ఈ 200 ఏళ్ల సీసా మిస్టరీ వీడింది, అందులో ఉన్న ద్రవం ఏంటంటే..

ఫొటో సోర్స్, Simon Spark/BBC
- రచయిత, సైమన్ స్పార్క్, స్టూవర్ట్ హ్యారట్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
గతేడాది ఇంగ్లండ్‌లోని క్లితోర్పేస్‌లో నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర కార్మికులకు ఒక గాజు సీసా దొరికింది. అది దాదాపు 200 ఏళ్ల కిందటి సీసా. అందులో ఉన్న ద్రవం ఏంటన్నది తాజాగా తేలింది.
సీ వ్యూ స్ట్రీట్ ప్రాంతంలో గుంతలు తవ్వుతున్నప్పుడు ఈ సీసా బయటపడింది. ఆ కార్మికులు మొదట ఈ సీసాలో ఉన్నది మద్యం అనుకొని తాగబోయారు.
ఇంతలోపే అక్కడి ప్రాజెక్ట్ మేనేజర్ వారిని ఆపారు.
ఆ సీసా చరిత్ర ఏంటి? ఎవరు, ఎందుకు అక్కడ పాతిపెట్టి ఉంటారు? అందులో ఉన్న ద్రవం ఏంటి? అన్నది తెలుసుకునేందుకు దానిని యూనివర్సిటీ ఆఫ్ లింకన్‌కు పంపించారు.
‘‘ఆ కార్మికులు అనుకున్నట్టుగా అందులో ఉన్నది మద్యం కాదు, మూత్రం అని మా పరిశీలనలో తేలింది’’ అని యూనివర్సిటీ ఆఫ్ లింకన్ విద్యార్థి జారా యేట్స్ తాజాగా చెప్పారు. ఆమె ఈ సీసాను పరిశీలించే బాధ్యతను చేపట్టారు.
ఈ సీసా ఎన్ని సంవత్సరాల కిందటిదన్నది అంచనా వేసేందుకు, అందులో ఉన్న ద్రవం ఏంటో తెలుసుకోవడానికి జారా అనేక సాంకేతిక పద్ధతులను ఉపయోగించారు.
‘‘ఈ సీసాను తయారు చేసిన శైలి 1790లలో ప్రారంభమైంది. దీన్ని చేతితో చేసినట్టుగా తెలుస్తోంది. అచ్చుల సాయంతో సీసాలను తాయారు చేసే ప్రక్రియను 1840ల నుంచి వాడడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ సీసాను అంతకుముందే చేతితో చేసి ఉంటారు. అందుకే దీని ఆకారంలో అసమానతలు కనిపిస్తున్నాయి’’ అని జారా బీబీసీతో చెప్పారు.


ఫొటో సోర్స్, Simon Spark/BBC
అనేక రకాల సాంకేతికతల సాయంతో ఈ సీసాను అత్యంత నిశితంగా పరిశీలించారు జారా. చివరికి, అందులో ఉన్నవి శరీర ద్రవాలని, అందులోనూ ప్రధానంగా ఉన్నది మూత్రం అని తేల్చారు.
పాత కాలంలో ‘దుష్ట శక్తులు’ ప్రవేశించకుండా ఉండడానికి ఇంటి లోపల ఇలాంటి సీసాలను పాతిపెట్టేవారని యూనివర్సిటీ ఆఫ్ లింకన్ చెబుతోంది.
ఒక పాతకాలపు నావికుడు తన ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుకుంటూ ఈ సీసాను అక్కడ పెట్టి ఉండవచ్చనే ఊహాగానం కూడా దీని చుట్టూ ఉంది.
'ఇంత పురాతన సీసా చెక్కు చెదరకుండా ఉండడం చాలా అరుదు. మా దగ్గరికి పరిశీలన కోసం సహజంగా పింగాణీ వస్తువులు, వస్త్రాలు వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి గాజు సీసా రావడం అరుదు. ఈ సీసాను పరిశీలించడంలో జారా అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఆమెకు మా అభినందనలు..' అని సీనియర్ సాంకేతిక నిపుణులు జోసెఫైన్ మేకేన్ జీ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














