మూడోసారి గర్భానికి ప్రసూతి సెలవు నిరాకరించిన ప్రభుత్వాసుపత్రి - కోర్టు ఏం చెప్పిందంటే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిత్య పాండియన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మదురైలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని మూడో డెలివరీ కోసం ప్రసూతి సెలవు అడగ్గా, మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆ మహిళ కోర్టుకు వెళ్లగా సెలవు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.
మదురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుకు మొదటి వివాహంలో ఇద్దరు పిల్లలున్నారు. ఆ రెండు డెలివరీల సమయంలో ఆమె వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను తీసుకోలేదు.
తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు. గర్భందాల్చడంతో ప్రసూతి సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆస్పత్రి అందుకు నిరాకరించింది.
తమిళనాడులో ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మహిళలకు వేతనంతో కూడిన 365 రోజుల ప్రసూతి సెలవులు అందిస్తున్నారు. అయితే ఇద్దరు పిల్లల డెలివరీ కోసం మాత్రమే అలాంటి సెలవు తీసుకోవచ్చు.
2021కి ముందు తమిళనాడులో ప్రసూతి సెలవు 270 రోజులు (9 నెలలు) ఉండేవి. తర్వాత తమిళనాడు ప్రభుత్వం ప్రసూతి సెలవులను 9 నెలల నుంచి 365 రోజులకు పొడిగిస్తూ సెప్టెంబర్ 17, 2021న ఉత్తర్వులిచ్చింది.
కేంద్రప్రభుత్వం ఇచ్చే ప్రసూతి సెలవుల కంటే ఇవి ఎక్కువ.
మరి ఏ కారణాలతో రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి సెలవులు నిరాకరించింది? మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ తీర్పులో ఏం చెప్పింది?
కేసు నేపథ్యం ఏంటి?
మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న రాధ (పేరు మార్చాం) మూడోసారి గర్భవతి అయ్యారు.
ఆమె 2008 నుంచి రాజాజీ ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తున్నారు. 2018లో ఆమె ఉద్యోగం పర్మినెంట్ అయింది.
2009, 2011లో ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. అప్పటికి ఆమె కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తుండడంతో తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసూతి సెలవులు తీసుకోలేకపోయారు.
వైవాహిక జీవితంలో ఇబ్బందులతో 2020లో ఆమె విడాకులు తీసుకున్నారు.
కొంతకాలం తర్వాత మరొకరిని పెళ్లిచేసుకున్నారు. తర్వాత ఆమె మళ్లీ గర్భందాల్చారు.
2024 ఆగస్టు 24 నుంచి ఆగస్టు 23, 2025 వరకు 12 నెలల ప్రసూతి సెలవు కోసం ఆమె ఆస్పత్రి అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆమె మూడోసారి గర్భం దాల్చారన్న కారణంపై ఆ దరఖాస్తును ఆస్పత్రి అధికారులు తిరస్కరించారు.
ప్రసూతి సెలవులు లేకుండా ఇతర సెలవుల కింద దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు సూచించారు. దీంతో గత సెప్టెంబర్ 4న ఆమె 365 రోజుల సెలవు కోసం దరఖాస్తు చేశారు.
మెడికల్ లీవ్ కింద 90 రోజులు, మెడికల్ సర్టిఫికెట్‌పై 169 రోజులు, జీతం లేకుండా 106 రోజులు కలిపి సెలవులు పెట్టారు.
దీనిపై తాము నిర్ణయం తీసుకోలేమని, మెడికల్ బోర్డును ఆశ్రయించాలని రాజాజీ ఆస్పత్రి అధికార యంత్రాంగం తెలిపింది. ఆమె దరఖాస్తును పరిశీలించిన మెడికల్ బోర్డు ఇది ఆమెకు మూడో డెలివరీ కాబట్టి వైద్య కారణాలతో సెలవు మంజూరు చేయలేమని సెప్టెంబర్ 24న తెలిపింది.
రాధ డెలివరీ డేట్‌ను వైద్యులు సెప్టెంబర్ 30, 2024గా నిర్ణయించారు. అయితే రాధ తిరిగి విధుల్లో చేరేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నారని మెడికల్ బోర్డు సెప్టెంబర్ 25న తెలిపింది. కాబట్టి ఆమె తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించింది.
ఆస్పత్రి అధికారయంత్రాంగం ప్రసూతి సెలవులు తిరస్కరించడాన్ని, విధుల్లో తిరిగి చేరాలంటూ మెడికల్ బోర్డు జారీ చేసిన ఆదేశాలను...సవాల్ చేస్తూ రాధ కోర్టును ఆశ్రయించారు.


ఫొటో సోర్స్, Getty Images
ఇది చట్టబద్ధమేనా? కోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి?
రాధ తరఫున వాదించిన లాయర్ మలైకాని పలు కోర్టు ఆదేశాలను ఉదహరించారు.
రాధ మూడోసారి గర్భవతి అయినప్పటికీ, ఆమె ప్రసూతి సెలవు కోసం దరఖాస్తు చేసుకోవడం ఇదే మొదటిసారని, ఆమె మూడోసారి గర్భం దాల్చిందన్న కారణంతో దరఖాస్తును తిరస్కరించరాదని మలైకాని వాదించారు.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వర్సెస్ ఇండస్ట్రీస్ సెక్రటరీ కేసులో బాంబే హైకోర్టు 2024లో ఇచ్చిన తీర్పును ఆమె ప్రస్తావించారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే మహిళ తన ఉద్యోగ జీవితంలో రెండుసార్లు ప్రసూతి సెలవు తీసుకోవచ్చని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు.
''మొదటి పెళ్లిలో పుట్టిన ఇద్దరు పిల్లలకు ప్రసూతి సెలవులు తీసుకోకపోతే, రెండో పెళ్లి తర్వాత డెలివరీ సమయంలో ప్రసూతి సెలవు తీసుకునేందుకు అర్హులే'' అని 2023లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు.
తమిళనాడు ప్రభుత్వ ప్రాథమిక నిబంధనలు - ఆర్టికల్ 101 (ఎ) ప్రకారం ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉన్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రసూతి సెలవులు ఇస్తారని, అయితే రాధకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నందున నిబంధనల ప్రకారం ప్రసూతి సెలవులు మంజూరు చేయలేమని ఆసుపత్రి యాజమాన్యం తరఫు లాయర్ వాదించారు.
ఆమె శారీరకంగా దృఢంగా ఉన్నారని, తిరిగి విధుల్లో చేరాలని మెడికల్ బోర్డు ఆదేశించినప్పటికీ రాధ ఆ ఆదేశాలు పాటించలేదని ఆరోపించారు.

ఫొటో సోర్స్, https://ecommitteesci.gov.in/
న్యాయమూర్తి తీర్పులో ఏముంది?
ఇరువురి వాదనలు విన్న జస్టిస్ ఆర్.విజయకుమార్.. వైద్యాధికారులు, బోర్డు ఆదేశాలు చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించారు.
రాధా తన దరఖాస్తులో కోరిననట్టుగా ప్రసూతి సెలవులను వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు.
రెండుసార్లు మాత్రమే ప్రసూతి సెలవుల కోసం ప్రాథమిక నియమాలు ఎందుకు రూపొందించారో తన తీర్పులో న్యాయమూర్తి తెలిపారు. నిబంధనలను పక్కన పెట్టి మరీ మహిళలకు ప్రసూతి సెలవులు మంజూరు చేయడానికి సాధ్యమయ్యే అంశాలను కూడా తీర్పులో ప్రస్తావించారు.
"మహిళల ఆరోగ్యాన్ని, పిల్లల పెంపకంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ జననాలు నమోదవకుండా ఈ నిబంధనలు రూపొందించారు. జననాల నియంత్రణ విధానాల మీద కూడా ఇది ఆధారపడి ఉంది. ఎక్కువమంది పిల్లలు ఉన్న మహిళకు ప్రసూతి సెలవును వర్తింపచేయడం వల్ల కలిగే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రెండు డెలివరీలకే దీన్ని వర్తింపచేయాలన్న నిబంధన పెట్టారు'' అని న్యాయమూర్తి తెలిపారు.
''ఈ కేసులో ఇంతకు ముందు ఆమె ప్రసూతి సెలవు తీసుకోలేదు. ప్రసూతి సెలవు నిబంధనల కింద రెండో పెళ్లి ద్వారా బిడ్డను కనే హక్కును నిరాకరించకూడదు.
ఈ ప్రసూతి సెలవుల వల్ల ఖజానాకు ఆమె ఎలాంటి నష్టం కలిగించలేదని మనం అర్థం చేసుకోవాలి. ఆమె మూడోసారి గర్భం దాల్చిందన్న కారణంతో ఆమె హక్కులను తిరస్కరించకూడదు'' అని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
ఒక మహిళ ఒక ప్రసవంలో కవలలకు జన్మనిచ్చినా, మరోసారి గర్భవతి అయినప్పుడూ ప్రసూతి సెలవు తీసుకోవచ్చని కూడా న్యాయమూర్తి తెలిపారు.
''ఇద్దరు పిల్లల తండ్రి అయిన వ్యక్తిని పెళ్లిచేసుకున్న ఓ మహిళ వారి బాగోగులు చూసుకునేందుకు ప్రసూతి సెలవు తీసుకున్నారు. కొంతకాలం తర్వాత ఆమె మొదటిసారి గర్భవతి అయినప్పుడు ప్రసూతి సెలవు తీసుకునే అన్ని హక్కులూ ఆమెకు ఉన్నాయి'' అని దీపికా సింగ్ వర్సెస్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘జీతం ఇవ్వలేదు’
ఇప్పుడు రాధకు అమ్మాయి పుట్టిందని ఆమె తరఫు లాయర్ మలైకాని బీబీసీతో చెప్పారు.
కోర్టు తీర్పు రాధకు అనేక విధాలుగా సహాయపడుతుందన్నారు.
రాధ సెలవుపై వెళ్లిన రోజు నుంచి ఆమెకు జీతం ఇవ్వలేదని, ఈ తీర్పు తర్వాత ఆమెకు జీతం వస్తుందని భావిస్తున్నాని మలైకాని తెలిపారు.
"ప్రసవానికి ముందు తర్వాత తల్లీ, పిల్లల సంరక్షణ కోసం ఈ సెలవు ఇస్తారు. తమిళనాడులో పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఒక సంవత్సరం విధులు నిర్వహించిన తర్వాత మాత్రమే ఈ సెలవు పొందవచ్చు. అందుకే రెండుసార్లు రాధకు ఈ సెలవు ఇవ్వలేదు. ఈ అంశం ఆధారంగా మేం కోర్టులో వాదించాం'' అని మలైకాని తెలిపారు.
తమిళనాడులో పనిచేస్తున్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మూడో డెలివరీకి సెలవు నిరాకరించడం ఇదే మొదటిసారి కాదు. ఈరోడ్‌కు చెందిన ఖదీజా ఉమామ అనే ఉపాధ్యాయురాలు తన మూడో ప్రసవానికి ప్రసూతి సెలవులు కోరారు.
ప్రభుత్వ ఉద్యోగంలో చేరకముందే ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఆమె గర్భం దాల్చారు. తన సెలవు దరఖాస్తుపై ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ తర్వాత ఆమెకు సెలవు మంజూరు చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
కీలక సమస్యలపై ఇంకా స్పష్టత లేదు
మద్రాస్ హైకోర్టులో ప్రసూతి సెలవులకు సంబంధించిన పలు కేసుల్లో మహిళల తరఫున వాదించిన వర్గీస్ అమల్ రాజా, చట్టంలోని ఏ అంశాలు అస్పష్టంగా ఉన్నాయో బీబీసీతో మాట్లాడుతూ వివరించారు.
"సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన ఒక మహిళ గత ఏడాది ఒడిశా హైకోర్టును ఆశ్రయించారు. బిడ్డ బాగోగులు చూసుకోవడానికి తన ఇంట్లో ఆడవాళ్లెవరూ లేరని, తనకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. కోర్టు ఆమెకు 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేసింది'' అని అమల్ రాజా చెప్పారు.
"సరోగసీ ద్వారా తల్లులుగా మారే ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి. దాని వల్ల తల్లులందరికీ సమాన ప్రయోజనాలు, మద్దతు లభిస్తాయి'' అని తీర్పులో కోర్టు వ్యాఖ్యానించిందని రాజా తెలిపారు. .
"సరోగసీ ద్వారా పిల్లలను పొందిన మహిళలకు భారత్‌లో ప్రసూతి సెలవులు ఇస్తున్నారు, అయితే సరోగసిలో గర్భం దాల్చే మహిళలకు అలాంటి ప్రయోజనాలు లభిస్తాయా అనేది స్పష్టంగా తెలియలేదు. పెళ్లి కాని మహిళలకు పిల్లలను దత్తత తీసుకునే హక్కు ఉంది. అయితే వారికి ప్రసూతి సెలవులు ఉన్నాయా లేదా అనేదానిపై స్పష్టత లేదు" అని వర్గీస్ అమల్ రాజా చెప్పారు.
‘‘భారతదేశంలో పిల్లలను దత్తత తీసుకునే వివాహితలకు 135 రోజుల వరకు సెలవు ఉంది. అయితే ఎక్కడైనా, ఒక మహిళ కేసు దాఖలు చేసి కోర్టుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇటువంటి చర్చలు తలెత్తుతాయి. వీటన్నింటిని ఓ పరిధిలోకి తెస్తూ చట్టం చేయడానికి చాలా కాలం పట్టొచ్చు. అలాంటి మహిళల ప్రయోజనాలకు రక్షణ కల్పించేందుకు రాష్ట్రాలు ఆర్డినెన్స్‌లు జారీ చేయాలి" అని రాజా అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














