మ్యూజియం దగ్గర పేలుడు.. బంగారు కళాఖండాలు మాయం.. సమీపంలో కాలిపోయి ఉన్న వాహనం.. అసలేం జరిగిందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇయాన్ ఐక్‌మాన్
- హోదా, బీబీసీ న్యూస్
నెదర్లాండ్స్‌లోని ఓ మ్యూజియంలో నాలుగు పురాతన బంగారు కళాఖండాలు చోరీకి గురయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈ దొంగతనం జరిగింది.
అసెన్ పట్టణంలోని డ్రెంట్స్ మ్యూజియంలోకి చొరబడేందుకు దొంగలు పేలుడు పదార్థాలను ఉపయోగించారు.
ఈ మ్యూజియంలో బంగారు, వెండితో తయారు చేసిన అత్యంత విలువైన రొమేనియన్ కళాఖండాల ప్రదర్శన జరుగుతోంది.
మూడు డేసియన్ స్పైరల్ బ్రేస్‌లెట్లను, ప్రదర్శనలో కేంద్ర బిందువుగా ఉన్న సుమారు 2,500 ఏళ్ల కాలం నాటి, బంగారంతో అలంకరించిన కోటోఫెనెస్టి హెల్మెట్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు.
చోరీకి గురైన వస్తువులను తిరిగి కనిపెట్టేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రొమేనియా సాంస్కృతిక శాఖ చెప్పింది. వీటిని రొమేనియా రాజధాని బుకరెస్ట్ నుంచి నెదర్లాండ్స్‌లోని ఈ మ్యూజియానికి తీసుకొచ్చారు.
ఈ దొంగతనంతో తమ సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారని డ్రెంట్స్ మ్యూజియం డైరెక్టర్ హ్యారీ తుపాన్ అన్నారు. ఈ మ్యూజియానికి ఉన్న 170 ఏళ్ల చరిత్రలో ఇదే అతిపెద్ద ఘటన అని పేర్కొన్నారు.

స్థానిక కాలమానం ప్రకారం, శనివారం(జనవరి 25) తెల్లవారుజామున 3.45 గంటలప్పుడు పేలుడు జరిగినట్లు రిపోర్టులు వచ్చాయి. ఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు.
అధికారులు ఫోరెన్సిక్ విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
సమీప రోడ్డులో కాలిపోయిన ఒక వాహనాన్ని గుర్తించిన పోలీసులు, దానిపై విచారణ చేపట్టారు. దీంతో చోరీకి, ఈ వాహనానికి సంబంధం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
''మంటలు చెలరేగిన ప్రదేశానికి సమీపంలోనే అనుమానితులు మరో వాహనంలోకి మారి ఉండొచ్చు'' అని డచ్ పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఇది ఒక్కరికి సాధ్యమయ్యే పని కాదని, ఇందులో పలువురు వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ కేసు విచారణ కోసం గ్లోబల్ పోలీసింగ్ ఏజెన్సీ ఇంటర్‌పోల్ సాయాన్ని కూడా పోలీసులు కోరారు.
నాలుగు పురాతన కళాఖండాలు చోరీకి గురైనట్లు మ్యూజియం ఒక ప్రకటనలో తెలిపింది.
వాటిలో ఒకటి సుమారు క్రీస్తు పూర్వం 450కి చెందిన కొటోఫెనెస్టి హెల్మెట్ అని, మరో మూడు ప్రాచీన డేసియన్ రాయల్ బ్రేస్‌లెట్లని పేర్కొంది.
చోరీకి గురైన ఈ నాలుగు వస్తువులూ ఎంతో సాంస్కృతిక విశిష్టతను కలిగి ఉన్నాయి. కొటోఫెనెస్టి హెల్మెట్‌ను రొమేనియాలో జాతీయ సంపదగా భావిస్తారు.
1990ల చివరలో కూడా గుప్తనిధుల వేటగాళ్లు పురాతనకాలం నాటి 24 బ్రేస్‌లెట్లను వెలికితీసి విదేశాల్లో విక్రయించారు.
ఆస్ట్రియా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా దేశాలకు చెందిన ఆర్ట్ కలెక్టర్ల నుంచి వాటిని వెనక్కి తీసుకొచ్చేందుకు రొమేనియా ప్రభుత్వం ఏళ్ల తరబడి పనిచేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













