దక్షిణ కొరియా: జెజు విమానం ఇంజిన్లలో పక్షి ఈకలు, రక్తపు మరకలు

ఫొటో సోర్స్, EPA
- రచయిత, కెల్లీ ఎన్జీ, జీన్ మెకంజీ
- హోదా, బీబీసీ న్యూస్
దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన విమాన ప్రమాద ఘటనలో విమానాన్ని పక్షి ఢీకొట్టినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు.
సోమవారం విడుదలైన ప్రాథమిక నివేదిక ప్రకారం, ప్రమాదానికి గురైన జెజు విమానం రెండు ఇంజిన్లలోనూ పక్షి ఈకలు, రక్తపు మరకలను గుర్తించారు. అవి పెద్ద పెద్ద సమూహాలుగా విహరించే వలస బాతులైన బైకాల్ టీల్ అనే పక్షికి చెందినవిగా గుర్తించారు.
దక్షిణ కొరియా గడ్డపై, భారీ ప్రాణనష్టానికి కారణమైన ఈ విమాన ప్రమాద ఘటనలో పక్షి ఢీకొనడం, రన్‌వే చివరన కాంక్రీట్ నిర్మాణం ఉండడంపై ప్రధానంగా దర్యాప్తు కొనసాగుతోంది.
బోయింగ్ 737 - 800 ఇంజిన్లు విఫలం కావడం, కాంక్రీట్ నిర్మాణంపై మరింత లోతుగా దర్యాప్తు జరపనున్నట్లు నివేదిక తెలిపింది.
జెజు ఎయిర్ సంస్థకు చెందిన ఈ విమానం డిసెంబర్ 29న బ్యాంకాక్ నుంచి దక్షిణ కొరియాలోని మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరింది.


ఫొటో సోర్స్, Reuters

పైలట్లు విమానాశ్రయ సిబ్బందితో సంప్రదింపులు జరిపిన మూడు నిమిషాల తర్వాత, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.57 గంటలకు, (అంటే భారత కాలమానం ప్రకారం ఉదయం 5.27 గంటలకు) పక్షులు ఢీకొనే ప్రమాదం ఉంది, జాగ్రత్త అంటూ కంట్రోల్ టవర్ సిబ్బంది, విమానంలోని సిబ్బందికి సూచించారు.
సరిగ్గా 8.59 గంటలకు (భారత కాలమానం ప్రకారం 5.29 గంటలకు) విమానం ఒక పక్షిని ఢీకొట్టినట్లు పైలట్ రిపోర్ట్ చేశారు, మేడే సిగ్నల్(మేడే కాల్ అత్యవసర పరిస్థితిని తెలియజేస్తుంది) ఇచ్చారు.
అనంతరం, విమానాన్ని వ్యతిరేక దిశలో ల్యాండ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని పైలట్ కోరారు, ఆ ఆతర్వాత ల్యాండింగ్ గేర్ పడకుండానే, అది రన్‌వేపై బెల్లీ - ల్యాండ్ (విమానం అడుగు భాగం కింద తగలడం) అయింది. రన్‌వే పైనుంచి దూసుకెళ్లి సమీపంలో ఉన్న కాంక్రీట్ నిర్మాణాన్ని ఢీకొని పేలిపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters/Google
ఈ ప్రమాదానికి నాలుగు నిమిషాల ముందు నుంచే విమాన డేటా, కాక్‌పిట్ రికార్డర్లు పనిచేయడం ఆగిపోయాయని అధికారులు గతంలో చెప్పారు.
ఇదే తరహా విమానాలు నడిపిన కొందరు నిపుణులు రన్‌వేకి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాలు ఉండడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆ కాంక్రీట్ నిర్మాణం లేకపోయి ఉంటే మరణాల సంఖ్య తగ్గేదని వారు అంటున్నారు.
ఈ కాంక్రీట్ నిర్మాణం విమానాల ల్యాండింగ్‌కు ఉపయోగపడే నేవిగేషన్ సిస్టమ్‌తో ఉంటుంది, దీనిని లోకలైజర్ అంటారు.
ఈ వ్యవస్థ దేశంలోని ఇతర విమానాశ్రయాల్లోనూ ఉందని, విదేశీ విమానాశ్రయాల్లోనూ ఇది కనిపిస్తుందని దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
అలాగే, దేశంలోని మరో ఏడు విమానాశ్రయాల్లో నేవిగేషన్ కోసం ఉపయోగిస్తున్న కాంక్రీట్ బ్యారియర్స్‌లో మార్పులు చేయనున్నట్లు గత వారం అధికారులు ప్రకటించారు.
ఈ ప్రాథమిక నివేదికను యునైటెడ్ నేవిగేషన్స్ ఏవియేషన్ ఏజెన్సీతో పాటు అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్ అధికారులకు అందజేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














