించింది.

2009 ఏప్రిల్‌లో, గుజరాత్ అల్లర్లను దర్యాప్తు చేయడానికి ఇప్పటికే నియమించిన సిట్‌ను ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సిట్ 2010 ప్రారంభంలో నరేంద్ర మోదీని విచారణకు పిలిచి, మే 2010లో సుప్రీంకోర్టుకు తన నివేదికను సమర్పించింది.

అక్టోబర్ 2010లో, ప్రశాంత్ భూషణ్ ఈ కేసు నుంచి బయటకు వచ్చారు. దీంతో సుప్రీంకోర్టు రాజు రామచంద్రన్‌ను అమికస్ క్యూరీగా నియమించింది.

జనవరి 2011లో సుప్రీంకోర్టుకు రాజు రామచంద్రన్ తన నివేదికను సమర్పించారు.

మే 2011లో సాక్షులను, సిట్ అధికారులను కలవాలని అమికస్ క్యూరీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

2011 సెప్టెంబర్‌లో మోదీపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. సిట్ తన నివేదికను దిగువ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

మోదీ, జాకియా జాఫ్రీ ఇద్దరూ దీనిని తమ విజయంగా ప్రకటించుకున్నారు.

ఫిబ్రవరి 8, 2012న సిట్ ఈ కేసులో తుది నివేదికను సమర్పించింది.

దీనిపై జాకియా జాఫ్రీ ఏప్రిల్ 15, 2013న పిటిషన్ దాఖలు చేశారు. జాకియా జాఫ్రీ, సిట్ న్యాయవాదుల మధ్య ఐదు నెలల పాటు వాదనలు కొనసాగాయి.

2013 డిసెంబర్‌లో మెట్రోపాలిటన్ కోర్టు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, ఇతర అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చింది.

డిసెంబర్ 9, 2021న సుప్రీంకోర్టులో జాకియా జాఫ్రీ పిటిషన్ దాఖలు చేశారు.

జూన్ 24, 2022న గుజరాత్ అల్లర్లపై సిట్ అందించిన నివేదికను సుప్రీంకోర్టు బెంచ్ సమర్థించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా 60 మందికి పైగా వ్యక్తులకు క్లీన్ చిట్ ఇచ్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)