ఆ గ్రంథాలయం రహస్యద్వారం ఓ చరిత్రాత్మక వీధికి దారి తీసింది..

జార్జ్ IV బ్రిడ్జ్ ,ద వాయిడ్‌
ఫొటో క్యాప్షన్, లైబ్రరీలోని అరల వెనుక ఉన్న గోడపైన తలుపులాంటి చిన్న భాగాన్ని అధికారులు తొలగించినప్పుడు వారికి ఈ వీధి కనిపించింది.
    • రచయిత, యాంజీ బ్రౌన్
    • నుంచి, బీబీసీ స్కాట్లాండ్

స్కాట్లాండ్‌లోని నేషనల్ లైబ్రరీలో ఓ తలుపు వెనుక శతాబ్దాల కిందట ఎడిన్‌బ్ర నగరం ఎలా ఉండేదో లీలామాత్రంగా చూపే ఓ వీధి ఉంటుంది. ఈ వీధిలోకి లైబ్రరీలోని పుస్తకాల అరల వెనుక ఉండే రహస్యద్వారం ద్వారా మాత్రమే చేరుకోగలం.

నగరం నడిబొడ్డున ఉండే లిబర్టన్స్ విండ్ అనే ఓ ఇరుకైన వీధిని జార్జి IV బ్రిడ్జి నిర్మించేందుకు ధ్వంసం చేశారు. కానీ అందులో కొంత భాగం ఇప్పటికీ మిగిలి ఉంది.

బ్రిడ్జి గోడలకు, లైబ్రరీ భవనానికి మధ్యన ఉండే ఈ వీధిలోకి గ్రంథాలయంలోని రహస్య తలుపు ద్వారా మాత్రమే చేరుకోవడానికి వీలవుతుంది.

గ్రంథాలయ సిబ్బంది ‘వాయిడ్’ అని పేరుపెట్టుకున్న ఈ వీధిలోకి ప్రజలను అనుమతించరు.

కానీ బీబీసీ స్కాట్లాండ్ న్యూస్‌కి ఈ వీధిని చూడటానికి అనుమతి లభించింది.

లైబ్రరీలోని అరల వెనుక ఉన్న గోడపైన తలుపులాంటి చిన్న భాగాన్ని అధికారులు తొలగించినప్పుడు వారికి ఈ వీధి కనిపించింది. వారు ఆ మార్గంలోంచి పాక్కుంటూ ఆ వీధిలోకి వెళ్లారు. వారికి చిన్నచిన్న గదులు, నడకదారి కనిపించాయి. బహుశా వంతెన నిర్మాణ సమయంలో ఈ చిన్న గదులను స్టోర్ రూమ్‌లుగా ఉపయోగించి ఉండొచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
City of Edinburgh Council – Capital Collections

ఫొటో సోర్స్, City of Edinburgh Council – Capital Collections

ఫొటో క్యాప్షన్, కౌగేట్ నుంచి లిబర్టన్స్ వైండ్

లైబ్రరీ మాజీ డైరెక్టర్ బిల్ జాక్సన్ బీబీసీ స్కాట్‌లాండ్ న్యూస్‌తో మాట్లాడుతూ శిథిలమైన ఫర్నిచర్, పద్దు పుస్తకం, బూట్లు, 100 ఏళ్లపైబడిన మూత్రవిసర్జన పాత్రను ఆ వీధిలో కనుగొన్నానని, అయితే అవి నీటిలో నానిపోయి దెబ్బతిన్నాయని చెప్పారు.

‘‘నేను అక్కడకు వెళ్లినప్పుడు చీకటిగా ఉంది. కొంత భయంగానూ అనిపించింది. నా చేతిలో టార్చ్ లైట్ ఉంది. దాని వెలుగులో అక్కడున్నవన్నీ కనిపించాయి. అయితే భయం వల్ల నేను అక్కడి నుంచి త్వరగా బయటపడాలనుకున్నాను’’ ‘‘కానీ అది చాలా అద్భుతంగా అనిపించింది’’

తరువాత ఆయన ఆ వీధిలో లైట్లు అమర్చారు. కౌగేట్ చివరన మరో తలుపు అమర్చారు.

లైబ్రరీ గదులు జార్జ్ IV వంతెన కోసం లిబర్టన్స్ విండ్‌లో కూల్చివేసిన భవనాల పునాదులపైన నిర్మించారు. కొన్ని భవనాల శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి.

లైబ్రరీ రిఫరెన్స్ అసిస్టెంట్ రాబీ మిచెల్ మాట్లాడుతూ ఈ వీధిలోకి ప్రవేశిస్తే ఓ పక్క ఇటుకలతో నిర్మించిన లైబ్రరీ గోడలను, మరోపక్క జార్జి IV వంతెన రాతి గోడలను చూడవచ్చని చెప్పారు.

ఈ వీధిని మేరీ కింగ్స్ క్లోజ్‌లా పరిరక్షించకపోయినా, శతాబ్దాల కిందటి ఎడిన్‌‌‌బ్ర చరిత్రను ఇది చూపుతుంది’’ అని తెలిపారు. .

"లైబ్రరీ సేకరణలలో అనేక ఓల్డ్ టౌన్ మ్యాప్‌లు ఉన్నాయి . ఇవి జార్జ్ IV బ్రిడ్జ్, ప్రస్తుతం లైబ్రరీ ఉన్న ప్రాంత పరిసరాలు గతంలో ఎలా ఉండేవో ఊహాచిత్రాన్ని రూపొందించడానికి సహాయపడతాయి" అని ఆయన చెప్పారు.

ఉరిశిక్ష

ఫొటో సోర్స్, City of Edinburgh Council – Capital Collections

ఫొటో క్యాప్షన్, ఉరిశిక్షలను లిబ్బర్టన్స్ విండ్ ఎగువన ఉన్న ఉరి కొయ్య వద్ద నిర్వహించేవారు

ఎడిన్‌బ్ర నడిబొడ్డును లోయప్రాంతంలోని కౌగేట్ మీదుగా ది రాయల్ మైల్‌కు కలిపేందుకు జార్జి IV వంతెనను నిర్మించారు. వంతెన నిర్మాణానికి ముందు ఎడిన్‌బ్రలోని ప్రసిద్ధ రాయల్ మైల్ వీధిని, పొరుగున ఉన్న కౌగేట్‌ ప్రాంతాలను లిబర్టన్స్ విండ్ వీధి కలిపేది. ఈ వీధి ఉరిశిక్షలు అమలుచేసే ప్రాంతానికి దారితీసేది. అయితే వంతెన నిర్మాణం కోసం ఈ వీధిలోని నిర్మాణాలను కూల్చివేశారు.

తరువాత వంతెన పైన నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్కాట్లాండ్ నిర్మాణం జరిగింది. ఈ లైబ్రరీ అంతస్తులన్నీ కిందనున్న కౌగేటు వరకు విస్తరించాయి.

ఈ వంతెన లిబర్టన్ విండ్ పునాదులపై నిర్మితమైంది. లైబ్రరీ వెనుక ఉన్న వీధిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీధి కొన్ని వందల అడుగుల లోతువరకు విస్తరించి ఉంది.

అధికారులు ప్రవేశ ద్వారాన్ని విస్తరించారు. అందులోని కొన్ని గదులను లైబ్రరీ స్ప్రింక్లర్ సిస్టమ్ కోసం భారీ నీటి ట్యాంకుల కోసం ఉపయోగిస్తున్నారు.

లిబర్టన్స్ విండ్ లాన్ మార్కెట్‌ను కలిసే చోట ఉండే ఉరిశిక్షల ప్రాంతంలో, శిక్షల అమలును చూసేందుకు వేలాదిమంది గుమికూడేవారని రాబీ మిచెల్ చెప్పారు. ఇలా ఈ ప్రాంతంలో ఉరిశిక్ష పడినవారిలో శవాల దొంగ, హంతకుడు విలియమ్ బర్కే కూడా ఉన్నారని, 1829లో ఆయనను ఇక్కడ ఉరి తీశారని చెప్పారు.

చరిత్రకారుడు, జామీ కార్స్టోర్ఫిన్
ఫొటో క్యాప్షన్, చరిత్రకారుడు జామీ కార్స్టోర్ఫిన్

స్థానిక చరిత్రకారుడు జామీ కార్స్టోర్ఫిన్ మాట్లాడుతూ, ‘ది వాయిడ్‌’లోకి ప్రవేశించడం తనకు చాలా ఉత్సాహాన్ని కలిగించిన విషయమని చెప్పారు. ఒకనాడు ఆ వీధి , బార్బర్లు, బూట్ల తయారీదారులు, నిత్యావసర కొట్లు, వెండి తయారీదారులు ఇలా రకరకాల వ్యాపారులతో చాలా రద్దీగా ఉండేది’’ అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)