గుమ్మనూరు జయరాం జర్నలిస్టులను ఏమన్నారు, వివాదం ఏంటి?

ఫొటో సోర్స్, Gummanur Jayaram/FB
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
జర్నలిస్టులను ఉద్దేశించి మాజీ మంత్రి, గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
"నాపై తప్పుడు వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా" అని జయరాం చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
జయరాం ఏమన్నారు?
టీడీపీ నేతలతో కలిసి బుధవారం (జనవరి 29) గుంతకల్లులో పర్యటించిన జయరాం మీడియాతో మాట్లాడారు.
"ఫ్రెండ్లీగానే అడుగుదాం. ఫ్రెండ్లీగానే.. ఏం శతృత్వం వద్దు. నేను పోయిన (అక్కడి నుంచి వెళ్లిన) తర్వాత అదీ ఇదీ రాస్తే మాత్రం.. మీరే అన్నారు పట్టాలపై పండబెడతారా అని. పట్టాలపై పండబెట్టడానికి సిద్ధంగా ఉన్నా. నాకేం లెక్కలే. అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి'' అని జయరాం వ్యాఖ్యానించారు.
"నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రం మీడియానే కాదు.. ఎవరైనా బహిరంగంగా అడగొచ్చు. కానీ తప్పు చేయకుండా అంటే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నాపై రాసేటప్పుడు ఎవరైనా అన్ని విధాలుగా ఆలోచించి రాయండి'' అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘ఇది సరికాదు’
ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం జర్నలిస్టులను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం సరికాదని, ప్రజాస్వామ్యంలో అలాంటి వ్యాఖ్యలను ఎవరైనా ఖండించాల్సిందేనని సీనియర్ జర్నలిస్ట్ గాలి నాగరాజు అన్నారు.
"ఒకవేళ నిజంగానే ఆయనపై తప్పుడు ప్రచారం జరిగితే దాన్ని ఖండించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఇలా వ్యాఖ్యానించడం సరికాదు. అయితే ఇప్పుడు జర్నలిస్టుల మధ్య విభజన రేఖ స్పష్టంగా కనిపిస్తోంది. వారి మధ్య కూడా ఐక్యత ఉండడం లేదు. నిజంగా ఇది క్లిష్ట పరిస్థితి. ఇలా ఎంత దూరం పోతుందో కూడా తెలియడంలేదు" అని ఆయన బీబీసీతో వ్యాఖ్యానించారు
ఎమ్మెల్యే అయితే మాత్రం.. బెదిరిస్తారా?
గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలపై జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జర్నలిస్టులనే కాదు.. ఎవరినుద్దేశించి అయినా సరే.. అలాంటి బెదిరింపు వ్యాఖ్యలు ఎలా చేస్తారు అని ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ అన్నారు.
"గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు తీవ్రమైనవి. తన గురించి తప్పుగా వార్తలు రాస్తే చట్టపరంగా ఖండించేందుకు చాలా మార్గాలున్నాయి. అంతే కానీ ఇలా బెదిరింపు వ్యాఖ్యలు చేస్తే ఎలా?" అని చందు జనార్దన్ అన్నారు.
"ఓ వ్యక్తిపై హత్య చేసినట్టు ఆరోపణ వచ్చిందనుకోండి. అది తప్పుడు ఆరోపణ అయితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అంతే కానీ ఆరోపించినవారిని హత్య చేసేస్తారా? ప్రజాప్రతినిధిగా ఎంత హుందాగా మాట్లాడాలి? ఇప్పటికైనా జయరాం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి" అన్నారు జనార్దన్.
తమ పార్టీ ఎమ్మెల్యే జయరాం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, తాను ప్రస్తుతం ఓ పర్యటనలో ఉన్నానని, దీనిపై తర్వాత మాట్లాడతానని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Gummanur Jayaram/FB
అందరినీ అనలేదు : జయరాం
గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలపై వివాదం గురించి బీబీసీ ఆయన్ను సంప్రదించింది.
తాను మొత్తం జర్నలిస్టులందరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని ఆయనన్నారు.
"నేను ఆ వ్యాఖ్యలు చేసింది జర్నలిస్టులందరి గురించి కాదు. జర్నలిస్టులపై నాకు చాలా గౌరవం ఉంది. కేవలం రెండు మీడియా సంస్థలను ఉద్దేశించే నేను ఆ మాటలన్నాను. మూడు రోజుల కిందట ఆ సంస్థల వాళ్లు నాపై దుష్ప్రచారం చేశారు. దాన్ని ఖండిస్తూ అలా వ్యాఖ్యానించాను. మా మనసు బాధ పడేలా కుటుంబ సభ్యులనూ వివాదాల్లోకి లాగితే ఎలా? వాళ్లు ఏం రాసినా చూస్తూ ఊరుకోవాలా?'' అని జయరాం ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యల వివాదంపై పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తన నుంచి ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారని జయరాం తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














