రెండు ముక్కలైన విమానం, తలకిందులుగా హెలికాప్టర్

Search and rescue boats have been deployed to the Potomac River

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నదిలో విమానం కూలిన తరువాత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఆర్మీ హెలికాప్టర్, ప్రయాణికుల విమానం గాల్లోనే ఢీకొని నదిలో కూలిపోయిన దుర్ఘటనపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటన చేసింది.

కన్సస్‌లోని విచిటా నుంచి వాషింగ్టన్ డీసికి వెళ్తున్న అమెరికన్ ఈగల్ ఫ్టైట్ 5342 డీసీ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ప్రమాదానికి గురైందని తెలిపింది.

ఈ విమానాన్ని పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్ ఆపరేట్ చేస్తున్నట్లు వెల్లడించింది.

విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు ప్రకటనలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది గురించి ఆందోళన చెందుతున్నామని, అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.

మరోవైపు ఆర్మీ హెలికాప్టర్ గురించి పెంటగాన్ నుంచి ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది.

''రాత్రి ప్రమాదానికి గురైన ఎయిర్‌క్రాఫ్ట్ వర్జీనియాలోని ఫోర్ట్ బెల్వాయిర్ నుంచి బయలుదేరిన ఆర్మీ UH-60 హెలికాప్టర్‌గా గుర్తించాం. అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఏదైనా సమాచారం ఉంటే తెలియజేస్తాం'' అని ఆర్మీ ఆ ప్రకటనలో పేర్కొంది.

వాషింగ్టన్ విమానాశ్రయానికి సుమారు 15 మైళ్ల దూరంలో ఉన్న సైనిక స్థావరం ఫోర్ట్ బెల్వాయిర్. 'మౌంట్ వెర్నాన్‌' పర్వతానికి సమీపంలో ఉంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మృతులు ఎంతమంది?

ప్రమాద స్థలంలో 18 మృతదేహాలను గాలింపు బృందాలు గుర్తించాయని, ప్రాణాలతో ఉన్నవారెవరూ ఇంకా కనిపించలేదని బీబీసీ యూఎస్ భాగస్వామి సీబీఎస్ న్యూస్‌తో పోలీసు అధికారులు తెలిపారు.

అయితే, మృతుల సంఖ్యపై, ఇప్పటికి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించే అవకాశం ఉంది.

గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు.

యూఎస్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, పోటోమాక్ నదిలో పడిపోయిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం సగానికి విరిగిపోయి, రెండుముక్కలైంది.

డైవర్లు, బోట్ల సాయంతో సహాయక సిబ్బంది బాధితుల కోసం గాలిస్తున్నారు.

ప్రమాదానికి గురైన హెలికాప్టర్ కూడా విమానానికి సమీపంలోనే తలకిందులుగా పడి ఉన్నట్లు యూఎస్ మీడియా రిపోర్ట్ చేసింది.

నదిలో గాలిస్తున్న హెలికాప్టర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాలింపు చర్యలలో భాగంగా నదిపై ఎగురుతున్న హెలికాప్టర్లు

ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు?

ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ‘ఎన్‌బీసీ వాషింగ్టన్’తో మాట్లాడారు.

‘పెద్ద మెరుపులు మెరిసినట్లుగా, పెద్ద కొవ్వొత్తిలాంటి మెరుపులు చూశా’ అని అరి షుల్మాన్ చెప్పారు.

విమానాశ్రయం సమీపంలోనే నివసించే జార్జ్ .. తాను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా విమానం ల్యాండ్ అవుతుండడం గమనించానని ఎన్‌బీసీ వాషింగ్టన్‌తో చెప్పారు. తరచుగా

ఈ దారిలో వెళ్లేప్పుడు విమానాలు ల్యాండ్ అవడం చూస్తుంటానని, అలాగే విమానం ల్యాండింగ్‌కు దగ్గరగా వచ్చినప్పుడు చూశానని చెప్పారు.

తొలుత అంతా మామూలుగానే అనిపించినా అంతలోనే వెనక్కి తిరిగిచూసినప్పుడు ‘అక్కడ ఏదో జరిగినట్లు కనిపించింది’ అన్నారు.

విమానం కుడివైపు పడిపోయినట్లు అనిపించింది, 90 డిగ్రీలు నిట్టనిలువుగా, అని ఆయన చెప్పారు.

‘విమానం కిందపడిపోవడం గమనించా, కానీ అక్కడ చాలా చీకటిగా ఉంది, తర్వాత ఏమీ కనిపించలేదు’ అన్నారు.

పసుపు రంగులో ప్రకాశవంతమైన కాంతి కనిపించిందని, ''దాని కింద మంటలు ఎగసిపడినట్లు ఉంది. అదొక పెద్ద రోమన్ కొవ్వొత్తిలా కనిపించింది'' అని ఆయన చెప్పారు.

trump

ఫొటో సోర్స్, Getty Images

డోనల్డ్ ట్రంప్ ఏమన్నారు?

‘రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ భయంకరమైన ప్రమాదం గురించి తెలిసింది’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.

‘వారి ఆత్మలకు శాంతిని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నా’ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

‘ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన సహాయక బృందాలకు ధన్యవాదాలు. పరిస్థితిని సమీక్షిస్తున్నా. మరింత సమాచారం అందిన వెంటనే తెలియజేస్తా’ అని అందులో ఆయన పేర్కొన్నారు.

ప్రమాద ఘటనను సమీక్షిస్తున్నామని, మంచి జరగాలని ఆశిద్దామని వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన ‘ఎక్స్’ ఖాతాలో రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)